close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చూడు నాన్నా!

- బాడిశ హనుమంతరావు

ఎర్రగా మెరిసిపోతున్న పట్టుచీరా దానిపైన జరీ పూలూ లతలూ పెద్ద అంచూ ఎక్కువ జరీతో వచ్చిన కొంగూ బుగ్గన దిష్టి చుక్కా ఆరోగ్యంగా మెరుస్తున్న ఆల్చిప్పల్లాంటి కళ్ళూ మునివేళ్ళతో కుచ్చిళ్ళు పైకి ఎత్తి పట్టుకుని నెమ్మదిగా నడుస్తున్న మహాలక్ష్మిలా... నా దిష్టే తగిలేలా ఉంది. తను నా చిట్టితల్లి మహీనేనా... నేను తప్ప అందరూ సంతోషంతో తుళ్ళిపడుతున్నారు.

‘‘కుడికాలు ముందు పెట్టమ్మా’’ ఓ పెద్దావిడ సూచనలు ఇస్తోంది.

‘‘ఆగండాగండి... పేరు చెప్పాలి కదా. ముందు మా అన్నయ్య పేరు చెప్పి అప్పుడు రమ్మనండి లోపలికి’’ అధికారం చూపుతోన్న ఆడబిడ్డ స్వరం. నేను దూరంగా పందిరి గుంజకు ఆనుకుని ఆ తంతును అసంతృప్తిగా చూస్తున్నాను. ఆ తంతనే కాదు... ఆ పెళ్ళిలో జరుగుతున్న ప్రతిదీ నన్ను అసంతృప్తికే గురిచేస్తోంది. ఇది ఈ పెళ్ళి నిర్ణయించుకున్నప్పటి నుంచే మొదలయింది.

*

మహిక నా కూతురు. ఇప్పటికి తను నా జీవితంలోకి వచ్చి ఇరవైనాలుగేళ్ళు.
నాకు మల్లికతో పెళ్ళయిన నాలుగేళ్ళ తర్వాత, మా ఇద్దరి మధ్యకు మరో ప్రాణి రాబోతున్న శుభ సందర్భం. ఏడో నెలలోనే మల్లిక వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది కాన్పు కోసం.
ఓ రోజు ఉదయం ఏడున్నరకు ‘మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందోయ్‌’ అనే వార్తను ఇంటిలో ఉన్న ల్యాండ్‌ ఫోన్‌ అందించింది. ఒక్క క్షణం గుండె ఎగిసిపడింది. నాకు కూతురు పుట్టింది. ప్రాణం ఆగలేదు... నాలుగు గంటల్లో అక్కడ వాలిపోయాను. ఎంతో ముద్దుగా అందంగా మంచులో తడిసిన లేతగులాబీలా ఉంది. ఎంత చూసినా తనివితీరితేనా!
నల్లని గోలీల్లాంటి కళ్ళు గిర్రుగిర్రున తిప్పుతూ చిట్టి చేతులూ బుల్లి కాళ్ళూ తపతపా కొడుతూ మల్లిక చేతుల్లోంచి, నా చేతుల్లోకి మూడో నెలలో వచ్చిన మహీ అక్కడ్నుండి నా గుండెల్లో కొలువుదీరింది.
అది మొదలు ఏనాడూ తనని నేను వదిలింది లేదు. తనూ నన్ను వదల్లేదు. మహీ వచ్చిన తర్వాతనే నా జీవితం మరింత అందంగా కనిపించడం మొదలైంది. తనను కన్నది పేరుకే మల్లిక. కానీ తన ప్రతి పనీ నాదే! ‘దెబ్బ తగిలితే అందరూ ‘అమ్మా’ అంటారు, నీ కూతురు ‘నాన్నా’ అంటుందేంట్రా?’ అనేవాళ్ళు మా బంధువులందరూ.
మహీ తొలి అడుగు వేసింది నా వేలు పట్టుకునే. అంతేకాదు, ఆ వేలు వదిలి రెండు కాళ్ళపై తడబడుతూ నిలబడి, సాధించానన్నట్టు విసిరిన అర విరిసిన మొగ్గ లాంటి నవ్వు మొదట జారింది నా కళ్ళముందే!
తను స్కూలుకు వెళ్ళే వయసులో ఇంటినుండి బడికి ఎంత బలవంతంగా వెళ్ళేదో, తను ఇంటి వద్దనే ఉన్న చిన్నతనంలో ఆఫీసుకి నేనూ అంతే బలవంతంగా వెళ్ళేవాణ్ణి.
దోస్తులతో గడిపి ఎప్పుడో కానీ ఇంటికిరాని నేను, మహీ పుట్టిన తరవాత ఒక్క నిమిషం ఇంటికి రావడం ఆలస్యం అయినా ఎంత అసహనంగా అనిపించేదో!

తను కూడా మమ్మల్ని ఏనాడూ ఏ విషయం లోనూ నిరాశపరచలేదు. చదువు విషయంలో గానీ అలవాట్ల విషయంలోగానీ ఎక్కడా కూడా. బాగానే చదివేది. చదువుతోపాటు ఆటపాటల్లోనూ మంచి ప్రతిభనే కనపరిచేది. తను ఎదుగుతున్న ఆ క్షణాలలో నేను తనకెంత ముఖ్యమో వీలుపడిన ప్రతీ సందర్భంలోనూ ప్రకటించేది.
మహీ చిన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చింది. ఖైరతాబాద్‌లో ఒక పిల్లల డాక్టరు వద్దకు తీసుకెళ్ళాం. అక్కడ చూపించుకోవడం అయిన తర్వాత బయటికి వస్తుంటే ఓ షాపు కనపడింది. దానికున్న అద్దాలలో నుంచి బయటికి కన్పిస్తున్న ఓ టెడ్డీబేర్‌ తనకు ఎంతో నచ్చింది. అది కావాలని అడిగింది. షాపులోకి వెళ్ళి కొందామని చూస్తే వాళ్ళు చెప్పిన ధర చూసి కళ్ళు తిరిగాయి.

అప్పటికి మహీని సముదాయించాను కానీ తనకు నచ్చిన బొమ్మను కొనివ్వలేకపోయానన్న విషయం నన్ను ఇబ్బందిపెట్టింది. ముందు ముందు ఇలాంటి సందర్భాలు ఎక్కువైపోతాయేమో!? నాకున్న సంపాదన తనను కంఫర్ట్‌గా ఉంచడానికి సరిపోదని అర్థమైంది. ఆ ఆలోచనే నేను ఆర్థికంగా ఎదగడానికి కారణమైంది. చివరకు ఏ విషయంలో కొరత ఏర్పడుతుందో అనే భయంతో పిల్లలను కూడా మహీతోనే ఆపేశాం.
ఊరు నుండి నగరం చేరడం... నాలుగంకెల నుండి నెల సంపాదన అయిదంకెలకు చేరడం... ఏ వస్తువు అదనంగా ఇంట్లోకి చేరినా అది దాదాపు మహీకి సంబంధించినదై ఉండటం... అలా ఇంట్లోకి తన ప్రవేశంతో చాలానే మార్పులు అనివార్యంగా సంభవించాయి.
అందరూ ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందంటారు. నిజమే, ఆడపిల్లతో ఇంటికే ఓ కళ వస్తుంది. తనకోసమైనా ఇంటి పరిశుభ్రతపైనా మన అలవాట్లపైనా శ్రద్ధ పెడతాం. మన ఖర్చుదారీ అలవాట్లు తగ్గించుకుంటాం. ఇతర ఆదాయ వనరులు పెంచుకుంటాం. ఆటోమేటిక్‌గా మన ఆర్థిక స్థితి మారుతుంది. ఆడపిల్ల పెరిగే క్రమంలో ఎన్ని ముచ్చట్లు, మురిపాలు... అవి అందించే ఆనందం అదనపు బోనస్‌.
తండ్రికి ఇంట్లో ఒక ప్రత్యేకత వచ్చేదే ఆడపిల్లవల్ల. ఆయనను మహారాజుని చేసి, తన తరఫున అధికారం చెలాయిస్తుంది. ఎక్కడా తండ్రికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలో తల్లినే మరిపిస్తుంది.
ఇంట్లో అమ్మాయి ఉంటే అమ్మ ఉన్నట్టే.
తండ్రికి కూడా ఇతరులతో వ్యవహరించే పద్ధతి మారుతుంది. ప్రత్యేకించి ఆడవారితో ప్రవర్తించే పద్ధతిలో వారికి గౌరవం ఇవ్వడంలో పూర్తిస్థాయి పెద్దరికం వస్తుంది. సమాజంలో కూడా హుందాగా వ్యవహరించడం మొదలవుతుంది.
ఆఫీసు నుంచి ఇంటికి రాగానే చేతిలోని బ్యాగు అందుకుని, నేను ఫ్రెషప్‌ కాగానే కాఫీ అందించే వరకూ అన్నీ మహీనే చూసుకునేది. నాకు ఏదైనా జ్వరం లాంటిది వచ్చిందంటే చిన్నపిల్లాడికంటే ఎక్కువగా చూసుకునేది. అనారోగ్యం తగ్గేంతవరకూ నన్ను వదిలేది కాదు. మా అమ్మానాన్నా నా పెళ్ళయిన రెండేళ్ళకే అనుకోని ప్రమాదంలో పోయారు. మా అమ్మే మళ్ళీ మహీ రూపంలో కనపడుతోంది.
మొదటిరోజు స్కూలుకి వెళ్ళినప్పుడూ మొదటిసారి ప్రైజు వచ్చినప్పుడూ మొదటిసారి కాలేజీకి వెళ్ళినప్పుడూ... ప్రతీ మొదటిసారిలోనూ మహీతో నేను ఉన్నాను. జీవితంలోని జీవితాన్ని చూపే మధుర జ్ఞాపకాలన్నీ నాకు మహీతోనే! ప్రతి విషయాన్నీ నాతో పంచుకునేది. చివరకు, చదువు పూర్తిచేసి, అది పూర్తవుతుండగానే విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఉంటున్న నగరంలోనే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంది.
‘‘అయ్యో, అలా ఎందుకమ్మా... అందరూ వెళ్తున్నారు కదా’’ అంటే ‘‘అక్కడ అన్నీ దొరకొచ్చు, ఎక్కువ సంపాదన ఉండొచ్చు... కానీ నాన్న ఉండడుగా. నాన్న దగ్గర లేనప్పుడు ఏవీ అంత ముఖ్యం కావు నాన్నా.’’
‘‘నాన్న ఉంటే సరిపోతుందా, సరే అయితే’’ కినుకగా అంటున్న మల్లికతో...
‘‘అయ్యో అమ్మా, నాన్నంటే అందులో డిఫాల్ట్‌గా అమ్మ ఉన్నట్టే’’ అంటూ ఎడమ కన్ను సుతారంగా కొట్టేస్తే... అది చూసి-
‘‘అలాగా, మరి అమ్మలో నాన్న డీఫాల్ట్‌గా ఉండడేం’’ అంటున్న మల్లికను చూపిస్తూ...
‘‘చూడు నాన్నా...’’ గారంగా గుండెలపై తలవాల్చి కబుర్లు చెప్పిన మహీ...
ఇప్పుడు మారిపోయింది... పూర్తిగా మారిపోయింది. నాన్నను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదంతా అతనివల్ల వచ్చింది. అతనే అవినాశ్‌.
అందరూ ‘ఉద్యోగం వచ్చింది కదా... మరి పెళ్ళెప్పుడు’ అంటున్నారని సంబంధాలు చూడటం మొదలుపెట్టాం. ఆ ప్రయత్నాలన్నీ చివరికి అవినాశ్‌ దగ్గరకి వచ్చి ఆగిపోయాయి.
ప్రాథమికంగా జరగాల్సినవి అయిపోయాక... పెద్దల సూచన మేరకు ఇద్దరూ ఒకరోజు కాఫీ షాప్‌లో కలిశారు. అన్నీ మాట్లాడుకున్నారు. అంగీకారం తెలుపుకున్నారు. క్రిస్మస్‌ సెలవుల్లో పెళ్ళి అనుకున్నాం. ఇంకా సుమారుగా ఆరు నెలలు ఉంది.

*

అప్పటినుంచీ మహీ నాతో మాటలు తగ్గించింది. అలా అనడంకంటే, తనకు నాతో మాట్లాడే సమయమే ఉండటం లేదు అనడం కరెక్టు. అయితే ఆఫీసు లేదా ఇంట్లో ఉంటే సెల్‌లో అతనితో ముచ్చట్లు. ఎప్పుడైనా మాతో ఒకటో రెండో ముక్కలు మాట్లాడినా... మాటకు ముందోసారి, తర్వాతోసారి అవినాశ్‌ ముచ్చట్లే. ఇప్పుడే ఇలా ఉంటే, పెళ్ళయితే నాతో అసలు మాట్లాడదేమో!?
పెళ్ళి ఏర్పాట్లు నా ప్రమేయం లేకుండానే చిన్నగా మొదలయ్యాయి.
పెళ్ళికి బట్టలు కావాలని సుమంగళి షోరూమ్‌కి వెళ్ళాం. ఎప్పుడు తనకు బట్టలు తీసుకున్నా ‘ఎలా ఉన్నాయి నాన్నా?’ అంటూ నా స్పందన కోసం చూసేది. ఆరోజు కూడా బయల్దేరేముందు ‘‘ఎటు తిరిగీ మీ నాన్న చెప్పిందే కదా తీసుకునేది, కూడా మేమెందుకు?’’ అని ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ దెప్పింది. కానీ, ఈసారి నా అంగీకారం ఏం లేదు.
ప్రతిదీ చూసుకోవడం, షార్ట్‌లిస్ట్‌ చేసుకోవడం, ఆ తరవాత అవినాశ్‌కి వీడియోకాల్‌ చేయడం, ఆ తర్వాతనే ఫైనల్‌ చేయడం జరుగుతోంది.
‘‘అమ్మా మహీ, నీకు ఈ కలర్‌ నప్పదమ్మా... ఎప్పుడూ కట్టుకోలేదు కూడా.’’
‘‘లేదు నాన్నా. అవినాశ్‌కి ఇదే నచ్చిందట.’’
‘‘ఈ హారం డిజైన్‌లో మామిడి పిందెలు భలేగా వచ్చాయి చూడు.’’
‘‘నాన్నా... అవినాశ్‌కి నచ్చలేదు.’’
‘‘నాన్నా, ఈ బ్రేస్‌లెట్‌ బాగుంది చూడు.’’
‘‘ఇప్పుడు నాకెందుకు తల్లీ! ఎప్పుడు షాపింగ్‌కి వచ్చినా నీ సంగతి పక్కనబెట్టి నాకు వెదుకుతావు?’’
‘‘అయ్యో నాన్నా... ఇది నీకు కాదు... అవినాశ్‌కి బాగుంటుంది కదా’’ అంటున్నా.
‘‘అవునా... నాకేమో అనుకున్నా.’’
‘‘ఇప్పుడు నీకెందుకు నాన్నా?’’
‘నీకెందుకు నాన్నా’ అని మహీ ఇంతకుముందు ఎప్పుడూ అనలేదు.
తనకు ఉద్యోగం వచ్చిన కొత్తలో షాపింగ్‌కు వెళ్ళాం. ఓ షాపులో ట్రెండీగా ఉన్న ఓ షర్ట్‌ నచ్చింది. ‘తీసుకోనా?’ అని మల్లికని అడిగాను. ‘ఇప్పుడు మీకెందుకండీ అది’ అంది ముఖం ఓ రకంగా పెట్టి. పక్కనే ఉన్న మహీ ఆ మాట అన్నందుకు తల్లిని కరచినంత పని చేసింది.

మర్నాడు ఆఫీసు నుంచి వస్తూ... ఆ షర్ట్‌ని కొనుక్కొచ్చింది. ‘‘నాన్నా, నీకు నచ్చింది ఏదైనా చెయ్యి, ఏదైనా తీసుకో... అది తప్పు పని కానప్పుడు ఎందుకు వద్దనుకుంటావు?’’
‘‘అమ్మ బావోలేదన్నది కదమ్మా?’’
‘‘అమ్మ అలాగే అంటుంది. ఒక్కసారికి వాడు... ఆ ముచ్చట తీరిపోతుంది. అప్పుడు వదిలేద్దువుగానీ. ఎన్ని కోరికలు మాకోసం చంపుకున్నావు నాన్నా! ఇప్పుడు ఇబ్బందిలేదు, నేనూ సంపాదిస్తున్నాగా!’’
ఇలా అనే నా కూతురు- ఇప్పుడు ‘నీకెందుకు నాన్నా’ అంటోంది. ‘ఇలా అవినాశ్‌ చూస్తే బావోదు’ అంటోంది. అవినాశ్‌కి నచ్చినట్టు చేయాలన్నట్టు గొంతు ధ్వనించేది. అది నాకెందుకో రుచించట్లేదు. తన మనసులో నా స్థానం కిందకు జారినట్టనిపిస్తోంది.

*

కళ్యాణ మంటపంలో పెళ్ళి అనుకున్నాం. సిటీలో ఇదో అడ్వాంటేజ్‌. డబ్బులు ఉంటే చాలు... మనం పెళ్ళింటివాళ్ళం అన్న సంగతి ఎవరికీ... చివరికి మనకు కూడా తెలియకుండానే పనులు జరిగిపోతాయి. పనులన్నీ ఒకదానివెంట ఒకటి జరిగిపోతున్నాయి. చూస్తుండగానే పెళ్ళిరోజు దగ్గరకు వచ్చింది. ప్రతి సెలక్షన్‌ దానిదే. ఇంకా చెప్పాలంటే అవినాశ్‌ది.
ఒకదానివెంట ఒకటి పనులు అయిపోతున్నై. మహీ ముఖంలో ఎక్కడా బాధా బెంగా కనపడటంలేదు. అన్నీ హాయిగా చేసేస్తోంది. ఎందుకో నా మనసు అంగీకరించలేకపోతోంది.
మూడుముళ్ళు వేసినప్పుడు... ‘గట్టి మేళం’ అని పంతులు అనడమే ఆలస్యం... మేళాల ధ్వనులూ అక్షింతల వర్షమూ దంపతుల మీద పడుతుంటే, నా గుండెలో ఓ భాగాన్ని పెళ్ళి పేరుతో లాక్కుపోతున్నట్టు సన్నగా నొప్పిలాంటి ఫీలింగ్‌.
అందరం కలిసి ఆరోజు సాయంత్రం, అవినాశ్‌ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కుడికాలు ముందుపెట్టి రమ్మని ఆడబిడ్డలు ఆటపట్టిస్తున్నారు. మహీ అదే స్థాయిలో స్పోర్టివ్‌గా రిసీవ్‌ చేసుకుంటోంది. మల్లిక నవ్వుతూ చూస్తోంది. నటిద్దామన్నా నా ముఖం మీద నవ్వు రావట్లేదు.
తనని అక్కడే వదిలేసి, తోడుగా మా కజిన్‌ను ఉంచి వచ్చాం.

*

నేనూ మల్లిక ఇద్దరమే ఇంట్లోకి వెళ్ళాం. హృదయం భారంగా ఉంది. అడుగులు బరువుగా పడుతున్నాయి. ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటిది ఇదే మొదటిరోజు. ఎవరికైనా చెప్పినా నమ్మలేరు కూడా. కానీ ఇది నిజం! మల్లిక నావైపే వింతగా చూస్తోంది. నిజమే, కూతురికి దూరమవుతున్న ఒక తండ్రి మనసు మరో తండ్రికి తప్ప తనకెలా గ్రహింపులోకి వస్తుంది...
సరాసరి మహీ గదిలోకి వెళ్ళాను. గోడమీద వాల్‌పోస్టర్‌ సైజులో- నేనూ తనూ దిగిన ఫొటో. అప్పట్లో నాకు నచ్చిందన్నానని తెచ్చిన షర్ట్‌లో నేనూ, నా చేతిని చుట్టి నవ్వులు చిందిస్తూ తనూ.
ఇప్పుడు తను ‘పరాయి(?)’ వాళ్ళింట్లో ఉంది. కళ్ళనిండా నీళ్ళు... పొద్దుటినుండి ఆనకట్ట వేసి ఆపిన వరద, గట్టు తెగినదానికిమల్లే వెల్లువైంది.
‘మహీ కనీసం ఫోన్‌ కూడా చేయలేదు. నాకు చేయాలనిపిస్తోంది కానీ... ఫోన్‌లో తన గొంతు వినగానే పెద్దగా ఏడ్చేస్తానేమో అని భయంగా ఉంది. అలా ఏడిస్తే అది వాళ్ళకు తెలిస్తే అపార్థాలకు దారితీస్తుందేమో. అయినా అసలు మహీనే సరిగా మాట్లాడకపోతే!?’
మల్లిక మౌనంగా వంటగదిలోకి వెళ్ళింది.
‘ఈ ఆడవాళ్ళు ఇంత గట్టిగా ఎలా ఉండగలరు? కూతురు వెళ్ళిందన్న బాధ కూడా లేకుండా పనులకు తయారైపోయింది.’
ఓ పది నిమిషాల్లో కాఫీ పట్టుకొచ్చింది. అదే మహీ ఉంటే... ఆ కప్పు తను తెచ్చి ఉండేది.
‘‘చాల్లే సంబడం... చిన్నపిల్లాడిలా ఏంటా ఏడుపు... ఎవరైనా చూస్తే నవ్విపోతారు’’ ఉపోద్ఘాతంలా మొదలుపెట్టింది.
‘‘కాదు మల్లీ, మహీ చూడు... ఎంత అటాచ్డ్‌గా కన్సర్న్డ్‌గా ఉండేది. ఇప్పుడు చూడు... ఎలా మారిపోయిందో? ప్రతిదీ ఆ అబ్బాయినే అడిగిచేస్తోంది. కనీసం మనతో సరిగా మాట్లాడనైనా మాట్లాడటంలేదు’’ ఫిర్యాదు చేస్తున్నట్టు అన్నాను. ‘‘నగా అతనికి నచ్చిందే, చీరలూ అతనికి నచ్చినవే, చివరికి కళ్యాణ మంటపం కూడా...’’
‘‘ఊఁ ఇంకా...’’ సర్కాస్టిక్‌గా అంది.
‘‘నీకేమో తమాషాగా ఉంది. అసలు తను లేని ఇల్లు చూడు ఎలా ఉందో. అసలు ఉండబుద్దే కావడం లేదు. ముందుముందు అంతా ఇలాగే ఉండాలేమో’’ అంటుండగానే గొంతు గాద్గదికమైపోయింది. మల్లిక పెద్దగా నవ్వింది.
‘‘ఇదో పిచ్చిది... ప్రతిదానికీ నవ్వు ఒకటి’’ గొణుక్కున్నాను.
‘‘మరీ ఇంతలా ఇదైపోతారేంటండీ? నేనుగానీ మీరుగానీ తనతో జీవితాంతం ఉంటామా? ఎప్పుడో ఒకప్పుడు బిచాణా సర్దుకోవాల్సిందే కదా. మనం వెళ్ళిపోయినా వాళ్ళకంటూ ఓ తోడూ... అదీ సొంతం అనుకునే తోడు కోసమే ఈ పెళ్ళీ వగైరా కట్టుబాట్లు.’’
‘‘మహీని వదిలేసి పోతామా... అలా ఎలా కుదురుతుంది?’’ నేను బేలగా చూస్తుండిపోయాను.
‘‘అయినా ఇంత అంటున్నారు కదా... మన పెళ్ళప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తులేదా? నాకు నచ్చినవని మీరు ఎన్ని కొనలేదు? మీకు నచ్చాయని నేను ఎన్ని కొనుక్కోలేదు? నాకు నచ్చిందని మీరు కొనుక్కున్న ఇటుకరంగు లాల్చీ ఇప్పటికీ బీరువాలో లేదూ? మీ అమ్మగారు ‘ఈ రంగు నీకు నచ్చదు కదరా’ అంటే... మీరేమన్నారు? ‘మల్లికి నచ్చిందమ్మా’ అనలేదూ..?
మన పెళ్ళయిన తరవాత రెండేళ్ళకే అత్తయ్యా మామయ్యా మనల్ని వదిలి వెళ్ళిపోయారు కదా. మనమూ అంతే! పిల్లలు... వాళ్ళదే భవిష్యత్తు. మనలాగా వాళ్ళు కూడా వారిదైన జీవితం నిర్మించుకుంటారు. ఈమాత్రం అర్థంచేసుకోలేక పోతున్నారేంటీ?’’ మళ్ళీ కొనసాగించింది.
‘‘అయినా ఏమన్నారు... మహీ మనల్ని మర్చిపోయిందనా? ఉద్యోగం చేస్తున్నా, స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయైనా... మనం అంగీకరించినవారినే చేసుకుని, మనల్ని ఎటువంటి ఇబ్బందీపెట్టని మనసు దానిది. తల్లిదండ్రులపైన ప్రేమ వేరు, ఆలుమగల మధ్య ప్రేమ వేరు. దేనిదారి దానిదే. మన పెళ్ళి కుదిరిన తరవాత మాట్లాడుకోవడానికి ఎంత ఆరాటపడేవాళ్ళమో గుర్తులేదా? ఎదురింట్లో ఉన్న ల్యాండ్‌ ఫోన్‌ మోగినప్పుడల్లా మనల్ని పిలుస్తారేమో అని ఎదురుచూడటం మర్చిపోయారా? మాట్లాడుతున్నప్పుడూ అప్పుడే అంత సమయమైందా అని సెకన్లు లెక్కపెట్టుకున్నదీ ఎటు పోయింది?
ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి పిల్లలకా అవకాశం దొరికింది. ఏదో జరగరానిది జరిగినట్లు అల్లాడిపోతారేం? ఆ వయసులో మీరు చేస్తే రైటూ వాళ్ళు చేస్తే తప్పా? ముచ్చట బానే ఉందిగానీ, కాఫీ తాగండి చల్లారిపోతుంది. మళ్ళీ వేడి చేయడం నావల్ల కాదు. ఆ పని చేయడానికి మీ కూతురు కూడా ఇక్కడ లేదు. నాకు ఒళ్ళంతా అలసటగా ఉంది.’’
పక్కనే ఉన్న మంచంపైన ఒరిగి అంతలోనే నిద్రలోకి జారిపోయింది. చల్లారిన కాఫీ గొంతులో వంపేసుకున్నాను.
ఆ రాత్రి నా మనసులో కలిగిన వేదన తీవ్రత, నిద్రకు చోటివ్వలేమని తేల్చిచెప్పిన కనురెప్పలకూ, ఉప్పునీటి సంద్రంలో తిరుగుతున్న కనుబంతులకూ తప్ప ఎవరికి తెలుసు?

తెల్లారింది. నిన్న మల్లిక వేసిన ప్రశ్నలు తనను కాదన్నట్టు పక్కకు నెట్టేసిన మనసు అసంకల్పితంగా వాటికి సమాధానాలు వెతుకుతూనే ఉంది. మా పెళ్ళప్పుడు మా వయసు మహీ కంటే తక్కువే. దొరికిన సమాధానాలు ఇంకా చిన్నపిల్లగా చూస్తున్న
నా కూతుర్ని కొత్త కోణంలో పరిచయం చేస్తున్నాయి. మరో కోణంలో చూడమని సూచనలు ఇస్తున్నాయి. నా ఆలోచనల్లోని అపసవ్యత గ్రహింపుకు వస్తోంది.

*

నూతన దంపతులు వస్తున్నారు. తీసుకురావడానికి మేం వస్తామంటే ‘‘వద్దులే, మేమే వస్తాం. ఎవరొచ్చినా ఒకటే కదా’’ అని సర్ది చెప్పారు. ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం.
మహీ మూడోరోజుకే వస్తున్నా... ఎన్నో ఏళ్ళకు వస్తున్నట్టుంది. వీధి మొదట్లో కారు హారన్‌... వాళ్ళే కావొచ్చు.
సోఫాలో నుండి లేస్తుండగానే ఇంటి ముందుకు కారు వచ్చి ఆగిన చప్పుడు. గబుక్కున లేచాను. పెద్ద అడుగు బయటికి వేశాను. పాలరాతి మెట్టుమీద కాలు జారింది. అక్కడే కూలబడ్డాను.
అదేదో టెలీపతిలాగా అందినట్టు ‘‘నాన్నా...’’ అంటూ మహీ కారులో నుంచి ఒక్క దూకు దూకింది. ‘‘అరె, నెమ్మదిగా’’ వెనుకనుండి అవినాశ్‌ అంటూనే ఉన్నాడు.
ఆ మాట పూర్తికాకముందే నా దగ్గరకు వచ్చిన మహీ నా భుజాల కింద చేయివేసి పైకి లేపడానికి ప్రయత్నిస్తుండగా మల్లిక, అవినాశ్‌ కూడా వచ్చారు.
‘‘చూసుకోవద్దా నాన్నా...’’ ఏడుస్తూనే అరిచింది.
‘‘ఇప్పుడేం కాలేదులే. జస్ట్‌ జారారు అంతే!’’ అంటూ సముదాయించబోయిన అవినాశ్‌ని కోపంగా చూస్తూ...
‘‘ఏం కాలేదా? పడ్డవాళ్ళక్కదా నొప్పి తెలిసేది?’’ అంటూ కాలు రుద్దుతూ...
‘‘కారు తీయి అవీ, హాస్పిటల్‌కి వెళ్దాం’’ అంది.
నా కళ్ళకు రెండు మూడు రోజులుగా బాగా పరిచయం అయిన వేదన తాలూకు గాఢత... ఆ కళ్ళముందే... మహీ కళ్ళల్లో నుండి బయటకు ఉబుకుతోంది.
‘‘ఫర్వాలేదమ్మా, జస్ట్‌ జారింది అంతే! కంగారుపెట్టకు... కంగారుపడకు’’ అనునయిస్తూ అన్నాను.
కొన్ని నెలల నుండి సలుపులు పెడుతోన్న మనసు నొప్పి దూదిపింజంలా తేలిపోతోంది.
‘‘మొన్నటినుండీ ఇదే వరస. అంతా పరధ్యానం. చీటికిమాటికి చిన్నపిల్లాడిలా ఏడుపొకటి’’ విసుక్కుంది మల్లిక.
‘‘అవునా ఆంటీ, మహీ కూడా అంతే! మీరు రిటర్న్‌ అయిన దగ్గరనుంచే ముఖం వేలాడేసింది. ఇప్పుడు చూడండి... ఎలా వెలిగిపోతోందో..? పెళ్ళి చేయకుండా ఇంట్లోనే పెట్టుకోవాల్సింది మీ కూతుర్ని’’ అంటూ ఆటపట్టిస్తున్న అవినాశ్‌ వైపు కోపంగా చూస్తూ...
‘‘చూడు నాన్నా’’ అంటూ నా భుజంపైన తల వాల్చి...
‘‘ఫోన్‌ కూడా చేయలేదేం నాన్నా? చేస్తావేమో అని చేతిలోనే పట్టుకుని కూర్చున్నా. నేను చేద్దామనుకున్నా... కానీ ఏడ్చేస్తానేమో, మీరు కంగారుపడతారేమో అని ఉగ్గబట్టుకున్నాను. నీ దగ్గర ఉన్నాననుకుంటే నాకు అదో ధైర్యం నాన్నా. నువ్వయితేనే నేను ఏమన్నా అర్థం చేసుకుంటావు. ఇంకెక్కడ అలా ఉండగలను? కదా నాన్నా’’ బుంగమూతి వేసుకుని అడుగుతున్న చిన్నారి మహిక కనపడుతోంది. ఇంతలోనే తనకు పెళ్ళి అయిపోయింది. నేను గమనించనే లేదు... ఎంతగా ఎదిగిపోయిందో!
‘‘నాపైన అనుమానాలు పెట్టుకోకండి మామయ్యా. ప్రాణంలా చూసుకుంటున్న కూతుర్ని ఉన్నట్టుండి ఇతరుల చేతిలో పెట్టడానికి బాధ ఉండటం సహజమే కానీ నేను మహీని బాగానే చూసుకుంటాను. పెళ్ళి పీటలపైన పంతులుగారు ప్రమాణాలు కూడా చేయించారు. నేను మాట తప్పను. నేను పరాయివాడిని కాదనీ సొంత కొడుకులాంటి వాడిననీ రుజువు చేసుకుంటాను’’ అంటూ నాటకీయంగా నెత్తిన చేయి పెట్టుకున్న అవినాశ్‌ని చూసి హాయిగా నవ్వాను.
‘‘అయినా పెళ్ళయినంత మాత్రాన మా అమ్మ, అమ్మ కాకుండా పోతుందా?’’ అమ్మలాంటి కూతుర్ని మురిపెంగా చూస్తూ అనుకున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.