close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శాకాహారం గుండెకు మేలు!

శాకాహారం ఎక్కువగా తీసుకునేవాళ్లలో హృద్రోగాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ పేర్కొంటోంది. ఇందుకోసం వీళ్లు దాదాపు పన్నెండు వేల మందిని ఎంపికచేసి దాదాపు 30 సంవత్సరాలపాటు పరిశీలించారట. మొదట్లో వాళ్లెవరికీ ఎలాంటి హృద్రోగాలూ లేవు. కానీ పరిశీలన సమయంలోనే వాళ్లలో 5400 మంది మరణించారు. అందులోనూ 1500 మంది హృద్రోగాలతోనే చనిపోయినట్లు తేలింది. మరో నాలుగు వేలమంది హృద్రోగాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అయితే మొత్తంగా పరిశీలించినప్పుడు- మిగిలినవాళ్లతో పోలిస్తే శాకాహారం ఎక్కువగా తీసుకున్నవాళ్లలో హృద్రోగాల బారినపడటం అనేది 16 శాతం, హృద్రోగాలతో చనిపోవడం అనేది 32 శాతం తక్కువగా ఉన్నట్లు తేలిందట.

నిద్రలేమితో జీర్ణసమస్యలు

ప్రస్తుతం అనేకమందిని బాధిస్తున్న అతిపెద్ద సమస్య నిద్రలేమి. ముఖ్యంగా నైట్‌ షిఫ్టులు చేసేవాళ్లకి నిద్ర సరిపోకపోతే జీర్ణవ్యవవస్థ దెబ్బతింటుంది అంటున్నారు లిస్బన్‌కు చెందిన పరిశోధకులు. రోగనిరోధకశక్తిని పెంచే 3 ఇన్నేట్‌ లింఫాయిడ్‌ కణాలు(ఐఎల్‌సి3ఎస్‌) జీవక్రియ, ఇన్‌ఫ్లమేషన్‌... వంటి జీవ ప్రక్రియల్ని కూడా నియంత్రిస్తుంటాయి. ఇన్ఫెక్షన్లు రాకుండానూ పొట్ట గోడలు దెబ్బతినకుండానూ కాపాడుతుంటాయి. అయితే ఈ ఐఎల్‌సి3ఎస్‌ కణాల పనితీరు జీవగడియారం మీద ఆధారపడి ఉంటుంది. అంటే- నిద్ర వేళలు మారిపోవడం, నిద్ర తక్కువగా ఉండటం వంటి కారణాలవల్ల జీవగడియారానికి సంబంధించిన జన్యువుల్లో మార్పు చోటుచేసుకుంటుంది. తద్వారా రోగనిరోధకశక్తిని నియంత్రించే ఆ కణాల పనితీరూ దెబ్బతింటుంది. ఫలితంగా జీవక్రియాలోపాలతోబాటు ఊబకాయం, అల్సర్లు, క్యాన్సర్లు... వంటి సమస్యలు తలెత్తుతాయి. సో, దీనంతటికీ కారణమైన నిద్రలేమి బారినపడకుండా ఉంటే ఆరోగ్యసమస్యలు దాదాపుగా ఉండవని సదరు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఉద్యోగి పనితీరు మెరుగవ్వాలంటే..!

పనిచేసే వాతావరణం బాగుండాలి, మంచి జీతం ఉండాలని ఉద్యోగులూ, వాళ్లు బాగా పనిచేయాలని యాజమానీ కోరుకోవడం సహజం. అయితే వాళ్ల పనితీరూ ఉత్పత్తీ మరింత బాగుండాలంటే జీతాలు పెంచి, పనివేళలు తగ్గించడం ఒక్కటే మార్గం అని అందరూ అనుకుంటారు. కానీ ఈ రెండింటికన్నా ఆప్యాయతతో కూడిన యజమాని పలకరింపు వల్లే ఉద్యోగులు ఆనందంగా ఉంటారనీ తద్వారా పనితీరూ మెరుగవుతుందనీ పెన్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయ నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగులకు ఆఫీసులో ఇచ్చే లంచ్‌లోగానీ లేదా వాళ్లు తెచ్చుకునే లంచ్‌లోగానీ విధిగా పండ్లు ఉండేలా చూస్తే- పని ఒత్తిడి తగ్గి, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని కూడా ఈ పరిశీలనలో స్పష్టమైంది. ఇందుకోసం సదరు పరిశోధకులు విపరీతమైన ఒత్తిడితో పనిచేస్తోన్న కొందరు ఉద్యోగుల్ని ఎంపికచేసి, రోజూ లంచ్‌లో పండ్లు తినేలా చేశారట. అంతేకాదు, యాజమాన్యం వాళ్ల యోగక్షేమాల గురించీ వాకబు చేసే ఏర్పాటూ చేశారట. ఇలా నాలుగువారాలు చేసేసరికి ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి, పనితీరుతోబాటు ఆరోగ్యం మెరుగైనట్లు గుర్తించారు.

ఒత్తయిన జుట్టుకోసం ఉల్లి!

శిరోజాలు అందంగా ఆరోగ్యంగా పెరిగేందుకు రకరకాల నూనెలు వాడుతుంటాం. అయితే వాటితోబాటు ఉల్లిపాయ రసం పట్టిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది అంటున్నారు కేశ సౌందర్య నిపుణులు. ఉల్లిరసంలోని సల్ఫర్‌ జుట్టు పెరుగుదలకి తోడ్పడే ఎంజైములని ప్రేరేపిస్తుందట. జుట్టు రాలిపోకుండానూ చిట్లిపోకుండానూ చూస్తుంది. అంతేకాదు, యాంటీఆక్సిడెంట్‌లా పనిచేసే  కెటలేజ్‌ అనే ఎంజైమ్‌ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది. ఇంకా ఇందులోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణాల కారణంగా చుండ్రు రాకుండానూ ఉంటుంది. రక్తప్రసరణ బాగా జరిగేలా చేయడంతోబాటు జుట్టు త్వరగా పెరిగేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా రెండు టేబుల్‌స్పూన్ల ఉల్లిరసం తీసుకుని అందులో దూదిని ముంచి తల అంతా పట్టించి సుమారు ఓ గంటసేపు ఉంచి షాంపూ చేయాలి. 2 టేబుల్‌స్పూన్ల ఉల్లిరసంలో 2 టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనె కలిపి తలకి పట్టించి అరగంటసేపు ఉంచి షాంపూ చేసినా మంచిదే. లేదా మూడు టేబుల్‌స్పూన్ల ఉల్లిరసానికి ఒకటిన్నర టేబుల్‌స్పూన్ల ఆలివ్‌నూనె కలిపి తలకి పట్టించి రెండు గంటలపాటు ఉంచాక స్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతూ అందంగా మెరుస్తుంటుంది.
29 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు