close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇరుగు-పొరుగు

- గోగినేని మణి

దూరంగా కనిపిస్తున్న పచ్చని కొండల్ని చూస్తూ కారిడార్‌ చివరనున్న బాల్కనీలో నిలబడిన మాధవి ‘‘మీరేనా ఈ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిందీ?’’ అన్న ప్రశ్నకి పక్కకి తిరిగింది. తన పక్కనే నిలబడిన పెద్దావిడను చూసి చిరునవ్వుతో ‘‘అవునండీ, నిన్ననే వచ్చాం’’ అని బదులు చెప్పింది.

‘‘నా పేరు కామాక్షి. మీ ఎదురు ఫ్లాటే మాది. మేం కూడా నాలుగు నెలల క్రితమే ఇక్కడకు వచ్చాం. నేనూ రోజూ ఉదయమే ఓ రెండు నిమిషాలు ఇక్కడ నిలబడుతుంటా. అదిగో, ఆ ఇంట్లోని తాయారమ్మగారు ఆ సరికే పూజ పూర్తిచేసుకుని, పెరట్లోని తులసమ్మకి నీళ్ళు పోసి నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు చేస్తూంటారు. నేనూ ఇక్కడి నుండే తులసమ్మకి దండం పెట్టుకుంటాను’’ భక్తి భావనతో ఆవిడ కళ్ళు అరమోడ్పులయ్యాయి.

మాధవి అటువైపు చూస్తూ ‘‘అవును... తులసిమొక్కే కాదు... కూరగాయల మొక్కలతోనూ వాళ్ళ పెరడు చిన్నతోటలా చక్కగా ఉంది. తులసిమొక్కలో మనకి మేలుచేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయట. అందుకే... తులసిని పెంచటం, నీరు పోసి పూజించటం అనే అలవాటును మన పెద్దవాళ్ళు చేశారేమో! మేలుకి ప్రతిగా కృతజ్ఞత అనే పూజ్య భావాన్ని అలవరచాలన్నది వాళ్ళ ఉద్దేశ్యం కావచ్చు. నిజానికి పెద్దలేర్పరిచిన ప్రతీ ఆచారం వెనకా ఏదో ఒక మంచి ఆలోచనే ఉంటుంది’’ అంది.

ఆ మాటలు అంతగా రుచించనట్లుగా కొద్దిగా మొహం చిట్లించిన కామాక్షిని చూసి ‘మొదటి పరిచయంలోనే తను కొంచెం ఎక్కువగా మాట్లాడానా?’ అనుకుంది మాధవి.

అంతలో కామాక్షిగారి పక్క ఫ్లాటులో ఉండే ప్రమీల వాళ్ళ దగ్గరకు వచ్చింది. కామాక్షి వాళ్ళిద్దర్నీ పరిచయం చేసింది.

‘‘ఈ టైముకి వెళ్తే ఇక సాయంకాలమే ఆఫీసు నుండి ఇంటికి వస్తాను. ఆయన నాకంటే ఓ గంట ముందు వెళ్ళి, ఒక గంట ఆలస్యంగా వస్తారు. సాయంకాలం మీరిద్దరూ మా ఇంటికి రండి. టీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం’’ అని చెప్పి ప్రమీల వెళ్ళిపోయింది.

*

ఆ సాయంకాలం ప్రమీల వాళ్ళ అపార్ట్‌మెంట్లో ముగ్గురూ కూర్చుని తమతమ కుటుంబాల గురించి వివరాలు చెప్పుకున్నారు. కొత్తగా వచ్చి చేరిన మాధవికి కామాక్షి తమ ఇద్దరి కుటుంబాల వివరాలనూ చెప్పింది.

‘‘ప్రమీలావాళ్ళు రెండేళ్ళ క్రితమే ఈ ఫ్లాట్‌ కొనుక్కున్నారు. మేం మాత్రం నాలుగు నెలలక్రితం ఇక్కడకు అద్దెకు వచ్చాం. మునుపు మావారిదీ ఇప్పుడు మా అబ్బాయిదీ కూడా ట్రాన్స్‌ఫర్ల ఉద్యోగాలు కాదు కాబట్టి ఈ ఊళ్ళోనే మొదటినుండీ ఉంటున్నాం. మారే పని లేకుండా ఒక ఇంట్లోనే చాలా సంవత్సరాలు ఉన్నాం. ఇంటి ఓనర్లు దాన్ని పడగొట్టి మళ్ళీ కట్టించుకోవాలని చెబితే ఇంకో ఇంట్లోకి మారాం. ఇల్లు సౌకర్యంగానూ ఉంది, అద్దె కూడా తక్కువే. అయితే సమస్యేమిటంటే... ఇంటి ఓనర్లు పక్కనే ఉంటారు. వాళ్ళంతా దాదాగిరీ చేసేవాళ్ళని తర్వాత తెలిసింది మాకు. వాళ్ళతో ఏ విషయంలో కొంచెం తేడా వచ్చినా కర్రలూ కత్తులతోనే సమాధానం ఉంటుందని అర్థమైంది. భయపడుతూ బితుకుబితుకుమంటూ గడపటంకంటే ఆ ఇల్లు ఖాళీ చేయటమే మంచిదనుకుని ఈ ఫ్లాట్‌కి వచ్చాం. మావాళ్ళకి ఆఫీసులు కొంచెం దూరమే అయినా ప్రశాంతంగా ఉన్నాం. ప్రాణానికి నిశ్చింతగా ఉంది.’’ కామాక్షి మాటల్ని అంగీకరిస్తున్నట్లుగా మాధవి తల ఊపుతూ ‘‘ఆ మాట నిజమండీ, ఇరుగూ పొరుగూతో సఖ్యత లేకపోతే మాత్రం ప్రాణానికి సుఖం ఉండదు’’ అంది.

‘‘అద్దెకుండే మనబోటివాళ్ళకేముంది... ఉంటున్న ఇల్లు నచ్చకపోయినా, ఇంకో మంచిది దొరికినా మారిపోయే సౌకర్యం ఉంటుంది. ప్రమీలావాళ్ళు మాత్రం సర్దుకుపోవాల్సిందే!’’ ఛలోక్తిగా అంటూ నవ్వింది కామాక్షి.

‘‘నిజమేగానీ వాళ్ళకి సొంత ఇల్లనే మమకారం, ఎవరూ ఖాళీ చేయమనరనే నిశ్చింతా ఉంటాయిగా’’ మాధవీ చిరునవ్వుతో అంది. ప్రమీల లోపలకు వెళ్ళి తీపి, కారం తినుబండారాల్ని ప్లేట్లలో తెచ్చి అందించింది. ప్రమీల మాధవిని ‘‘మీరు... మునుపు... ఎక్కడ ఉండేవారు ఆంటీ?’’ అనడిగింది.

‘‘పదిహేనేళ్ళక్రితం మావారికి ఈ ఊరు ట్రాన్స్‌ఫరై వచ్చినప్పుడు పెద్ద స్థలంలో ఉన్న పెంకుటిల్లు అమ్మకానికి వచ్చింది. ధర అందుబాటులో ఉండేసరికి కొనుక్కున్నాం. అప్పటినుండీ ఈ ఊళ్ళోనే ఉండి, మావారి ఆఫీసు బ్రాంచీలకు మారుతూ ఆ ఇంట్లోనే ఉండగలిగాం. నేనూ దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో టీచరుగా చేస్తూ కిందటి సంవత్సరమే రిటైరయ్యాను.’’

‘‘మరి... ఆ ఇల్లు..?’’ ప్రమీల ప్రశ్నార్థకంగా చూసింది.

‘‘నాకు చాలా బాగుండేది. పెరటి గుమ్మానికి అటూ ఇటూ అరుగులుండేవి. పొద్దున్నే ఒక అరుగు మీద కత్తిపీట వేసుక్కూర్చుని వంటకి కూరగాయలు తరుగుతూనే, పెరట్లోని మొక్కలకి పాదులు చేస్తూ నీళ్ళు పెడుతూ తోటపని చేసే మావారితో కబుర్లు చెబుతూ ఇంట్లోకీ బయటకూ తిరుగుతుండేదాన్ని. హడావుడిగా పనిచేస్తున్నట్లుగా కాకుండా సరదాగా ఉండేది.

ఇక సాయంకాలాలు ఇంకో విధంగా ఉండేవి. ఇరుగుపొరుగు అమ్మాయిలు నలుగురైదుగురు బడి నుంచి చక్కగా స్నానాలు చేసి జడలు వేయించుకుని నా దగ్గరకు వచ్చేవారు. అప్పటికే కోసి ఉంచి మాలలు కట్టిన మల్లెలో జాజులో కనకాంబరాలనో అందరి జడల్లోనూ పెడితే, వాళ్ళకి ఎంత ఆనందమో..! తర్వాత కాసేపటికే కొంతమంది పిల్లలు పుస్తకాలతో ఇంటిముందు వరండాలో చేరి హోమ్‌వర్క్‌ చేసుకుంటూంటే, మావాడినీ వాళ్ళతోపాటే కూర్చోబెట్టి అందరికీ తెలియనివి చెబుతూనే రాత్రి వంట పూర్తిచేయటం... అలవాటుగా ఆయన ఎనిమిది గంటలకి రాగానే వాళ్ళంతా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవటం జరిగేది. అలా రోజంతా ఉరుకులూ పరుగులతో గడుస్తున్నట్లున్నా ఉత్సాహంగా ఉండేది’’ ఆ రోజుల జ్ఞాపకాలతో మాధవి కళ్ళు మెరిశాయి.

‘‘మరి... ఇప్పుడు... మీవారు...’’ అంటూ కామాక్షి మాధవివైపు ప్రశ్నార్థకంగా చూసింది. ‘‘ఆయన పోయి... రెండేళ్ళు దాటిందండీ’’ నిట్టూరుస్తూ జవాబు చెప్పింది.

మాధవివైపు ఒక క్షణం పరిశీలనగా చూసి ‘‘ఇప్పట్లో... అందరూ ఒకేలా ఉంటున్నారుగా, అందుకే తెలియక...’’ సంజాయిషీ ఇస్తున్నట్లుగా ఒక విధమైన నిట్టూర్పుతో కామాక్షి అంది. మాధవి నిర్లిప్తంగా తలూపి మౌనంగా ఉండిపోయింది.
ప్రమీల మాట కలుపుతూ ‘‘సొంతిల్లు కదా... ఎందుకు ఖాళీ చేశారాంటీ..?’’ అడిగింది.

‘‘ఇల్లు బాగా పాతబడటంతో ఏవో మరమ్మతులు వస్తూండటం, నేనొక్కదాన్నీ ఉండటం మా అబ్బాయికి భయంగా ఉంటోంది- అది ఒక కారణం. దాన్ని పడగొట్టి మోడ్రన్‌గా కట్టించే ఉద్దేశ్యం కూడా వాడికి ఉంది- అది ఇంకో కారణం. వాడి ఉద్యోగం ఉత్తరాదిలో. అలవాటైన ప్రాంతాన్ని వదిలి తన దగ్గరికి వెళ్ళటం నాకిష్టం లేకపోయింది. ఈ ఊళ్ళో బంధువులూ స్నేహితులూ చాలామందే ఉన్నారు. అందుకే ఇక్కడైతే కాలక్షేపం బావుంటుందని ఊరు మారకుండా ఇల్లు మారాను. పాత సామాను చాలా తీసేశాం. కొంచెం సామానే కాబట్టి ఇద్దరం కలిసి వెంటనే సర్దేసుకున్నాం. రాత్రి బండికే మావాడు జాబ్‌లో జాయినవ్వాలని వెళ్ళిపోయాడు’’ తన విశేషాలన్నీ మాధవి వివరంగా చెప్పింది.

‘‘మా ఊళ్ళో... మా నాన్నగారు మా నాన్నమ్మ గదిని ఒకవైపు పడగొట్టి కొంచెం పెద్దదిగా మారుస్తానని అంటే... మా నాన్నమ్మ ఇంటిని ఏవిధంగానూ మార్చటానికి వీల్లేదని పట్టుబట్టింది. మీ అబ్బాయి ఆలోచన తెలుసుకుని... అన్ని మంచి జ్ఞాపకాలున్న ఇంటిని ఖాళీ చేయటమంటే... మీరు నిజంగా గ్రేట్‌ ఆంటీ’’ ప్రశంసగా అంది ప్రమీల. మాధవి చిరునవ్వుతో చూసింది ‘‘అదేంకాదు, ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కోవిధంగా ఉంటాయి, అంతే! నా వరకూ జ్ఞాపకాలనేవి గుండెలో ఉంటాయిగానీ, గది గోడల్నే పట్టుకుని ఉంటాయని అనుకోను.’’

ఆ తర్వాత టీ తాగుతూ ముగ్గురూ మరికాసేపు కబుర్లు చెప్పుకున్నాక కామాక్షి, మాధవి తమతమ ఫ్లాట్స్‌లోకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి మాధవి తన కొడుకుతో ఫోనులో మాట్లాడుతూ ‘‘ఈ ఫ్లోర్‌లో ఉన్న మిగతా రెండు ఫ్లాట్స్‌ వాళ్ళతోనూ పరిచయం కలిగింది. మనకి సరిగ్గా ఎదురుగా ఉండే దానిలో కామాక్షిగారు ఉంటారు. ఆమె నాకంటే పెద్దావిడ. వాళ్ళిద్దరూ కొడుకూ కోడలూ మనవడితో ఉంటారు. ఆ పక్కదానిలో ఉండే ప్రమీల చిన్నమ్మాయి. వాళ్ళిద్దరే ఉంటారు. ఇంకా పిల్లల్లేరు. ఇద్దరూ ఉద్యోగస్థులే. కామాక్షిగారూ, ప్రమీలా చక్కగా పలుకరించారు. ఇక్కడ నాకు మంచి పొరుగు ఉంది కాబట్టి నేనొక్కదాన్నే ఉంటున్నాననే భయం నీకక్కర్లేదు. నిశ్చింతగా ఉండు’’ అని చెప్పింది.

*

ఆ ఆదివారం... తలుపు తీసి బయటకు వచ్చిన కామాక్షికి పుస్తకాలు చేతబట్టుకుని మాధవివాళ్ళ  ఇంటినుండి బయటకు వచ్చిన నలుగురైదుగురు పిల్లలు కనిపించారు. వాళ్ళ వెనకే వచ్చిన మాధవివైపు ‘ఎవరు వాళ్ళు’ అనడుగుతున్నట్లుగా చూసింది.

‘‘మునుపు మేం ఉండే వీధిలోని పిల్లలు. నన్ను చూడటానికి వస్తామని ఫోన్‌ చేస్తే పుస్తకాలు కూడా తెచ్చుకోమని నేనే చెప్పాను. కాసేపు కూర్చుని అర్థంకాని పాఠాలు చెప్పించుకుని వెళ్తున్నారు’’ మాధవి సమాధానం చెప్పింది.

‘‘అవునా...’’ అంటూ ఒక క్షణం ఆలోచనలోపడిన కామాక్షి తన మనసులోని మాటను బయటపెట్టింది. ‘‘మీరేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతా. మా అబ్బాయీ కోడలూ ఇద్దరూ ఉద్యోగస్థులేగా... మా మనవడి చదువు గురించి పట్టించుకునే తీరికా ఓపికా ఉండదు. ట్యూషన్‌కి పంపిద్దామంటే దగ్గర్లో ఎవరూ లేరు. మీకు కష్టం కాకపోతే...’’ అంటూ మధ్యలోనే ఆగిపోయింది.

‘‘నాకు అలవాటైన, ఇష్టమైన వ్యాపకమే కాబట్టి కష్టంగా అనిపించదు. నా వీలునుబట్టీ అవసరాన్నిబట్టీ సమయం చూసుకుని చెబుతాను. ఫీజు మాట మాత్రం ఎత్తకండి. నేనెవరి దగ్గర్నుండీ తీసుకోను’’ చిరునవ్వుతో అంది మాధవి.

కామాక్షి మొహం సంతృప్తితో వెలిగిపోయింది. ఆ సాయంకాలమే కామాక్షిగారి మనవడు గిరి తన పుస్తకాలన్నీ తీసుకుని మాధవి  దగ్గరకు వచ్చాడు.

అతనికి ఏ సబ్జెక్టు కష్టంగా ఉంటుందీ, ఎంతవరకూ పాఠాలు అయ్యాయీ లాంటి వివరాలన్నీ మాధవి అడిగి తెలుసుకుని, కాసేపు చదివించింది. రాత్రిపూట తొందరగా నిద్రపోయి మర్నాడు వేకువనే లేచే అలవాటుందని గిరి చెప్పటంతో, తనూ ఉదయమే లేస్తుంది కాబట్టి, ఆ సమయంలో చదువుకోవటం బావుంటుందనీ అప్పుడే రమ్మనీ మాధవి గిరికి చెప్పింది.

మాధవి మాటతీరూ పాఠంచెప్పే పద్ధతీ బాగా నచ్చటం వల్ల కాబోలు గిరి వేకువజామునే లేచి పుస్తకాలతో మాధవి దగ్గరకు రావటం మొదలుపెట్టాడు. వారం పదిరోజుల తర్వాత జరిగిన టెస్టులన్నిటిలో మంచి మార్కులు సంపాదించాడు. ఆ తర్వాత స్కూలులో జరిగిన వక్తృత్వ పోటీలో పాల్గొని బహుమతినీ పొందాడు. నాలుగురోజులు మాధవే తర్ఫీదునిచ్చింది. గిరి ఇంట్లో అంతా ఆనందించి, మాధవికి కృతజ్ఞతల్ని తెలియజేశారు.

ఒకరోజు మాధవి దగ్గర చదువుకుంటున్నప్పుడు గిరి మాటల మధ్య ‘‘మా నాన్నమ్మ- ప్రతీరోజూ నేను నిద్రలేచాక, మా అమ్మా నాన్నావాళ్ళు నిద్రపోతున్నా సరే- వాళ్ళ ముఖాల్నిగానీ, లేకపోతే దేవుడి పటాన్నిగానీ చూసి దండం పెట్టుకుని, అప్పుడు
చదువుకోవటానికి వెళ్ళమనీ ఎవర్నీ చూడకుండా నేరుగా మీ దగ్గరకు రావద్దనీ చెప్పింది. నేనేమో గురువు దైవంతో సమానమని అన్నారుగా... అందుకని ముందు మాధవి టీచర్‌కే నమస్కారం పెడతానని చెప్పాను’’ అంటూ నవ్వాడు.

‘కామాక్షిగారు- తన మనవడికి అలా ఎందుకు చెప్పారా?’ అని మాధవి ఒక క్షణం ఆలోచించింది కానీ అర్థంకాలేదు. ఆ తర్వాత నాలుగైదు రోజులకే అసలు సంగతి ఏమిటో ఆమెకి అర్థమైంది. సాయంకాలంపూట ప్రమీల ఆఫీసు నుండి వచ్చాక మాధవి ఆమెతో కలిసి దగ్గర్లోనే ఉన్న రైతుబజార్‌కి వెళ్ళొస్తుండగా మెట్లు ఎక్కుతున్నప్పుడు కింద ఫ్లోర్‌లో ఉండే ఉమాదేవి ప్రమీలను పలుకరించింది. ఆమె డెలివరీకి పుట్టింటికి వెళ్ళి ఆ ముందురోజే చంటిబిడ్డతో వచ్చింది. ప్రమీలా ఉమాదేవి ఇద్దరూ ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత ఉమాదేవి కొంచెం గొంతు తగ్గించి ఓ విషయం చెప్పింది.

‘‘ఈ ఉదయం కామాక్షిగారు మా పాపను చూడటానికి వచ్చినప్పుడు ఓ సంగతి చెప్పారు. వాళ్ళకి ఎదురుగా ఉండే ఫ్లాటు మా పిన్నత్తగారి బంధువులదే కదా... నన్ను వాళ్ళకి ఫోను చేసి, ఇల్లు ఒకరిద్దరైనా పిల్లలున్నవాళ్ళకి ఇస్తే బావుంటుంది కదాని చెప్పమన్నారు. పెద్దాయన- అదే బాబాయ్‌గారు పొద్దున్నే పేపరు తీసుకోవటానికని తలుపు తీసేసరికి ఎదురింట్లోని విధవావిడా పేపరు తీసుకుంటూ విష్‌ చేసిందట. ఆరోజు ఆయన బాత్‌రూమ్‌లో జారిపడ్డారట. మనవడేమో పొద్దున్నే ఆవిడ దగ్గరకు
ట్యూషన్‌కి వెళ్తాడట. స్కూలు గ్రౌండులో రెండుసార్లు కాళ్ళు విరగ్గొట్టుకున్నంత పనయిందట! అందుకే... వేరే ఎవరికైనా...’’

గడగడా చెప్పుకుపోతున్న ఉమాదేవి మాటలకు అడ్డుకట్టవేస్తూ ‘‘కామాక్షిగారి ఎదురు ఫ్లాట్‌లో ఉండే మాధవిగారు వీరే...’’ అని పరిచయం చేసేసరికి ఆవిడ తెల్లబోయింది.

మెల్లగా గొంతు పెగల్చుకుని ‘‘అలాగా... నేను చాన్నాళ్ళ తర్వాత నిన్ననే వచ్చాను గదా... అందుకే తెలియలేదు. మీ బంధువులేమో అనుకున్నాను’’ అంటూ తత్తరపడింది. మళ్ళీ మాధవివైపు చూస్తూ ‘‘కామాక్షిగారికి పక్కనే ఉంటారుగా, అందుకే ప్రమీలగారి చెవిన వేద్దామని ఆవిడ మాటల్ని చెప్పానుగానీ... నామటుకు నాకు... అలాంటి శకునాల నమ్మకాలేం లేవండీ. ఏదో మాట్లాడేశాను, ఏమీ అనుకోరుగా’’ అంది క్షమాపణ అడుగుతున్నట్లుగా.

మాధవి చిన్నగా నిట్టూర్చి చిరునవ్వుతో చూసింది. ‘‘ఫరవాలేదమ్మా, ఇందులో అనుకోవటానికేం ఉందీ! నేను చేసిన తప్పేమీ లేనప్పుడు ఎవరి మాటల్నీ పట్టించుకోవాల్సిన పనిలేదు.’’

ప్రమీలకి ఆవేశం వచ్చింది. ‘‘అన్నీ తెలిసిన పెద్దావిడ. అలా మాట్లాడటం ఏమిటీ!? ఎప్పుడూ అన్నిరోజులూ ఒకలాగే జరగవు. పెద్దాయన పట్టుతప్పి బాత్‌రూమ్‌లో జారిపడితేనూ, పిల్లాడు ఆటల్లో దెబ్బలు తగిలించుకుంటేనూ... శకునమే కారణమా..? మరి ఆ మనవడే మంచి మార్కులు సంపాదించినపుడూ బహుమతులు పట్టుకొచ్చినప్పుడూ... ఆ రోజుల సంగతేమిటి? నేను కామాక్షిగారిని అడుగుతాలెండి.’’

ఉమాదేవి వెళ్ళిపోయింది. ఇద్దరూ మెట్లెక్కి తమ ఫ్లోర్‌కి వచ్చారు. ‘‘కాసేపు కూర్చుని కాఫీ తాగి వెళ్దురుగాని రండి’’ అంటూ ప్రమీల మాధవిని తమ ప్లాట్‌లోకి తీసుకెళ్ళింది. రెండు నిమిషాల్లో కాఫీ కలిపి తీసుకువచ్చింది. మాటల మధ్య ప్రమీల మళ్ళీ ఆ ప్రసక్తి తీసుకువచ్చింది.

‘‘నాలుగురోజుల క్రితం కామాక్షిగారు నాతో ఓ మాట అన్నారు- ‘మన పెద్దలేర్పరిచిన ప్రతీ ఆచారం వెనుకా ఏదో ప్రయోజనకరమైన ఆలోచన ఉంటుందని మాధవి అంటుంది. మరి శకునాల సంగతేమిటీ అని అడగాలి’ అన్నారు. ఏదో తెలుసుకోవాలన్న ఆలోచనతో మాత్రమే అలా అన్నారని నేనూ అనుకున్నానుగానీ... ఇలాంటి నమ్మకం మనసులో ఉంచుకుని అలా మాట్లాడారని ఇప్పుడర్థమైంది.’’

‘‘అన్ని విషయాలూ నాకు తెలుసని నేనెపుడూ అనుకోను ప్రమీలా. కానీ, మనసును నొప్పించే కొన్ని ఆచారాల వెనుక, ఏ ఉద్దేశ్యం ఉందో ఆలోచనకి అందనప్పుడు... అలాంటి దురాచారాల్ని వదిలించుకోగలగాలి. ఒక్కోసారి- పెద్దలు ఏదో చెబితే, అది రూపాంతరం చెంది ఇంకోవిధంగా స్థిరపడిపోతుంది. సతీ సహగమనం రోజుల్నుంచీ అమానుషంగా అనిపించే కట్టుబాట్లనూ అలవాట్లనూ వదిలించుకుంటూ కొన్నింటిని పరిస్థితులకనుగుణంగా మార్చుకుంటూనూ వస్తున్నాం. కొందరిలో మాత్రం కొన్ని నమ్మకాలు అలాగే నిలబడిపోతుంటాయి. కాలం గడిచేకొద్దీ, జ్ఞానం పెరిగేకొద్దీ అయినా వాళ్ళలో మార్పు వస్తుందేమోనని ఎదురుచూడాలంతే. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి మరిచిపోదాం’’ అంది మాధవి ముగింపుగా.

*

ఆ మరుసటి రోజునుండీ ఉదయం కాకుండా, సాయంకాలం స్కూలు నుండి వచ్చాక వీలున్న సమయంలో వచ్చి చదువుకోమని గిరికి చెప్పింది మాధవి.

తర్వాత వారం రోజులకే ఆ ఫ్లాట్‌ ఖాళీచేసి మరొకదానిలోకి మారుతున్నట్లుగా మాధవి ప్రమీలకి చెప్పింది. అపుడే ఆఫీసు నుండి వచ్చి ఇంట్లో పనులు చేసుకుంటున్న ప్రమీల ఆ మాటలకి ఆశ్చర్యపోయింది.

‘‘చాలా సామాన్లు తీసేసి మా అబ్బాయి మేలు చేశాడు. అందువల్లే కష్టం లేకుండా కాసేపటిలోనే సామాన్లు సర్దుకోగలిగాను. మా బంధువుల అబ్బాయి వస్తే సామాన్లను పంపించేసి, నీకు చెప్పి వెళ్దామని ఉన్నాను’’ అంది మాధవి.

‘‘ఎందుకు ఖాళీ చేశారని మిమ్మల్ని అడగను. మీరు చెప్పకుండానే కారణం నాకు తెలుస్తూనే ఉంది. అయితే ఇలా చేయటం మాత్రం నాకస్సలు నచ్చలేదు ఆంటీ. ఇష్టంలేనివాళ్ళు వెళ్ళిపోవాలిగానీ మీరెందుకు ఖాళీ చేయాలీ..? వాళ్ళ మూర్ఖత్వాన్ని అంగీకరించి విలువ ఇచ్చినట్లుగా ఉండదూ..?’’ ఆవేశంగా అంది ప్రమీల.

మాధవి చిన్నగా నిట్టూర్చింది. ‘‘అందరి అన్ని అభిప్రాయాలూ మనకి నచ్చకపోవచ్చు. కొందరిలో బలంగా పాతుకుపోయిన నమ్మకాల్ని పెకలించటానికి... నాకు... మాటల బలం లేదు... చాలదు! అందుకే ఆమె వయసుకు గౌరవం ఇస్తూ నేనే ఖాళీ చేసేశాను. మా అబ్బాయి అభిప్రాయాన్ని మన్నించి సొంత ఇంటినే వదిలి వచ్చేసిన నాకు అద్దె ఇల్లు ఖాళీ చేయటంలో కష్టం ఏమీలేదు. ప్రమీలా, ఇంకోమాట కూడా చెప్పనా... మౌనంతో కోపాన్నీ దూరంగా జరిగి నిరసననీ తెలియజేయవచ్చని నేననుకుంటున్నాను.’’

మాధవికి వీడ్కోలు చెప్పి గుమ్మం బయటే నిలబడిన ప్రమీల వైపు అపుడే తలుపు తీసుకుని బయటకు వచ్చిన కామాక్షి విషయం ఏమిటన్నట్లుగా చూసింది. మాధవి ఫ్లాట్‌ ఖాళీచేసి వెళ్ళిన విషయాన్ని నిర్లిప్తంగా చెప్పింది ప్రమీల.

‘‘ఒక నెల అడ్వాన్స్‌ ఉండగానే, అది వదులుకుని మరీ ఇలా హఠాత్తుగా ఎందుకు ఖాళీ చేసినట్లు..?’’ అంటూ ఆమె ఆశ్చర్యపోయింది. ప్రమీల ఆవిడవైపు చురుగ్గా చూసింది.

‘‘మునుపు మీరుండే ఇల్లు సౌకర్యంగానే ఉన్నా పొరుగునే ఉండే ఇంటివాళ్ళ రౌడీయిజానికి భయపడి ఖాళీచేసి ఇక్కడికి వచ్చామని చెప్పారుగా... అలాగే ఇప్పుడు మాధవిగారు కూడా - కర్రలూ కత్తులకంటే మూఢనమ్మకాల మాటల దాడే ఎక్కువ బాధాకరం - అనుకుని ఇంకో ఫ్లాట్‌కి మారిపోయారేమోనని అనుకుంటున్నా..!’’

ఆ మాట చెప్పి వెంటనే ప్రమీల లోపలకు వెళ్ళిపోయింది. ప్రమీల మాటలతో, మొహం మీద చల్లటి నీళ్ళు కొట్టినట్లయి, నోటమాట లేక నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది కామాక్షి.

‘‘మా నాన్నమ్మ- ప్రతీరోజూ నేను నిద్రలేచాక, మా అమ్మా నాన్నావాళ్ళు నిద్రపోతున్నా సరే- వాళ్ళ ముఖాల్నిగానీ, లేకపోతే దేవుడి పటాన్నిగానీ చూసి దండం పెట్టుకుని, అప్పుడు చదువుకోవటానికి వెళ్ళమనీ ఎవర్నీ చూడకుండా నేరుగా మీ దగ్గరకు రావద్దనీ చెప్పింది. నేనేమో గురువు దైవంతో సమానమని అన్నారుగా... అందుకని ముందు మాధవి టీచర్‌కే నమస్కారం పెడతానని చెప్పాను’’ అంటూ నవ్వాడు.

‘‘ఎందుకు ఖాళీ చేశారని మిమ్మల్ని అడగను. మీరు చెప్పకుండానే కారణం నాకు తెలుస్తూనే ఉంది. అయితే ఇలా చేయటం మాత్రం నాకస్సలు నచ్చలేదు ఆంటీ. ఇష్టంలేనివాళ్ళు వెళ్ళిపోవాలిగానీ మీరెందుకు ఖాళీ చేయాలీ..? వాళ్ళ మూర్ఖత్వాన్ని అంగీకరించి విలువ ఇచ్చినట్లుగా ఉండదూ..?’’ ఆవేశంగా అంది ప్రమీల.

29 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.