close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫోను పేలిపోదిక!

బ్యాటరీల అవసరం తెలిసిందే. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులకీ ఇన్‌బిల్ట్‌ బ్యాటరీ ఉండాల్సిందే. అప్పుడప్పుడూ అవి చెడిపోవడంవల్ల ఆ వస్తువు పాడవడం సంగతి అలా ఉంచితే, ఫోనుల్లాంటివయితే పేలి పోయే ప్రమాదం ఉంది. అందుకే త్వరగా ఛార్జ్‌ అవడంతోబాటు సురక్షితంగా పనిచేసే ఎల్‌టీపీఎస్‌ అనే పదార్థాన్ని రూపొందించారు యూనివర్సిటీ ఆఫ్‌ కేథలిక్‌ డె లూవెయిన్‌కి చెందిన పరిశోధకులు. ప్రస్తుతం లి-అయాన్‌ టెక్నాలజీతో తయారవుతోన్న బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్లు ద్రవస్థితిలో ఉండటంతో పేలడానికి అవకాశం ఉంటుంది. కానీ టయోటా కంపెనీ భాగస్వామ్యంతో చేసిన ఈ పరిశోధనలోని కొత్త రకం బ్యాటరీల్లో ఎలక్ట్రోలైట్లు ఘనరూపంలో ఉంటాయి, శక్తిమంతంగానూ పనిచేస్తాయట. కాబట్టి ఫోన్లూ కార్లూ బ్యాటరీ కారణంగా పాడవడం, పేలిపోవడం తగ్గుతుందన్నమాట.


పిల్లలు మాట్లాడుతున్నారా?!

రిగ్గా మాట్లాడలేనివాళ్లకు మానసిక సమస్యలు ఉండే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. వీళ్లు కేప్‌టౌన్‌ సమీపంలోని ఖయెలిస్తా అనే ఊళ్లోని కొందరు పిల్లల్ని ఎంపికచేసి వాళ్ల భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించారట. అందులో బాగా తక్కువ మాట్లాడుతోన్న పిల్లల్ని పరిశీలిస్తే- వాళ్లలో బుద్ధిమాంద్యం లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అదేసమయంలో ధారాళంగా మాట్లాడే పిల్లల్లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నట్లు తేలింది. భాషానైపుణ్యం లేని టీనేజర్లలో ఎక్కువమంది డిప్రెషన్‌తో బాధపడటంతోబాటు చదువులో వెనకబడటాన్నీ గమనించారట. ఈ లోపానికి పేదరికం తోడయితే, ఆ పిల్లల్లో నెగెటివ్‌ ఆలోచనలు పెరిగి, అవి మానసిక సమస్యలకి దారితీస్తున్నట్లు గుర్తించారు. సో, తల్లిదండ్రులు చిన్నవయసు నుంచే పిల్లల భాషా పరిజ్ఞానం పెంచే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు.


ఏ మందు వాడాలి?

కొన్ని రకాల వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు ఓ పట్టాన తగ్గవు. దాంతో డాక్టర్లు మందుల్ని మార్చి రాస్తుంటారు. దీనివల్ల ఆ బ్యాక్టీరియా లేదా వైరస్‌లకి అన్ని రకాల యాంటీబయోటిక్స్‌నీ తట్టుకునే శక్తి పెరిగిపోయి, సదరు రోగికి ఏ మందు ఇచ్చినా పనిచేయదు. ఇన్ఫెక్షనూ తగ్గదు. అందుకే యోర్క్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పెన్సిలిన్‌ మాదిరిగా పనిచేసే బీటా-ల్యాక్టమ్‌ అనే ఒకరకమైన యాంటీబయోటిక్‌ను రూపొందించారు. దీన్ని ఓ సెన్సర్‌తో అనుసంధానించడం ద్వారా శరీరంలోని బ్యాక్టీరియా లేదా వైరస్‌ దాన్ని ఎంతవరకూ తట్టుకుంటుందో తెలుసుకోవచ్చు అంటున్నారు. అందుకోసం మూత్ర పరీక్ష మాదిరిగానే యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ పరీక్షను రూపొందిస్తున్నారు. దీనివల్ల ఆ మందుని బ్యాక్టీరియా ఏ స్థాయి వరకూ తట్టుకుంటుందో ముందే తెలుస్తుంది. దాంతో రోగికి ఏ రకమైన యాంటీబయోటిక్స్‌ వాడాలీ ఎంత మోతాదులో వాడాలీ అన్న అవగాహన వస్తుంది అంటున్నారు.


‘ఫయిజమా’లొస్తున్నాయ్‌!

నిద్రపోయేటప్పుడు కాస్త లూజుగా ఉండే దుస్తుల్ని వేసుకోవడం తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సరికొత్త ‘ఫయిజమా’లను తయారుచేశారు యూనివర్సిటీ ఆఫ్‌ మాసాచుసెట్స్‌ పరిశోధకులు. ఈ దుస్తులు గుండెరేటునీ శ్వాసవేగాన్నీ గుర్తించేలా రూపొందించారట. శరీరధర్మాన్ని తెలుసుకునే దుస్తులు(ఫిజియోలాజికల్‌ సెన్సింగ్‌ టెక్స్‌టైల్స్‌) కాబట్టి వీటిని ఫయిజమాస్‌ అంటున్నారు. సాధారణంగా స్మార్ట్‌ టెక్స్‌టైల్స్‌ లోపల రకరకాల సెన్సర్లు అమర్చడం వల్ల ఒంటికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆ కారణంతోనే వాటిని పడుకునేటప్పుడు వేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ వాటినే వదులుగానూ ఉండేలా రూపొందిస్తే శరీరానికి హాయిగా ఉండటంతోపాటు అందరూ వేస్తారు. పైగా నిద్రలో రకరకాల భంగిమల్లోకి మారుతుంటాం. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన ఈ దుస్తుల్లోని సెన్సర్లు, అన్ని రకాల భంగిమల్నీ ఆ సమయంలో అవయవాల పనితీరునీ... ఇలా మొత్తం సమాచారాన్ని సంబంధిత ఆప్‌ ద్వారా ఫోనులో నిక్షిప్తం చేయడం వల్ల వాళ్లలోని ఆరోగ్యసమస్యల్ని ముందే గుర్తించగలిగే వీలు ఉంటుందట. ముఖ్యంగా నిద్రపోయే భంగిమల ఆధారంగా చాలినంత నిద్ర పోతున్నారా లేదా అన్నదీ తెలుస్తుంది. సో, దుస్తులనుంచే ఆరోగ్యాన్ని పరీక్షించవచ్చన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.