close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐఐటీ అందరి సొత్తు!

ఐఐటీ అందరి సొత్తు!

ఐ... ఐ... టీ... ఈ మూడక్షరాల బోర్డున్న కాలేజీలో చదవాలని ప్రతి విద్యార్థీ తపిస్తాడు. కోట్లు ఖర్చుపెట్టినా దిగిరాని ఆ సీటు, ప్రతిభకు మాత్రమే దాసోహమంటుంది. ఆ ప్రతిభ ఉన్నా, ఖరీదైన కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి దానికి మెరుగులు దిద్దుకోలేని నిరుపేద విద్యార్థులకు, నిన్నమొన్నటి దాకా ఐఐటీ కల అందని ద్రాక్షే. కొందరు దయగల మేధావుల నిర్ణయం ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిని మారుస్తోంది. లక్షలు పోసి శిక్షణ తీసుకునే అవసరం లేకుండానే పేద విద్యార్థుల పేరు పక్కన ఐఐటీ అక్షరాల్ని చేరుస్తోంది.

రోజూ పదహారు గంటలపాటు చదివే పిల్లలు చాలామంది ఉంటారు. కానీ వాళ్లంతా టాపర్లు కాలేరు. పిల్లల చదువు కోసం సర్వం త్యాగం చేసే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. కానీ వాళ్లందరి బిడ్డలూ ఆ అంచనాల్ని అందుకోలేరు. తమ విద్యార్థులే అన్నింట్లో ముందుండాలని ఉపాధ్యాయులంతా తపన పడతారు. కానీ అందరు విద్యార్థులూ ఆ కోరికని తీర్చలేరు. కాస్త కష్టపడితే ఎవరైనా పరీక్షలో పాసవ్వొచ్చు. కానీ టాపర్లుగా మారాలన్నా, ర్యాంకర్లుగా నిలవాలన్నా, అత్యున్నత విద్యాసంస్థల్లో చదవాలన్నా విద్యార్థుల క¹ష్టానికి కాసులూ తోడవ్వాలి. ఉత్తమ కోచింగ్‌ సెంటర్ల శిక్షణా ఆసరాగా మారాలి. అన్నింటికంటే ముఖ్యంగా తమ కుటుంబ పరిస్థితుల్ని మరచిపోయి, ఐఐటీలు ఏ ఒక్కరి సొత్తో కాదనీ, కసి ఉంటే ఎవరైనా ఎక్కడైనా సీటు సాధించగలరనే నమ్మకాన్ని వాళ్లకు కల్పించాలి. బిహార్‌లో సూపర్‌ 30, కశ్మీర్‌లో రైజ్‌, పుణెలో దక్షణ, ముంబైలో అవంతి లాంటి ఎన్నో శిక్షణా కేంద్రాలు అదే పనిచేస్తున్నాయి. రైతు కూలీల పిల్లల్ని జాతీయ స్థాయి టాపర్లుగా మారుస్తున్నాయి. గిరిజన విద్యార్థులను దిల్లీ విద్యాసంస్థలవైపు నడిపిస్తున్నాయి. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్లని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి... అదీ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా!

ఆ శిక్షణా కేంద్రాల ప్రభావం దేశ విద్యారంగ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. నిన్నమొన్నటి దాకా జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో గ్రామీణ విద్యార్థుల సంఖ్య మూడు శాతంలోపే ఉండేది. కానీ రెండు మూడేళ్లుగా ఆ పరిస్థితి అనూహ్యంగా మెరుగైంది. శిక్షణా కేంద్రాల పుణ్యమా అని వేలాది గ్రామీణ పేద, మధ్య తరగతి విద్యార్థులు ఐఐటీ, ఐఐఎంల్లాంటి జాతీయ విద్యా సంస్థల తలుపు తట్టారు. వాళ్లలో తొంభై శాతం తమతమ కుటుంబాల నుంచి తొలిసారి పదో తరగతి దాటొచ్చిన వాళ్లే. ఉన్నత చదువుల విలువ తెలియనీ, తెలిసినా స్తోమత లేక చదివించలేని తల్లిదండ్రుల పిల్లలే. అలాంటి వాళ్లని ఎంపిక చేసుకొని ఆణిముత్యాల్లా తయారు చేస్తూ కొత్త తరానికి స్ఫూర్తినిస్తున్న శిక్షణా కేంద్రాలెన్నో.

నిజంగా ‘సూపర్‌’ 30లు...
దిల్లీలోని ఎలైవ్‌ టెక్నాలజీస్‌... మధ్య తరగతి ఇళ్లల్లో వినియోగానికి అనువైన రోబోటిక్‌ పరికరాల్ని తయారు చేసే సంస్థ అది. అనేక పోటీల్లో అత్యుత్తమ స్టార్టప్‌గా నిలిచి, పెద్ద సంస్థగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. ఆ కంపెనీని స్థాపించింది, సీయీవోగా దాన్ని నడిపిస్తోందీ పూనమ్‌ గుప్తా అనే ఒక అమ్మాయి. సపూనమ్‌ జీవితంలో రెండేళ్లు వెనక్కి వెళ్తే... ఖరగ్‌పూర్‌ ఐఐటీ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తెలివైన విద్యార్థుల్లో ఆమె ఒకరు. కాలేజీ తరఫున ఎన్నో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ పోటీల్లో ఆమె ఐడియాలకు అవార్డుల వర్షం కురిసింది. పబ్లిక్‌ స్పీకర్‌గా, జూనియర్‌ విద్యార్థులకు మెంటార్‌గా ఆ ఐఐటీలో ఆమె ఒక సూపర్‌ స్టార్‌.

పూనమ్‌ జీవితంలో మరో ఆరేళ్లు వెనక్కి వెళ్తే... దిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలో ఓ అద్దె గదిలో ఆమె కుటుంబం నివాసం ఉండేది. ఎదుగూబొదుగూ లేని చిన్న ప్రైవేటు ఉద్యోగం ఆమె తండ్రిది. ఆరుగురు సభ్యులున్న కుటుంబాన్ని పోషించడానికే ఆయన నానా తిప్పలు పడేవాడు. ఆడపిల్ల చదివి ఎవరిని ఉద్ధరించాలని తల్లి పూనమ్‌ని నిత్యం నిరుత్సాహపరిచేది. ఇంటి పనులూ, ఆర్థిక సమస్యలూ ఆమె చదువుకి అడుగడుగునా అడ్డుతగిలేవి. వాటికి తోడు అమ్మాయికి త్వరగా పెళ్లి చేసేయమని తల్లిదండ్రులకు బంధువులిచ్చే సలహాలు ఆమె కలల్ని మరింత నీరుగార్చేవి. ఐఐటీలో సీటు సాధించాలనీ, తన కుటుంబానికి మంచి భవిష్యత్తునివ్వాలనీ పూనమ్‌ పడే ఆరాటం ఎవరికీ అర్థమయ్యేది కాదు. చివరికి పూనమ్‌ కూడా భవిష్యత్తుపైన ఆశలు వదులుకుని పెళ్లికి సిద్ధమయ్యే సమయంలో చీకట్లో కాంతిరేఖలా ఆమెకు ‘దిల్లీ సూపర్‌ 30’ గురించి తెలిసింది. ప్రతిభ ఉండీ డబ్బులేని పేద విద్యార్థులను ఉచితంగా ఐఐటీ ప్రవేశ పరీక్షకు సన్నద్ధం చేసే సంస్థ అది. చదువు విషయంలో తిరుగులేని పూనమ్‌కి సూపర్‌30లో సులువుగా సీటొచ్చింది. ఆపైన ఖరగ్‌పూర్‌ ఐఐటీకి ఎంపికై పూనమ్‌ తన కలను నిజం చేసుకుంది. ఇప్పుడు తన సొంత సంస్థని నెలకొల్పి భవిష్యత్తులో వందలాది మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో అడుగేస్తోంది.

దిల్లీ సూపర్‌ 30 లేకపోతే పూనమ్‌ ఎవరో ప్రపంచానికి తెలిసేది కాదు. ఆమె ఓ సంస్థని స్థాపించి ఇతరులకు ఉద్యోగాల్ని ఇచ్చుండేది కాదు. ఆమె స్ఫూర్తితో మరింత మంది పేదలు ఐఐటీ కలలు కనేవాళ్లూ కాదు. ఆ కోచింగ్‌ సెంటర్‌ పుణ్యమా అని ఏటా పూనమ్‌లాంటి ఎందరో పేద విద్యార్థులు ఐఐటీల గడప తొక్కుతున్నారు.

గెయిల్‌ సూపర్‌ 30-కాన్పూర్‌, ఆకాంక్షా సూపర్‌ 30-ఉత్తరాఖండ్‌, వేదాంతా సూపర్‌ 30-జైపూర్‌, అభయానంద్‌ సూపర్‌ 30-థానే, ఆయిల్‌ ఇండియా సూపర్‌ 30-అసోం... ఇలా సూపర్‌ 30ల పేరుతో దేశవ్యాప్తంగా పదమూడు ఐఐటీ శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఫలితాల విషయంలో నిజంగానే ఇవి వేటికవే సూపర్‌ అనిపించుకుంటున్నాయి. గత ఏడేళ్లలో వీటిలో ఉచితంగా శిక్షణ తీసుకున్న 550కి పైగా విద్యార్థులు దేశంలోని వివిధ ఐఐటీలకు ఎంపికయ్యారు. కాన్పూర్‌లో 96లో 70మంది, జోధ్‌పూర్‌లో 30లో29 మంది, జోర్హట్‌లో 22కి 22మంది, డెహ్రాడూన్‌లో 27లో 21మంది... ఇలా ఈ ఏడాది సూపర్‌ 30ల విద్యార్థులు ఐఐటీ సీట్లలో ఎక్కువ వాటా దక్కించుకున్నారు. వీళ్లంతా పేద, అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్లే. చదువుకు ఏమాత్రం ప్రోత్సాహంలేని నేపథ్యమున్న కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే. కఠినమైన ప్రవేశ పరీక్షలో వేలాది మందిని దాటుకొని సూపర్‌ 30ల గడప తొక్కిన వాళ్లే.

 సూపర్‌ 30ల్లో ప్రవేశానికి ప్రతిభ తొలి అర్హత. పేదరికం రెండో అర్హత. సామాన్యులకూ అత్యున్నత విద్యను చేరువ చేయాలన్న మహోన్నత లక్ష్యంతో ఇవి ఏర్పడ్డాయి. అందుకే ఎంత ప్రతిభావంతులైనా సంపన్నుల పిల్లలకు వీటిలో చోటు లేదు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల కుటుంబ నేపథ్యాన్ని అంచనా వేయడానికి వాళ్లకి మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. తరవాత వారి ఇళ్లను పరిశీలించి, ఆర్థిక స్థితిగతులపైన ఓ అభిప్రాయానికి వచ్చాకే శిక్షణకు ఎంపిక చేస్తారు. ఒక్కసారి సూపర్‌ 30లో అడుగుపెట్టాక, ఐఐటీ ప్రవేశ పరీక్ష పూర్తయ్యే వరకూ విద్యార్థుల బాధ్యతంతా ఆ సంస్థలదే. భోజనం, వసతి, పుస్తకాల లాంటి అన్ని సౌకర్యాలనూ సంస్థలే చూసుకుంటాయి. వీటన్నింటికీ ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ, గెయిల్‌ లాంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు సూపర్‌ 30ల నిర్వహణకు సాయం చేస్తున్నాయి. వాటికి ఇతర కార్పొరేట్‌ సంస్థల సహకారమూ తోడవడంతో ఎలాంటి అడ్డంకీ లేకుండా కొనసాగుతున్నాయి.

 

అన్ని సూపర్‌ 30 సంస్థలూ నిలకడగా ఒకే తరహా ఫలితాల్ని సాధించడానికి కారణం వాటి మధ్య ఉన్న సారూప్యతే. ఈ సంస్థలన్నింటికీ అభయానంద్‌ అనే రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అకడమిక్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు ఆయనే స్వయంగా ఫిజిక్స్‌ పాఠాలూ చెబుతున్నారు. ఆయన సూచనల ప్రకారమే సిలబస్‌ రూపకల్పనా, టీచర్ల ఎంపికా జరుగుతుంది. అందరికీ ఒకే తరహా శిక్షణ అందాలంటే, అందరికీ ఒక్కరే పాఠాలు చెప్పడం ఉత్తమం. అందుకే ఇక్కడ చాలా మంది ఉపాధ్యాయులు వంతుల వారీగా ఇతర రాష్ట్రాల్లోని సూపర్‌ 30 కేంద్రాలకీ వెళ్లొస్తూ పాఠాలు చెబుతున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు వ్యక్తులు వీటిని నడిపిస్తున్నా, ‘సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ లెర్నింగ్‌’ అనే సంస్థ వీటన్నింటి మధ్య వారధిలా మారింది. అన్ని సూపర్‌ 30లనూ సమన్వయపరుస్తూ ఒకే తరహా శిక్షణా, ఒకేలాంటి ఫలితాలూ దక్కేలా చూస్తోంది.

 

రహ్‌మానీ సూపర్‌-30...
అభయానంద్‌ మార్గదర్శనంలోనే ఇదీ పనిచేస్తోంది. కాకపోతే ఈ కేంద్రాల్లో కేవలం ముస్లిం విద్యార్థులకు మాత్రమే ప్రవేశం. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ముస్లిం విద్యార్థుల శాతం తక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. బిహార్‌లాంటి వెనకబడిన రాష్ట్రాల్లో ఆ సంఖ్య నామమాత్రమే. ఆ పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశంతో తొమ్మిదేళ్ల క్రితం హజ్రత్‌ మౌలానా రహమానీ అనే విద్యావేత్త దాన్ని మొదలుపెట్టాడు. ఆపైన కొందరు ఔత్సాహికులు ఆయనతో కలిసి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ఔరంగాబాద్‌లకూ దాన్ని విస్తరించారు. అర్హతగల ముస్లిం విద్యార్థులను ఎంపిక చేసి వాళ్లకు ఉచిత శిక్షణ, వసతి సౌకర్యాలతో పాటు స్కాలర్‌షిప్‌నీ అందిస్తున్నారు. తొమ్మిదేళ్లలో ‘రహ్‌మానీ సూపర్‌ 30’ల నుంచి 213మంది ఐఐటీలకు ఎంపికవడం, ఈ ఒక్క ఏడాదే 75మంది ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో ర్యాంకులు సాధించడం, ఆ సంస్థ అంకిత భావానికి నిదర్శనం.

కశ్మీర్‌లో ‘రైజ్‌’
నిత్యం తుపాకుల చప్పుళ్లూ, బాంబు పేలుళ్లూ, అంతర్గత అల్లర్లతో ఉక్కిరిబిక్కిరయ్యే రాష్ట్రం జమ్మూ కశ్మీర్‌. నాసిరకమైన విద్యాప్రమాణాలకు అది పెట్టింది పేరు. అలాంటి ప్రాంతంలోనూ ఐఐటీ కుసుమాలను విరబూయిస్తోంది ‘రైజ్‌’ అనే సంస్థ. ముంబై ఐఐటీలో చదువుకున్న ముబీన్‌ అనే కుర్రాడు దీని వ్యవస్థాపకుడు. అతడి బ్యాచ్‌లో కశ్మీర్‌ నుంచి ఐఐటీకి ఎంపికైంది ముబీన్‌ ఒక్కడే. ఆ పరిస్థితిని మార్చేందుకూ, సొంత రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో ఐఐటీయన్లను తయారు చేసేందుకూ, కార్పొరేట్‌ రంగాన్ని వదిలిపెట్టి రైజ్‌కి ప్రాణం పోశాడు. అతడి లక్ష్యానికి ముచ్చటపడి మరో ఇద్దరు ఐఐటీ స్నేహితులూ ముబీన్‌కి తోడయ్యారు. నాలుగేళ్ల క్రితం యాబై మందికి ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇస్తే, అందులో నుంచి నలుగురు ఐఐటీలకూ, నలబై మంది ఎన్‌ఐటీలకూ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా 150మందికి పైగా విద్యార్థులు రైజ్‌ చొరవతో ఐఐటీలూ, ఎన్‌ఐటీలలో సీట్లు దక్కించుకున్నారు. ప్రస్తుతం యాభై శాతం మందికి ఉచితంగా, మిగతా వారికి నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇస్తున్న రైజ్‌, అందరికీ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నిధుల వేట కొనసాగిస్తోంది.

కశ్మీర్‌లో పరిస్థితులు మారాలంటే ముందు విద్యా ప్రమాణాలు మెరుగవ్వాలని అక్కడి ఆర్మీ అధికారులూ అర్థం చేసుకున్నారు. అందుకే తెలివైన విద్యార్థులను జాతీయ విద్యా సంస్థల వైపు నడిపించేందుకు ‘ఆర్మీ సూపర్‌ 40’ అనే సంస్థకు శ్రీకారం చుట్టారు. పెట్రోనెట్‌ అనే ప్రభుత్వ రంగ సంస్థ సహకారంతో గతేడాది నలబై మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి శ్రీనగర్‌లో శిక్షణ ఇచ్చారు. వాళ్లలో ఈ ఏడాది తొమ్మిది మంది ఐఐటీలకూ, 19మంది ఎన్‌ఐటీలకూ ఎంపికై తల్లిదండ్రులతో పాటు ఆర్మీ అధికారులూ గర్వపడేలా చేశారు.

దేశమంతా ‘అవంతి’
వజ్రాల్ని వజ్రాలే సానబెట్టాలంటారు. అందుకే ఐఐటీ ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులకు ఐఐటీయన్లతోనే ఇద్దరు కుర్రాళ్లు శిక్షణ ఇప్పిస్తున్నారు. అజయ్‌, రామ్‌ కుమార్‌ అనే ఐఐటీ పూర్వ విద్యార్థులు ఏడేళ్ల క్రితం ‘అవంతి’ అనే సంస్థకు ప్రాణం పోశారు. హైస్కూల్‌ కాలేజీ దశలోనే ప్రతిభా వంతులైన విద్యార్థుల్ని ఎంపిక చేసి, వాళ్లని అప్పట్నుంచే ఐఐటీలకు సన్నద్ధం చేయాలన్నది ఆ కుర్రాళ్ల ఆలోచన. వాళ్ల కల ఫలించి అవంతీ సాయంతో ఇప్పుడు ఏటా ఎంతోమంది విద్యార్థులు ఐఐటీల్లో అడుగుపెడుతున్నారు. పదకొండు రాష్ట్రాల్లోని ఇరవై నగరాల్లో ఉన్న అవంతీ శిక్షణ కేంద్రాల్లో పాఠాలు చెప్పేవాళ్లంతా ఐఐటీ పూర్వ విద్యార్థులే. పేద విద్యార్థులను ఐఐటీయన్లుగా మార్చాలన్న మంచి లక్ష్యంతో కార్పొరేట్‌ ఉద్యోగాలను వదిలేసి, వాళ్లంతా తక్కువ జీతాలకే అవంతీలో పనిచేస్తున్నారు. డబ్బుకంటే విద్యార్థుల జీవితాల్లో మార్పే ముఖ్యమని చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలలకు ‘దక్షణ’
పేదరికాన్ని పారదోలే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నది మోనీష్‌ పెబ్రాయ్‌ అనే ఎన్నారై నమ్మకం. అందుకే సమాజంలో అత్యంత పేదలను అత్యున్నత విద్యావంతులుగా మార్చేందుకూ, వాళ్ల కుటుంబాలను తరతరాల దారిద్య్రం నుంచి బయట పడేసేందుకూ కోట్ల రూపాయలను ఆయన ఖర్చు చేస్తున్నాడు. పదేళ్ల క్రితం తన ఆస్తిలో కొంత భాగాన్ని కేటాయిస్తూ భార్య హరినా కపూర్‌తో కలిసి ‘దక్షణ ఫౌండేషన్‌’ను నెలకొల్పాడు. దేశవ్యాప్తంగా ఉన్న ఐదొందలకు పైగా జవహర్‌ నవోదయా ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా పరీక్షని నిర్వహించి, ప్రతిభగల విద్యార్థులను దక్షణ ఫౌండేషన్‌ ఎంపిక చేస్తోంది. ఆపైన రెండేళ్ల పాటు తన భాగస్వామ్య సంస్థలతో కలిసి భోజన, వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు, విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ శిక్షణా ఇప్పిస్తోంది. అలా శిక్షణ పొందిన 447మంది దక్షణ విద్యార్థుల్లో ఈ ఏడాది ఏకంగా 389మంది ఐఐటీల్లో చేరడానికి అర్హత సాధించారు. గతేడాది ఆ సంఖ్య 233. ఒక్క పుణె శాఖ నుంచే ఈ ఏడాది 69 మంది ఐఐటీ జేఈఈ పరీక్ష రాస్తే అందులో 67మంది సఫలమయ్యారు. మొత్తంగా పదేళ్లలో రెండు వేలకు పైగా ఐఐటీయన్లను ‘దక్షణ’ దేశానికి అందించింది.

* * *

ప్రపంచంలో అతిపెద్ద పేదరిక నిర్మూలనా కార్యక్రమం అంటే అందరికీ అత్యున్నత విద్య అందించడమే అని బరాక్‌ ఒబామా అంటాడు. ఒక ఉపాధ్యాయుడూ, ఒక విద్యార్థీ, ఒక పుస్తకం, ఒక పెన్నూ చాలు, ప్రపంచాన్ని మార్చడానికి అని మలాలా చెబుతుంది. అత్యున్నత చదువులు అందని ద్రాక్షలా మిగలకూడదు, అందరి హక్కులా మారాలి అని వారెన్‌ బఫెట్‌ ఉటంకిస్తాడు. ఆ మేధావులు చెప్పిన మాటల్ని ఈ శిక్షణా కేంద్రాలు ఆచరణలో పెడుతున్నాయి. ఇప్పటికే వీటి దయ వల్ల ఎన్నో కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. రాష్ట్రం దాటని విద్యార్థులు విదేశాల్లో స్థిరపడ్డారు. తిండికి కష్టపడే పరిస్థితి నుంచి నలుగురికి సాయపడే స్థాయికొచ్చారు.

విద్యార్థులకు సాయపడటంతో పాటు, వాళ్లూ భవిష్యత్తులో తమలాంటి ఇంకొందరి జీవితాలనూ బాగుచేయాలన్నదే ఆ ఉచిత శిక్షణ ఉద్దేశం. సంస్థలు పెట్టి ఇతరులకు ఉద్యోగాలిచ్చినా సరే, తమ సంపాదనతో కొందరిని చదివించినా సరే, కనీసం తమ విజయాల్ని వివరిస్తూ ఇతరుల్లో స్ఫూర్తి నింపినా సరే... ఒక దీపం మరో వంద దీపాల్ని వెలిగించినప్పుడే దానికి సార్థకతా, ఆ తొలి దీపాన్ని వెలిగించిన వాళ్లకు సంతృప్తి!


అంకెల్లో ఐఐటీ

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల సంఖ్య : 23
అందుబాటులో ఉన్న ఐఐటీ సీట్లు : దాదాపు 11వేలు
ఏటా పరీక్ష రాస్తున్న విద్యార్థులు : దాదాపు 14లక్షలు


ప్రాంగణ ఎంపికల్లో అత్యధిక జీతం పొందిన ఐఐటీయన్లు:

ఐఐటీ బాంబే విద్యార్థిని ఆస్తా అగర్వాల్‌ - ఏడాదికి రూ.2కోట్లు - ఫేస్‌బుక్‌లో;
ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థి అభిషేక్‌ పంత్‌ - ఏడాదికి రూ.2కోట్లు- గూగుల్‌లో;
ఐఐటీ పాట్నా విద్యార్థి అశుతోష్‌ - ఏడాదికి రూ.1.8కోట్లు- గూగుల్‌లో


సూపర్‌ ఆనంద్‌

దేశంలో ఇప్పటిదాకా వెలసిన ఉచిత ఐఐటీ శిక్షణా కేంద్రాలకు స్ఫూర్తినిచ్చిందీ, ఈ ఉచిత సంస్కృతికి పునాది వేసిందీ ఆనంద్‌ కుమార్‌ అనే గణితశాస్త్ర నిపుణుడు. ఐఐటీ శిక్షకుడిగా ఆయన సాధించిన విజయాలూ, పాట్నాలో ఆయన నెలకొల్పిన సూపర్‌ 30 సృష్టించిన సంచలనాలూ అన్నీ ఇన్నీ కావు. పదిహేనేళ్ల క్రితం తన ఇంట్లో, సొంత ఖర్చులతో ఆనంద్‌ ఈ ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టాడు. ఏటికేడు అతడి విద్యార్థులు సాధిస్తోన్న విజయాలు భారతీయులతో పాటు ఇతర దేశస్థులనూ ఆశ్చర్యంలో పడేస్తున్నాయి. ప్రపంచంలోనే కఠినమైన పరీక్షగా ఐఐటీ ఎంట్రెన్సుకు పేరుంది. అలాంటి పరీక్షలో అంత అలవోకగా ఎలా విజయం సాధిస్తున్నాడో పరిశీలించడానికి జపాన్‌, దక్షిణ కొరియా ప్రొఫెసర్లు సైతం ఆనంద్‌ సూపర్‌ 30ని సందర్శించారు. దేశంలో ఏ ఉచిత ఐఐటీ శిక్షణా కేంద్ర నిర్వాహకుడిని కదిపినా, తనకు ప్రేరణ ఆనందేనని చెబుతాడు. పదిహేనేళ్లలో ఆనంద్‌ 396మంది ఐఐటీయన్లను తయారు చేశాడు. ఈ ఏడాది అతడి విద్యార్థులు 30మందీ జాతీయ స్థాయి టాపర్లుగా నిలిచారు. ప్రపంచమంతా ఆనంద్‌ని పొగడ్తలతో ముంచేస్తుంటే, అతడు మాత్రం తన విద్యార్థుల శ్రమా, అంకిత భావంతోనే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని వినమ్రంగా చెబుతాడు.


ఐపీఎస్‌-ఐఐటీ

మనసుంటే ఇతరులకు సాయపడటానికి మార్గముంటుందని జార్ఖండ్‌కి చెందిన ఖండేల్వాల్‌ అనే ఐపీఎస్‌ అధికారి నిరూపించాడు. ఆ రాష్ట్ర రవాణా పౌరవిమానయాన శాఖకు సెక్రటరీగా ఉన్న ఖండేల్వాల్‌కు బోధన అంటే ఆసక్తి. తన విజ్ఞానం పేద పిల్లలకు సాయపడాలన్న ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ఇంటి దగ్గర ఒక రాత పరీక్షను నిర్వహించి ఆరుగురు పేద ప్రతిభావంతులను ఎంపిక చేసుకున్నాడు. ప్రభుత్వ అధికారిగా బిజీగా ఉంటూనే సాయంత్రాలూ, వారాంతాల్లో ఆ పిల్లలకు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ పాఠాలు చెబుతూ వచ్చాడు. ఐఐటీ ప్రవేశ పరీక్షకు ముందు కొన్నాళ్లు ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఆ శిక్షణ కొనసాగించాడు. ఆ కష్టం ఫలించింది. అతడి లక్ష్యం నెరవేరింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఖండేల్వాల్‌ దగ్గర చదువుకున్న ఆరుగురు విద్యార్థులూ ఐఐటీలకు ఎంపికయ్యారు. అలా ఐపీఎస్‌ అధికారిగానే కాకుండా అధ్యాపకుడిగానూ మారి దేశ సేవకు కొత్త దారి చూపించాడు ఖండేల్వాల్‌.


ప్రభుత్వాలూ స్పందిస్తున్నాయి

పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మనసున్న మేధావులే కాదు, కొన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. అందులో వెనకబడ్డ రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌ ముందుంది. ఈ ఏడాది అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే కొందరు వెనకబడిన వర్గాలకు చెందిన పిల్లలను ఎంపిక చేసి ఐఐటీలకు సన్నద్ధం చేసింది. వాళ్లలో ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది 55మంది ఐఐటీల్లో అడుగుపెట్టడానికి అర్హత పొందారు. బిహార్‌ ప్రభుత్వం కూడా తాము ఎంపిక చేసిన పిల్లలకి శిక్షణ ఇవ్వడానికి సూపర్‌ 30ల సాయం తీసుకుంటోంది. సంపన్నుల పిల్లలని ఉన్నత చదువులు చదివించడానికి తల్లిదండ్రులుంటారు, కానీ పేద పిల్లల విషయంలో మాత్రం ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని వాళ్లు నమ్మబట్టే ఆ చొరవ సాధ్యమవుతోంది.


ఐఐటీలే ఎందుకంటే...

1950లో ఖరగ్‌పూర్‌లో తొలిసారిగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని నెలకొల్పినప్పుడు దేశంలో పారిశ్రామిక ప్రగతికి సాయపడే పదునైన ఇంజినీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండేది. రానురానూ ఐఐటీల సంఖ్య పెరుగుతూ వచ్చినా, ఆ విద్యాసంస్థలన్నీ నేరుగా రాష్ట్రపతి అధీనంలో ఉండటంతో వాటి విద్యా ప్రమాణాల్లో నాణ్యత మాత్రం తగ్గలేదు. దాంతో పరిశ్రమలూ, ఐటీ కంపెనీలూ ఐఐటీల్లో చదివిన విద్యార్థులకే ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయి. క్రమంగా విదేశీ సంస్థలకూ దేశ ఐఐటీలపైన గురి కుదిరింది. దాంతో కోట్ల రూపాయల వార్షిక జీతాలు ప్రకటించి ఇక్కడి ఐఐటీల్లో చదువుకున్న వాళ్లను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. ఇతర ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పోలిస్తే ఐఐటీల్లో చదువుకున్న విద్యార్థి కనీసం అరవై శాతం ఎక్కువ జీతంతో కెరీర్‌ను మొదలుపెడుతున్నాడని సర్వేలు చెబుతున్నాయి. వీటికి తోడు గత పదిహేనేళ్లుగా దేశంలో మధ్య తరగతి కుటుంబాల సంఖ్యా భారీగా పెరగడంతో, సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి ఐఐటీ చదువులే మార్గమన్న భావన వాళ్లలో నాటుకుపోయింది. సుందర్‌ పిచాయ్‌, ఆర్‌.నారాయణ మూర్తి, సచిన్‌ బన్సాల్‌-బిన్నీ బన్సాల్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, నందన్‌నీలేకని, జైరామ్‌ రమేష్‌, మనోహర్‌ పారికర్‌ లాంటి ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు ఐఐటీల పూర్వ విద్యార్థులే. అలాంటి వాళ్లందరి విజయాల కారణంగా దేశవ్యాప్తంగా ఐఐటీలకు ఆదరణతో పాటు పోటీ కూడా పెరిగిపోయింది.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.