close
ఆలోచన అదుర్స్‌!

పెళ్లి సమయంలో వృథాని అరికట్టాలనుకున్నారు వీరంతా. అందుకే వెరైటీగా ఆలోచించి... పర్యావరణహితంగా పెళ్లి తంతు జరుపుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు.

ఆ పూలు ఎరువుగా...

ప్లాస్టిక్‌ పర్యావరణానికి ఎంతో హాని చేస్తోంది. పెళ్లిళ్ల సమయంలో ప్లేట్లూ, గ్లాసులూ, అలంకరణ వస్తువులు తదితరాలూ ప్లాస్టిక్‌తో చేసినవే అయి ఉంటున్నాయి. అందుకే తన పెళ్లితో పర్యావరణానికి హాని జరగకూడదని ఎకో ఫ్రెండ్లీ వివాహం చేసుకుంది కోయంబత్తూరుకు చెందిన వీణా బాలకృష్ణన్‌. ఇందులోభాగంగా, నాటితే మొలకెత్తే సీడ్‌ పేపర్‌లో ఆహ్వానాలు ప్రచురించింది. స్థానిక రైతులు పండించే పూలతోనే అలంకరణ చేయించుకుంది. భోజనాలకి ప్లాస్టిక్‌ ప్లేట్లూ, గ్లాసులకు బదులు అరిటాకులూ, స్టీలు గ్లాసులూ ఉపయోగించింది. ఓ డ్రాప్‌బాక్స్‌ ఏర్పాటు చేసి వచ్చిన అతిథుల్ని అందులోనే నగదు బహుమతి వేయమని కోరింది. పెళ్లయ్యాక ఆ డబ్బును ఓ అనాథాశ్రమానికి ఇచ్చేసింది. వాడిపోయిన పూలూ, అరటి ఆకులూ, వంట సమయంలో మిలిగిన వృథాని సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్‌కి పంపి రైతులకు ఉచితంగా ఎరువులు అందేలా ఏర్పాట్లు చేసింది. మిగిలిపోయిన భోజనాన్ని రాబిన్‌హుడ్‌ ఆర్మీ అనే స్వచ్ఛంద సంస్థకు అందించింది. వృథా లేకుండా, పర్యావరణానికి హాని కలగకుండా జరిగిన ఆ వేడుక చూసిన ఎందరో తమకీ అలా పెళ్లి చేసుకోవాలనుందని వీణను సంప్రదించారు. దాంతో స్నేహితురాలు సుదర్శనతో కలిసి ‘టూస్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ని ప్రారంభించి ఎకో ఫ్రెండ్లీ వివాహాలు జరిపిస్తోంది వీణ.

పెళ్లి ఖర్చు తగ్గించి... పేదలకు సాయం!

పుణెకి చెందిన రాహుల్‌, స్నేహలు ఇంజినీరింగ్‌లో క్లాస్‌మేట్స్‌. సివిల్స్‌కి ప్రిపేర్‌ అయ్యేరోజుల్లో ప్రేమలో పడ్డారు. ఈ మధ్యనే వీళ్ల పెళ్లి జరిగింది. అలాగని భారీగా ఖర్చు పెట్టలేదు. ఎక్కడా వృథా చేయలేదు. సింపుల్‌గా వివాహం చేసుకుని... సమస్యల్లో ఉన్నవారికి సాయం అందించారు. అసలు విషయం ఏంటంటే... కొన్నాళ్ల క్రితం ఐఆర్‌ఎస్‌ ర్యాంకు సాధించి ఆ విభాగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న రాహుల్‌కి ఆదర్శ భావాలెక్కువ. ఖరీదైన దుస్తులూ, నగలూ కొనుక్కుంటే తమకి మాత్రమే సంతోషం కలుగుతుందనీ, అదే డబ్బుతో ఇతరులకి సాయపడితే వారి అవసరాలు తీరతాయనీ భావించాడు. పైగా మండపాలూ, అలంకరణ వేడుక పెళ్లి జరిగిన కాసేపే. ఆ మాత్రానికే డబ్బు వృథా చేయడం అవసరమా అనుకున్నాడు. అందుకే ఆడంబరాలూ, ఆర్భాటాలూ లేకుండా పెళ్లి చేసుకుని తద్వారా మిగిలిన డబ్బుతో సేవాకార్యక్రమాలు చేయాలన్న తన ఆలోచనని కాబోయే భార్య స్నేహతో పంచుకున్నాడు. ఆమెకీ ఆ ఆలోచన నచ్చడంతో,  మార్చి చివరి వారంలో జరిగిన వారి పెళ్లిలో పుణె చుట్టుపక్కల గ్రామాల నుంచీ కిలోమీటర్ల కొద్దీ నడిచి స్కూలుకెళ్లే వందమంది ఆడపిల్లలకి సైకిళ్లూ, వితంతువులకి కుట్టుమిషన్లు అందించారు. కాలుష్యం, నీటికొరత అంశాలపై రెండొందల మంది విద్యార్థులకు పెయింటింగ్‌ పోటీలను నిర్వహించి ఆ సమస్యలపై వారికి అవగాహన కల్పించారు. పెళ్లి తంతు పూర్తయ్యాక దాదాపు రెండున్నర లక్షలరూపాయల్ని అనాథాశ్రమాలకీ, వృద్ధాశ్రమాలకీ విరాళంగా ఇచ్చారు. సుమారు పది గవర్నమెంట్‌ స్కూళ్లలో లైబ్రరీలు ఏర్పాటు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

మోదీ మెచ్చిన పెళ్లి పత్రిక

పెళ్లి పత్రికలు కేవలం పిలుపుకోసమే. ఎవరు పంచినా చూసి అలా పక్కకు పడేస్తుంటాం. మరి అందుకు కాగితాలు వృథా చేయడం కరెక్ట్‌ కాదనుకున్నాడు పుణెలో ప్రింటింగ్‌ ప్రెస్‌ నడిపే ఉదయ్‌గాడ్గిల్‌. అందుకే తన కూతురి పెళ్లి సమయంలో పేపర్లు వృథా చేయదల్చుకోలేదు. తాను పంచే పెళ్లి పత్రిక ఆ తరవాత కూడా ఉపయోగపడాలని బాగా ఆలోచించి కాగితానికి బదులు కర్చీఫ్‌ను ఎంచుకున్నాడు. దానిపైన టెంపరరీ ఇంకుతో పెళ్లి వివరాలు రాసి చక్కగా డిజైన్‌ చేయించాడు. ఆ కర్చీఫ్‌ ఆహ్వానాన్ని మరో క్లాత్‌ బ్యాగులో ఉంచి బంధుమిత్రులకు పంచాడు. అది చూసిన కొందరు ఆశ్చర్యపోతే మరికొందరు ప్రశంసించారు. ఇంకొందరేమో తమకీ అలాంటి రుమాలు కార్డులు ముద్రించి పెట్టమని ఉదయ్‌ని సంప్రదించడం మొదలుపెట్టారు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం బయటకొచ్చి వైరల్‌ అయింది. ఉదయ్‌ ముద్రిస్తున్న రుమాలు పెళ్లి పత్రికల విషయం ప్రధాని నరేంద్రమోదీ వరకూ వెళ్లడంతో ‘పర్యావరణానికి హాని జరగకుండా... రుమాలుపై ఆహ్వానాలు ముద్రిస్తూ ఇతరులకీ మార్గదర్శకంగా నిలిచినందుకు ధన్యవాదాలు’ అంటూ ఓ అభినందనలేఖను పంపారు. అంతేకాదు రుమాలు పెళ్లి పత్రిక కోసం విదేశాల నుంచి కూడా ఉదయ్‌ని పలువురు సంప్రదిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.