close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముత్తాతల పేర్లూ మర్చిపోరు!

న తాత పేరేమిటో చెప్పగలం... ముత్తాత పేరూ గుర్తుండే ఉండొచ్చు. కానీ అంతకన్నా దూరం వెళితే... అంటే ముత్తాతకి తాత పేరు అడిగితే మాత్రం ఎవరైనా నీళ్లు నమిలేస్తాం. కానీ అరుణాచల్‌ ప్రదేశ్‌కి చెందిన గాలో తెగ ప్రజలు మాత్రం సునాయాసంగా 20 తరాలపేర్లని చెప్పేయగలరు! పేర్లు పెట్టుకోవడంలో వీళ్లు అనుసరించే ఓ పద్ధతి ఇందుకు కారణం.  తండ్రి పేరులోని చివరి అక్షరాన్ని(సిలబల్‌), అతని కుమారుడి పేరులో మొదటి అక్షరంగా వాడతారు వీళ్లు. ఉదాహరణకి... తండ్రి పేరు ‘తని’ అయితే వాళ్లబ్బాయి పేరు ‘నితో’ అవుతుంది. నితో కొడుకు పేరు ‘తోపో’, మళ్లీ అతని వారసుడి పేరు ‘పోయి’... ఇలా సాగుతుంది క్రమం. పేరులో మొదటి అక్షరం తండ్రి పేరే కావడం... ఉన్నవి కూడా రెండు అక్షరాలే అవ్వడం... అవే పేర్లనే మళ్లీమళ్లీ పెట్టుకోవడం వల్లే ఇరవై తరాల పేర్లనీ గుర్తుపెట్టుకోగలుగుతున్నారు.


పిల్లిమొగ్గలతో ‘శాయ్‌’కు వెళ్లారు!

దకొండేళ్ల జషిక, పదమూడేళ్ల మహ్మద్‌ అజాజుద్దీన్‌లు కోల్‌కతాలోని ఓ మురికివాడలో ఉండే నిరుపేద పిల్లలు. వాళ్లిద్దరికీ డాన్స్‌ అంటే ఎంతిష్టమో. ఆ ఆసక్తితోనే శేఖర్‌ రావు అనే తెలుగు అబ్బాయి దగ్గర శిక్షణ కోసం చేరారు. రెండేళ్ల నుంచి డాన్స్‌ నేర్చుకుంటున్న ఆ చిన్నారులు గత నెల్లో స్కూల్‌ నుంచీ పిల్లి మొగ్గలు వేసుకుంటూ ఇంటికొచ్చారు. ఆ సమయంలో తీసిన వీడియోని డాన్స్‌ మాస్టర్‌ శేఖర్‌ ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో పెట్టాడు. ఒక్కరోజులోనే ఆ వీడియోకి ఎంతో స్పందన రావడంతోపాటు రొమేనియన్‌ జిమ్నాస్ట్‌ నదియా కొమానిచ్‌ వరకూ వెళ్లింది. ఐదుసార్లు ఒలింపిక్‌ పతకాన్ని అందుకున్న నదియా ఆ పిల్లల్ని మెచ్చుకోవడంతో వాళ్లకు సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. అది చూసిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌రిజుజు కూడా స్పందించి జిమ్నాస్టిక్స్‌లో మరింతగా ప్రోత్సహించడానికి దిల్లీలోని శాయ్‌లో వారికి ప్రవేశం కల్పించారు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన జషిక, అజాజుద్దీన్‌లు ఇప్పుడు శాయ్‌లో శిక్షణ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అలా డాన్సర్‌ అవుదామనుకుంటే ఎంతో మంది ఔత్సాహికులు ప్రవేశం కోసం ఎదురు చూసే శాయ్‌ అకాడమీనే ఆహ్వానించింది. లక్‌ అంటే అదేనేమో.


ఇది నానో హెలికాప్టరు

నానో పేరూ... హెలికాప్టరు పేరూ విన్నాం... వాటిని చూశాం. మరి... నానో హెలికాప్టరు పేరు విన్నారా? దాన్ని చూడాలంటే... బిహార్‌ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. అక్కడి సింహరి గ్రామానికి చెందిన ఇరవై నాలుగేళ్ళ మిథిలేష్‌ ప్రసాద్‌ దీన్ని తయారు చేశాడు. హెలికాప్టరులో తిరగాలన్నది ఆయన కల. ఆర్థిక పరిస్థితులు బాగాలేక అది సాకారమవ్వలేదు. దీంతో మిథిలేష్‌... తన నానో కారునే హెలికాప్టరు ఆకారంలోకి మార్చి ఈ కలను నెరవేర్చుకున్నాడు. పైపు ఫిట్టర్‌ అయిన ఆయన... తన కారు వెనక, ముందు భాగాల్ని హెలికాప్టరులాగే తయారుచేసి పైన తిరిగే పెద్ద పంకానూ ఏర్పాటు చేశాడు. ఇంకేం అది అచ్చం హెలికాప్టరుగానే మారింది. కాకపోతే... కారులాగే రహదారిపై తిరుగుతుంటుందంతే. నానో కారును హెలికాప్టరులా  మార్చడానికి ఏడు నెలల సమయం పట్టిందనీ, ఏడు లక్షల డబ్బు ఖర్చైందనీ చెబుతున్న మిథిలేష్‌... హెలికాప్టరులో తిరగాలన్న కలను ఇలా నెరవేర్చుకున్నానని సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఇది రహదారిపైన చక్కర్లు కొడుతుంటే... ప్రతి ఒక్కరూ ఓరి ‘నానో’య్‌ అంటూ గుడ్లప్పగించి చూడాల్సిందే...!


కాలం చెల్లిన కార్లతో...

‘సృజనతో చూసే కళ్లుండాలేకానీ... ప్రపంచంలో ఏ వస్తువూ వృధా కాదు!’ అంటాడు ఫ్రాన్స్‌కి చెందిన కళాకారుడు బెనెడెటో బుఫాలినో. అన్నట్టే నిరుపయోగంగా పడిఉన్న పాతవాహనాలన్నింటినీ సృజనాత్మకంగా మళ్లీ ఉపయోగంలోకి తెస్తుంటాడతను. కాలం చెల్లిన కార్లని ఫుడ్‌కోర్టుల్లో ఉపయోగించే పొయ్యిగా, ల్యాంప్‌ పోస్టులుగా, చిన్నపాటి తోటగా, టేబుల్‌ టెన్నిస్‌ కోర్టులుగా రూపాల్లోకి మార్చి ఆశ్చర్యపరుస్తున్నాడు. పనికిరాని పాత బస్సు లోపలి భాగాలన్నింటినీ తొలగించి ఈతకొలను చేశాడు. పాత వాహనాలని రిపేర్లతో మళ్లీమళ్లీ వాడటం వల్ల ఎక్కువగా పొగ వెదజల్లుతాయి. అలా అని వాటిని పక్కన పడేస్తే గుట్టలుగా పేరుకుపోయి మరోరకం కాలుష్యానికి కారణమవుతున్నాయి. అందుకు పరిష్కారంగానే ఆ పాతవాహనాలని ప్రయోజనకర వస్తువులుగా మారుస్తానని చెబుతున్నాడు బుఫాలినో!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.