close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాలీఫ్టవర్‌ రైస్‌ తింటున్నారా?

ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, వెదురు బియ్యం... ఇలా బియ్యంలో చాలా రకాల గురించి విన్నాంగానీ కొత్తగా ఈ కాలీఫ్లవర్‌ రైసేంటో అనిపిస్తోంది కదూ. నిజమే, ఈమధ్య మార్కెట్లోకి వస్తోన్న ఫుడ్‌ ట్రెండ్స్‌ వెనకున్న కామన్‌ సూత్రం ఒకటే. ఆరోగ్యం... అందులో భాగంగా బరువు తగ్గడం. అలా తెరమీదకి వచ్చిందే ఈ కాలీఫ్లవర్‌ రైస్‌ కూడా. అసలీ కాలీఫ్లవర్‌ రైసేంటీ, దాన్ని తినడమేంటీ అన్నదానిమీద ఓ లుక్కేస్తే..!

పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, టొమాటో... ఇలా చాలా రకాల రైస్‌ వెరైటీల గురించి మనకు తెలిసిందే. ఈ కాలీఫ్లవర్‌ రైస్‌ కూడా అలాంటిదే అయి ఉంటుంది, అందులో పెద్ద వింతేముందీ అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ఇది పేరుకే రైస్‌, కానీ అన్నం మెతుకు కూడా ఉండదు. కాలీఫ్లవర్‌ మాత్రమే ఉంటుంది. అంటే- కాలీఫ్లవర్‌ని సన్నగా తరిగి దాన్నే రైస్‌గా వండుతారన్నమాట. అన్నం మాదిరిగానే కాలీఫ్లవర్‌ బియ్యంతోనూ పులావ్‌, ఫ్రైడ్‌ రైస్‌, పులిహోర, కిచిడీ, బిర్యానీ, పాయసం, పొంగలి, ఇడ్లీ, ఉప్మా... ఇలా అన్నీ చేసుకోవచ్చు. లేదంటే తెల్ల అన్నం మాదిరిగానే ఒట్టిగానే ఉడికించుకుని అందులోనే కూరలూ కలుపుకోవచ్చు. సలాడ్‌లానూ తినొచ్చు.

అసలెందుకీ రైస్‌?
కాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు కణాలను రక్షించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడకుండా చూస్తాయి. ఇందులోని మెగ్నీషియం కండరాల పనితీరుకీ బీపీ నియంత్రణకీ తోడ్పడుతుంది. ఫోలేటూ,్ల విటమిన్‌-బి6లు నాడీవ్యవస్థ పనితీరుని మెరుగుపరిస్తే, కె-విటమిన్‌ ఎముకల్ని కాపాడుతుంది. కాలీఫ్లవర్‌లోని సల్ఫొరాపేన్‌ అసహజ కణాలు పెరగకుండా చేస్తుంది. ఇవన్నీ పక్కన ఉంచితే, కాలీఫ్లవర్‌రైస్‌లో పిండిపదార్థాల శాతం చాలా తక్కువ. ఉదాహరణకు వంద గ్రా. వైట్‌ రైస్‌ నుంచి సుమారు 40గ్రా. పిండిపదార్థాలు, 204 క్యాలరీలు లభిస్తే, అంతే మోతాదులోని కాలీఫ్లవర్‌ రైస్‌ నుంచి దాదాపు 5గ్రా. కార్బోహైడ్రేట్లూ, 2.1గ్రా ప్రొటీన్లూ, 2.1గ్రా. పీచూ, 25 గ్రా. క్యాలరీలు మాత్రమే అందుతాయి. పైగా అన్నంలోకన్నా ఇందులో ఖనిజాలూ విటమిన్లూ వంటి పోషకాలు ఎక్కువ. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లు ఫాల్స్‌ కార్బ్స్‌ ట్రెండ్‌ని అనుసరిస్తూ బియ్యానికి బదులుగా కాలీఫ్లవర్‌ రైస్‌ని తినడం అలవాటు చేసుకుంటున్నారు. కీటోడైట్‌లో భాగంగానూ తింటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవాళ్లకీ మంచిదనేది పోషక నిపుణుల ఉవాచ. పైగా నిమ్మ, వెల్లుల్లి, పుదీనా... వంటివి వాడితే కాలీఫ్లవర్‌ ఫ్లేవర్‌ అదిరిపోతుంది అంటున్నారు తింటున్నవాళ్లు.

ఎలా చేయాలి?
గ్రేటర్‌ లేదా ఫుడ్‌ ప్రాసెసర్‌తో కాలీఫ్లవర్‌ని తురిమి బియ్యాన్ని ఎప్పటికప్పుడు ఇంట్లోనే తాజాగా చేసుకోవచ్చు. సన్నగా తరిగిన కాలీఫ్లవర్‌ బియ్యం లేదా ముక్కల్ని ఓ నిమిషం బ్లాటింగ్‌ పేపర్‌మీద వేస్తే తడి ఆరిపోతుంది. ఆపై పాన్‌లో కాస్త వెన్న లేదా నూనె వేసి ఈ రైస్‌(కాలీఫ్లవర్‌ తురుము) వేసి, కొద్దిగా ఉప్పు చల్లి మూతపెట్టి ఏడెనిమిది నిమిషాలు ఉడికిస్తే రైస్‌ రెడీ. చల్లారాక దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రెండుమూడు రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రీజర్‌లో పెట్టీ వాడుకోవచ్చు. అయితే ఫ్రీజ్‌ చేసినవి వాడుకోవడానికి ఓ రెండుమూడు గంటల ముందే తీసిపెట్టుకోవాలి. ఇవన్నీ వద్దనుకుంటే రైస్‌డ్‌ కాలీఫ్లవర్‌ ప్యాకెట్లు మార్కెట్లోనూ దొరుకుతున్నాయి. కాలీఫ్లవర్‌ మాదిరిగానే బీట్‌రూట్‌, ఒక రకం గుమ్మడితో కూడా రైస్‌లను తీసుకువస్తున్నారు. కానీ అన్నింటికన్నా కాలీఫ్లవర్‌ రైస్‌ త్వరగా ఉడుకుతుంది. మసాలాలూ, కూరగాయలూ ఏవి జోడించినా రుచిగా ఉంటుంది. అందుకే కాలీఫ్లవర్‌నే అన్నంగా తినేస్తున్నారు. సో... అదన్నమాట కాలీఫ్లవర్‌ రైస్‌ వెనకున్న అసలైన మతలబు.
మరి తినడానికి మీరూ రెడీనా?!

29 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.