close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీ ఇంట్లో పెద్దవాళ్లున్నారా?!

‘చిన్నప్పుడు తెలివైనవాళ్లను చూసి స్ఫూర్తిపొందిన నేను, పెద్దయ్యాక దయాగుణాన్ని ఇష్టపడుతున్నాను’ అన్నాడో పెద్దాయన. కానీ ఈతరం వృద్ధులు చాలా స్మార్ట్‌. పిల్లల నుంచి ప్రేమనీ సమాజం నుంచీ సహాయాన్నీ ఆశించడం లేదు, టెక్నాలజీ తోడుంటే చాలు, మలి వయసూ ఆనందమయమే అనుకుంటున్నారు. వాళ్ల మనసు గ్రహించే కాబోలు, కంపెనీలు సైతం అరవై పైబడిన వాళ్లనే టార్గెట్‌ చేసుకుని, లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ రకరకాల సాంకేతిక ఉత్పత్తుల్ని రూపొందిస్తున్నాయి. అలా వస్తోన్న వాటిల్లో కొన్ని... (అక్టోబరు 1 వృద్ధుల దినోత్సవం)

భూతద్దం స్టాండ్‌తో..!

వృద్ధులనే కాదు, యాభై దాటిన దగ్గర్నుంచీ చూపు తగ్గి అక్షరాలు కనిపించవు. పుస్తకాలు బాగా చదివేవాళ్లకి ఇది మరీ సమస్యాత్మకంగా మారుతుంది. దాంతో చాలామంది కళ్లజోడు ఉన్నా భూతద్దాల్ని ఆశ్రయిస్తుంటారు. ఎల్‌ఈడీ బల్బుతోవస్తున్నా ఈ అద్దాల్ని చేత్తోపట్టుకుని చదవాలంటే కష్టం. అందుకే అవీ ఇప్పుడు ఫ్లోర్‌స్టాండింగ్‌ మ్యాగ్నిఫయిర్‌ ల్యాంప్‌ల రూపంలో వస్తున్నాయి. ఇందులో అమర్చిన బల్బులు అచ్చం పగటి వెలుతురునే తలపించడంతో సోఫాలో కూర్చుని కావలసిన ఎత్తుకి అమర్చుకుని హాయిగా చదువుకోవచ్చు.

మరమనిషే మంచి తోడు

రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోయినట్లే చదువులకోసమో ఉద్యోగాలకోసమో పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలి భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు. దాంతో చాలా ఇళ్లలో పెద్దవాళ్లు మాత్రమే ఉండాల్సి వస్తోంది. జీవిత భాగస్వామి కూడా దూరమైనప్పుడు ఆ ఒంటరితనం భరించడం చాలామందికి కష్టంగానే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా తోడుగా ఎవరినైనా మనుషుల్ని పెట్టుకుందామన్నా దొరికే రోజులు కావివి. అందుకే ఆధునిక మనిషికి మర మనుషులే తోడుగా మారుతున్నాయి. అలా అచ్చంగా పెద్దవాళ్లకోసం రూపొందించినవవే ఎలిక్‌, లికు, కేరొబోట్‌... వంటి రోబోలు. ఇవి వృద్ధుల చుట్టుపక్కలే తిరుగుతూ వాళ్లకేం కావాలో తెలుసుకుంటుంటాయి. సంగీతాన్ని వినిపించడం, మందులు వేసుకోమని చెప్పడం, వ్యాయామాలు చేయించడం, ఆహారాన్ని అందించడం, ఫేస్‌బుక్‌ పోస్టులు పంపడం, ఈమెయిల్స్‌ గట్టిగా చదవడం, ఫోన్‌కాల్స్‌ తీయడం... ఇలా రకరకాల పనులు చేస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నాయి.

మందులు వేసుకునే టైమయింది

యాభై దాటిన దగ్గర్నుంచే వేసుకునే మందుల సంఖ్యా పెరుగుతూ వస్తుంది. వాటిని వేసుకోవడం మర్చిపోయినా, గుర్తులేక ఎక్కువ వేసుకున్నా రెండూ ప్రమాదమే. మూత్రపిండాలు దెబ్బతినడం, గుండె సమస్యలు రావడం వంటివి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఏ టైమ్‌కి ఏయే మందులు వేసుకోవాలి అనే పిల్‌ ఆర్గనైజర్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. అయితే మతిమరపుతో బాధపడేవాళ్లకి మందులు వేసుకున్నామో లేదో కూడా గుర్తు ఉండకపోవచ్చు. అలాంటివాళ్లకోసమే ఇప్పుడు ఆటోమేటిక్‌ పిల్‌ డిస్పెన్సర్లు వస్తున్నాయి. ఇందులో 28 రోజులకి సరిపడా మందుల్ని ఏయే సమయంలో వేసుకోవాలనేది ముందే సెట్‌ చేసుకుంటే, ఆ సమయానికి అలారం పెద్ద శబ్దంతో మోగుతుంది. కాబట్టి ఇంట్లో ఎవరూ లేకున్నా పెద్దవాళ్లు సమయానికి మందులు వేసుకోగలుగుతారన్నమాట.

తాళం ఎక్కడుంది?

వయసుతోబాటు బోనస్‌గా వచ్చేది మతిమరుపే. ఫలితం... తాళాలూ కళ్లద్దాలూ టీవీ రిమోటూ ఎక్కడో ఒకచోట పెట్టేసి మర్చిపోతుంటారు. ఆపై వాటిని వెతుక్కోవడానికే రోజంతా గడిచిపోతుంటుంది. చూడ్డానికి చిన్న సమస్యలానే అనిపించినా దీనివల్ల తలెత్తే ఇబ్బందులు ఎన్నో. అందుకే ఇప్పుడు అనేక కంపెనీలు ఐటమ్‌ లొకేటర్‌, కీ ఫైండర్లను రూపొందిస్తున్నాయి. చూడ్డానికి చిన్న రిమోట్‌లా ఉండే దీంతోబాటు కీచెయిన్లను పోలిన రిసీవర్లు ఉంటాయి. వీటిని తరచూ మరిచిపోయే వస్తువులైన కళ్లద్దాలు, రిమోట్‌, పర్సులు, తాళాలకు తగిలించుకుంటే చాలు, అవి ఏ సోఫా కుషన్ల వెనకో బెడ్‌మీదో, కిచెన్‌ గట్టుమీదో... ఇలా ఎక్కడ ఉన్నాయనేది వాటినుంచి వచ్చే బీప్‌ బీప్‌ మన్న శబ్దం ద్వారా చిటికెలో తెలుసుకోవచ్చు. అంటే- రిమోట్‌లా ఉన్న కంట్రోలర్‌ మీద రంగుల్లో బటన్స్‌ ఉంటాయి. ఆ బటన్‌ ప్రెస్‌ చేస్తే అదే రంగుతో ఉన్న రిసీవర్‌ తగిలించిన వస్తువు ఎక్కడ ఉందో అక్కడి నుంచి శబ్దం వస్తుంది. పైగా కంట్రోలర్‌ లోపల ఎల్‌ఈడీ లైటు ఉండటం వల్ల రాత్రిపూటా బటన్స్‌మీద ఉన్న రంగులు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి చీకట్లో కూడా నొక్కి, శబ్దం ద్వారా అదెక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

టాయ్‌లెట్‌కీ ‘సెన్స్‌’ర్‌

పెద్దవయసులో రాత్రిపూట ఎక్కువసార్లు బాత్రూమ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. లేచినప్పుడల్లా లైటు వేయడం వల్ల మళ్లీ నిద్ర పట్టడానికి చాలా సమయం పడుతుంది. లైటు వేసుకోవడానికీ తడుముకోవాలి. ఆ ఇబ్బంది లేకుండా ఉండేందుకే మోషన్‌ ఆక్టివేటెడ్‌ టాయ్‌లెట్‌ నైట్‌ లైట్లు వస్తున్నాయి. అంటే- బాత్రూమ్‌లోకి రాగానే మనిషి కదలిక, అతని శరీర ఉష్ణోగ్రతను బట్టి అది వెలుగుతుంది. లేచి వెళ్లగానే ఆరిపోతుంది. రొటేషన్‌ పద్ధతిలో వరసగా 16 రంగుల్లోకి మారుతూ వెలుగుతుందీ లైటు. వద్దనుకుంటే బటన్‌ను ప్రెస్‌ చేసి ఒకే రంగులో వెలిగేలా చేసుకోవచ్చు. పీవీసీతో తయారైన దీన్ని ఏ టాయ్‌లెట్‌కైనా సులభంగా అనుసంధానించుకోవచ్చు.

పెద్ద వయసులో ‘స్మార్ట్‌’గా..!

ఎలక్ట్రానిక్‌ యుగంలో సెల్‌ఫోన్‌ శరీరావయవాల్లో ఒక భాగంగా మారింది. అయితే వయసుమీదపడేకొద్దీ కంటి కండరాలు బలహీనమై చూపు మసకబారుతుంది. దీనికితోడు గ్లకోమా, కేటరాక్ట్‌... వంటి సమస్యలు కాచుకునే ఉంటాయి. అందుకే వాళ్లకోసం పెద్ద అక్షరాల సెల్‌ఫోన్లూ రిమోట్లూ వాచీలూ వస్తున్నాయి. అంతేకాదు, శామ్‌సంగ్‌ (గెలాక్సీ ఎస్‌8), మోటారొలా (జి6), నోకియా(6.1), ఫూజిత్సు(స్టైలిస్టిక్‌ ఎస్‌01)... వంటి కంపెనీలన్నీ వృద్ధులకోసం ఆండ్రాయిడ్‌ ఫోన్లనీ ప్రత్యేకంగారూపొందిస్తున్నాయి. అందులో ఎమర్జెన్సీ బజర్‌తోబాటు సులభంగా ఆపరేట్‌ చేసేలా టచ్‌ బటన్స్‌ను వేర్వేరు రంగుల్లోనూ వాటర్‌ప్రూఫ్‌ టెక్నాలజీతోనూ ఎక్కువసేపు బ్యాటరీ వచ్చేలానూ చేస్తున్నారు. వాయిస్‌ కమాండ్స్‌... వంటి ఫీచర్లనీ జోడించడంతో చరమాంకంలోనూ నిస్సంకోచంగా స్మార్ట్‌ఫోన్‌ వాడుకోవచ్చు. అలాగే చేతికి అటామిక్‌ టాకింగ్‌ వాచ్‌ ఉంటే సమయాన్నీ తారీకునీ కూడాచెబుతుంటుంది.

వీడియో డోర్‌ బెల్‌

పిల్లలు స్కూళ్లకీ పెద్దవాళ్లు ఆఫీసులకీ వెళ్లిపోతే ఇంట్లో వృద్ధులు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరో ఒకరు వచ్చి బెల్‌ కొట్టడం షరా మామూలే. కానీ వాళ్లు మాటిమాటికీ లేచెళ్లి తలుపు తీయలేకపోవడం ఒక సమస్య అయితే, ఎవరో తెలీకుండా తీయడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణానికే ప్రమాదంగా పరిణమించవచ్చు. ముఖ్యంగా మార్కెటింగ్‌ వాళ్లు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్‌ చేస్తుంటారు. దాంతో ప్రతీసారీ డోర్‌ వరకూ వెళ్లి, కెమెరాలోంచి చూసి తలుపు తీయాలన్నా కష్టంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వీడియో డోర్‌బెల్‌ పెట్టించుకుని దాన్ని ఆప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి అనుసంధానిస్తే వచ్చిందెవరో ఫోన్‌లోనే చూసి వాళ్లతో మాట్లాడి అవసరమైతేనే తలుపు తీయొచ్చు, లేదంటే అటు నుంచి అటే వెళ్లిపోమని చెప్పవచ్చు.

టీవీ బాగా వినిపిస్తుంది

పెద్దయ్యేకొద్దీ కళ్లు మాత్రమే కాదు, చెవులూ మొరాయిస్తాయి. అందుకే టీవీ, రేడియో సౌండ్‌ పెద్దగా పెట్టుకుని చూస్తుంటారు. కానీ దీనివల్ల ఇంట్లోవాళ్లకే కాదు, పక్కింట్లోవాళ్లకీ ఇబ్బందిగా ఉంటుంది. అలాగని సౌండ్‌ తగ్గించమంటే పెద్దవాళ్లకేమో వినిపించక తెగ కోపం వచ్చేస్తుంటుంది. అదే వైర్‌లెస్‌ హియరింగ్‌ ఎయిడ్‌ సెట్‌ సిస్టమ్‌ ఇంట్లో ఉంటే, దాంతోపాటు వచ్చే ఇయర్‌ఫోన్స్‌ చెవిలో పెట్టుకుంటే చాలు, టీవీలో వచ్చే శబ్దాలన్నీ స్పష్టంగా వినిపిస్తాయి కాబట్టి టీవీ వాల్యూమ్‌ పెంచాల్సిన అవసరం ఉండదు. ఇయర్‌బడ్స్‌ దగ్గరే వాళ్లకు కావాల్సిన సౌండ్‌ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వీటిని ట్రాన్స్‌మిటర్‌లా పనిచేసే బోర్డులో పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ చేసుకోవచ్చు

ఇవేకాదు, మణికట్టుకు కట్టుకునే సెన్సర్లూ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే రిస్ట్‌ బ్యాండ్‌లూ బయటకు వెళ్లినప్పుడు వాళ్లెక్కడ ఉన్నారనే విషయాన్ని తెలిపే జియోబిట్‌ ట్రాకర్లూ ప్రమాదవశాత్తూ గాయపడినప్పుడు వాళ్లెంత వేగంగాకోలుకుంటున్నారనేది నేరుగా వైద్యులకు తెలిసేలా రూపొందించిన ఐసో స్టిక్‌ చేతికర్రలూ... ఇలా కొత్త టెక్నాలజీ హంగులెన్నో వృద్ధులకోసం వస్తున్నాయి. వాళ్లు ఎవరిమీదా ఆధారపడకుండా ప్రశాంతంగా ఆనందంగా జీవించేందుకు తోడ్పడుతున్నాయి. వృద్ధాప్యం శాపం కాకుండా చూస్తున్నాయి.
29 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.