close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముక్కే కానీ.. పక్కా శాకాహారం!

మొన్నటివరకూ మాంసాహారిగా ఉన్న క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఇప్పుడు పూర్తి శాకాహారి. బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ తదితరులూ టాలీవుడ్‌లో అమలా అక్కినేని లాంటివారూ అలా మారినవారే. సెలబ్రిటీలే కాదు, యువతరంలో చాలామంది రకరకాల కారణాలతో శాకాహారానికి ఓటేస్తున్నారు. ఈ ట్రెండ్‌ని ఆహారపరిశ్రమా అందిపుచ్చుకుంటోంది. మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా ప్రత్యామ్నాయ ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తోంది. అలా వచ్చిందే... మాంసాహారపు రంగూరుచులతో కూడిన శాకాహారం!

స్వస్థస్య స్వాస్థ్య రక్షణమ్‌... జీవనకాలం పెంచుకోడానికీ ఆరోగ్యంగా జీవించడానికీ పనికొచ్చే ఆహారం తీసుకోవాలన్నది పెద్దల మాట. మితాహారమూ, అలవాటైన ఆహారమూ... అన్నది అప్పటి పద్ధతి. అలాంటిది నాగరికతతో పాటే ఆహారపుటలవాట్లూ విస్తృతమయ్యాయి. మాంసాహారమూ శాకాహారమూ అంటూ మనుషులు తమ అభిరుచికి తగినట్లుగా రకరకాల ఆహారపదార్థాలను తయారుచేసుకుని రుచినీ ఘుమఘుమల్నీ ఆస్వాదించడం మొదలెట్టారు. జిహ్వచాపల్యానికి పెరిగిన ప్రాధాన్యం ఆరోగ్యాన్ని వెనక్కి నెట్టేసింది. ఈ పరిస్థితే ఇప్పుడు కొందరిని ఆలోచింపజేస్తోంది. తాము తింటున్న ఆహారాన్నీ, దాని ఫలితాన్నీ, సమాజంతో సంబంధాన్నీ దగ్గరగా పరిశీలించినవారు తమ ఆహారపుటలవాట్లను మార్చుకోవడానికి సందేహించడం లేదు. అందుకే శాకాహారులూ వేగన్‌ల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రూపుదిద్దుకున్నదే ‘ప్రత్యామ్నాయ మాంసం’. ధాన్యమూ మొక్కల నుంచీ తయారుచేసిన ఈ పదార్థం అచ్చం మాంసాన్ని పోలి ఉంటుంది.

మొక్కలనుంచీ మాంసమా?
అవును, దీని రూపమూ రుచీ కూడా అచ్చం మాంసంలానే ఉంటుంది. కొంతకాలంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా ఉన్న వెజ్‌ మీట్‌ గత ఏడాది ఏకంగా నంబర్‌వన్‌ ఫుడ్‌ ట్రెండ్‌గా మారింది. రుచికి రుచీ పోషకాలకు పోషకాలూ... అన్నీ ఉన్నప్పుడు ఇక ఆదరణకేం కొదవ. ఒకప్పుడు శాకాహారంలో మాంసానికి ప్రత్యామ్నాయం అంటే సోయానే అనుకునేవారు. మరో పక్క మనదేశంలో తలసరి మాంసాహారం వాడకమూ ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. నూటికి 70 మంది మాంసాహారులే అయినప్పటికీ వారిలో చాలామంది వారంలో ఒక్కరోజుకు మించి మాంసాహారం తీసుకోరు. పండుగలూ సంప్రదాయాల్లాంటి పలు కారణాల వల్ల కూడా కొంతమంది సంవత్సరంలో కొన్ని నెలలపాటు మాంసాహారానికి దూరంగానే ఉంటారు. ఇలాంటివారు సమతులాహారం తీసుకుంటే ఫర్వాలేదు కానీ అలా తీసుకోకపోతే మాంసకృత్తుల లోపం తలెత్తుతుంది. విటమిన్‌ బి12, విటమిన్‌ డి, కాల్షియం లాంటివీ తగ్గుతాయి. ఇవన్నీ రోజూ తినే మామూలు కూరగాయల్లో తగినంత ఉండవు. మాంసకృత్తులు తగినన్ని లభించాలంటే కంది, పెసర, మినప లాంటి పప్పులూ, వేరుసెనగ, బాదం, జీడిపప్పులాంటివీ తగు మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా బఠాణీలూ పుట్టగొడుగులూ గోధుమల్లోనూ గుమ్మడీ పొద్దుతిరుగుడు లాంటి విత్తనాల్లోనూ పనస లాంటి పండ్లలోనూ మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. అలా మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుని ప్రయోగశాలలో తయారుచేస్తున్న ఈ ‘వెజ్‌ మీట్‌’ లేదా ‘మాక్‌ మీట్‌’ని ఎవరైనా ఎప్పుడైనా తినవచ్చు.

మాంసంలా కన్పించడం ఎందుకు?
ఈ శాకాహార మాంసం తయారీకి ఒకటి కాదు, ఇంకా ఎక్కువే కారణాలు ఉన్నాయి.
* శాకాహారులకు మాంసకృత్తులతో కూడిన ఆహారాన్ని అందించడం మొదటిది.
* మాంసాహారాన్ని ఇష్టపడేవారి కోసం అన్నది రెండోది. వారు నేరుగా మాంసాహారాన్నే తినొచ్చు. కాకపోతే జీవహింస కోణం నుంచీ చూసి అపరాధభావానికి లోనై ఈ మధ్య చాలామంది మాంసాహారాన్ని తీసుకోవటం మానేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయమే ఇది.
* మూడోది పర్యావరణ ప్రియుల కోసం. జంతువులనూ కోళ్లనూ మాంసం కోసం ప్రత్యేకంగా పెంచడం వల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతోంది. వ్యవసాయం వల్ల వెలువడే గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో 60 శాతం వాటా వీటిదే. దాంతో వాతావరణ మార్పుల గురించి ఆలోచించేవారంతా ఇప్పుడు మాంసాహారం పట్ల విముఖత చూపిస్తున్నారు.
* మరో కారణం- ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న యాంటీబయోటిక్స్‌ మందుల్లో సగం ఈ మాంసం ఉత్పత్తి రంగంలో వినియోగిస్తున్నారు. దీని వల్ల ఆ మందుల్ని తట్టుకునే బాక్టీరియా పెరుగుతోంది.
...ఇవన్నీ ఆలోచించి, ప్రత్యామ్నాయ మాంసం తయారీవైపు మొగ్గుచూపుతోంది ప్రపంచమంతా. రుచిలోనూ రూపంలోనూ అచ్చం మాంసంలా ఉంటే మాంసాహారులనుంచి శాకాహారులుగా మారినవారికి ఇబ్బంది ఉండదని అలా తయారు చేస్తున్నారు.

ప్రయోగశాలలో మాంసం తయారుచేయడమంటే ఇదేనా?
కాదు, ప్రత్యామ్నాయ మాంసాన్ని రెండు రకాలుగా తయారుచేస్తున్నారు. మొక్కలూ ధాన్యం ఉత్పత్తులనుంచి తయారుచేసేదాన్ని ‘వెజ్‌మీట్‌’ అంటారు. ఇది అచ్చంగా శాకాహారమే. రెండో రకాన్ని కూడా ప్రయోగశాలలోనే చేస్తారు కానీ దానికి మాంసమే ఆధారం. దాన్ని ‘అహింసా మాంసం’ అంటున్నారు. జంతువులను హింసించకుండా, అసలు వాటిని చంపకుండా అచ్చం వాటి మాంసం లాంటిదే ప్రయోగశాలలో తయారుచేస్తారన్నమాట. ఉదాహరణకు కోడి శరీరం నుంచి చాలా కొద్దిపాటి కణజాలాన్ని సిరంజితో తీసి ఆ కణజాలం ఆధారంగా టిష్యూ ఇంజినీరింగ్‌ ప్రక్రియతో అచ్చంగా అలాంటి కణజాలాన్నే తయారుచేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా మాంసం తయారుచేయడం సాధ్యమేనని ఆరేళ్లక్రితమే లండన్‌ శాస్త్రవేత్తలు రుజువుచేశారు. అప్పటినుంచీ అన్ని దేశాల్లోనూ ప్రయోగాలు జరుగుతున్నాయి. మనదేశంలోనూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ లాంటి సంస్థలు ప్రభుత్వ రంగంలోనూ, ‘క్లియర్‌మీట్‌’ లాంటి సంస్థలు ప్రైవేటు రంగంలోనూ పరిశోధనలు చేస్తున్నాయి. ఈ మాంసం మన దేశ మార్కెట్లోకి రావడానికి మరో రెండేళ్లు పట్టవచ్చు.

వెజ్‌మీట్‌ మనకి లభిస్తోందా?
మనదేశంలో పలు కంపెనీలు దీన్ని తయారుచేస్తున్నాయి. కోడి, వేటమాంసాన్ని ఉపయోగించి రకరకాల పదార్థాలు తయారుచేసుకున్నట్లే ఈ శాకాహార మాంసంతోనూ రకరకాల వంటలు చేసుకోవచ్చు. రెడీమేడ్‌ వంటల్ని కూడా కొనుక్కోవచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్న అలాంటి కొన్ని కంపెనీలూ వాటి ఉత్పత్తులూ...

అహింసా ఫుడ్‌ - దిల్లీ: ‘వెజ్జీ ఛాంప్‌’ పేరుతో నవాబీ కబాబ్‌, హాట్‌ డాగ్స్‌, వేగన్‌ సలామీ లాంటివి తయారుచేసి విక్రయిస్తోంది. వీరి వేగన్‌ బర్గర్‌కి నాణ్యమైన శాకాహారంగా అవార్డులు కూడా లభించాయి. చికెన్‌కి మాత్రమే కాదు, చేప, వేటమాంసం, బాతుమాంసం లాంటి వాటికి ప్రత్యామ్నాయంగా వీళ్లు తయారుచేసే పదార్థాలు రుచిలోనే కాదు, చూడడానికీ అచ్చం అలాగే కనిపిస్తాయి.

గుడ్‌ డాట్‌ - ఉదయ్‌పూర్‌: ఈ సంస్థ వెజ్‌ బైట్స్‌, ప్రొటీజ్‌, వెజికెన్‌ అనే ఉత్పత్తుల్ని తయారుచేస్తోంది. వెజ్‌బైట్స్‌ పిల్లలు చిప్స్‌లాగా తినడానికి బాగుంటాయి. వెజికెన్‌తో బిర్యానీలాంటివి చేసుకోవచ్చు. ప్రొటీజ్‌తో పకోడీలు వేసుకోవచ్చు, కూరల్లోనూ ఉపయోగించవచ్చు.

వెజెటా గోల్డ్‌ - చెన్నై: ఈ సంస్థ సోయా, పుట్టగొడుగులను వాడి సాసేజెస్‌, ఫిల్లెట్స్‌, ప్యాటీస్‌ లాంటి ఎన్నో రకాల ఉత్పత్తులను తయారుచేస్తోంది. ‘రోస్టెడ్‌ సొయాటో’ వీరి ప్రత్యేకత. కట్లెట్స్‌గానూ సమోసా, పఫ్‌ల లోపల పెట్టడానికీ ఇవి బాగుంటాయి.

వెజ్‌లే - దిల్లీ: ఈ కంపెనీ తయారుచేస్తున్న వెజ్‌మీట్‌తో కబాబ్‌లూ, బర్గర్‌ ప్యాటీస్‌, షవర్మా, చాప్స్‌, సోయా లాలిపాప్స్‌ లాంటివి చేసుకోవచ్చు.

వెజిటేన్‌ - బెంగళూరు: ‘వెజిటేన్‌’ తయారుచేసే వేగన్‌ సాసేజెస్‌కీ, మీట్‌ స్ట్రిప్స్‌కీ చాలా డిమాండ్‌ ఉంది.
ఇవే కాకుండా వేగన్‌ రెస్టరెంట్లు చాలావరకూ తమ శాకాహార మాంసాన్ని స్వయంగా తయారుచేసుకుంటున్నాయి. గోధుమలతో తయారుచేసే సెయితాన్‌ బర్గర్లూ శాండ్‌విచ్‌లలో అయితే 100గ్రాముల బర్గర్లో 75 గ్రాములు మాంసకృత్తులే ఉంటాయంటారు ‘హౌస్‌ ఆఫ్‌ సెయితాన్‌’ హోటల్‌ నిర్వహిస్తున్న రోమారాయ్‌. ‘శాకాహారం అనగానే చాలామంది దాన్ని ఎందుకూ పనికిరాని గడ్డి కింద కొట్టిపడేస్తారు. కానీ దాని వల్ల ఇష్టమైనవి తింటూనే ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పాలనే నేనీ హోటల్‌ పెట్టా’నంటారు రోమా. ఆమె సింగపూర్‌లో ఐటీ ఉద్యోగం వదులుకుని వచ్చి మరీ బెంగళూరులో హోటల్‌ నిర్వహిస్తున్నారు.

మాంసకృత్తులు ఒక్కటేనా?
ఈ శాకాహార మాంసం వల్ల ఒకటి కాదు, చాలా లాభాలే ఉన్నాయంటాడు ‘గుడ్‌డాట్‌’ సహవ్యవస్థాపకుడు అభిషేక్‌ సిన్హా. మాంసకృత్తులు ఎక్కువగా ఉండటమే కాక, మామూలు మాంసంతో పోలిస్తే పీచు ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందనీ, కొలెస్టరాల్‌ అనేది అసలు ఉండదనీ చెబుతాడు. ఐఆర్‌ఎస్‌ హోదాలో మంచి ఉద్యోగం చేసిన సిన్హాకి పెంపుడు జంతువులంటే చాలా ప్రేమ. ఆ ప్రేమ వల్లే అతడికి మాంసాహారం పట్ల విముఖత ఏర్పడింది. అది కాస్తా ఈ పరిశ్రమ ప్రారంభించేందుకు దారితీసింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన అంచిత్‌దీ అదే సమస్య. కబేళాలను దగ్గరగా చూసిన అతడు మాంసాహారాన్ని తినడం మానేశాడు. ప్రత్యామ్నాయం ఏమీ దొరకదనీ ఆరోగ్యం పాడైపోతుందనీ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పినా వినలేదు. ‘పదేళ్లక్రితం నేను మాంసం మానేసినప్పుడు నిజంగానే ప్రత్యామ్నాయాలేమీ లేవు. కానీ రెండుమూడేళ్లుగా ఎన్నో రకాలు దొరుకుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొంటున్నాను. ఫుడ్‌ట్రక్‌ దగ్గరా తింటున్నాను. ఇప్పుడసలు మాంసం మానేసినట్లే లేదు నాకు’ అంటాడు అంచిత్‌.

ఈ వెజ్‌మీట్‌ విదేశాల్లోనూ దొరుకుతుందా?
అసలు మొదలైందే అక్కడ కాబట్టి మనకన్నా ముందే అక్కడిదో ట్రెండ్‌ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే మాంసాహార పదార్థం బర్గర్లే. అయితే మాంసం ఆరోగ్యానికి మంచిది కాదనీ, క్యాన్సర్లూ గుండెజబ్బులూ వచ్చే అవకాశాలు పెరుగుతాయనీ వైద్యులు హెచ్చరించడంతో కంపెనీలు ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టాయి. అలా మొట్టమొదట ఈ రంగంలోకి దిగింది ‘బియాండ్‌ మీట్‌’ అనే సంస్థ. వృక్షసంబంధ పదార్థాలతో మాంసానికి ప్రత్యామ్నాయంగా అలాంటి రుచితోనే వెజ్‌ బర్గర్లు తయారుచేయడం మొదలెట్టింది. వీరు తయారుచేసిన వెజ్‌మీట్‌ వంటకాన్ని తినిచూసిన బిల్‌ గేట్స్‌ అది చికెన్‌ కాదు అంటే నమ్మలేకపోయాడట. ఆ తర్వాత ఆయనతో పాటు రిచర్డ్‌ బ్రాన్సన్‌, లెవిస్‌ హామిల్టన్‌ లాంటి ప్రముఖులూ, గూగుల్‌ వెంచర్స్‌, టైసన్‌ ఫుడ్స్‌, కెలాగ్స్‌, క్రోగర్‌, నెస్లే లాంటి సంస్థలూ కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడంతో ‘వెజ్‌ మీట్‌’ వైపు అందరి దృష్టీ మళ్లింది. క్రోగర్‌ ఇప్పటికే గుడ్డుకి ప్రత్యామ్నాయంగా పెసర నుంచి ‘జస్ట్‌ ఎగ్‌’ని తయారుచేస్తోంది. మరో సంస్థ చేపమాంసానికి ప్రత్యామ్నాయం తయారుచేసే పనిలో ఉంది. ఒక్క అమెరికాలోనే ఇప్పుడిది లక్ష కోట్ల రూపాయల పరిశ్రమ అనీ త్వరలోనే అది పదిరెట్లకు పెరుగుతుందనీ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. మరో పక్క ఈ తరహా పదార్థాల తయారీకి 99శాతం నీరూ, 93 శాతం భూమీ, 46 శాతం ఇంధనమూ తక్కువ ఖర్చవుతాయని ‘బియాండ్‌ మీట్‌’ పనితీరుపైన అధ్యయనం చేసిన నిపుణులు లెక్కతేల్చారు. దాంతో పర్యావరణప్రియులూ సంతోషిస్తున్నారు.

మనవాళ్లూ వీటిని ఇష్టపడుతున్నారా?
స్వతహాగానే మన దగ్గర శాకాహారులు ఎక్కువ. అది ఇప్పుడు ఇంకా ఎక్కువవుతోంది. పిజ్జా ఎక్స్‌ప్రెస్‌ ఇప్పుడు దేశమంతటా వేగన్‌ చీజ్‌ పిజ్జాలను సరఫరా చేస్తోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం... ఇలా దాదాపు అన్ని నగరాల్లోనూ వేగన్‌ రెస్టరెంట్లు వెలశాయి. వీటన్నింటిలోనూ ప్రత్యామ్నాయ మాంసం వంటకాల్ని వడ్డిస్తున్నారు. శాకాహార ప్రియులు వాటిని ఇష్టంగా లాగిస్తున్నారు. ఏడెనిమిదేళ్లక్రితం పదిమందితో మొదలైన హైదరాబాద్‌ వేగన్స్‌ బృందంలో ఇప్పుడు కొన్నివేల మంది సభ్యులున్నారు. వేగన్స్‌ అయితే పాల ఉత్పత్తులు కూడా తీసుకోరు. ఒక ఉద్యమంలా వీరు తాము నమ్మిన విధానాన్ని కొనసాగించడం వల్ల ప్రత్యామ్నాయ మాంసం ఉత్పత్తులపై చర్చ జరుగుతోందనీ వాటికి ప్రచారం లభించి వినియోగదారులను చేరడం ఎక్కువవుతోందనీ చెబుతుంది హైదరాబాద్‌కి చెందిన సంజన. ఇంట్లో నాన్నమ్మను చూసి శాకాహారిగా మారిన సంజన ‘కేవలం శాకాహారిగా మారడం వల్ల కర్బన ఉద్గారాల్లో ఒక వ్యక్తి వాటాను 73 శాతం తగ్గించవచ్చని తెలిశాక నేను సరైన నిర్ణయమే తీసుకున్నాననిపించింది’ అంటుంది. ఇలా- ఈ కొత్త శాకాహారుల వెనక ఒకటి కాదు, చాలానే కారణాలు ఉన్నాయి.

*

కొందరికి జీవకారుణ్యం...
మరికొందరికి పర్యావరణం...
కొందరికి సంప్రదాయం...
మరికొందరికి ఆరోగ్యం...
ప్రేరణ ఏదైతేనేం... అందరూ కోరుకుంటున్నది మాంసాహారానికి ప్రత్యామ్నాయం.  అందుకే ఇప్పుడు ఆహారం తనను  తాను మార్చుకుంటోంది! శాకాహారులు ఇబ్బందిపడకుండా, మాంసాహారులు  అసంతృప్తి చెందకుండా శాకాహార మాంసం అందుబాటులోకి వస్తోంది!

అహింసా మాంసం..!

కోడిని కోయకుండానే కోడిమాంసం తినొచ్చు అంటోంది దిల్లీకి చెందిన స్టార్టప్‌ ‘క్లియర్‌మీట్‌’. కార్తిక్‌ దీక్షిత్‌, డాక్టర్‌ పవన్‌ధర్‌, డాక్టర్‌ సిద్ధార్థ్‌ మన్వతి కలిసి పెట్టిన ఈ సంస్థ మనదేశంలో కృత్రిమ మాంసం తయారీకి సంబంధించి మొదటిది. నాగ్‌పుర్‌కి చెందిన కార్తిక్‌ మాంసం ఉత్పత్తికోసం పశువుల్ని ఎక్కువగా పెంచడం వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిపై పరిశోధన చేసేవాడు. ఆ క్రమంలో ఆహార శాస్త్రవేత్తలతో అయిన పరిచయం అతడిని మాంసానికి ప్రత్యామ్నాయం ఆలోచించేలా చేసింది. నిండా పాతికేళ్లులేని కార్తిక్‌ ఆలోచనావిధానమూ పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న తపనా జేఎన్‌యూకి చెందిన పరిశోధకులు పవన్‌, సిద్ధార్థ్‌లను ఆకట్టుకున్నాయి. అంతకన్నా ముందు ఓ నలభై మంది శాస్త్రవేత్తలదాకా అతడి ఆలోచనని విని నవ్వేశారు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి విజయం సాధించిన కార్తిక్‌ ఏడాదిన్నర క్రితం పవన్‌, సిద్ధార్థ్‌లతో కలిసి ‘క్లియర్‌మీట్‌’కి శ్రీకారం చుట్టాడు. బతికివున్న కోడినుంచి కొద్దిగా కణజాలాన్ని తీసుకుని అచ్చం అలాంటి కణజాలాన్నే ప్రయోగశాలలో తయారుచేస్తారు. బెర్లిన్‌కి చెందిన ప్రొ-వెజ్‌ అనే ఇంక్యుబేటర్‌ సంస్థ సహకారం కోసం పోటీపడిన 100 స్టార్టప్‌లలో క్లియర్‌మీట్‌కి రెండో స్థానం దక్కింది. అది చూసి అమెరికాకి చెందిన గ్లాస్‌వెల్‌ సిండికేట్‌ లాంటి ప్రఖ్యాత సంస్థ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. మరో ఏడాదిన్నరకల్లా తమ ఉత్పత్తితో మార్కెట్లోకి రావాలన్న లక్ష్యంతో ‘క్లియర్‌మీట్‌’ పనిచేస్తోంది. ప్రభుత్వ రంగంలోనూ ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి పరిశోధక సంస్థ అయిన గుడ్‌ఫుడ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయోగశాలలో తయారుచేసే మాంసాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యమే వీరిది కూడా.

పనసతో ప్రత్యామ్నాయం

చాలామందికి పనసపండు తొనలు మాత్రమే తెలుసు కానీ అది ఎక్కువగా పండేచోట ఆహారంలోనూ దాన్ని రకరకాలుగా వాడతారు. కూరలు మాత్రమే కాక పనసకాయ బిర్యానీ లాంటి వంటలూ చేస్తారు. శాకాహారులు ఇష్టంగా తినే ఈ బిర్యానీలో పనస ముక్కలు అచ్చం మాంసంలాగే కన్పిస్తూ మాంసాహారులకూ నోరూరిస్తాయి. పేదవాడి పండుగా పేరొందిన పనసలో మాంసకృత్తులు పుష్కలం. అందుకని ప్రత్యామ్నాయ మాంసంగా దాన్ని అభివృద్ధి చేయడానికి మేఘాలయ ప్రభుత్వం ఈ మధ్యే రూ.80 కోట్లతో ‘మిషన్‌ జాక్‌ఫ్రూట్‌’ని ప్రారంభించింది. పేరొందిన ‘యూనివేద్‌’ ఫిట్‌నెస్‌ బ్రాండ్‌ యజమాని అమిత్‌ మెహతా గత పదేళ్లుగా పనస కాయతోనే రకరకాల ఆహారపదార్థాలను తయారుచేసి మాంసానికి ప్రత్యామ్నాయంగా విక్రయిస్తున్నాడు.

ఫుడ్‌ ట్రక్కులూ వచ్చేశాయి!

న్‌లైన్‌లోనో, ఎక్కడో కొన్ని హోటళ్లలోనో మాత్రమే ఈ శాకాహార మాంసం ఉత్పత్తులు దొరుకుతాయనుకుంటే పొరపాటే. ఉదయ్‌పూర్‌కి చెందిన ‘గుడ్‌డాట్‌’ సంస్థ తమ నగరంలోనే కాక అహ్మదాబాద్‌, భిల్వారా, పట్నా, జయపుర, లఖ్నవూ, బెంగళూరుల్లో ఫుడ్‌ట్రక్కులను నిర్వహిస్తోంది. ఈ ట్రక్కుల్లో అచ్చంగా మాంసాహారాన్ని పోలిన శాకాహార ఆహారపదార్థాల్ని తయారుచేసి విక్రయిస్తున్నారు. స్పైసీ మోమోస్‌, టిక్కా లాంటి స్టార్టర్స్‌తో మొదలుపెట్టి వెజ్‌మీట్‌ బిర్యానీ, కీమా లాంటి వంటకాలన్నీ ఇక్కడ లభిస్తాయి. తక్కువ ధరలోనే మాంసంతో సమానంగా ప్రొటీన్స్‌ ఉన్న ఆహారాన్ని సరఫరా చేసే ఉద్దేశంతో రూ.50 నుంచి తమ వంటకాలను ప్రారంభించామంటున్న అభిషేక్‌ త్వరలో అన్ని నగరాలకూ ఫుడ్‌ ట్రక్కుల్ని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.