close
మాటే మంత్రం..!

ఒక మాట... ఓ పెదవి విరుపు...ఓ కనుసైగ... ఓ చేతి స్పర్శ... పైకి చిన్నవిగానే కన్పించినా చాలా విషయాలే చెబుతాయట.అందుకే ఆలుమగల భాషకి అర్థాలే వేరంటున్నారు నిపుణులు.ఆ భాష... మీకు అర్థమవుతోందా మరి!

ఓ జంట షష్టిపూర్తి వేడుక జరుగుతోంది. ఆరు పదుల వయసునీ మూడున్నర పదుల దాంపత్య జీవితాన్నీ పూర్తిచేసుకున్న ఆ పెద్దాయన భార్యతో కలిసి ఉత్సాహంగా అతిథులను ఆహ్వానించాడు. అందరూ కూర్చున్నాక వేదిక మీదికి వెళ్లి మైకు అందుకున్నాడు.
‘మా ఆహ్వానాన్ని మన్నించి, మామీద ప్రేమతో మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి మీరంతా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు అరవయ్యేళ్లు నిండాయన్న విషయాన్ని అటుంచితే మా ఇద్దరి ప్రేమకీ, దాంపత్యానికీ 35 ఏళ్లు నిండాయి. ఆ ప్రేమనే ఇప్పుడు సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నాం. ఈ సందర్భంగా మీ అందరినీ నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నాను... ఏ కాపురమైనా కలకాలం సంతోషంగా ఉండాలంటే దంపతుల మధ్య ఉండాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటనుకుంటున్నారు’ - అడిగాడు ఆయన. ‘నిజాయతీ’ ‘ప్రేమ’ ‘నమ్మకం’ ‘పరస్పరం గౌరవం’ ... అంటూ అతిథుల నుంచి రకరకాల సమాధానాలు వచ్చాయి.

‘నిజమే. మీరు చెప్పినవన్నీ కరెక్టే. అయితే మీలో ఉన్న ఆ ప్రేమనీ నిజాయతీనీ నమ్మకాన్నీ గౌరవాన్నీ... మీ భాగస్వామికి ఎలా తెలియజేస్తారు?’ అడిగాడాయన. అతిథులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు...
‘మనసులో ఎంత ప్రేమ ఉన్నా దాన్ని మాటల్లోనో చేతల్లోనో చెప్పినప్పుడే ఎదుటివారికి అర్థమవుతుంది. సినిమాల్లో లాగా మనం డ్యూయట్లు పాడుకోలేం. అయితేనేం అంతకుమించిన ఆయుధమే మన దగ్గర ఉంది. దాన్ని మనం మాటామంతీ అనుకుందాం. అది సవ్యంగా ఉంటే ఇద్దరి మధ్యా దగ్గరితనం పెరుగుతుంది...’ చెబుతున్నాడు పెద్దాయన. నిశ్శబ్దంగా వింటున్నవారంతా ఆలోచనలో పడ్డారు. ఆ అతిథులే కాదు, అందరూ ఆలోచించాల్సిన విషయమే అది!

అప్పుడూ ఇప్పుడూ...
భార్యాభర్తలిద్దరూ పాలూ తేనెలా కలిసిపోవాలని చెప్పిన పెద్దలు వారి మధ్య ఆ అనుబంధం పెనవేసుకునేలా పెళ్లైన ఏడాదంతా సంప్రదాయాల పేరుతో రకరకాల వేడుకలు చేసేవారు. వాటికోసం పుట్టింటికీ మెట్టినింటికీ మధ్య తిరుగుతూ విరహాన్నీ కలయికనీ ఆస్వాదిస్తూ కొత్త దంపతులు జీవితకాలపు అనుబంధానికి పునాది వేసుకునేవారు. కాలంతో పాటు అవన్నీ మారిపోయాయి. ఇప్పుడు సంబంధం కుదిరిన పదిహేను రోజుల్లో పెళ్లి చేసుకుని, మరో పదిరోజుల్లో కాపురం పెట్టి, ఆ మర్నాటి నుంచి ఎవరి ఉద్యోగాలకు వాళ్లు వెళ్లిపోతున్నారు. ఇదిగో... ఈ స్పీడే ఇద్దరి మనసుల్లోనూ అనుబంధానికి పునాదిని పడనీయడం లేదు. ఇంతకు ముందు అయితే సాయంత్రం వేళ ఏ టీవీ చూస్తూనో ఇద్దరూ కాసేపన్నా ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు ఇద్దరికీ ఉద్యోగాలు, వేర్వేరు షిఫ్టులు. ఇద్దరి చేతుల్లోనూ ఫోన్లు, వేర్వేరు స్నేహితులు. ఇక కలిసి కబుర్లాడే తీరికేదీ? దాంతో ఇద్దరి మధ్యా మాటామంతీ లేక దగ్గరయ్యే అవకాశాలు తగ్గి దూరం పెరిగిపోతోంది. అలా చూస్తూండగానే పిల్లలూ వారి బాధ్యతలూ, ఉద్యోగాల్లో ఒత్తిళ్లూ పెరిగిపోతాయి. వాటన్నిటి మధ్యా ఆలుమగల బంధం చిన్నబోతోంది. ఆ బంధానికి తగినంత ప్రాధాన్యం దొరకని ఫలితమే చీటికీమాటికీ కస్సుబుస్సులూ, అసహనంతో మాటా మాటా పెరిగి పోట్లాటల్లోకి దిగడాలూ. పాతికేళ్లు చెరో ఇంటా వేర్వేరు నేపథ్యాల్లో పెరిగిన యువతీయువకులు పెళ్లి అనే బంధంతో ముడిపడినంత మాత్రాన అకస్మాత్తుగా ‘మనుషులిద్దరు... మనసొకటే’ అన్నట్లుగా బతకడం అంత ఈజీ కాదు- అందుకే కాస్త కష్టపడి అయినా దంపతులిద్దరూ కలిసి అనుబంధాన్ని పెంచిపోషించుకోవాలంటున్నారు నిపుణులు.

 

ఏమిటీ బంధం?
తానూ నేనూ మొయిలూ మిన్నూ తానూ నేనూ కలువా కొలనూ...ఆమధ్య యువజంటల గొంతుల్లో విన్పించిన ప్రేమగీతం ఇది. భార్యాభర్తల బంధానికి అర్థం చెప్పే పాట. మరి, అంత చక్కని బంధం ముడిపడాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంతో జరగాలి. మూడు గంటల్లో అయిపోయే సినిమా కాబట్టి మూడు నిమిషాల పాటలో ప్రేమంతా తెలియజేస్తారు. కానీ నిండు నూరేళ్ల వైవాహికజీవితమూ ఆ స్థాయిలో పెనవేసుకోవాలంటే అందుకు ఇద్దరూ బోలెడంత సమయం పెట్టుబడి పెట్టాలి. రోజూ కాసేపు తప్పనిసరిగా కలిసి గడుపుతూ కబుర్లు చెప్పుకోవాలి, కలలెన్నో కనాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఇవన్నీ జరిగినప్పుడే ఇద్దరి మధ్యా మానసిక సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ‘తానూ నేనూ... రెప్పా కన్నూ’ అనుకోగల విడదీయరాని అనుబంధం బలపడుతుంది. ఇంట్లో ఉన్న కాస్త సమయమూ ఇద్దరూ ఒకేచోట ఉండాలి. కలిసి వంటపని చేసుకోవడమూ కలిసి కాఫీ తాగుతూ పేపర్లు చదువుకోవడమూ- ఇలా ఇద్దరూ ఎప్పుడూ ఎదురెదురుగా ఉండడం వల్ల మాట్లాడుకునే సందర్భాలు పెరుగుతాయి. ఒకరి మనసు ఒకరికి తెలిసేది ఆ మాటల్లోనే. ‘ఎదుటా నీవే... ఎదలోనా నీవే...’ అంటూ కూనిరాగం తీస్తూ ఓరకంట ఓ చూపు విసిరితే ఇష్టసఖి వాలుచూపులతో తిరుగు సమాధానం చెప్పదూ. చిరు అలకలూ బతిమాలుకోవడాలూ... లాంటి చిన్న చిన్న సరాగాలే దగ్గరితనాన్ని పెంచుతాయి. వేర్వేరు షిఫ్టుల్లో ఉద్యోగాలు చేసేవారికి ఇలా కలిసి గడిపే అవకాశం లేకపోవడం వల్లనే
ఈరోజుల్లో చాలామంది వైవాహిక జీవితం పట్ల అసంతృప్తితో ఉంటున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. అలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఇంటిసమయాన్ని ప్లాన్‌ చేసుకోవాలి.

ఇష్టాలు వేరైనా...
ప్రేమ పెళ్లయినా పెద్దలు చేసిన పెళ్లైనా- ఇద్దరి అభిరుచులూ ఒకేలా ఉండాలనిలేదు. ఒకరికి సినిమాలు చూడడం ఇష్టమైతే ఇంకొకరికి క్రికెట్‌ ఇష్టం కావచ్చు. ఒకరికి ముదురు రంగులు ఇష్టమైతే మరొకరికి లేత రంగులు నచ్చవచ్చు. అభిరుచుల్లో ఎంత తేడా ఉన్నా ఇద్దరూ ప్రేమగా జీవించడానికి అవి అడ్డు రావు. పైగా పోతపోసినట్లు ఒకేలాంటి అభిరుచులుంటే బోర్‌ కొడుతుంది కూడా. అదే ఇద్దరి టేస్టులూ వేర్వేరయితే మాట్లాడుకోవటానికి బోలెడు విషయాలుంటాయి. కాకపోతే, ఒకరి ఇష్టాల్ని మరొకరు గౌరవించాలి. ఎవరికి వాళ్లు ‘నాదంటూ

ఓ లోకం... నేనంతా ప్రత్యేకం... ’
అనుకుంటే ఎప్పటికీ వాళ్లు ఇద్దరుగానే ఉంటారు తప్ప ఒక్కటవరు. అందుకని సంతోషంగా జీవించాలనుకునే దంపతులు చిన్న చిన్న సర్దుబాట్లను ఎలా చేసుకుంటారంటే- భర్తకు ఇష్టమైన రంగు చీర భార్య కొనుక్కుంటుంది. ‘మీకు నచ్చుతుందని ఈ చీర కొన్నాను, ఎలా ఉందీ’- అని కట్టుకుని చూపిస్తుంది. తన ఇష్టానికి భార్య ప్రాధాన్యమివ్వడం భర్తకు సంతోషం కలిగిస్తుంది. అలాగే అతడికి సినిమా చూడడం ఇష్టం లేకపోయినా భార్యకు ఇష్టమని సినిమాకి తీసుకెళతాడు. ఇలాంటి సర్దుబాట్లు చేసుకునేటప్పుడు వాళ్లిద్దరూ ఒక విషయం గుర్తు పెట్టుకుంటారు- అది, ఇష్టంగా మనస్ఫూర్తిగా భాగస్వామి మీద ప్రేమతో చేయాలి తప్ప మొక్కుబడిగా చేయకూడదని. నాకిష్టం లేకపోయినా తనకోసం ఇది చేశానూ అది చేశానూ- అని ఒకటికి పదిసార్లు గుర్తుచేసుకునే పరిస్థితి రానప్పుడే ఆ సర్దుబాట్లు ఇద్దరినీ దగ్గర చేస్తాయి.

ప్రతి రోజూ ప్రత్యేకమే
భాగస్వామి పెళ్లిరోజో పుట్టినరోజో గుర్తు పెట్టుకోలేదని అలిగి పోట్లాడేవారే కాదు, విడాకుల దాకా వెళ్లినవాళ్లూ ఉన్నారు. అసలు ఆ రెండు రోజులు మాత్రమే ఎందుకు సెలబ్రేట్‌ చేసుకోవాలి. సంతోషంగా జీవించాలనుకునేవారికి ప్రతిరోజూ పండగే. ప్రత్యేక సందర్భాలను వారికివారే సృష్టించుకుంటారు. రోజూ ఏదో ఒక టిఫిన్‌ చేస్తాం, ఏదో ఒక కూర వండుతాం... అదేదో భాగస్వామికి ఇష్టమైనది చేసి- మీకిష్టమని ఈ కూర చేశాను, అని నవ్వుతూ చెబితే రుచి చూడకుండానే అతడికి కడుపు నిండిపోతుంది. ఇక తిన్నాక ‘చాలా బాగుందోయ్‌’ అని చెబితే ఆమె కడుపూ నిండిపోతుంది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు భార్యకోసం ఏదైనా తీసుకెళ్లాలని అతనికి అనిపిస్తుంది. ఇలా ఇద్దరూ ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు తెలుసుకుని తీర్చుకోవటమూ ప్రేమను వ్యక్తపరచడమే. అంతేకానీ సినిమాలో లాగా ప్రతిసారీ ‘ఐ లవ్‌ యూ’ అనో ‘నువ్వంటే నాకిష్టం’ అనో చెప్పనక్కర్లేదు.

నోరారా ప్రశంస
కట్టుకున్న చీరైనా, వండిన కూరైనా... భాగస్వామి నోట బాగుందన్న ఒక్క మాట ఆమెకు బోలెడు సంతోషాన్నిస్తుంది. తమ మనసులోని ప్రేమను తెలియజేయడానికైనా, ఎదుటి వ్యక్తిలో తమ పట్ల ప్రేమను తెలుసుకోవడానికైనా మహిళలు మాటల్ని ఇష్టపడతారనీ అదే పురుషులైతే స్పర్శ ద్వారా ప్రేమను తెలియజేయడానికి ఇష్టపడతారనీ సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య పొగడ్తలేంటీ అనుకోకుండా మనసారా ప్రశంసల్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఎవరికైనా ప్రశంస వినగానే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. సంతోషం అనే అనుభూతిని అవి ఎంతోసేపు పట్టి ఉంచుతాయి. ప్రతివ్యక్తిలోనూ మనకు నచ్చిన విషయాలూ నచ్చని విషయాలూ ఉంటాయి. నచ్చని వాటిని వదిలేసి నచ్చిన విషయాలనే తరచూ ప్రశంసిస్తూ ఉంటే- ఒకరి పట్ల మరొకరికి ప్రేమ పెరగడమే కాదు, క్రమంగా నచ్చని విషయాలనూ భాగస్వామికి నచ్చేలా మార్చుకునే అవకాశమూ ఉంటుందట.

ఇష్టంగా దగ్గరవ్వాలి
ఉదయం నిద్ర లేవగానే నుదుట ఓ చిన్న ముద్దు, వెచ్చగా ఓ కౌగిలి... ఉత్సాహంగా రోజు మొదలుపెట్టడానికి అంతకన్నా ఏం కావాలి. భాగస్వామి ఆత్మీయ స్పర్శ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందట. నీకు నేనున్నానన్న ధైర్యాన్నీ, సంశయించకుండా నిర్ణయాలు తీసుకోగల శక్తినీ ఇస్తుందట. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి సాహచర్యాన్నీ స్పర్శనీ మరొకరు ఆస్వాదించాలి. రోజూ పొద్దున్నే టైమ్‌ అయిపోయిందంటూ పరుగులు తీయకుండా ఒక పది నిమిషాలు ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు సేదదీరితే రోజంతా ఆనందంగా గడుస్తుంది. భాగస్వామి శరీర స్పర్శా, పరిమళమూ ఇద్దరి మధ్యా అనుబంధాన్ని బలపరిచే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ను విడుదలచేస్తాయట. దాని ప్రభావం వల్ల రోజంతా ఒకరికొకరు ఎంత దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్న అనుభూతిని పొందుతారనీ, ఆత్మస్థైర్యంతో పనులు చేసుకుంటారనీ అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఒత్తిడిని కలిగించే కార్టిసోల్‌ స్థాయుల్నీ ఇది తగ్గిస్తుంది. అందుకే ఇష్టమైనవారిని కౌగిలించుకున్నా, ప్రేమగా దగ్గరికి తీసుకున్నా ఒత్తిడి తగ్గుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే భార్యను ముద్దుపెట్టుకునేవారి ఆయుష్షు మిగతావారికంటే ఐదేళ్లు పెరుగుతుందట. వృత్తి జీవితంలోని ఒత్తిళ్లను తట్టుకునేందుకైనా, కెరీర్‌లో పైకి ఎదిగేందుకైనా... శక్తినిచ్చేది అనుబంధంలోని ఈ చిన్న చిన్న ఆనందాలే.

టచ్‌లో ఉండాలి
అనుబంధానికి విలువనిచ్చే భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరి జ్ఞాపకాల్లో ఒకరు కదలాడుతుంటారు. ఆఫీసులో ఇంటి పనుల గురించి ఆలోచించకూడదు కానీ ఏ లంచ్‌ టైమ్‌లోనో భార్యకు ఫోన్‌ చేయొచ్చు. చెప్పుకోడానికి ఏ విశేషాలూ లేకపోతే వాట్సాప్‌లో ఓ మంచి పాటో, నవ్వించే జోకో పంపొచ్చు. మహా అంటే అందుకు పట్టేది రెండు నిమిషాలు. కానీ దాని ప్రభావం అవతలి వ్యక్తి మీద చాలాసేపు ఉంటుంది. తనని తలచుకుంటున్నారన్న ఫీలింగ్‌ మనసుని ఆనందంలో ముంచెత్తుతుంది. స్నేహితులతో చాట్‌ చేసినట్లు భార్యాభర్తలు కూడా పొడిమాటలతో ఎమోజీలతో సరిపెట్టుకోకూడదు. దానికీ ఓ ప్రత్యేకమైన పద్ధతి ఉండాలి. చేతిలో ఎప్పుడూ ఫోను ఉంటుంది కాబట్టి అవతలివారికి తెలియకుండా అందమైన పోజులెన్నో క్లిక్‌మనిపించవచ్చు. సందర్భానికి తగిన ఒక ఫొటో, ఓ చక్కని సందేశం కలిపి పంపితే అవతలి మనసు మరింతగా పులకించిపోతుంది. ‘నేను నీ గురించి ఆలోచిస్తున్నాను’ అన్న సందేశం భాగస్వామికి అందుతుంది. ఇలా టచ్‌లో ఉండటం వల్ల ఇద్దరి మధ్యా దగ్గరితనం పెరుగుతుంది. అయితే ఒక్క మాట, స్వీట్‌ నథింగ్స్‌కి తప్ప సీరియస్‌ విషయాలకి అక్కడ చోటీయకూడదు. ‘కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయారు, మీరెప్పుడూ ఇంతే...’, ‘బీరకాయ వండొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవా...’ తరహా ఆరోపణలు వాట్సాప్‌లో వద్దు, వాటికి వేరే సమయం, సందర్భం ఉంటాయి.

పోట్లాటా మంచిదే!
సముద్రానికి అలల్లాగే సంసారానికి చిన్న చిన్న అలకలూ తగాదాలూ అందాన్నిస్తాయి. అయితే అవి చినికి చినికి గాలివాన కాకుండా చూసుకోవాలి. సరదాగా పోట్లాడుకున్నా, సీరియస్‌గానే అభిప్రాయభేదాలు వచ్చినా- అహాన్ని మధ్యలోకి రానివ్వకూడదు. చాలామంది ఏదైనా సమస్య రాగానే అది ‘నీవల్లా? నావల్లా?’ - అని ఆలోచిస్తున్నారు. కారణం ఎవరైనా సమస్య పరిష్కారం ముఖ్యం. అందుకని భార్యాభర్తలిద్దరూ సమస్యను తమ నుంచి విడదీసి చూసినప్పుడే ఇద్దరూ కలిసి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలన్నది ఆలోచించవచ్చు. అలాగే కోపంతోనో ఒత్తిడితోనో ఉన్నప్పుడూ మనసు ఉద్వేగభరితంగా ఉన్నప్పుడూ భాగస్వామితో గొడవ పెట్టుకోకూడదు. ప్రశాంతంగా నిదానంగా మాట్లాడుకోగలిగినప్పుడే మనసులో ఇబ్బంది పెడుతున్న సమస్యల్ని చర్చకు పెట్టాలి. భాగస్వామి చెబుతున్నప్పుడు కళ్లలోకి చూస్తూ మనసుపెట్టి వినాలి, అలాగే చెప్పాలి. మాట్లాడేటప్పుడు ‘నువ్వు’ ‘నేను’ బదులు ‘మనం’ అన్న మాట రావాలి. అప్పుడే తప్పుతో సంబంధం లేకుండా అటునుంచీ బేషరతుగా ‘సారీ’ వచ్చేస్తుంది. ఇద్దరినీ బిగికౌగిలిలోకి చేరుస్తుంది. ఒక్కోసారి కొన్ని సమస్యలు అంత త్వరగా తెమలకపోనూవచ్చు. అప్పుడు పంతానికి పోయి తెగేదాకా లాగకుండా అప్పటికి ఆ గొడవను పక్కనపెట్టి మరోసారి ప్రశాంతంగా చర్చించుకోవటం మంచిది.

కలసి కలలు కనాలి
కలలు కనే వయసంటే యుక్తవయసనే అనుకుంటారు చాలామంది. అదేం కాదు- మనిషి జీవితంలో ఏ వయసుకి తగ్గ కలలు ఆ వయసుకు ఉంటాయి. ఆ కలలేవో భార్యాభర్తలిద్దరూ కలిసి కంటే అవి నిజమయ్యే అవకాశాలు ఎన్నో రెట్లు పెరుగుతాయట. పొద్దునో సాయంత్రమో కాసేపలా తీరిగ్గా కూర్చుని పిల్లల గురించో, సొంతింటి గురించో, చూడాలనుకున్న ప్రదేశాల గురించో ఇద్దరూ తమ తమ ఊహల్ని అల్లుకోవచ్చు. అలాంటి సమయంలోనే కదా మనసులోని భావాలు స్వేచ్ఛగా బయటపడతాయి. అలా భాగస్వామి మనసు తెలిశాక దానికి తగ్గట్టుగా నడుచుకోవటం ఇద్దరికీ తేలికవుతుంది. పిల్లలు పెద్దవాళ్లై వారి జీవితాల్ని వారు నిర్మించుకున్నాక మళ్లీ మిగిలేది భార్యాభర్తలు ఇద్దరే. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ పాతికేళ్లూ ఎటుపోయాయో అనుకునే పరిస్థితి వస్తే... ఆ జంట మానసిక బంధాన్ని సరిగ్గా అల్లుకోలేదన్నట్లే. అలా కాకుండా ఏ మనవరాలి పెళ్లిలోనో అందరూ కలిసి కబుర్లు చెఫ్పుకుంటున్నప్పుడు ఆనాటి సరదా సంఘటనలు గుర్తొచ్చి ఇద్దరి పెదవుల మీదా చిరునవ్వులు పూస్తే... అదీ నిజమైన జీవితం, నిండైన జీవితం.

*       *     *

ఎప్పుడు చూసినా నవ్వుతూ తుళ్లుతూ అసలు తమకు ఎలాంటి కష్టాలూ లేవన్నట్లు ఉండే ఓ జంటని మీ అన్యోన్య దాంపత్య రహస్యం ఏమిటని అడిగింది ఓ యువ జంట.‘చాలా సింపుల్‌. నేను ఏం అనుకుంటానో తను అదే చేస్తుంది’ అని ఆయనా, ‘నా మనసు ఏది కోరుతుందో అదే ఆయన చేస్తారు’ అని ఆమె చెప్పారు.‘అవతలి వాళ్లు ఏం కోరుకుంటున్నారో మనకెలా తెలుస్తుందీ అని మళ్లీ అడక్కండి. అది తెలిసేలా జీవించడమే అన్యోన్య దాంపత్యంలోని అసలు రహస్యం’ చెప్పారిద్దరూ నవ్వుతూ.


మీలో సగం... మీ బలం!

వ్యక్తిగత జీవితంలో సంతృప్తి భాగస్వామి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఉద్యోగ జీవితంలో..? అదీ భాగస్వామిని బట్టీ వారిచ్చే ప్రోత్సాహాన్ని బట్టే ఉంటుందంటున్నారు పరిశోధకులు. దీనికి సంబంధించి కార్నెగీ మెలన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రెండువందల జంటలతో ఒక అధ్యయనం చేశారు. వారందరినీ ఓ చోట చేర్చి రకరకాల ఆటలూ పోటీలూ పెట్టారు. గెలిచినవారికి బహుమతులూ ప్రకటించారు. పాల్గొన్నవారిలో చాలామంది సరదాగా తేలిగ్గా ఉండే ఆటల్ని ఎంచుకుంటే కొందరు మాత్రం ఛాలెంజింగ్‌గా ఉండే పోటీలను ఎంచుకున్నారు. వారు అలా ఎంచుకోడానికి కారణమేమిటన్నది విశ్లేషిస్తే... ఆ వ్యక్తి సామర్థ్యం మీద నమ్మకం కలిగి మంచి మాటలతో ప్రోత్సహించిన భాగస్వామి ఉన్నవారు సీరియస్‌గా పోటీల్లో పాల్గొన్నారట. ఆ నమ్మకం లేక ‘మనవల్ల కాదులే...’ అంటూ నిరుత్సాహపరిచిన భాగస్వామి ఉన్నవాళ్లు పోటీలకు దూరంగా సరదా ఆటలతో సరిపెట్టుకున్నారట. నిర్వాహకులు అంతటితో ఊరుకోకుండా ఆ తర్వాత కొన్నేళ్లపాటు ఆ జంటల్ని పరిశీలించారు. ఆత్మవిశ్వాసంతో ఛాలెంజింగ్‌గా ఉన్న పోటీలను ఎంచుకుని చివరివరకూ పోరాడినవారు వృత్తి ఉద్యోగాల్లోనూ గొప్ప విజయాలు సాధించారు. వ్యక్తిగతంగానూ సంతోషంగా ఉన్నారు. వారికి అడుగడుగునా భాగస్వామి ప్రోత్సాహం లభించిందట. జీవితంలో ఎవరైనా ఏదైనా సాధించాలన్నా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నా భాగస్వామి ఇచ్చే ప్రోత్సాహం చాలా అవసరమని దీన్ని బట్టి అర్థమవుతోందంటున్నారు ఆ పరిశోధకులు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.