close
ఆ ఒక్కఫైట్‌... 70 రోజులు తీశాం!

సైరా నరసింహారెడ్డి... సాంకేతికంగా తెలుగుసినిమా సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటింది. ఆ సినిమాకి తెరపైన కర్తా, కర్మ, క్రియ అన్నీ తానే అయి మెగాస్టార్‌ చిరంజీవి నడిపిస్తే... తెరవెనక సాంకేతిక నిపుణుల్లో అంతే ముఖ్యమైన పాత్ర పోషించినవాడు రత్నవేలు. ‘రంగస్థలం’తో సామాన్య ప్రేక్షకులు కూడా కెమెరాపనితనం గురించి మాట్లాడుకునేలా చేసిన సినిమాటోగ్రాఫర్‌ వేలు... ‘సైరా’తో ఆ అద్భుతాన్ని దేశవ్యాప్త ప్రేక్షకులకి చేరువచేశాడు. తాను ఓ జాతీయస్థాయి కళాకారుడిగా ఎదిగిన క్రమాన్ని ఇలా పంచుకుంటున్నాడు...

మాది చదువుల కుటుంబం. నాన్న రామన్‌ డాక్టర్‌. అన్నయ్య ఇంజినీరు, ఒక అక్క డాక్టర్‌, మరో అక్క లాయర్‌. నేనూ ఇంజినీరింగ్‌ చదవాలన్నదే నాన్న కోరిక. కాకపోతే ఓసారి మా అన్నయ్య చేతిలో కనిపించిన హాట్‌షాట్‌ కెమెరా నా జీవితాన్ని మార్చేసింది. దాన్ని నేను చేతిలోకి తీసుకున్న తొలిరోజు నుంచే కనిపించిన చెట్టూచేమా, పువ్వూపుట్టా అన్నీ క్లిక్‌మనిపించడం మొదలుపెట్టాను. చెట్టూపుట్టలయ్యాక మనుషులని వివిధ కోణాల్లో ఫొటో తీయడం ప్రారంభించాను. అలా రెండేళ్లపాటు ఫొటోగ్రఫీయే నా ప్రపంచమైంది. సరిగ్గా అప్పుడే దర్శకుడు మణిరత్నం, సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ కాంబినేషన్‌లో ‘మౌనరాగం’, ‘ఘర్షణ’ వంటి చిత్రాలు వస్తున్నాయి. ఆ సినిమాల్లోని సరికొత్త కెమెరా కోణాలూ, వెలుగునీడలూ నాకు పిచ్చెక్కించాయి. నేనూ సినిమాటోగ్రాఫర్‌ని కావాలని నిర్ణయించుకున్నా! ఇంటరయ్యాక.. నాన్న వద్దంటున్నా పట్టుబట్టి మరీ చెన్నై ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాను. కోర్సు ముగిశాక సినిమాటోగ్రాఫర్‌ రాజీవ్‌మేనన్‌ దగ్గర సహాయకుడిగా చేరాను. నేను చేరిన కొన్నాళ్లకే మణిరత్నం ‘బొంబాయి’ సినిమాకి రాజీవ్‌మేనన్‌ని సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికచేసుకున్నారు. ఓ అసిస్టెంట్‌ కెమెరామ్యాన్‌గా ఆ సినిమా ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. ‘బొంబాయి’ తర్వాత నేనే సొంతంగా ప్రకటనలకి పనిచేయడం మొదలుపెట్టాను. పదేళ్లలో కోక్‌, పెప్సీ.. ఇలా పెద్ద కంపెనీల యాడ్‌లన్నీ చేశాను. ఆ యాడ్‌లు చూసి.. శరత్‌కుమార్‌ హీరోగా ‘అరవిందన్‌’ అనే తమిళ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నుకున్నారు. సినిమా విడుదలైందికానీ.. పెద్ద ఫ్లాప్‌. సెంటిమెంట్‌లు ఎక్కువగా చూసే పరిశ్రమలో మొదటి సినిమా ఫ్లాపయితే ఇంకేమైనా ఉందా! దాంతో ఆ తర్వాత అవకాశాల కోసం ఎంతో ఎదురుచూడాల్సి వచ్చింది. అప్పుడే బాల వచ్చాడు. అప్పట్లో దర్శకుడిగా మారేందుకు ఎంతో పోరాడుతున్నాడు తను. ఓ సినిమా పూజదాకా వచ్చి ఆగిపోయింది కూడా! చావోరేవో అన్నట్టు రెండో కథ సిద్ధం చేసుకుని నాకు చెప్పాడు. అదే సేతు(‘శేషు’ పేరుతో తెలుగులో రీమేక్‌ అయింది). దాని కోసం ఇద్దరం చాలా కసిగా పనిచేశాం. ఆ సినిమా పెద్ద హిట్టు! ఆ తర్వాతి చిత్రం ‘నందా’కీ బాల నన్నే ఎన్నుకున్నాడు. అది నన్ను తమిళ పరిశ్రమలో పెద్ద సినిమాటోగ్రాఫర్‌గా నిలిపింది. ‘పీసీ శ్రీరామ్‌, సంతోష్‌శివన్‌ల స్థాయి ఇతనిది..’ అని నలుగురూ అనుకునేలా చేసింది.

సుక్కుకి థ్యాంక్స్‌ చెప్పాలి...
2003లో నేను తమిళ టాప్‌ హీరో విజయ్‌ సినిమాలకి పనిచేస్తున్నాను. జీవితంలో ఎప్పుడూలేనంతగా బిజీ. అప్పుడే దిల్‌రాజుగారు ఫోన్‌చేశారు.. ‘మా దర్శకుడు మీతో స్టోరీ డిస్కస్‌ చేయాలి!’ అని. ‘నాకు గంట సమయమే ఉంటుంది..’ అని కరాఖండిగా చెప్పాను. అలా మొదటిసారి నన్ను చెన్నైలో కలిశారు సుక్కు(దర్శకుడు సుకుమార్‌). ‘ఆర్య’ కథ చెప్పాడు. గంటే సమయముందని చెప్పినవాణ్ణి నాలుగుగంటలపాటు వింటూ కూర్చున్నా. ముంబయి వెళ్లాల్సిన ఫ్లైట్‌ కూడా వదులుకున్నా! పొరబాటున కూడా ‘ఆర్య’ను వదులుకోకూడదనే నిర్ణయానికి వచ్చేశా. ఆ చిత్రం ఎంతపెద్ద హిట్టో మీకు చెప్పక్కర్లేదు. తన సినిమాలు విభిన్నంగా ఉండితీరాలనే సుక్కు తపన చూస్తుంటే ఇప్పటికీ ముచ్చటేస్తుంది. అదే నన్ను అతనికి దగ్గరచేసింది. సుక్కు సినిమాల్లో నేను కేవలం సినిమాటోగ్రాఫర్‌గా ఉండిపోలేను. స్క్రిప్ట్‌తో మొదలుపెట్టి అన్ని విభాగాల్లోనూ ఏమేం చేయొచ్చో సలహాలిస్తూనే ఉంటా.. నాపై ప్రేమతో ప్రతి సినిమాలోనూ నాకు ఆ అవకాశం ఇస్తూనే ఉన్నాడు సుక్కు! ‘ఆర్య’ నుంచి ‘రంగస్థలం’ దాకా సుక్కు డైరెక్టొరల్‌ టీమ్‌లో నన్నూ భాగస్వామిని చేశాడు.

అదే నా పంథా...
‘ఖైదీ నెంబర్‌ 150’.. చిరంజీవిగారితో నా మొదటి సినిమా. తొలి రషెస్‌ చూడగానే వచ్చి నా భుజం తట్టి, ‘ఏముంది నీచేతుల్లో.. నన్నింత అందంగా చూపించావ్‌?’ అన్నారు. నా కెమెరాతో చిరు వయసు ఇరవైఏళ్లు తగ్గించానని అందరూ ప్రశంసించారు. ఇక ‘సైరా’ చర్చలు మొదలు కాకముందే రామ్‌చరణ్‌ నన్ను కలిశాడు. ‘నాన్నగారి కలల ప్రాజెక్టు ఇది. చక్కటి నిర్మాణ విలువలతో ఈ సినిమాని ఆయనకో గిఫ్ట్‌గా ఇవ్వాలి!’ అన్నాడు. చిరంజీవి కూడా ఫోన్‌ చేసి ‘ఈ ప్రాజెక్టులో నువ్వు ఉండితీరాలి’ అని చెప్పారు. ఓ కెమెరామన్‌గా నాకో పద్ధతుంది. దర్శకులు స్క్రిప్టులో భాగంగా ‘స్టోరీ బోర్డు’ రాసుకున్నట్టే నేను ‘మూడ్‌ బోర్డు’ అని తయారుచేస్తా. డైలాగులూ, నటుల యాక్షన్‌తోనే కాకుండా నా కెమెరా యాంగిల్స్‌, కలర్స్‌, లైటింగ్స్‌ ద్వారా కూడా ఆయా సన్నివేశాలకి తగ్గ ఉద్వేగాలని ప్రేక్షకుల్లో కలిగించాలనుకుంటాను. శంకర్‌ ‘రోబో’కి అయితే ప్రతి సీన్‌కి ఓ పెద్ద పుస్తకమే తయారుచేసుకున్నాను. ‘సైరా’ కోసం ప్రత్యేకంగా రెండునెలలు బ్రేక్‌ తీసుకుని అంతకన్నా పదింతలు పెద్ద ‘మూడ్‌ బోర్డు’ రూపొందించాను. ఉదాహరణకి- సినిమా ప్రారంభంలో 18వ శతాబ్దం నాటి లండన్‌ నగరంలోని స్తబ్దతని చూపించడడానికి డల్‌ కలర్స్‌ని వాడాను. కుంఫిణీవాళ్లు మనదేశానికి వచ్చేటప్పుడు ఇక్కడి సిరిసంపదలనీ, ఆనందాన్నీ చూపించడానికి కళ్లకింపైన రంగుల్ని ఎంచుకున్నాను. సెకెండ్‌ హాఫ్‌ నుంచి యుద్ధసన్నివేశాలకి పూర్తిగా ముదురు గోధుమ రంగులు వాడాను... ఇక విషాదాంతమైన క్లైమాక్స్‌ కోసం అందరి దృష్టీ చిరంజీవిపైనే ఉండేలా చుట్టూ ఉన్నవాటి కలర్స్‌ని తగ్గించాను. ఇక... 250 ఏళ్లనాటి ఈ కథని చూసే ప్రేక్షకులకి ఎక్కడా ఎలక్ట్రిక్‌ లైట్లు వాడిన అనుభూతి కలిగించకూడదు. పగలైతే ఎండానీడలూ, రాత్రయితే వెన్నెలా కాగడా వెలుగులన్నట్టే ప్రేక్షకులకి అనిపించాలి. అందుకోసం అడుగడుగునా జాగ్రత్తపడ్డాం. ముఖ్యంగా బ్రిటిష్‌వాళ్ల కోటపైన చిరంజీవీ, ఆయన అనుచరులూ రాత్రివేళ దాడి చేసే ఫైట్‌ సీన్‌ ఉంటుంది. ఇందులో నటించేవాళ్లందరి మీదా వెన్నెల వెలుగు సమానంగా పరుచుకున్నట్టు ఉండాలని 250 అడుగుల ఎత్తున భారీ లైట్లని వేలాడదీసి షూట్‌ చేశాం. సినిమాలోని కీలక యుద్ధ సన్నివేశాన్ని జార్జియాలో చిత్రీకరించాం. అందులో వేలమంది పాల్గొంటే అందరి స్కిన్‌ టోన్‌ ఒకేలా కనిపించాలని కలర్స్‌ పరంగా ఎంతో శ్రమించాం. మధ్యమధ్యలో మారుతున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా లైటింగ్‌ని మార్చుకుంటూ చేయడం వల్ల ఆ ఒక్క ఫైట్‌ కోసమే డెభ్భై రోజులు చిత్రీకరించాల్సి వచ్చింది! ఇవన్నీ అలా పక్కనపెడితే ఓ వైపు చిరంజీవి, మరోవైపు అమితాబ్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, నయనతార, తమన్నా... వీళ్లందరికీ కెమెరా కోణాలూ, రంగుల పరంగా సముచిత స్థానం కల్పించాల్సి రావడమే పెద్ద సవాలుగా అనిపించింది. అంత శ్రమ ఉన్నందునే ఈ సినిమా విజయం... మా టీమ్‌ మొత్తానికీ ఓ అద్భుతమైన కల సాకారమైనంత సంతోషాన్నిస్తోంది. సైరా పూర్తవుతుండగానే మహేశ్‌ ‘సరిరారు నీకెవ్వరు’ చిత్రీకరణకి వచ్చేశాను. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేశ్‌తో కలిసి చేస్తున్న సినిమా ఇది. కాకపోతే, ‘రంగస్థలం’ నుంచి తీరికలేకుండా తెలుగు రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నాను. ఫ్యామిలీతో కొద్దిరోజులైనా ఉండే అవకాశం ఉంటుందని శంకర్‌ ‘భారతీయుడు2’కి ఒప్పుకున్నాను. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉంటూనే షూటింగ్‌లకి వెళుతున్నాను!

తను ఎప్పుడూ అంతే

నేను సాధిస్తున్న విజయాల వెనక నా భార్య హేమ ఉంది. మా అమ్మకి కొడుకుగా, పిల్లలకి తండ్రిగా నేను నిర్వహించాల్సిన బాధ్యతలన్నీ తనే భుజాన వేసుకుని నడుస్తోంది. మా అబ్బాయి ఆదిత్‌ కూడా సినిమాటోగ్రాఫర్‌ కావాలనే కలలుకంటున్నాడు... నాలా కాదు ప్రపంచస్థాయిలో. అందుకే ఇంటర్‌ పూర్తవగానే ఓ పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైయినింగ్‌ తీసుకుంటున్నాడు. నా కూతురు అహానా నాలుగో తరగతి చదువుతోంది. పిల్లలకి ఏ చిన్న దెబ్బతగిలినా కంగారుపడిపోతాన్నేను. అందుకే నా భార్య షూటింగ్‌లో ఉన్నప్పుడు అలాంటివేవీ నా చెవినపడనీయదు. మొన్నామధ్య మా పాపకి ఏదో గాయమైతే ఆసుపత్రికి తీసుకెళ్లిందట. నేను నా షూటింగ్‌ పనులన్నీ ముగించుకుని చెన్నై ఫ్లైట్‌ ఎక్కాకే ఫోన్‌ చేసింది. అన్నీ నింపాదిగా చెప్పి ‘ఏం కాలేదు.. నేనున్నాగా!’ అని పెట్టేసింది. తనెప్పుడూ అంతే!

అమ్మ కూడా దక్కదనుకున్నా...

నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేకున్నా.. ఇంట్లో చిన్నకొడుకుని కాబట్టి నాన్న నన్నెంతో గారం చేసేవాడు. అన్న, అక్కయ్యలతో కాకుండా నాతోనే ఉండిపోయాడు. నాలుగేళ్లకిందట నాన్న కిడ్నీలు రెండూ పాడైపోయాయి. నేను ఆయనతోపాటూ వారంరోజులు ఆసుపత్రిలో ఉన్నాను. కొద్దిగా కోలుకుంటున్నారని చెప్పడంతో గ్రేడింగ్‌ పనుల కోసమని ముంబయి రావాలని ఓ నిర్మాత ఫోన్‌ చేశాడు. నేను కుదర్దన్నా వాళ్లేమీ అనరు. కానీ పనిపై ఉన్న మితిమీరిన తపన వల్లనేమో ముంబయి ఫ్లైట్‌ ఎక్కేశాను. పని చకచకా పూర్తిచేసి విమానాశ్రయానికి వస్తే.. నేను ఎక్కాల్సిన విమానం క్యాన్సిలైంది. ఇంతలో నాన్న పరిస్థితి విషమించిందంటూ ఫోన్‌! ఆదరాబాదరా ఫ్లైట్‌ పట్టుకుని చెన్నై విమానాశ్రయంలో దిగి ఫోన్‌ చేస్తే.. ‘నాన్నకి ఫర్వాలేదు’ అని చెప్పారు. ‘హమ్మయ్య’ అనిపించింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఓ నాలుగు కిలోమీటర్లు దాటాక ఓ చోట ట్రాఫిక్‌ రద్దీలో కారు ఆగిపోయింది.

అప్పుడొచ్చింది ఫోన్‌.. ‘నాన్న ఇప్పుడే పోయారు’ అని చెబుతూ. అది  చాలా పెద్ద దెబ్బనాకు! అంతకాలం నాతోనే ఉన్న నాన్న, నన్నెంతో అభిమానించిన నాన్న.. చివరి క్షణంలో నన్ను చూడాలనుకున్నాడేమో. నేను అక్కడ లేనని తెలిసి ఏమనుకుని ఉంటాడు?! ఈ ప్రశ్న ఇప్పుడు కూడా నన్ను పీడిస్తూనే ఉంది. గత ఏడాది అమ్మకీ ఇదే పరిస్థితొచ్చింది. బీపీ బాగా తగ్గిపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పారు డాక్టర్‌లు. సరిగ్గా అప్పుడే విశాఖలో ‘రంగస్థలం’ ప్రీ-రిలీజ్‌ వేడుకలని నిర్మాత ప్రకటించారు. కానీ నేను విశాఖ వస్తే అమ్మ కూడా నాకు దక్కదేమో అనిపించింది. అందుకే రాలేదు. ఈ విషయం చిరంజీవిగారికి తెలిసి నాతో మాట్లాడారు. ఆ తర్వాత నా విషయం ఆరోజు వేదికపై ప్రకటించారు. సభలో ఉన్నవాళ్లందరూ అమ్మ కోసం ప్రార్థించాలని కోరారు. అంతమంది ప్రార్థన ఫలితమేమో.. అమ్మ నేను చూస్తుండగానే కోలుకుంది!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.