close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ బొమ్మలు మాట్లాడతాయి!

కొండపల్లి కోట... ఓ చారిత్రక ఖజానా! విజయవాడ దగ్గర్లో ఉన్న ఈ దుర్గంలోని దర్బార్‌ హాలుని ఈ మధ్యే పునరుద్ధరించారు. అక్కడో చక్కటి సింహాసనాన్ని ఉంచారు. మామూలు కంటితో చూస్తే అది సింహాసనమే కానీ... మీ మొబైల్‌ కెమెరాని దానికెదురుగా పెడితే దానిపైన కులీ కుతుబ్‌షాహీ ప్రభువు కూడా కనిపించి ఈ కోట కథని వివరిస్తాడు. ‘ఆగ్మెంటెడ్‌ రియాలిటీ’ సాంకేతికత సాయంతో ఆవిష్కరించిన అద్భుతం ఇది. మన తెలుగు నేలపైన వివిధ పర్యటక ప్రాంతాల్లో ఈ సాంకేతికతతో హల్‌చల్‌ చేస్తోంది సింటిలియా క్రియేషన్స్‌ అనే సంస్థ.

కొండపల్లి కోటలోని సింహాసనం మాత్రమే కాదు... అక్కడున్న నలభై విగ్రహాలూ ఇలాగే తమ కథని వివరించి సందర్శకుల్ని అబ్బురపరుస్తున్నాయి. ఆ దుర్గాన్నేలిన కుతుబ్‌షాహీలూ, అసఫ్‌జాహీలు తమ పరివారంతో వరసకడుతున్నారు. గుజరాత్‌, మహరాష్ట్రల్లోని మ్యూజియాల్లో ఈ సాంకేతికతని ఇదివరకే ఉపయోగించారుకానీ అందులో కనిపించే విగ్రహాలు కదలవూ, మెదలవు. అవి అలా నిల్చుని ఉంటే... వెనక నుంచి నేపథ్య గళం వినిపిస్తుంది. కానీ ఇక్కడ విగ్రహాలు ‘యానిమేట్‌’ అవుతాయి. నిజంగానే మానవరూపం ధరించాయా అన్నట్టు కదులుతాయి. ఇలాంటి ఏఆర్‌ ప్రయోగం దేశంలోనే మొదటిదని చెబుతున్నారు కొండపల్లి  కోటలో దీన్ని ఏర్పాటుచేసిన ‘సింటిలియా క్రియేషన్స్‌’ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతీష్‌. హైదరాబాద్‌కి చెందిన ఈ సంస్థ విజయవాడలోని ప్రఖ్యాత బాపు మ్యూజియంలోనూ ఏఆర్‌ సాంకేతికతని ఇంతే సమర్థంగా వినియోగించింది. ఈ మ్యూజియంలో ఉన్న ఏళ్లనాటి బౌద్ధ శిల్పాలు కదిలి మాట్లాడటమే కాదు... చిన్నపాప కూడా ప్రత్యక్షమై కృష్ణాతీరంలో నాగరికత విలసిల్లిన వైనాన్ని వివరించడం మరో అద్భుతమనే చెప్పాలి. కర్నూలు మ్యూజియంలోనూ ఇలాంటి సాంకేతిక నైపుణ్యాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది సింటిలియా సంస్థ. వీటికి భిన్నంగా, తిరుపతిలోని శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో ఉన్న ‘ఫ్రైడే పార్కు’లో మరో రకం యానిమేషన్‌ని కళ్లముందుకు తెస్తోంది. మనం ఈ పార్కుకి వెళ్లి పద్మావతి పరిణయం ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని ‘ఫ్రైడే పార్కు’ గోడలపైనున్న చిత్రాలవైపు మన మొబైల్‌ ఫోన్‌ని చూపిస్తే చాలు... అవి యానిమేటెడ్‌ బొమ్మలుగా మారిపోతాయి. అలా మారి, ఒక్కొక్కటీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయగాథని వివరిస్తాయి. వీటికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేపథ్యగాత్రం అందించారు. యాదాద్రి దగ్గర్లోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామంలో భగవద్గీతనీ దృశ్యాత్మకంగా వివరిస్తున్న ఘనత కూడా ఈ సంస్థదే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదండోయ్‌... తమిళనాడులోని రామేశ్వరంలోనూ వీళ్లు ఏఆర్‌ సాయంతో రామకథని వినిపించి ‘వావ్‌’ అనిపిస్తున్నారు. అక్కడి రామనాథపురంలో ఉన్న ‘మెరైన్‌ వరల్డ్‌’ జలచరాల మ్యూజియం బాధ్యతలనీ తమిళనాడు ప్రభుత్వం సింటిలియాకే అప్పగించింది. ఇక్కడ ప్రతి సముద్రజీవీ నేరుగా వచ్చి తమ గురించీ, పర్యావరణ పరిరక్షణలో తమ పాత్ర గురించీ వివరించడం ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తోందని చెబుతున్నారు పర్యటకులు.

ఇంతకీ ‘ఏఆర్‌’ అంటే...
‘ఆగ్మెంటెడ్‌ రియాలిటీ’ అంటే... మన ఎదురుగా ఉన్న వాస్తవానికి(రియాలిటీ) అదనపు హంగులు జోడించి చూపించేది అని అర్థం. ఆ వాస్తవం వస్తువూ, బొమ్మా, భవంతీ, చిత్రం... ఇలా ఏదైనా కావొచ్చు. దానికి సంబంధించిన మరింత సమాచారాన్నో, వీడియోలనో, చిత్రాలనో అప్పటికప్పుడు అదనపు హంగుగా అందిస్తుంది కాబట్టి ఆ పేరు. ఇందుకోసం ‘రియల్‌’ వస్తువులో ఏఆర్‌ సంకేతాలని సూక్ష్మంగా ముద్రించి ఉంటారు. దాన్ని మనం వాడుతున్న మొబైల్‌(లేదా ప్రత్యేక కళ్లద్దాలు, హెడ్‌సెట్‌)లోని కెమెరా స్కాన్‌ చేయగానే... దానికి సంబంధించిన వీడియోలు వచ్చేస్తాయి. మనదేశంలోనూ మొదట రక్షణరంగంలోనే ఇవి అడుగుపెట్టాయి. ఈ టెక్నాలజీ టాలీవుడ్‌లోకీ వెళ్లింది. పెప్సికో సంస్థ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌ అల్లు అర్జున్‌తో కలిసి ‘క్లిక్‌ చేస్తే... డ్యాన్స్‌ చేస్తా’ అనే ప్రచారాన్ని నిర్వహించింది. ఆ తర్వాత, దగ్గుబాటి రానా తన ‘నేనే రాజు... నేనే మంత్రి’ సినిమా కోసం కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించారు. అలా సినిమా ప్రేక్షకులకి పరిచయమైన ‘ఏఆర్‌’ని సింటిలియా సంస్థ ఇప్పుడు పర్యటక రంగంవైపు తెచ్చి ఈ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.