close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీసా మన ఫొటోతో!

ఫొటోలంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు. అందుకే ఇంటి గోడ నుంచి సెల్‌ఫోన్‌, సోషల్‌మీడియా వాల్‌ దాకా- ఎక్కడ వీలైతే అక్కడ రకరకాల ఫొటోలు పెట్టుకుంటుంటాం. ఆ స్ఫూర్తితోనే మన ఫొటోలు ముద్రించిన కస్టమైజ్డ్‌ కాఫీ మగ్గులూ, క్యాలెండర్లూ, దిండ్లూ, దుప్పట్లూ, కీచెయిన్ల వంటివెన్నో అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఆ జాబితాలో మంచినీళ్ల సీసాలు కూడా వచ్చి చేరాయి. ఈ కస్టమైజ్డ్‌ వాటర్‌ బాటిళ్లను అందించడానికి పలు రకాల వెబ్‌సైట్లూ ఉన్నాయి. ఆ సైట్లలోకి వెళ్లి బాటిల్‌ సైజును ఎంచుకుని దానిపైన నచ్చిన ఫొటో, తగిన క్యాప్షన్‌ మనమే జతచేయొచ్చు. లేదంటే పూర్తిగా కొటేషన్లూ రాయొచ్చు. అలా బాటిల్‌ను మనకు నచ్చినట్టు డిజైన్‌ చేసుకోవచ్చు. ఇలాంటివి ఆఫీసులో టేబుల్‌పైన పెట్టుకుంటే బాగుంటాయి. అలానే ఫొటో, పేర్లూ ముద్రించిన ఈ బాటిళ్లను పుట్టినరోజులూ పెళ్లి రోజుల వంటి ప్రత్యేక సందర్భాల్లో రిటన్‌ గిఫ్టులుగానూ ఇవ్వచ్చు.

పళ్లు...  తోమక్కర్లేదు!

‘పళ్లు తోమేటప్పుడు బ్రష్‌ని 45 డిగ్రీల కోణంలో ఉంచాలి, ‘బాస్‌’ పద్ధతిలో(పైకీ కిందకీ అన్నట్టు) శుభ్రం చేయాలి, ఇదంతా కనీసం ఐదు నిమిషాలన్నా సాగాలి’ అన్నది ప్రపంచవ్యాప్తంగా దంత వైద్యులు మనకిచ్చే సలహా! కానీ మనలో ఇంత ఓపిగ్గా, పద్ధతిగా దంతధావనం చేసేవాళ్లు 90 శాతం కూడా ఉండరు. ఏదో హడావుడిగా అయిందనిపించి ఆ తర్వాతి పనుల్లో పడిపోయేవాళ్లే ఎక్కువ. ఇందువల్ల పాచి పేరుకుపోయి, దీర్ఘకాలంలో పిప్పి పళ్లూ వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు ఉండకూడదనే వై-బ్రష్‌ని సృష్టించింది ఫ్రాన్స్‌కి చెందిన ఫాస్టిష్‌ అనే సంస్థ. ఇది ఇంగ్లిష్‌ ‘వై’ ఆకారంలో పెట్టుడు పళ్లలా ఉంటుంది. దానికి పేస్ట్‌ వేసి పళ్లపైన పెట్టుకుంటే చాలు పదిక్షణాల్లో శుభ్రం చేసేస్తుంది... అదీ వైద్యులు చెప్పిన పద్ధతిలోనే! దీన్ని శుభ్రం చేయడానికీ పెద్దగా కష్టపడక్కర్లేదు జస్ట్‌ నీళ్లతో కడిగితే చాలు. అప్పుడప్పుడూ ఛార్జ్‌ చేస్తే సరిపోతుంది. మార్కెట్‌లో ఇప్పటికే ఎలక్ట్రికల్‌ బ్రష్‌లున్నా అవి మనం ఇప్పుడు వాడేవాటిలాగే ఉండి... వాటి బ్రిసల్స్‌ భాగం మాత్రం అటూఇటూ కదిలి శుభ్రం చేస్తాయి. వాటికన్నా భిన్నమైన ఆకారంతో రూపుదిద్దుకోవడమే వై బ్రష్‌ని ప్రత్యేకంగా నిలిపి దంతధావనం అతితక్కువ సమయంలో పూర్తయ్యేలా చేస్తోంది.

బొమ్మలేయడం నేర్పుతుంది

పిల్లలకి బొమ్మలు గీయడమంటే ఎంతిష్టమో! కాకపోతే, వాళ్ల పక్కన కూర్చుని బొమ్మలు గీయించడానికీ, ఎలా గీయాలో నేర్పించడానికీ పెద్దవాళ్లకి సమయం ఉండదు. అందుకే, ఆ బాధ్యతని తాను తీసుకుంటానంటోంది ‘స్మార్ట్‌ స్కెచర్‌ ప్రొజెక్టర్‌’ అనే ఈ పరికరం. చూడటానికి ఓ రీడింగ్‌ లైట్‌లా ఉంటుంది. కానీ ఆన్‌చేయగానే వెలుగుతోపాటూ కింద ఓ బొమ్మని ప్రొజెక్ట్‌ చేస్తుంది. ఆ బొమ్మపైన మనం ఓ తెల్లకాగితాన్ని పెట్టి... అదే గీతలపైన గీస్తూ పోతే చాలు బొమ్మ రెడీ! ‘ఇంతేనా’ అనుకోకండి... ఆ బొమ్మని ఒకేసారి గీయించడం కాకుండా ఒక్కో స్టెప్‌గా ఎలా గీయాలో చెబుతుంది. అంతేకాదు, మీ చుట్టూ ఉన్న పరిసరాలూ, వ్యక్తుల్ని కూడా ఇందులో గీసేయొచ్చు. ఇందుకోసం, మీరు గీయాలనుకున్నవాటిని ఓ ఫొటో తీసి ప్రొజెక్టర్‌కి సంబంధించిన మొబైల్‌ ఆప్‌లోకి అప్‌లోడ్‌ చేస్తే నలుపు తెలుపులతో కూడిన ‘పెన్సిల్‌ స్కెచ్‌’గా మార్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని కూడా మిగతా బొమ్మల్లాగే చకచకా గీసేయొచ్చు. బావుంది కదా!

బొమ్మలు కాదు పాటీలు

పిల్లలు కమోడ్‌పైన కూర్చోలేరు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా పాటీలు వాడుతుంటారు. అయితే ఇప్పుడవి ఆధునిక హంగులు సంతరించుకుని డిజైనర్‌ పీసుల్లా మారిపోయాయి. రకరకాల బొమ్మలూ, టెడ్డీ బేర్ల ఆకృతిలో ఒదిగిపోయి మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ఆటబొమ్మల్లా ఉండే ఈ పాటీల పైన పిల్లలు అల్లరి చేయకుండా కూర్చుంటారు. అంతేకాదు ఇవి తక్కువ పరిమాణం, తేలికపాటి బరువుతోనూ వస్తున్నాయి. ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లడానికి వీటిని ఫోల్డ్‌ చేసే సౌకర్యం కూడా ఉంది. ఇక పిల్లలతో ఎక్కడికెళ్లినా నిశ్చింతగా ఉండొచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు