close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ గుడిలో కానుకలు వేయరు!

‘దేవభూమిగా పిలిచే ఆ హిమాలయాల అసమాన సౌందర్యాన్నీ అక్కడ కొలువుదీరిన దేవతల్నీ భారతావని రక్షణని భుజాలకెత్తుకున్న సైనికుల దేశభక్తినీ ఏకకాలంలో సందర్శించాలనుకుని కాట్రాకి బయలుదేరాం’ అంటూ ఆ యాత్రా విశేషాలను చెప్పుకొస్తున్నారు కాకినాడకు చెందిన యనమండ్ర రమాదేవి.

ముందుగా మంచుకొండల్లో కొలువుదీరిన వైష్ణోదేవిని దర్శించుకోవాలని కాకినాడ నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి దిల్లీకి చేరుకున్నాం. అక్కడి నుంచి శక్తి ఎక్స్‌ప్రెస్‌లో కాట్రాకు చేరుకున్నాం. అప్పటికే సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది. ఆ చిరుచీకట్లలో అమ్మ వైష్ణవీదేవి వెలసిన ఆ కొండదారి విద్యుత్కాంతులతో మెరుస్తూ ఆకాశంలోని నక్షత్రాలతో పోటీపడుతున్నట్లుగా అనిపించింది. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించి త్రికూట భవన్‌కు బయలుదేరాం. భక్తులందరికీ అక్కడే బస ఏర్పాటుచేస్తారు. ఫ్రెష్‌ అయ్యి సామాన్లు భద్రపరచుకుని, అమ్మ దర్శనంకోసం గుర్రం మీద బయలుదేరాం. నడక, డోలీ, హెలీకాప్టర్‌, బ్యాటరీ కారు...ఇలా భిన్న విధాలుగా భక్తులు ప్రయాణిస్తుంటారు. ప్రయాణంలో తొలి పదిహేను నిమిషాలు గందరగోళంగానూ గుర్రంపైన ప్రయాణించడం కష్టంగానూ అనిపించింది. కొంతదూరం వెళ్లాక కాస్త సర్దుకున్నాం. దారికి ఇరువైపులా అనేక దేవాలయాలూ దేవతా విగ్రహాలూ కనిపించాయి. వాటి మధ్యలో బాహుబలి కటౌట్‌ని చూసి ఆశ్చర్యపోయాం.
కాట్రా నుంచి అమ్మ సన్నిధికి 15 కి.మీ. దారి పొడవునా అన్ని సౌకర్యాలూ ఏర్పాటుచేశారు. 24 గంటలూ వైద్య సేవలూ అందుబాటులో ఉంటాయి. సుమారు మూడు కిలోమీటర్లు వెళ్లాక కొండ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం పారవశ్యాన్ని కలిగిస్తుంది. పర్వతాలలో విరిసిన రంగురంగుల పువ్వులు మనసుని సేదతీరుస్తాయి. ఆ దారిలో రకరకాల కోతులు ఆహారం కోసం అటూఇటూ తిరుగుతూ కనిపిస్తుంటాయి. అమ్మ సన్నిధికి చేరుతున్నామనగా- ఎడమవైపు దూరంగా మెరుస్తున్న శ్రీనగర్‌ మంచు కొండలు రారమ్మని ఆహ్వానిస్తుంటాయి.

త్రిశక్తి స్వరూపం!
ఓ నిర్ణీత స్థలం దగ్గర గుర్రాలను ఆపేస్తారు. అక్కడినుంచి వైష్ణోదేవి ఆలయానికి ఓ కిలోమీటరు నడవాల్సిందే. ఉదయం 6.20 గంటలకు బయల్దేరితే తొమ్మిదిన్నరకి అక్కడికి చేరుకున్నాం. అక్కడ అమ్మ గుడిని భవన్‌ అని పిలుస్తారు. లోపలకు ఫోన్‌, కెమెరా, ఇతర ఏ వస్తువులనీ అనుమతించరు. పర్సు మాత్రం తీసుకెళ్లొచ్చు. సామాన్లు భద్రపరచుకునే సౌకర్యం దూరంగా ఉండటంతో మేము ఓ దుకాణంలో అప్పగించి బయల్దేరాం. జైమాతాదీ అని నినాదాలు చేస్తూ భక్తులు నడుచుకుంటూ వెళుతుంటారు. నడవలేనివాళ్లకోసం చేతికర్రల్నీ ఉంచుతారక్కడ. అలా చాలా దూరం వెళ్లాక పెద్ద క్యూ కనిపించింది. అందరి మొహాల్లోనూ అమ్మను చూడాలనే ఆతృత. కానీ కొండ ఇరుగ్గా ఉండటంవల్ల కొద్దిమందినే దర్శనానికి వదులుతారు. దాంతో నిరీక్షణ తప్పదు. గతంలో 2 అడుగుల పొడవూ వెడల్పూ ఉన్న చిన్న గుహలోంచి పాకుతూ వెళ్లి దర్శించుకునేవారట. కానీ ప్రధాని మోదీ చొరవ కారణంగా ఆ కొండ విస్తీర్ణాన్ని ఎనిమిది అడుగులకు పెంచారట. అయినా ఇరుగ్గానే ఉంది. క్యూ కొంచెంకొంచెం కదలగా అమ్మకి కాస్త దగ్గరగా వెళ్లాం. చల్లని కొండగాలి మనసుని సేదతీర్చితే, పై నుంచి మంచు నీటి బిందువులు దీవెనల్లా తలమీదకి జారిపడ్డాయి. అలా ముందుకు వెళ్లి అమ్మను దర్శించుకున్నాం. ఇక్కడ అమ్మ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇలా త్రిశక్తి స్వరూపంగా పూజలు అందుకుంటోంది. నల్లరాతితో చేసిన శివలింగంలాంటి మూడు ఆకారాలకు మూడు కిరీటాలు పెట్టి ఉంటాయి. వీటిపైన ఈ మూడింటి స్వరూపమైన అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఈ గుడిలో ప్రత్యేక పూజలేవీ చేయరు. కానుకలూ వేయరు. ముడుపులూ కానుకలూ వేయాలనుకునేవాళ్లు దారిలోనే ఉన్న హుండీలోనే వేస్తారు. అమ్మ పిలువు ఉంటేనే దర్శనభాగ్యం జరుగుతుందనేది భక్తుల నమ్మకం. మేమూ అలాగే భావించి కన్నులారా అమ్మని దర్శించుకుని ఆ రూపాన్నే తలచుకుంటూ ప్రసాదం తీసుకుని వెనుతిరిగాం.

భైరవనాథుడి దర్శనం!
అక్కడి నుంచి మళ్లీ గుర్రాలు ఉన్నచోటుకి వచ్చి భైరవ్‌ క్షేత్రాన్ని చూడ్డానికి వెళ్లాం. భవన్‌ నుంచి 1.5 కి.మీ. దూరంలో ఈ గుడి ఉంది. అక్కడికి వెళ్లడానికి రోప్‌ వే ఉంది కానీ దానికే ఎక్కువ సమయం  పడుతుందట. అమ్మను దర్శించుకోవడం  ఒకెత్తయితే, అక్కడి నుంచి ఈ భైరవ్‌ బాబా గుడికి వెళ్లడం మరో ఎత్తుగా అనిపించింది.  శ్రీధరుడు అనే భక్తుడి దగ్గరకు అమ్మ బాలిక రూపంలో వచ్చి పూజలూ ప్రార్థనలూ చేసి అందరికీ భోజనాలు పెట్టమని చెప్పిందట. దానికి అతను భైరవ్‌నాథ్‌ అనే వ్యక్తిని సాయం తెచ్చుకోగా, అతను బాలిక రూపంలో ఉన్న అమ్మను మోహించి,  వెంబడించగా- కోపోద్రిక్తురాలైన అమ్మ అతని తలను బాణంతో నరికిందట. తల నేలను తాకబోతుండగా పశ్చాతాపంతో భైరవుడు శరణు కోరగా, నన్ను దర్శించిన వారు నిన్నూ దర్శిస్తేనే ఈ క్షేత్ర సందర్శనకి ఫలం కలుగుతుందని చెప్పగా అతని తల నేల వాలిందట. అది గుర్తుతెచ్చుకుని ఆ భైరవుణ్ణీ దర్శించుకుని, తిరిగి కాట్రా దారి పట్టాం.  అక్కడి నుంచి త్రికూట భవన్‌కు చేరుకున్నాం. అక్కడ దక్షిణ భారత ఆహారం కూడా దొరుకుతుంది. టీ చాలా బాగుంది. విశ్రాంతి అనంతరం శ్రీనగర్‌ వెళ్లాలని అనుకున్నాం. కానీ అక్కడి పరిస్థితులరీత్యా వెంటనే దారి మార్చుకుని ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా క్యాబ్‌ బుక్‌  చేసుకుని హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా లోయకు బయల్దేరాం.  ఆ దారి అద్భుతంగా ఉంది. రాత్రి ఎనిమిది గంటలకిగానీ చీకటి పడలేదు అక్కడ. అక్కడికి వెళ్లగానే మంచువాన స్వాగతం పలికింది. ఆ రాత్రికి అక్కడే ఓ హోటల్లో బస చేసి తెల్లవారుజామునే ఉప శక్తిపీఠాల్లో ఒకటైన చాముండేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శించాం. గుడిపక్కనే ఉన్న బ్యాన్‌ నదిలోని నీటి పరవళ్లతో కాసేపు ఆడుకుని, హిమాలయాల పై నుంచి అప్పుడే ఉదయిస్తున్న బాలభానుణ్ణి చూసి ఆనందించాం. ఆ సూర్యకిరణాలు హిమాలయాలపై ప్రసరించే వేళలో పసిడి, వెండి కొండల్లా మెరుస్తోన్న ఆ మంచుకొండల సౌందర్యాన్ని వర్ణించడం ఎవరి తరం అనిపించింది. అలా చాలాసేపు వాటినే చూస్తూ తరవాత అక్కడికి 30 కి.మీ. దూరంలో ఉన్న ధర్మశాలకు వెళ్లాం. అది బుద్ధుడు నడిచిన భూమిగా చెబుతారు. చల్లని వాతావరణం మధ్యలో కాసేపే ఎండ ఉంటుంది. అక్కడ ఎండాకాలం 40 రోజులే.

దేశభక్తితో నిండిన ప్రాంతమది...
ధర్మశాలలోని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, టీ తోటలూ వీరభద్రుడి గుడీ చూసుకుని కాంగ్రా దేవిని దర్శించుకున్నాం. ఇక్కడ అమ్మని వజ్రేశ్వరీ దేవి అంటారు. ఇది పురాతనమైన ఆలయం. ఇక్కడ అనేక శుభకార్యాలు జరుగుతుంటాయి. అక్కడి నుంచి జ్వాలాముఖి అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మను దర్శించుకున్నాం. ఆ దారి పొడవునా హిమాలయాల అందాలు కనువిందు చేస్తూనే ఉన్నాయి. ఆలయానికి చాలా దూరంలో ఉండగానే ఆ పర్వతాల నుంచి ఆగకుండా పొగ రావడాన్ని గమనించాం. ఆ పొగ 365 రోజులూ వస్తుంది.  అక్కడ అమ్మవారు జ్వాలాముఖి రూపంలోనే దర్శనమిస్తుంది. గర్భగుడి మధ్యలో కొంచెం పెద్ద జ్వాల, దాని వెనక 4 చిన్న జ్వాలలూ ఉన్నాయి. ఎవరు ఎంత ప్రయత్నించినా దాని వెనక ఉన్న రహస్యాన్ని ఇప్పటివరకూ తెలుసుకోలేకపోయారట. ఆ అమ్మను  దర్శించుకుని, చింతపూర్ణి అమ్మవారి గుడికి వెళ్లాం. ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే తనివి తీరలేదు. తరవాత అమృతసర్‌కు బయల్దేరి రాత్రి 8 గంటలకు స్వర్ణదేవాలయానికి చేరుకున్నాం. దేదీప్యమానంగా కాంతులీనే ఆ దేవాలయాన్ని చూసి తరించిపోయాం. తరవాత గురునానక్‌ సమాధిని చూసి హోటల్‌కు చేరుకున్నాం. ఉదయాన్నే మళ్లీ స్వర్ణదేవాలయానికి వెళ్లి, అక్కడకు దగ్గరలోనే ఉన్న జలియన్‌ వాలాబాగ్‌ సంఘటనాస్థలికి వెళ్లాం. దాన్ని పార్క్‌గా మార్చారు. తుపాకీగుళ్లు కాల్చినచోటు, తాకిన ఆనవాళ్లు, ఎవరు కాల్చారు, ఎంత దూరం నుంచి కాల్చారు, ఎవరెవరు బలయ్యారు... వంటి వివరాలతో ఓ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. ఆ కాల్పుల సమయంలో ఆత్మరక్షణకోసం 120 మంది బావిలో దూకి చనిపోయారట. ఆ బావిని చూసి బాధతో వెనుతిరిగాం. అక్కడే ఉన్న కొన్ని దేవాలయాల్నీ చూసి వాఘా సరిహద్దుకు బయల్దేరాం. మధ్యాహ్నం 1.30 కల్లా అటారీ గ్రామానికి చేరుకున్నాం. ఇది భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు అయిన వాఘాకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ సరిహద్దు ప్రాంతంలోని చివరి స్టేషన్‌ ఇదే. అక్కడి నుంచి వాఘా గేటు దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడ 1962 నుంచీ బీఎస్‌ఎఫ్‌ ప్రతిరోజూ సూర్యాస్తమయవేళ సైనిక కవాతు చేస్తుంది. పొరుగు దేశానికి మన శక్తిసామర్థ్యాలు తెలుపుతూనే మేము శాంతి కాముకులం అంటూ స్నేహ హస్తాన్ని అందించడమే దీని ముఖ్యోద్దేశం. ఇప్పటివరకూ ఒక్కరోజు కూడా ఈ కవాతు ఆపలేదట. ఎంతో క్రమశిక్షణతో మన సైనికులు చేసే విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. మన సరిహద్దు గేటూ పాకిస్థాన్‌ సరిహద్దు గేటూ ఏకకాలంతో తెరిచి సంబంధిత కవాతు నియమాలు అవగానే ఏకకాలంలో మూసేస్తారు. ఇదో ముఖ్యమైన ఘట్టం. దీన్ని చూడ్డానికి కొంచెంకొంచెంగా మొదలైన జన ప్రవాహంతో క్రమంగా స్టేడియం నిండిపోతుంది. రోజూ కనీసం 30 వేల మందయినా దీనికి హాజరవుతారట. అన్ని రాష్ట్రాలూ ఏకమై కదిలి వచ్చిన సమైక్య భారతావని అక్కడ కనిపిస్తుంది. త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న చిన్నారులూ దేశభక్తి గీతాలకు నర్తించే ఔత్సాహికులూ దేశభక్తిని ప్రేరేపించే సైనికుల మాటలూ చేతలూ వెరసి ఆ ప్రాంగణమంతా దేశభక్తికి నిలువెత్తు రూపంలా ఉంటుంది. అక్కడి నుంచి అమృత్‌సర్‌ రైల్వేస్టేషన్‌కి చేరి, అటు నుంచి జమ్మూకి చేరుకుని రఘునాథ్‌ దేవాలయం, రణేశ్వర్‌ దేవాలయం, ఆక్వేరియం వంటివి చూసి దిల్లీ మీదుగా వైజాగ్‌కు చేరుకున్నాం.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.