close
దండాలు దండాలు దుర్గమ్మ తల్లీ..!

తనలోని అర్ధ భాగాన్ని ఇచ్చి శివయ్య గౌరవించినా... అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ... అంటూ పోతనామాత్యుడు స్తుతించినా... ఇవన్నీ ఆ జగన్మాత గొప్పదనాన్ని జగత్తుకు వివరించేందుకే. తనను నమ్మిన భక్తుల పాలిట అమ్మగా మారి ఎలాగైతే కరుణను కురిపిస్తుందో, లోకకంటకుల పాలిట అంతే రౌద్రాన్ని చూపి దుష్టసంహారం చేస్తుంది. అటువంటి తల్లిని స్మరించుకునే ఉత్సవమే విజయదశమి.

అమ్మకు ప్రతిరూపమైన ఆ జగదంబను ఆరాధించే అత్యంత పవిత్రమైన కాలం దేవీనవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు ఆ శక్తి స్వరూపిణిని వివిధ రూపాల్లో కొలుస్తారు. మహాలయ పక్షానికి యుద్ధ పక్షం అని పేరు. సురాసుర సమరంలో ఓడిపోయిన దేవతలు శరన్నవరాత్రుల్లో తమతమ ఇష్టదేవతలను అర్చించగా పదోరోజైన దశమి రోజున వారిని విజయం వరించిందనీ అప్పటి నుంచీ ఈ దేవీనవరాత్రుల్లో అమ్మవారిని అర్చించడం ఆనవాయితీగా వస్తోందనీ పురాణ కథనం. నవరాత్రుల్లో మొదటి మూడురోజులు దుర్గా స్వరూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలనూ, తదుపరి మూడు రోజులూ లక్ష్మీ స్వరూపాన్ని ధ్యానించి సిరిసంపదలనూ, చివరి మూడురోజులు సరస్వతి రూపాన్ని పూజించి జ్ఞానాన్నీ పొందవచ్చు. అయితే ఈ నవరాత్రులు మొత్తం అమ్మవారిని పూజించలేనివాళ్లు అష్టమి, నవమి, దశమి ఈ మూడు రాత్రుళ్లూ పూజించినా అంతే ఫలితం లభిస్తుందని దేవీభాగవతం తెలియజేస్తోంది.

ఐశ్వర్య ప్రదాయని
హైందవ సంప్రదాయంలో ఒక్కో తిథికీ ఒక్కో ప్రాముఖ్యం ఉంది. వినాయకుడికి చవితి, కుమారస్వామికి శుద్ధ షష్ఠి... ఇలా ఒక్కో దేవీదేవతల ఆరాధనకు ఒక్కో తిథి ఉత్కృష్టమైందిగా చెబుతారు. అలాగే...అష్టమి తిథి ఐశ్వర్యానికి సూచిక. ప్రతిమాసంలో శుద్ధ అష్టమిరోజున అమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి. అందుకే దేవీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజును దుర్గాష్టమి అంటారు. సాధించడానికి కష్టమైంది ఏదో అది దుర్గగా పేర్కొంటారు. అందుకే అమ్మవారు సమరానికి సిద్ధమైతే దుర్గాదేవిగా మారుతుంది. ఈ రోజున అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించింది. దుర్గముడు చాలా శక్తిమంతుడు. అలా అని దేవి వెనకడుగు వేయలేదు. శివుడి నుంచి శూలాన్నీ, విష్ణువు దగ్గర చక్రాన్నీ...ఇలా పద్దెనిమిది దేవతల నుంచి పద్దెనిమిది ఆయుధాలను పొంది దుర్గముడిని అంతమొందిస్తుంది.

పోరాటానికి ప్రతీక
తిథుల్లో నవమి... ధైర్యానికీ ధర్మానికీ శత్రుసంహారానికీ ప్రతీకగా నిలుస్తుంది. మహర్నవమి రోజున అమ్మవారిని అపరాజిత (ఓటమి తెలియనిది)గా పూజిస్తారు. నవమినాడు అమ్మవారు ధరించే రూపం కాళిక. ‘క్రోధేచ కాళీ’ అంటారు. అంటే, భయంకరమైన క్రోధంతో ఉంటుంది. కాల అంటే మృత్యువు. శత్రువులను సంహరించాల్సి వచ్చినప్పుడు అమ్మ అంత రౌద్రంతో కాళిగా మారుతుందట. నవమినాడు దేవి రక్తబీజుడనే రాక్షసుణ్ని అంతమొందించింది. బీజం అంటే విత్తనం. తన రక్తం నేలమీద పడితే తనలాంటి వాళ్లు వేలమంది పుట్టాలని వరం పొందాడు రక్తబీజుడు. అందుకే భూమినే నాలుకగా చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది దుర్గాదేవి. మహిషాసురుడనే రాక్షసుడు మహిళచేతిలో తప్ప తనకు చావు లేకుండా వరాన్ని పొందుతాడు. ముల్లోకాలనూ జయించిన తనను ఆడది ఏం చేయగలుగుతుందన్న గర్వంతో ప్రజలను హింసించడం మొదలుపెడతాడు. ఆ బాధలు తట్టుకోలేని వారు త్రిమూర్తులను వేడుకుంటారు. ఈ బాధ్యతను ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవి తీసుకుంటుంది. తనని వివాహం చేసుకోవాలనుకున్నట్లు మహిషాసురుడికి కబురు పంపిస్తుంది. అమ్మవారి మనోహరమైన రూపానికి మైమరచిపోయిన ఆ రాక్షసుడు వెంటనే అంగీకరిస్తాడు. అయితే వివాహం జరగాలంటే యుద్ధంలో తనను గెలవాలన్న షరతు విధిస్తుంది అమ్మవారు. తొమ్మిది రోజులపాటు జరిగిన ఆ యుద్ధంలో చివరికి అమ్మవారు మహిషాసురుడిని సంహరిస్తుంది.

విజయ దశమి
ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు సాయంత్రాన్ని ‘విజయ కాలం’ అని పిలుస్తారు. ఆ కాలంలో ఎవరు శక్తిస్వరూపిణిని ఆరాధిస్తారో వారికి తమకార్యాల్లో తప్పక విజయం లభిస్తుందని భావం. శ్రవణా నక్షత్రంతో కలిసిన దశమి తిథిని విజయదశమీ లేదా దసరాదశమిగా జరుపుకుంటారు. నక్షత్ర మండలంలో శ్రవణా నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుందనీ అందుకే ఏవైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునేవారు ఆ రోజు ప్రారంభిస్తే విశేష ఫలితం ఉంటుందని చెబుతారు. దశమిరోజు చేసే మరో విశేషమైన కార్యక్రమం శమీవృక్షాన్ని పూజించడం. శమి అంటే పాపాల్నీ, శత్రువుల్నీ నశింపజేసేది అని అర్థం. జమ్మిచెట్టు కొమ్మ లేదా సమిధకు ప్రదక్షిణ చేస్తే... తొమ్మిది రోజుల పూజలో తెలియక చేసిన దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. దశమి రోజున జమ్మి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందంటారు.

యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.