close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పెళ్ళికానుక

- దేవీప్రసాద్‌ ఒబ్బు

‘‘రఘురామయ్యగారూ, రఘురామయ్యగారూ!’’ అన్న నర్సు పిలుపుతో డాక్టరు రూముకు ఎదురుగా వెయిటింగ్‌ హాల్లో కూర్చుని ఉన్న రఘురామయ్య అతికష్టం మీద కుర్చీలోంచి లేచి భార్య పద్మావతమ్మ సహాయంతో మెల్లగా నడుచుకుంటూ డాక్టరు రూములోకి వెళ్ళాడు. ‘ఏంటీ సమస్య?’ అన్న డాక్టరమ్మ ప్రశ్నతో ఉన్నశక్తినంతా కూడగట్టుకుని, ‘‘మోకాళ్ళ నొప్పులమ్మా, నడుస్తుంటే భరించలేని బాధ. మోకాళ్ళమీద పెద్ద బండరాయి పెట్టేసినంత బాధ’’ అని చెప్పాడు రఘురామయ్య.

‘‘ఎప్పినుంచి?’’ అనే మరో ప్రశ్నకు- ‘‘పదిపదిహేను రోజులుగా ఈ మాయదారి నొప్పులు అవస్థపెడుతున్నాయమ్మా’’ అని చెప్పాడు.

స్టెతస్కోప్‌ తీసుకుని ఛాతీపైనా వీపుమీదా పెట్టి చూసి... మోకాళ్ళపైన తన వద్ద ఉన్న స్టీలు సుత్తితో మెల్లగా కొట్టిన తర్వాత లెటర్‌ ప్యాడ్‌పైన ప్రిస్క్రిప్షన్‌ రాస్తూ...

‘‘పెద్దయ్యా, వారంరోజులకి ట్యాబ్లెట్స్‌ రాసిస్తాను. ఇవి వాడితే నొప్పి తగ్గిపోతుంది. మీరేమీ భయపడవలసిన పనిలేదు. ధైర్యంగా ఉండండి’’ అని చిరునవ్వుతో చెప్పింది.

డాక్టరమ్మ నవ్వుతూ చెప్పిన సమాధానానికే రఘురామయ్యకి నొప్పి సగం తగ్గినట్లనిపించింది.

డాక్టరమ్మ రూము నుంచి వెలుపలికి వచ్చి మెడిసిన్స్‌ తీసుకుని ఊరెళ్ళడానికి బస్టాండుకు చేరుకునేసరికి ఎక్కవలసిన బస్సు సిద్దంగా ఉంది.

రఘురామయ్యది విజయవాడ సిటీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న వేణుగోపాలపురం అనే చిన్నపల్లెటూరు. భార్యాభర్తలిద్దరూ బస్సెక్కి కూర్చోగానే...

‘‘అమ్మా, ఎక్కడున్నారు..? డాక్టరమ్మ ఏంచెప్పింది?’’ అని కొడుకు అభిరామ్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.

‘‘భయపడవలసిన పనేంలేదు, వారం రోజులు మందులు వాడితే నొప్పి తగ్గిపోతుందని చెప్పార్రా. మేము ఇప్పుడు బస్సులో ఉన్నాం. కాసేపట్లో బయలుదేరుతుంది’’ అని చెప్పింది పద్మావతమ్మ.

‘‘సరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి. నేను వారంలో ఇంటికి వస్తాను’’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు అభిరామ్‌.

రఘురామయ్యకు అభిరామ్‌తోపాటు అనసూయ అనే కూతురు కూడా ఉంది. అభిరామ్‌ ఎండీలో పీడియాట్రిక్స్‌ చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాబ్‌ చేస్తున్నాడు. అనసూయ బీటెక్‌ చేసి హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది.

‘‘డాక్టరమ్మకు పట్టుమని పాతికేళ్ళు కూడా ఉండవు. ఎంత ఓపిక... ఎంత వినయం... అప్పుడే అంత పెద్ద డాక్టరమ్మ అయిపోయింది. ఇలాంటి అమ్మాయి మన అభిరామ్‌కు పెళ్ళాం అయితే బాగుంటుంది, ఏమంటావే’’ అన్నాడు రఘురామయ్య.

‘‘నేను కూడా అదే మనసులో అనుకున్నానయ్యా. కాకపోతే నువ్వు బయటకనేశావు అంతే.’’

‘‘అవునూ, వాడే కదా... ఈ డాక్టరమ్మ దగ్గరకు పొమ్మంది. వాడిక్కానీ ఈ అమ్మాయి ముందే తెలుసంటావా?’’

‘‘ఏమో ఆ దేవుడికే తెలియాలి. ఈ సంగతి వాడినే అడిగితే పోలా.’’

‘‘ఆ! వద్దు వద్దు. ఒకేళ అదే నిజమైతే, వాడే చెప్తాడ్లే’’ అన్నాడు రఘురామయ్య. ఇంతలో ‘‘వేణుగోపాలపురం’’ అన్న కండక్టర్‌ కేకతో బస్సుదిగి ఇంటిముఖం పట్టారు ఇద్దరూ.

*

రఘురామయ్య తండ్రి సుబ్బరామయ్యకు నలుగురు సంతానం. అందులో రఘురామయ్య పెద్దవాడు. వెంకట్రామయ్య రెండో సంతానం, శేషయ్య తరువాత నాలుగోసారి శకుంతల పుట్టింది. రఘురామయ్య, వెంకట్రామయ్యలకు చదువు సరిగా అబ్బకపోవడంతో వ్యవసాయంలో తండ్రికి సహాయంగా ఉండిపోయారు. తాము చదవకపోయినా తమ్ముడు బాగా చదువుకోవాలని ఆశించారు అన్నలిద్దరూ. అందులోనూ శేషయ్యకు చదువు మీద ఆసక్తి ఉండటంతో అతన్ని పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకూ చదివించారు. తన అన్నయ్య శేషయ్య ప్రభావం శకుంతల మీద పడటంతో తనూ ఎకనామిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి స్టేట్‌ బ్యాంకులో ఉద్యోగం సంపాదించింది. శేషయ్య కూడా జూనియర్‌ కాలేజీలో ఇంగ్లిషు లెక్చరర్‌గా సెలెక్ట్‌ అయ్యాడు. వీళ్ళిద్దరికీ ఉద్యోగాలు రావడానికి మూడేళ్ళముందే రఘురామయ్యకూ వెంకట్రామయ్యకూ పెళ్ళిళ్ళు అయ్యాయి. తండ్రి సుబ్బరామయ్య పెళ్ళి ప్రస్తావన తెచ్చిన సందర్భంలో పీజీలో తన క్లాస్‌మేట్‌ శ్రీనివాస్‌ను ప్రేమించాననీ అతన్నే పెళ్ళి చేసుకుంటాననీ చెప్పింది శకుంతల. ప్రేమ వివాహానికి ఇంట్లోవాళ్ళు నిరాకరించడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి శ్రీనివాస్‌ను గుడిలో పెళ్ళిచేసుకుంది. పెళ్ళి బట్టలతో ఇంటికి వెళ్ళిన దంపతులను గుమ్మందాటి లోపలకు రావద్దని తండ్రి ఆగ్రహంగా చెప్పడంతో అక్కణ్ణుంచే వెనుతిరిగింది. అప్పట్నుంచీ పుట్టింటికి దూరమైంది. తనకు ఇష్టంలేని పెళ్ళి చేసుకున్న శకుంతల ఇంట్లోకి వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని సుబ్బరామయ్య తేల్చిచెప్పడంతో అన్నదమ్ములు ముగ్గురూ మౌనంగా ఉండిపోయారు.

శేషయ్య, ఇంట్లో వాళ్ళు కుదిర్చిన సంబంధాన్నే పెళ్ళిచేసుకున్నప్పటికీ, భార్య మాటలు విని ఆస్తి పంపకాలు చేయాలని పట్టుపట్టడంతో, అప్పటివరకూ కలసిమెలసి ఉన్న ఉమ్మడి కుటుంబంలో కలతలు ప్రారంభమయ్యాయి.

తన కూతురు పెళ్ళి వ్యవహారానికే సగం చచ్చిపోయిన సుబ్బరామయ్య ఆస్తి తగాదాలు కూడా తోడవ్వడంతో మానసికంగా పూర్తిగా కుంగిపోయి మంచానపడ్డాడు. ఆస్తి పంపకాల తర్వాత శేషయ్య కూడా తన కుటుంబంతో తెగతెంపులు చేసుకుని పట్టణానికి వెళ్ళిపోయాడు. వెంకట్రామయ్యకు సంతానం లేకపోవడంతో తన భాగానికి వచ్చిన పొలాన్ని కూడారఘురామయ్యకే ఇచ్చేసి అతనితోపాటే కలసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు.

శేషయ్య ఇంట్లో నుంచి వెళ్ళిన ఏడాదికే సుబ్బరామయ్య చనిపోయాడు. తండ్రి చనిపోయిన విషయం అన్నయ్యల ద్వారా తెలుసుకున్న శేషయ్య అంత్యక్రియలు చూసుకుని ఆ సాయంత్రానికే తిరిగి వెళ్ళాడు. తరవాత కర్మకాండలకు కూడా హాజరుకాలేదు. శకుంతల గురించి ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో మిన్నకుండిపోయారు రఘురామయ్య, వెంకట్రామయ్య.

*

‘‘హలో అభిరామ్‌, మీ నాన్నగారి ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమేమీ లేదు. పదిహేను రోజులు మోకాళ్ళపైన ఎక్కువ ప్రెజర్‌ లేకుండా చూసుకోవాలి. బరువులు ఎక్కువ మోయకుండా జాగ్రత్తపడితే చాలు. డోంట్‌ వర్రీ అబౌట్‌ దట్‌ ఇష్యూ’’ అని ఫోన్‌ చేసి చెప్పింది అలేఖ్య.

‘‘అలేఖ్యా, నేను విజయవాడకు ఈ వారంలో వస్తాను. వచ్చేముందు ఫోన్‌ చేస్తాను. ఇద్దరం కలసి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్దాం. నీకు ఉద్యోగం వచ్చి మూడు మాసాలైనా నాకు ట్రీట్‌ ఇవ్వలేదు.’’

‘‘మహానుభావా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు మనం ఎప్పుడు కలిశాం- నేను నీకు ట్రీట్‌ ఇవ్వడానికి.’’

‘‘సరదాగా అన్నాన్లే. సరే నాకు ఇక్కడ పేషెంట్స్‌ వెయిటింగ్‌లో ఉన్నారు. ఐ విల్‌ కాల్‌ యు లేటర్‌.’’

‘‘అబ్బా, ఇక్కడేదో నేను ఖాళీగా ఉన్నట్టు. నేనూ నీకంటే బిజీ తెలుసా?’’

‘‘సారీ మేడమ్‌, ఏదో పొరపాటుగా అనేశాను. ఓకే, బై అలేఖ్యా.’’

‘‘హలో, ఒక్క విషయం... ఇంతకుమునుపే మా నాన్న అర్జంట్‌గా హైదరాబాద్‌ రమ్మని ఫోన్‌ చేశాడు. ఈ సాయంత్రమే బయలుదేరుతున్నా.’’

‘‘ఇంత సడన్‌గా మీ నాన్నగారు రమ్మన్నారంటే పెళ్ళి విషయమే అయి ఉంటుందేమో అలేఖ్యా.’’

‘‘ఏమో అభిరామ్‌. నాకూ అదే టెన్షన్‌గా ఉంది.’’

‘‘ఏమీకాదు దైర్యంగా చెప్పేయ్‌. నేనూ ఈసారి ఊరెళ్ళినప్పుడు ఇంట్లో చెప్పేస్తాను. ఆల్‌ ద బెస్ట్‌ అలేఖ్యా.’’
‘‘ఓకే, బై అభిరామ్‌.’’
‘‘బై అలేఖ్యా.’’

అభిరామ్‌ థర్డ్‌ ఇయర్‌ ఎంబీబిఎస్‌ చదివేటప్పుడు ఫస్ట్‌ ఇయర్‌లో జాయిన్‌ అయింది అలేఖ్య. కాలేజీలో ర్యాగింగ్‌ బ్యాన్‌ అయినప్పటికీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న ఓ స్టూడెంట్‌ తరచూ అలేఖ్యను ఇబ్బంది పెడుతుండటంతో అతనికి వార్నింగ్‌ ఇచ్చాడు అభిరామ్‌. అప్పటినుంచి అలేఖ్య జోలికి రాలేదతను. అలా పరిచయం అయిన అలేఖ్య కనపడినప్పుడల్లా నవ్వడం, లైబ్రరీలోనూ తారసపడినప్పుడు మాట్లాడటం చేసేది. పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అభిరామ్‌ ఫైనల్‌ ఇయర్‌కి వచ్చే సమయానికి వారిమధ్య స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. తర్వాత అభిరామ్‌ ఉస్మానియాలో పీడియాట్రిక్స్‌లో పీజీ చేశాడు. రెండేళ్ళ తర్వాత అలేఖ్య అదే కాలేజీలో ఆర్థోపెడిక్స్‌లో పీజీ చేసింది. అభిరామ్‌ కూడా కోర్సు పూర్తి చేసిన వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో మంచి ఆఫర్‌ రావడంతో జాయిన్‌ అయ్యాడు. అలేఖ్య కూడా కోర్సు కంప్లీట్‌ అయిన తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్‌ అయింది.

*

అలేఖ్య విజయవాడ నుంచి ఇంటికి వచ్చిన సాయంత్రం బాల్కనీలో సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్న నాన్న శ్రీనివాస్‌ దగ్గరకు వచ్చి ‘టీ’ అందించింది.

‘‘అమ్మా, అలేఖ్యా... నీతో ఓ విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో’’ అన్నాడు ఎదురుగా ఉన్న కుర్చీ చూపించి.

‘‘ఏంటి నాన్నా, చెప్పండి’’ అంది కుర్చీలో కూర్చుని.

‘‘ఏంలేదమ్మా, నీ పెళ్ళి విషయం. నీలాగే ఎండీ ఆర్థో చేసిన డాక్టరు హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హాస్పిటల్లో జాబ్‌ చేస్తున్నాడట. జీతం నెలకి రెండులక్షలు వస్తుందట. మంచి కుటుంబమట. వాళ్ళ అమ్మానాన్నలు కూడా డాక్టర్లేనట... నా కొలీగ్‌ విశ్వనాథం చెప్పాడు. నువ్వు ‘సరే’ అంటే మాట్లాడతాను. బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు’’ అన్నాడు శ్రీనివాస్‌.

అలేఖ్య కాసేపు మౌనం వహించింది. ఆ మౌనంలో తన ప్రతిపాదన ఇష్టంలేదనే విషయం గమనించాడు శ్రీనివాస్‌.

‘‘ఏంటమ్మా, ఎవరినైనా ప్రేమించావా?’’ అనే ప్రశ్నకు అలేఖ్య కాస్త కంగారుపడుతుంటే...

‘‘ఏం పర్లేదు చెప్పమ్మా’’ అన్నాడు శ్రీనివాస్‌.

‘‘నాన్నా, నేను అభిరామ్‌ అనే అతన్ని ప్రేమించాను. తను నాకంటే రెండేళ్ళు సీనియర్‌. అతనూ ఎండీలో పీడియాట్రిక్స్‌ చేశాడు. మెడిసిన్‌ చదివేటప్పటి నుంచీ ప్రేమించుకున్నాం.’’

‘‘వాళ్ళది ఏ ఊరు, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు?’’

‘‘విజయవాడ దగ్గర వేణుగోపాలపురం. వాళ్ళది వ్యవసాయ కుటుంబం నాన్నా.’’ ‘‘ఏంటీ, వేణుగోపాలపురమా! వాళ్ళ నాన్నగారి పేరేమిటి?’’ ‘‘రఘురామయ్యగారు’’ అంది అలేఖ్య.

‘‘ఏంటండీ... తండ్రీ కూతురూ రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. ఏమిటీ విషయం?’’ అంది మార్కెట్‌ నుంచి అప్పుడే వచ్చిన శకుంతల.

‘‘ఏం లేదు శకుంతలా! తనకు రేపు విలేజీలో మెడికల్‌ క్యాంపు ఉందట. అందుకోసం ఇవాళే వెళ్ళాలట. అదే మాట్లాడుకుంటున్నాం’’ అన్నాడు శ్రీనివాస్‌.

‘‘అసలు అలేఖ్యను ఎందుకు రమ్మన్నారో ఆ విషయం మాట్లాడారా?’’

‘‘సరే అలేఖ్యా, నువ్వు నీ రూములోకి వెళ్ళు తర్వాత మాట్లాడతాను’’ అని అలేఖ్యను అక్కడ నుంచి పంపించేశాడు శ్రీనివాస్‌. ‘‘ఏంటండీ, పెళ్ళి విషయం మాట్లాడకుండా అలా పంపించేశారు?’’

‘‘శకుంతలా, ముందు నువ్వు కూర్చో చెబుతాను.’’ ‘‘సరే చెప్పండి’’ అని కుర్చీలో కూర్చుంది శకుంతల.

‘‘శకుంతలా, మన అనుమానమే నిజమైంది. అలేఖ్య దగ్గర పెళ్ళి ప్రస్తావన తేగానే తన ముఖం ముభావంగా మారిపోయింది. ‘ఎవరినైనా ప్రేమించావా’ అంటే మొదట కంగారుపడింది. తర్వాత ‘ఏం పర్లేదు, చెప్పమ్మా’ అంటే అప్పుడు తన ప్రేమ విషయం బయటపెట్టింది.’’
‘‘ఎవరా అబ్బాయి?’’

‘‘వాళ్ళు నీకు బాగా తెలిసినవాళ్ళే.’’

‘‘నాకు తెలిసినవాళ్ళా... టెన్షన్‌ పెట్టకుండా చెప్పండీ.’’

‘‘అలేఖ్య ప్రేమించింది ఎవరినో కాదు... మీ పెద్దన్నయ్య రఘురామయ్యగారి అబ్బాయిని. అతని పేరు అభిరామ్‌.’’

వాళ్ళ అన్నయ్య పేరు వినగానే శకుంతల ముఖంలో ఆనందంతోపాటు దుఃఖం కూడా తొంగిచూసింది.

‘‘ఏంటీ, మీరు చెప్పేది నిజమా!’’ ‘‘అవును శకుంతలా- అబ్బాయి కూడా ఎండీలో పీడియాట్రిక్స్‌ చేశాడట.’’ ‘‘ఎంత శుభవార్త చెప్పారండీ... ఇది కలా నిజమా... నమ్మలేకపోతున్నాను.’’

‘‘నిజమే శకుంతలా, నాకూ ఆశ్చర్యంగానే ఉంది. విధి ఎంత విచిత్రమైనదో కదా.’’ ‘‘అవునూ, రఘురామయ్య మా అన్నయ్య అని అలేఖ్యకు తెలుసా?’’
‘‘తెలియదు’’

‘‘అయితే ఒక పని చేద్దామండీ! మనం రేపే ఊరెళ్ళి మా అన్నయ్య వాళ్ళతో పెళ్ళి విషయం మాట్లాడి, సంప్రదాయం ప్రకారం మన ఇంటికి పెళ్ళిచూపులకి రమ్మని ఆహ్వానిద్దాం. తర్వాత పెళ్ళి ముహూర్తం నిర్ణయిద్దాం. ఈ విషయం ఎట్టి పరిస్థితులలోనూ అలేఖ్యకు తెలియకూడదు. దాన్ని సర్‌ప్రైజ్‌ చేద్దాం.’’

‘‘శకుంతలా, మన పెళ్ళి విషయంలో మీ ఇంట్లోవాళ్ళు ఎంత రాద్దాంతం చేశారో అప్పుడే మర్చిపోయావా? మనం కొత్తగా పెళ్ళి చేసుకుని ఇంటికెళ్ళినప్పుడు కన్నకూతురని కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా గుమ్మంలోంచే పంపించేశారు మీ నాన్నగారు.’’

‘‘అదెలా మర్చిపోతానండీ. కానీ, ఆ సమయంలో ఏ తండ్రయినా అలానే చేస్తాడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకండీ. ఇప్పుడు మనం ఆలోచించవలసింది అలేఖ్య పెళ్ళి గురించి.’’

‘‘మీ అన్నయ్యవాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారా? ఒకవేళ మీ అన్నదమ్ములు ఒప్పుకున్నా మీ నాన్నగారు అంగీకరిస్తారా?’’

‘‘ఒప్పుకుంటారని నాకు నమ్మకముందండీ. అయినా ఏదైనా ప్రయత్నం చేయనిదే ఎలా తెలుస్తుంది? మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత అంతా ఆ దేవుని దయ.’’

‘‘సర్లే శకుంతలా, ఈ రోజు అలేఖ్య ఎలాగూ ఊరెళుతుంది కాబట్టి మనం రేపే మీ ఊరెళదాం.’’ ‘‘సరేనండీ, మాటల్లోపడి వంట విషయం మర్చిపోయాను’’ అంటూ వంటగదిలోకి వెళ్ళింది శకుంతల.

*

రఘురామయ్య ఇంటి ముందు కారు ఆగింది. కారు దిగి తన ఇంటి పరిసరాలు చూడగానే శకుంతలకు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కన్నీళ్ళను బలవంతంగా ఆపుకుని ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళింది. అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తున్న రఘురామయ్యను చూసి ‘‘బాగున్నావా అన్నయ్యా’’ అని పలకరించింది.

‘‘ఎవరూ... శకుంతలా... నువ్వా! రామ్మా లోపలికిరా. ఏంటి తల్లీ ఇన్ని రోజులకు మేము గొర్తొచ్చామా... ఇన్ని రోజులూ ఏమైపోయావు... ఎక్కడున్నారు... రండి బావగారూ అలా కూర్చోండి’’ ఆహ్వానించాడు రఘురామయ్య.

‘‘హైదరాబాదులో ఉంటున్నాం అన్నయ్యా.’’ ‘‘ఏమయ్యో, ఎవరొచ్చారు?’’ అంటూ వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చింది పద్మావతమ్మ.

‘‘గుర్తుపట్టలేదా... మా చెల్లెలు శకుంతల’’ ఆనందంగా చెప్పాడు రఘురామయ్య.
‘శకుంతలా నువ్వా... ఎంత మారిపోయావే. ఏం తమ్ముడూ బాగున్నారా?’’ అని పలకరించింది పద్మావతమ్మ.

‘‘బాగున్నాం వదినా, మీరు బాగున్నారా? అవునూ అన్నయ్యా నాన్న ఎక్కడ? పొలానికేమైనా వెళ్ళారా?’’ అంది శకుంతల.

‘‘ఇంకెక్కడి నాన్న శకుంతలా... మీరెళ్ళిన అయిదేళ్ళకు నాన్న చనిపోయాడు. నీకోసం ఎంత విచారించినా నీ ఆచూకీ తెలియకపోవడంతో నాన్న చనిపోయిన విషయం నీకు చెప్పలేకపోయాం.’’

నాన్న చనిపోయాడనే విషయం తెలియగానే శకుంతల దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది అన్నయ్యను పట్టుకుని వలవల ఏడ్చింది. రఘురామయ్యతోపాటు పద్మావతికి కూడా కళ్ళు చెమర్చాయి. శకుంతలను ఓదార్చడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది శ్రీనివాస్‌కు.

‘‘అమ్మా శకుంతలా, పిల్లలు ఎంతమంది... ఏం చేస్తున్నారు?’’

‘‘ఒకే అమ్మాయి అన్నయ్యా. డాక్టరు చదివి విజయవాడలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో జాబ్‌ చేస్తోంది.’’

‘‘నీకెంతమంది పిల్లలు అన్నయ్యా?’’
‘‘ఒకమ్మాయి, అబ్బాయి. అమ్మాయి బీటెక్‌ చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో ఉంది. అబ్బాయి డాక్టరు. వాడూ హైదరాబాదులోనే జాబ్‌ చేస్తున్నాడు.’’

‘‘అమ్మాయికి పెళ్ళి అయిందా?’’ ‘‘ఆ విషయమే మాట్లాడటానికి వచ్చాను అన్నయ్యా.’’
‘‘నాతోనా... ఏంటో చెప్పమ్మా.’’
‘‘మా అమ్మాయి అలేఖ్యా మీ అబ్బాయి
అభిరామ్‌ ప్రేమించుకున్నారట. ఈ విషయం మాకు నిన్ననే తెలిసింది. అలేఖ్య దగ్గర పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడు చెప్పింది.’’
‘‘ఏంటీ, అభిరామ్‌ ప్రేమించాడా...

మీ అమ్మాయి పేరు ఏమని చెప్పావు?’’
‘‘అలేఖ్య అన్నయ్యా’’
‘‘అమ్మాయి పనిచేసేది విజయవాడ అపోలో హస్పిటలేనా?’’

‘‘అవును అన్నయ్యా, నీకెలా తెలుసు?’’ ‘‘నేను చూపించుకున్నది అమ్మాయి దగ్గరే అమ్మా. ఎంత వినయం, ఎంత ఓర్పు... చక్కని పిల్లమ్మా’’ అని చెప్పి తన భార్య పద్మావతి వైపు చూసి... ‘‘నేను అప్పుడే అనలా... ఈ అమ్మాయి మనోడికి ముందే తెలిసుంటాదనీ, ఈ అమ్మాయి మన కోడలైతే ఎంత బాగుంటుందో అనీ... మన అనుమానమే నిజమైంది.’’

‘‘అవును శకుంతలా, ఈయనకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటే మీ అమ్మాయి దగ్గరకే పొమ్మన్నాడు మావోడు’’ అని చెప్పింది పద్మావతి.

‘‘అవునా? మనం అన్నా చెల్లెళ్ళమని వాళ్ళకు తెలియదు అన్నయ్యా. మీకు మా అమ్మాయిని కోడలుగా చేసుకోవడం ఇష్టమైతే వాళ్ళ పెళ్ళి జరిపిద్దాం’’ అంది శకుంతల.

‘‘ఎంతమాట తల్లీ... నా బంగారుతల్లి బిడ్డను చేసుకోవడంకంటే నాకు భాగ్యమేముందమ్మా... లక్షణంగా వాళ్ళ పెళ్ళి జరిపిద్దాం’’ అని రఘురామయ్య అనగానే శకుంతల ముఖం పున్నమి చంద్రుడిలా వెలిగిపోయింది.

‘‘అన్నయ్యా, మన పిల్లలకు ఒక సర్‌ప్రైజ్‌ ఇద్దాం. పెళ్ళిచూపులకు అని చెప్పకుండా అబ్బాయిని మా ఇంటికి తీసుకురండి. అలాగే అమ్మాయికి ఏదో కొత్త సంబంధం అని చెప్తాం. అబ్బాయి ఒప్పుకోకపోయినా ఏదో ఒకటి చెప్పి తీసుకురండి’’ అని చెప్పింది శకుంతల.

శకుంతల చెప్పిన దానికి సమ్మతించారు రఘురామయ్య దంపతులు.

‘‘అన్నయ్యా, మాటల్లో మర్చిపోయాను. వెంకట్రామయ్య అన్నయ్యా, శేషయ్య అన్నయ్యా ఎక్కడున్నారు?’’

‘‘వెంకట్రామయ్యా, వాడి భార్య వెంకటమ్మా పొలంకాడికెళ్ళారమ్మా. శేషయ్యకు పెళ్ళయిన తర్వాత ఇంటి నుంచి తెగతెంపులు చేసుకుని టవునుకు వెళ్ళిపోయాడు. నాన్న చనిపోయినప్పుడు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కనపడలేదమ్మా.’’

‘‘సరే అన్నయ్యా, మేం బయలుదేరుతాం. దారిలో పొలం దగ్గర ఆగి అన్నయ్యనీ వదిన్నీ పలకరించి వెళ్తాం’’ అని చెప్పి బయలుదేరి వచ్చేశారు శకుంతల దంపతులు.

*

‘‘అలేఖ్యా, పెళ్ళివారు వచ్చే టైమయింది. త్వరగా రెడీ అవ్వమ్మా.’’

‘‘అమ్మా, నాకిష్టంలేదని ఎన్నిసార్లు చెప్పినా వివవేంటి... నేను అభిరామ్‌ని తప్ప ఇంకెవరినీ పెళ్ళి చేసుకోను.’’

‘‘మీ నాన్నగారు ఎవరికో మాట ఇచ్చేశారట. ఒకసారి చూస్తే పోయేదేముంది? నీకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్ళి చెయ్యం కదా. నా మాట విని రెడీ అవ్వమ్మా’’ అని శకుంతల నచ్చచెప్పడంతో సరే అంది అలేఖ్య.

ఇంతలో బయట కారు శబ్దం వినిపించింది. కారు దిగి కాంపౌండ్‌ వాల్‌ దాటుకుని రఘురామయ్య దంపతులతోపాటు వస్తున్న అభిరామ్‌ను చూసి ఎంతో సంతోషించి లోపలికి ఆహ్వానించారు శకుంతలా, శ్రీనివాస్‌లు.

హాల్లో ఉన్న సోఫాలో అభిరామ్‌ కూర్చోగానే అతనికి ఇరువైపులా కూర్చున్నారు రఘురామయ్య దంపతులు. దానికి ఎదురుగా ఉన్న కుర్చీలో శ్రీనివాస్‌ కూర్చున్నాడు. అలేఖ్యను తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది శకుంతల. తలవంచుకుని హాల్లోకి వస్తున్న అలేఖ్యను చూసి... ‘‘అలేఖ్యా, నువ్వా..? అమ్మా... నేను ప్రేమించింది ఈ అమ్మాయినే’’ అని బిగ్గరగా అరిచాడు అభిరామ్‌. ఆ అరుపుతో ఉలిక్కిపడి తల పైకెత్తి చూసింది. ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్న అభిరామ్‌ను చూసి... ‘‘అభిరామ్‌, నువ్వా’’ అంటూ అమ్మానాన్న వైపు చూసింది అలేఖ్య. శకుంతలా, శ్రీనివాస్‌, అభిరామ్‌ తల్లిదండ్రులూ నవ్వుకోవడం చూసి అలేఖ్య, అభిరామ్‌ ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

‘‘అమ్మా, వీళ్ళు మీకు ముందే తెలుసా?’’ అడిగింది అలేఖ్య.

‘‘తెలుసమ్మా నువ్వు ప్రేమించింది ఎవరినో కాదు, మా అన్నయ్యగారి అబ్బాయినే. ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు. నీవద్ద పెళ్ళి ప్రస్తావన తెచ్చినప్పుడు నువ్వే చెప్పావట కదా. అందుకే నువ్వు విజయవాడకు వెళ్ళిన మరుసటిరోజే మా ఊరెళ్ళి మా అన్నయ్యతో మాట్లాడి ఈ పెళ్ళి చూపులను ఏర్పాటుచేశాం. నిన్ను సర్‌ప్రైౖజ్‌ చేయాలని నీతో చెప్పలేదు.’’

తర్వాత అలేఖ్య రఘురామయ్య దంపతుల దగ్గరకు వెళ్ళి పాదాలకు నమస్కరించి... ‘‘మామయ్యా, మోకాళ్ళ నొప్పులు తగ్గాయా?’’ అని పలకరించింది.

‘‘గడుసుపిల్ల, అప్పుడే వరస కలిపేసింది’’ అంటూ నవ్వేసింది పద్మావతమ్మ. ‘‘బంగారు తల్లీ... ఆరోజు నువ్వు నవ్వుతూ చెప్పిన మాటకే నాకు సగం జబ్బు తగ్గిపోయిందమ్మా. నువ్విచ్చిన మందులతో ముప్పావు తగ్గింది. ఇప్పుడు నువ్వు నా కోడలివి అవుతావన్న ఆనందంతో పూర్తిగా తగ్గిపోయిందమ్మా’’ అని రఘురామయ్య అనడంతో అందరూ హాయిగా నవ్వుకున్నారు.

తర్వాత శకుంతల తన అన్నావదినలను వేరే గదిలోకి పిలిచి... ‘‘అన్నయ్యా, ఇలా చెపుతున్నానని ఏమీ అనుకోవద్దు. ఎంత దగ్గరి సంబంధమైనా అమ్మాయిని ఊరికే పంపలేము కదా, కట్నకానుకలు ఎంత ఇవ్వమంటారు’’ అని అడిగింది.

‘‘చూడు శకుంతలా, ఇన్నాళ్ళూ దూరంగా ఉన్న నువ్వు మాకు దగ్గరవటంతోపాటు, అపరంజి బొమ్మలాంటి అమ్మాయిని మా ఇంటి కోడలిగా పంపిస్తున్నావు. ఇంతకన్నా ఏం కావాలమ్మా... అలేఖ్యనే మీరు మాకిచ్చే కోట్ల విలువైన కట్నం’’ అన్నాడు రఘురామయ్య.

ఆ మాటలతో తన అన్నయ్య పాదాలకు నమస్కరిస్తుండగా... శకుంతల కంటి నుంచి ఆనందభాష్పాలు జాలువారాయి.

ఈ సన్నివేశాన్ని ఆ గది కిటికీకున్న కర్టెన్‌ వెనుక నుంచి చాటుగా చూస్తున్న అభిరామ్‌, అలేఖ్యల ఆనందానికి అవధులు లేవు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు