close

కిట్‌క్యాట్‌ ఇక కాగితంలో....

నోట్‌బుక్‌లోని కాగితాలతో పడవలు చేసి వాన నీళ్లలో వదిలిన చిన్ననాటి జ్ఞాపకాలు మనలో చాలామందికి ఉండే ఉంటాయి. అయితే జపాన్‌లో మాత్రం అలా కాగితాలతో బొమ్మలు చేయడం ఓ కళ. దాన్ని ఆరిగామి అంటారు. అందుకు ప్రత్యేకంగా అల్యూమినియం ఫాయిల్‌ మాదిరి కాగితం ఉంటుంది. అది కలపగుజ్జుతో చేసిందే అయినా చాలామందంగా, దృఢంగా ఉంటుంది. ఇప్పుడు నెస్లే సంస్థ తమ ఉత్పత్తి అయిన కిట్‌క్యాట్‌ ప్యాకింగ్‌కి ఆ కాగితాన్నే వాడుతున్నట్టు ప్రకటించింది.  జపాన్‌లో అత్యంత ఆదరణ ఉన్న చాక్లెట్‌ కిట్‌క్యాట్‌ కావడంతో తయారీ ఎక్కువగానే ఉంటోంది. ఏడాదికి వీటి ప్యాకింగ్‌కోసం దాదాపు 380 టన్నుల ప్లాస్టిక్‌ కాగితాన్ని వాడుతోంది ఆ సంస్థ. ఇక నుంచైనా పర్యావరణానికి హాని చేయకూడదని నిర్ణయించుకున్న నెస్లే సంస్థ కిట్‌క్యాట్‌ బార్‌ లోపల రెండో పొరను కూడా తొలగించి కేవలం ఆరిగామి ప్యాకింగ్‌తోనే మనదేశంలోనూ అందించడానికి సన్నాహాలు చేసింది.

అక్కడ మాంసం తినడం నేరం!

ఇంతకీ అదెక్కడంటే... గుజరాత్‌లోని భావ్‌నగర్‌జిల్లా పాలితాన్‌ పట్టణంలో. అక్కడ దాదాపు తొమ్మిందొల జైన దేవాలయాలున్నాయి. జైనులు ఎక్కువగా ఉన్న పాలితానాకు జైనమత ప్రచారకులు దేశవిదేశాల నుంచీ వస్తుంటారు. జైనమతంలో మాంసాహారం ముట్టొద్దనీ, హింసకి దూరంగా ఉండమనీ చెబుతుంటారు. అందుకే అక్కడ మత ప్రచారకులు పోరాడి మరీ అధికారికంగా మాంసాహారాన్ని నిషేధించారు. ఇప్పుడక్కడ మాంసం, గుడ్లూ అమ్మడం, తినడం చట్టవిరుద్ధం. ఇప్పటికే గ్రామస్థులంతా ఒకమాట మీద ఉండి ఇలాంటి నియమాల్ని పెట్టుకున్న కొన్నిగ్రామాలు మనదేశంలో ఉన్నాయి. అయితే మాంసాహారం విషయంలో ఏకంగా ప్రభుత్వమే కలగజేసుకుని చట్టం తీసుకొచ్చింది ఒక్క పాలితానాలోనే.

సెల్ఫీల కోసం స్టూడియో...

ఫోన్‌లో తీసుకున్న ఫన్నీ సెల్ఫీనో, క్లిక్‌మనిపించిన అందమైన దృశ్యాన్నో వాట్సాప్‌ స్టేటస్‌గానో, ఫేస్‌బుక్‌వాల్‌మీదో, ఇన్‌స్టా లేదా ట్విటర్‌లోనో పోస్ట్‌ చేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఇతరులు పంచుకున్న ఫొటోల కంటే ఇంకా మంచివి పెట్టాలనిపిస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య యువత రకరకాల ప్రయోగాలు చేసి సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా కోకొల్లలు. అవన్నీ గమనించిన ఇరవై ఆరేళ్ల విల్‌బోవేర్‌ లండన్‌లో ఏకంగా సెల్ఫీలూ, ఫొటోల కోసం ఓ స్టూడియోని ఏర్పాటు చేశాడు. ఇందుకోసం ఇరవై గదుల్ని రకరకాల థీమ్‌లతో డిజైన్‌ చేయించిన విల్‌ 70, 80ల నాటి ఫోన్లూ, టీవీలూ, వాచీల వంటి యాంటిక్‌పీస్‌ల రెప్లికాలతోపాటు స్పైడర్‌, ఆర్మీ తదితర దుస్తుల్నీ పెద్ద పెద్ద సాఫ్ట్‌ టాయ్స్‌నీ అందుబాటులో ఉంచాడు. నచ్చిన థీమ్‌లూ వాటికి మ్యాచ్‌ అయ్యేలా దుస్తులూ వేసుకుని ఇక్కడ సెల్ఫీలూ, ఫొటోలూ తీసుకోవడానికి పిన్నల నుంచీ పెద్దల వరకూ తెగ ఉత్సాహపడిపోతున్నారట. ఓ పెద్ద మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోలో కొందరైతే రోజంతా సెల్ఫీలు తీసుకుంటూనే ఉండటం విశేషం.

పిల్లలకు ఆ పేర్లే

పిల్లలు పుట్టాక వారి జాతకం, నక్షత్రం ప్రకారం వచ్చిన అక్షరంతోనే పేరు పెట్టడం చాలామంది చేస్తుంటారు. ఆ పేర్ల కోసం పుస్తకాలో, వెబ్‌సైట్లో గాలించి మరీ సెంటిమెంట్‌కి తగినట్టు పెట్టేస్తుంటారు. అయితే  ఇప్పుడు లండన్‌తోపాటు మరికొన్ని దేశాల్లో పిల్లలకు డిస్నీ సినిమాల్లోని పాత్రల పేర్లు పెట్టేస్తున్నారట. ఇప్పటివరకూ దాదాపుగా పదిలక్షల మందికిపైనే ఆ పేర్లు పెట్టారని ఓ ట్రావెల్‌ ఏజెన్సీ చేసిన సర్వేలో తేలింది. డిస్నీ సినిమాల్లో సరికొత్త పేర్లను సృష్టించి పెట్టింది ఆ సంస్థ. అందుకే కొన్ని దేశాల్లో పిల్లలకు పేర్లు పెట్టాల్సి వచ్చినప్పుడు డిస్నీ వాళ్ల సినిమాలు చూసి పలకడానికి తేలిగ్గా ఉండే పొట్టి పేర్లను ఎంచుకుని మరీ పెడుతున్నారట. తాజాగా విడుదలైన లయన్‌కింగ్‌లోని సింబా, నాలా పేర్లు యమా ఫేమస్‌ అయ్యాయక్కడ.
29 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.