close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయాలు అందించే... త్రిపురాంతకుడు!

సాధారణంగా రాక్షసులు కోరిన వెంటనే వరాలిచ్చే స్వామిగా శివయ్యను పేర్కొంటారు. అందుకు భిన్నంగా బ్రహ్మ వరంతో విర్రవీగుతున్న రాక్షసుల గర్వం అంతమొందించడానికి ఆ కైలాసనాథుడే కదిలివచ్చి, రాక్షస సంహారం అనంతరం అక్కడే కొలువైన క్షేత్రం ప్రకాశం జిల్లా మార్కాపురానికి సమీపంలో ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం. శ్రీచక్ర ఆకారంలో నిర్మించిన ఈ ఆలయంలో స్వామి బాలాత్రిపురసుందరితో కలిసి పూజలందుకోవడం విశేషం.

ఆలయ స్థలపురాణం ప్రకారం- పూర్వం తారకాసురుడనే రాక్షసుడు దేవతలనూ రుషులనూ మునులనూ బాధిస్తూ ఉండేవాడు. వారు కుమారస్వామికి తమ కష్టాలను తెలపగా కుమారస్వామి వచ్చి, తారకాసురుడిని సంహరిస్తాడు. తారకాసురుడి ముగ్గురు కుమారులైన తారాక్షుడూ, విద్యున్మాలీ, కమలాక్షుడూ తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తారు. అందుకోసం బ్రహ్మ వరం పొందాలని తపస్సు ప్రారంభిస్తారు. వీరి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఆ ముగ్గురూ తమకు ఎవరి వల్లా మరణం సంభవించకుండా చేయమని ప్రార్థిస్తారు. దానికి బ్రహ్మ... పుట్టిన వాడు గిట్టక తప్పదు కాబట్టి అది తప్ప మరేదైనా వరాన్ని కోరుకోమని చెబుతాడు. అప్పుడు త్రిపురాసురులు సకల సౌకర్యాలుండే మూడు నగరాలను నిర్మించుకుని, వెయ్యేళ్లు జీవించిన తర్వాత ఆ మూడు నగరాలూ ఒకే సరళ రేఖమీదకు చేరినప్పుడు ఒకే బాణంతో ఆ నగరాల్ని ఛేదించగలిగినవాని చేతిలో మృత్యువు కలిగేలా వరం కోరుకుంటారు. ఆ తర్వాత బంగారం, వెండీ, ఇనుములతో మూడునగరాలను నిర్మించుకున్న త్రిపురాసురులు వర గర్వంతో దేవతలనూ రుషులనూ అమాయకులైన స్త్రీలనూ హింసించడం మొదలుపెడతారు. దీంతో వారందరూ పరమశివుడిని శరణువేడగా... బ్రహ్మ వరం పొందిన ఆ రాక్షసులను సంహరించాలంటే తనకు అపూర్వ రథమూ, బాణాలూ కావాలని చెబుతాడు. దీంతో విశ్వకర్మజగత్తత్వంతో రథాన్నీ, వేద తత్వంతో గుర్రాలనూ, నాగతత్వంతో వింటినారినీ, సోమ, విష్ణు, వాయు తత్వాలతో మూడు బాణాలనూ తయారుచేస్తాడు. రథానికి బ్రహ్మదేవుడు సారథ్యం వహిస్తాడు. దీంతో పరమశివుడు ఆ ముగ్గురు రాక్షసుల మీదకూ యుద్ధానికి వెళతాడు.


అయితే యుద్ధంలో ఎంత ప్రయత్నించినా ఆ ముగ్గురు రాక్షసులనూ పరమశివుడు నిలువరించలేకపోతాడు. దీంతో పరమశివుడు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు అమ్మవారు బాలా త్రిపురసుందరి రూపంలో యాగగుండం నుంచి విల్లు రూపంలో ఉద్భవిస్తుంది. ఆ విల్లుతో శివుడు ఆకాశంలో ఎగురుతున్న మూడు నగరాలనూ ఛేదించి, ఆ రాక్షసులను సంహరిస్తాడు. అటుపై బాలాత్రిపుర సుందరి ధనుస్సు నుంచి బయటకు వచ్చి, సృష్టి ఉన్నంతవరకూ స్వామి ఇక్కడే త్రిపురాంతకుడిగా పూజలందుకోవాలని వరమడుగుతుంది. అందుకు అంగీకరించిన శివుడు తనతోపాటు బాలాత్రిపురసుందరినీ ఎవరు పూజిస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుందని వరమిస్తాడు.

శ్రీచక్రంలో శివుడు...
సాధారణంగా శక్తి పీఠాలూ లేదా అమ్మవారి ఆలయాలను మాత్రమే శ్రీచక్రాకృతిలో నిర్మిస్తారు. అయితే అందుకు భిన్నంగా ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఈ దేవాలయం శ్రీచక్రాకృతిలో నిర్మించిన ఏకైక శివాలయం. ఏటా జరిగే కార్తికమాస పూజలూ, దేవీ నవరాత్రుల ఉత్సవాలూ ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహాశివరాత్రి రోజున బోళా శంకరుడి నామస్మరణతో ఈ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. ఆలయానికి నాలుగు దిక్కుల్లో నాలుగు ప్రవేశద్వారాలు ఉన్నాయి. స్వామివారికి సమీపంలోనే బాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయం ఉంది. త్రిపురాంతకేశ్వరుడి గర్భాలయానికి నైరుతి భాగంలో ఒక చీకటి గుహ ఉంది. దీన్నే స్థానికులు చీకటి మిద్దె అని పిలుస్తారు. ఆ గుహ నుంచి కాశీ, శ్రీశైలం క్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నాయనీ పూర్వం రుషులూ సిద్ధులతోపాటు రాజులు కూడా ఈ గుహ ద్వారానే వచ్చి పురాంతకేశ్వరుడిని పూజించేవారనీ ఆలయ ప్రాంగణంలోని శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి.
ఇలా చేరుకోవచ్చు ప్రకాశం జిల్లా మార్కాపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపురాంతకేశ్వరుడిని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు-విజయవాడ ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉందీ త్రిపురాంతకేశ్వరాలయం. నియోజకవర్గ కేంద్రమైన యర్రగొండపాలెం వైపు వెళ్లే బస్సులూ ఆటోల్లో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు. రైల్లో వచ్చే భక్తులు... వినుకొండ లేదా మార్కాపురం స్టేషన్లలో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు.

- పాతకోటి అంజిరెడ్డి, ఈనాడు జర్నలిజం స్కూల్‌

22 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.