close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వారు అడవిని సృష్టించారు

అటవీ విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఫలితంగా పర్యావరణానికి విఘాతం కలుగుతూ ఉష్ణతాపం పెరుగుతోంది. ఇదే వరస కొనసాగితే భవిష్యత్తులో ప్రాణవాయువు దొరక్క ఊపిరి ఆగిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆలోచించిన ఆ పర్యావరణ ప్రేమికులు మొక్కలు నాటడానికి నడుం బిగించారు. నాటడమే కాదు... వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ సొంతంగా ఓ అడవినే సృష్టించారు.

ఉద్యోగం వదిలేసి..

మణిపూర్‌లోని ఉరిపోక్‌ ఖైదం లెయికై ప్రాంతానికి చెందిన మోయిరంగ్తం లోయా వృత్తిరీత్యా మెడికల్‌ రిప్రజెంటేటివ్‌. ఆయనకు మొదటి నుంచీ మొక్కలంటే ఇష్టం. తన బాల్యంలో అక్కడి కౌబ్రా పీక్‌ ప్రాంతంలోని పచ్చని అటవీ ప్రాంతానికి తరచూ వెళ్ళేవాడు. తన చదువు ముగిశాక కొన్నాళ్లకి ఓ సారి ఆ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. కానీ.. అక్కడ ఇదివరకటిలా చెట్లు లేవు... పచ్చదనం కరవైంది. ఒకప్పుడు పచ్చదనంతో అలరారిన కౌబ్రా పీక్‌ కళావిహీనంగా మారడం అతడిని ఆందోళనకు లోనుచేసింది. ఇలాగైతే మానవ మనుగడ కష్టమని భావించి తానే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగం పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2002లో ఉద్యోగానికి రాజీనామా చేసి మొక్కలు నాటడానికి అవసరమైన స్థలాన్వేషణలో పడ్డాడు. ఆ క్రమంలో మరు లంగొల్‌ హిల్స్‌ ప్రాంతానికి వెళ్ళాడు. మూడు వందల ఎకరాల విస్తీర్ణం ఉన్న అక్కడ ఒక్క మొక్కా లేదు. దాంతో ఆ మొక్కలు నాటడానికి అనువైందిగా భావించాడు. అక్కడే ఓ గుడిసె వేసుకొని తన కార్యాచరణ ప్రారంభించాడు. తాను సేకరించిన విత్తనాల్ని చల్లడంతోపాటు వెదురు, టేకు, రావి, సిందూరం, పనస తదితర మొక్కల్నీ నాటాడు. తాను చల్లిన ప్రతి విత్తనం మొలకెత్తేలా జాగ్రత్తగా చూశాడు. నాటిన ప్రతి మొక్కా బతికేలా పాదుల్ని ఏర్పాటు చేసి నీటి సదుపాయం కల్పించాడు. ఫలితంగా... ఇప్పుడు అక్కడ మూడు వందల రకాలకుపైగా చెట్లు పెరిగి పచ్చదనంతో కళకళలాడుతోంది. ఆ ప్రాంతం ఎన్నో రకాల వన్యప్రాణులకూ నిలయంగా మారింది.

భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా

మనుషులు అవసరాల కోసం చెట్లను నరికేస్తున్నారేగానీ... ప్రాణవాయువును అందించే మొక్కలను నాటడం లేదు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించాడు పశ్చిమ్‌ బంగలోని కోల్‌కతా ప్రాంతానికి చెందిన మంతు హయత్‌. అతని చిన్నతనంలో ఎక్కడ చూసినా చెట్లే కనిపించేవి. ప్రస్తుతం అవి కనుమరుగై ఖాళీ ప్రాంతమే కనిపిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న మంతు హయత్‌.. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా మొక్కలు నాటాలని తలచాడు. కోల్‌కతా పోర్టు ట్రస్టు స్థలం ఖాళీగా ఉండటంతో అక్కడ మొక్కలు పెంచే ఉద్దేశంతో అధికారులకు లేఖ రాశాడు. వారి నుంచి సమాధానం లేకపోవడంతో 2010లో కోల్‌కతా ప్రాంతంలోని మేజర్‌హఠ్‌ - న్యూ అలీపూర్‌ రహదారి వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాడు. స్నేహితుల సహకారంతో ఇప్పటి వరకూ 250 రకాల జాతులకు చెందిన 25 వేలకుపైగా మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నాడు.

మొక్కల్లో బిడ్డను చూసుకుంటూ...

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌ జిల్లా భరత్‌పుర్‌ గ్రామానికి చెందిన భయ్యారామ్‌ యాదవ్‌ సాధారణ రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొడుకు పుట్టిన తరవాత 2001లో ఆయన భార్య చనిపోయింది. సరైన చికిత్స అందక మరికొన్ని రోజులకు ఏడు నెలల కొడుకూ మరణించాడు. కొన్ని నెలల వ్యవధిలోనే భార్యనూ కొడుకునూ కోల్పోయిన ఆయన మానసిక వేదనకు లోనయ్యాడు. మనసు చెదిరిన స్థితిలో భయ్యారామ్‌ ఇంటిని వదిలి ఎక్కడెక్కడో తిరిగాడు. చివరికి ఓ గ్రామంలో అక్కడి ప్రభుత్వం గోడలపై రాసిన ‘ఒక్క మొక్క వంద మంది కొడుకులతో సమానం’ అన్న నినాదం ఆయన్ను ప్రభావితం చేసింది. కొడుకును కోల్పోయిన తాను వేలాది మొక్కలను నాటి వాటిలోనే తన బిడ్డను చూసుకోవాలనుకున్నాడు. అప్పటి నుంచీ మొక్కలను నాటడం, వాటిని కాపాడటమే వ్యాపకంగా మలుచుకున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి టేకు, చింత, ఉసిరి, జామ, నిమ్మ తదితర మొక్కల్ని 40,000 పైచిలుకు సేకరించాడు. వాటిని తన సొంతూరితోపాటు సమీప గ్రామాల శివార్లలో సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో నాటాడు. అందులోని ఒక్క మొక్కా చనిపోకుండా ప్రాణప్రదంగా కాపాడుతున్నాడు. నలభై లక్షల మొక్కలు నాటడమే తన లక్ష్యమని పేర్కొంటున్న భయ్యారామ్‌.. ప్రభుత్వం సహకరిస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత సులువవుతుందంటున్నాడు.

29 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.