close

పుష్పగుచ్ఛాలొద్దు... పుస్తకాలతో రండి!

శాలువాతో సన్మానం... ఓ గౌరవ సూచకం. పుష్పగుచ్ఛంతో ఆహ్వానం... ఎదుటివారిపై మనం వెలిబుచ్చే అభిమానం. అధికారులూ, ప్రజాప్రతినిధులూ బాధ్యతలు స్వీకరించిన సమయాల్లోనూ, ఇతర సందర్భాల్లోనూ ప్రజలూ, అభిమానులూ, కిందిస్థాయి సిబ్బందీ, సంఘాల నేతలూ వారిని శాలువాలతో సన్మానిస్తూ, పుష్పగుచ్ఛాలు అందిస్తూ అభినందనలు తెలుపుతుంటారు. కొందరు బహుమతులూ అందజేస్తూ ఆత్మీయత చాటుతారు. అయితే ఇప్పుడు ట్రెండు మారింది. శాలువాలూ బొకేల స్థానంలో పుస్తకాలూ, సేవా కార్యక్రమాలు చేరుతున్నాయి... ఇలా...!

శీతాకాలం వచ్చిందంటే ఆదిలాబాద్‌ జిల్లాలో చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా వణికిపోవాల్సిందే. ప్రధానంగా హాస్టళ్ళలోని విద్యార్థులు దుప్పట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారని గ్రహించారు అక్కడి కలెక్టరు దివ్య దేవరాజన్‌. వారికి బ్లాంకెట్లూ, దుప్పట్లూ అందించి చలి బాధ నుంచి తప్పించాలనుకున్నారు. సాధారణంగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలపడానికి గ్రీటింగ్‌ కార్డులూ, పుష్పగుచ్ఛాలూ తీసుకొని కలెక్టరు దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు. దీంతో రెండు రోజుల ముందుగానే... తనకు ఎవరూ గ్రీటింగ్‌ కార్డులూ, పుష్పగుచ్ఛాలూ ఇవ్వొద్దనీ, వాటి స్థానంలో విద్యార్థుల కోసం దుప్పట్లూ, బ్లాంకెట్లూ తీసుకురావాలనీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంకేం... ఎంతోమంది స్పందించారు. కలెక్టరు దివ్య దేవరాజన్‌కు బ్లాంకెట్లూ, దుప్పట్లూ అందజేసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ వాటిని విద్యార్థులకు అందజేయాలని కోరారు. రెండు రోజుల్లోనే అయిదువేలకు పైగా సమకూరిన వీటిని విద్యార్థులకు అందజేసి వారిని చలి నుంచి కాపాడారు.

సన్మానాల స్థానంలో పుస్తకాలు
సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డిని అభినందించడానికి అభిమానులూ, పార్టీ నాయకులూ, కార్యకర్తలూ పోటెత్తివచ్చారు. అందులో శాలువానో, పుష్పగుచ్ఛమో తీసుకొచ్చిన వారే ఎక్కువ. దీంతో తనకు అవేవీ వద్దనీ, వాటి స్థానంలో పేద విద్యార్థులకు పంపిణీ చేయడానికి రాత పుస్తకాలు తీసుకురావాలనీ సూచించారాయన. వారంతా స్పందించి ఆయనకు పుస్తకాలు అందజేస్తూ అభినందనలతో ముంచెత్తారు. ఇలా నాలుగు రోజుల్లోనే ఎనిమిది వేలకుపైగా పుస్తకాలు వచ్చాయి. వాటన్నింటినీ సికింద్రాబాద్‌ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల పేద పిల్లలకు అందజేసి ఔదార్యం చాటారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితారెడ్డి కూడా ఇదే పంథాను అనుసరించారు. ఆమెను అభినందించడానికి ఎంతో మంది రాగా... శాలువాలూ, పుష్పగుచ్ఛాలూ, మిఠాయిలూ వద్దనీ, వాటికి బదులు పేద విద్యార్థుల కోసం నోట్‌బుక్స్‌ తీసుకురావాలనీ కోరారు. ఈ సూచనతో పదివేలకు పైగా పుస్తకాలు వచ్చాయి. వీటన్నింటినీ ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు పంపిణీ చేశారు. తెలంగాణ కొత్త గవర్నరుగా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌ ఇదే అంశాన్ని సూచించారు. అభినందించేందుకు వచ్చే ప్రతిఒక్కరూ పుస్తకాల్ని తీసుకురావాలని కోరారు. ఇలా వచ్చిన వాటిని పేద పిల్లలకు అందజేస్తానని ప్రకటించారు.

పుట్టినరోజున గిఫ్ట్‌ ఎ స్మైల్‌
నాయకుడి పుట్టిన రోజు అంటే చాలు.. శుభాకాంక్షల ప్రకటనలూ, బహుమతులూ, సన్మానాలూ, పుష్పగుచ్ఛాలతో అభిమానులు చేసే సందడి అంతాఇంత కాదు. ఒక్క రోజుకు మాత్రమే పనికొచ్చే వాటితో డబ్బు వృథా అవడం మినహాయించి ఎలాంటి
ఉపయోగమూ ఉండదు. వీటికి బదులు ఈ డబ్బును పేదలకు ఉపయోగపడేలా చూడాలనుకున్నారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌. జులై 24న తన పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరూ ప్రకటనలు ఇవ్వొద్దనీ, ఫ్లెక్సీల్నీ ఏర్పాటుచేయొద్దనీ, బహుమానాలూ, పుష్పగుచ్ఛాలూ తీసుకురాకుండా వాటి కోసం ఖర్చు చేసే డబ్బును పేదలకు ఉపయోగించాలనీ ట్విటర్‌లో కోరారు. ‘గిఫ్ట్‌ ఎ స్మైల్‌’ పేరిట చేసిన ఆయన ట్వీట్‌కూ మంచి స్పందనే వచ్చింది.

 

హైదరాబాద్‌లోని రాందేవ్‌ రావు మెమోరియల్‌ ట్రస్టు ఆస్పత్రికి అంబులెన్సు కొనుగోలుకు ఎమ్మెల్సీ కె.నవీన్‌రావు పది లక్షలు అందించారు. నగరంలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయడానికి మరో పది లక్షల రూపాయల్ని సైబరాబాద్‌ కమిషనర్‌కు అందజేశారు. శిరీష్‌ అనే ప్రవాసభారతీయుడు అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీకి పదిహేడు వేలు, మరో ప్రవాస భారతీయుడు కనపర్తి శశి నిశాంత్‌ క్యాన్సర్‌ ఫౌండేషనుకు ముప్ఫైఅయిదు వేలు విరాళంగా పంపించారు. మంత్రి కేటీఆర్‌ పిలుపుతో పలువురు అభిమానులు గిఫ్ట్‌ ఎ స్మైల్‌ పేరిట ఇప్పటికీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారు.

29 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.