close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మాయిలూ.. రండి రండి!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజ సంస్థల్లో ఓ ఆందోళన కనిపిస్తోంది. ఎక్కువమంది జనాలకి అవసరమైన సాఫ్ట్‌వేర్‌లను తయారుచేసే ‘కోడింగ్‌’ నిపుణుల్లో అమ్మాయిలు చాలా తక్కువమంది ఉంటున్నారట! దీంతో, సాఫ్ట్‌వేర్‌ని స్త్రీల కోణం నుంచి ఆలోచించి వాళ్ల అవసరాలకు అనుగుణంగా తయారుచేయలేక నష్టపోతున్నాయట కంపెనీలు. ఆ సమస్యని నివారించేందుకు... ఐటీ దిగ్గజ కంపెనీల్లో సృజనాత్మక పాత్ర పోషించేందుకు అమ్మాయిల్నిసుశిక్షితుల్ని చేస్తామంటోంది హైదరాబాద్‌కి చెందిన ‘టాలెంట్‌ స్ప్రింట్‌’ సంస్థ... అదీ ఉచితంగా...!

టాలెంట్‌ స్ప్రింట్‌ 2009లో మొదలైంది. ఐటీ ప్రొడక్ట్‌ రంగంలో అనుభవమున్న శంతను పాల్‌ దీని వ్యవస్థాపకుడు. ఈ సంస్థ సీఈఓ కూడా ఆయనే. శంతను మరో ఇద్దరు ఐటీ రంగ నిపుణులు జె.ఎ.చౌదరీ, మధుమూర్తి రోణంకిలతో కలిసి దీన్ని
ఏర్పాటుచేశారు. ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల్లో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే ఉద్యోగులూ, విద్యార్థులకి శిక్షణ ఇచ్చే సంస్థ ఇది. అలా ఈ పదేళ్లలో సుమారు యాభైవేల మందికి శిక్షణ ఇచ్చింది టాలెంట్‌ స్ప్రింట్‌ సంస్థ. దాంతోపాటూ తన సామాజిక బాధ్యతగా అమ్మాయిల కోసం 2013 నుంచి ‘విమెన్‌ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌’(వైజ్‌) శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. ప్రస్తుతం ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ కంపెనీల ఉద్యోగాలకే పరిమితమవుతున్న యువతుల్ని సవాళ్లతో నిండిన ఐటీ ప్రొడక్ట్‌ కంపెనీల ఉద్యోగాలవైపు నడిపించడమే దీని లక్ష్యం. రెండింటికీ తేడా ఏమిటంటారా- చాలా ఉంది.

గూగుల్‌ ముందుకొచ్చింది...
ఐటీ కంపెనీలు రెండురకాలు. మొదటి రకానివి సాఫ్ట్‌వేర్‌నీ, అప్లికేషన్‌లనీ ఉత్పత్తి చేస్తుంటాయి. రెండో రకానివి... మొదటి తరహా కంపెనీలకి పొరుగు సేవలు అందిస్తుంటాయి. ఈ మొదటి రకం కంపెనీలే ప్రజలకి అవసరమైన కొత్త సాఫ్ట్‌వేర్‌లని ఆవిష్కరిస్తుంటాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాపిల్‌... వంటి సంస్థలు ఇలాంటివి. వీటిని ఐటీ ఉత్పత్తి(ప్రొడక్ట్‌) సంస్థలంటారు. రెండోరకంవి ఐటీ సేవల(సర్వీసెస్‌) సంస్థలు. సహజంగానే, మొదటి వాటిల్లో పనిచేయడానికి ఎంతో మేధస్సూ, సృజనా కావాలి. రెండో తరహా కంపెనీల్లో చేయడానికి కొద్దిపాటి ఐటీ పరిజ్ఞానం ఉంటే చాలు. మనదేశంలో అసలైన సవాళ్లున్న ఐటీ ప్రొడక్ట్‌ కంపెనీల్లో పనిచేసే అమ్మాయిల సంఖ్య పదిశాతానికి మించట్లేదు. పాశ్చాత్యదేశాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అసలు అక్కడి అమ్మాయిలు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌(స్టెమ్‌) చదవడం చాలా తక్కువ. ‘కానీ మనదేశంలో మ్యాథ్స్‌, సైన్స్‌ చదువుతున్నా... అదంతా ఒట్టి పుస్తక పరిజ్ఞానంగానే మిగిలిపోతోంది...’ అని చెబుతున్నారు టాలెంట్‌ స్ప్రింట్‌ సీఈఓ శంతను. కారణాలేవైనా... ప్రొడక్ట్‌ కంపెనీల్లో అమ్మాయిల ప్రాతినిధ్యం ఉండట్లేదన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఉదాహరణకి ఓ కంపెనీ ఆన్‌లైన్‌లో మేకప్‌ కిట్‌లని ఆర్డర్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ని తయారుచేస్తోందని అనుకుందాం. దాని వాడకందార్లు అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. కానీ తయారుచేసే నిపుణులందరూ మగవాళ్లే! ఇందువల్ల సాఫ్ట్‌వేర్‌లు స్త్రీలకి దూరమైపోతున్నాయి. ఆ నష్టం రాకూడదనే ఎన్నో కంపెనీలు కోడింగ్‌ బాగా తెలిసిన ఉద్యోగినుల కోసం చూస్తున్నాయి. ఆ కంపెనీల డిమాండుకి తగ్గట్టు సుశిక్షితులైన కోడింగ్‌ నిపుణులని తయారుచేయాలని 2013లో ‘వైజ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది టాలెంట్‌ స్ప్రింట్‌. దీని ద్వారా తెలుగు రాష్ట్రాలకి చెందిన రెండొందల మంది అమ్మాయిలకి నాలుగేళ్లపాటు శిక్షణ అందించింది. అలా శిక్షణ తీసుకున్నవాళ్లలో మొత్తం అందరికీ ప్రపంచంలోని పెద్దపెద్ద సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయట. ఈ విజయాన్ని చూసే గూగుల్‌ సంస్థ టాలెంట్‌ స్ప్రింట్‌తో కలిసి విమెన్‌ ఇంజినీర్స్‌(వి) అనే కొత్త శిక్షణా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.

ఇలా చేస్తారు...
మూడేళ్లలో దేశంలోని నిరుపేద కుటుంబాలకి చెందిన ఆరువందలమంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల్ని మెరికల్లా తయారుచేయాలన్నది ‘వి’ కార్యక్రమం లక్ష్యం. ఈ ఏడాదిగ్గాను దేశంలోని 20 నగరాల్లో నుంచి 109 మందిని ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసుకుని శిక్షణ మొదలుపెట్టారు. వీళ్లలో 90 శాతం మంది ఆయా కుటుంబాల నుంచి తొలిసారి కాలేజీల్లోకి అడుగుపెట్టినవాళ్లు. వీళ్లకి కావాల్సిన శిక్షణను టాలెంట్‌ స్ప్రింట్‌ అందిస్తే, ఫీజుల్ని గూగుల్‌ సంస్థ భరిస్తుంది. అంతేకాదు, ఏడాది శిక్షణ తర్వాత గూగుల్‌, దాని భాగస్వామ్య కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తారు. ఇలాగే రెండో ఏడాది రెండొందలమందికీ, మూడో ఏడాది మూడొందల మంది విద్యార్థినులకీ శిక్షణ ఇస్తారు. ఆ తర్వాతి నుంచి ఏడాదికి మూడొందల మందికి చొప్పున శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు. ‘కేవలం సాంకేతికతని నేర్పించడం కాకుండా కంపెనీలకి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లని ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, ఏ స్థాయికి ఎదిగినా మళ్లీమళ్లీ కొత్తవి నేర్చుకునే జిజ్ఞాస పెంచడమే మా లక్ష్యం!’ అంటున్నారు శంతను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.