close
‘రుధిర చింత’ తెలుసా మీకు?

చింతలు లేని ఇల్లు ఉంటుందేమోగానీ చింతపండులేని ఇల్లు అస్సలు ఉండదు. పప్పుకూరా, చారూ, పులిహోరా వంటివాటిల్లో చింతపండు వాడకం తప్పనిసరి. వంటింట్లో నిత్యావసరమైన ఈ చింతపండు ముదురు తేనె రంగులో ఉంటుందనీ పచ్చిచింతకాయకండ తెల్లగా ఉంటుందనీ తెలిసిందే. మరి ఎర్రని కండ ఉండే ‘రుధిర చింత’ గురించి విన్నారా...?

కరవుకు నిలయమైన రాయలసీమ వాతావరణం పంటలకు ప్రధాన శత్రువు. ఉద్యానవన పంటలతోనే రైతులు నెట్టుకొస్తుంటారు. అందుకే అనంతపురంలోని రేకులకుంట జాతీయ మెట్ట పరిశోధన కేంద్రంలో ఆ పంటలపై నిత్యం పరిశోధనలు జరుపుతుంటారు శాస్త్రవేత్తలు. అందులో భాగంగానే అక్కడున్న 41 చింత రకాలపైన ప్రయోగాలు చేశారు. వాటికి సంబంధించిన జెర్మ్‌ప్లాజం (జీవద్రవ్యం) ఉపయోగించి ఎర్రని కండ ఉన్న రకాన్ని వృద్ధి చేశారు. అలా వచ్చిన ఎర్ర చింత తల్లి చెట్టును అంటు కట్టి పలు మొక్కలు వృద్ధి చేసి 2008లో వాటిని నాటారు. ఐదేళ్లలో అవి నీటి ఎద్దడినీ, పొడివాతావరణాన్నీ తట్టుకుని ఏపుగా పెరిగాయి. కాయలు కూడా గుత్తులు గుత్తులుగా విరగ్గాశాయి. గింజసైజు తక్కువగా ఉండి కండ ఎక్కువగా ఉన్న ఈ ఎర్ర చింత కాయలపైన శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలూ, ప్రయోగాలూ చేసి, వీటిలో ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు. అవి ఆంటీఆక్సిడెంట్లలా పనిచేసి శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపుతాయి. బీపీ, మూత్ర సమస్యల్నీ అదుపులో ఉంచడంతోపాటు మరికొన్ని లాభాలూ ఉన్నాయి. అలానే టార్టారిక్‌ యాసిడ్‌, క్యాల్షియం, భాస్వరం, పొటాషియం, ఖనిజాలు కూడా అధికమేనట. మనం నిత్యం వాడే చింతతో పోలిస్తే ఇది మరింత రుచిగా ఉండటంతోపాటు నోట్లో వేసుకుంటే నాలుక ఎర్రగా మారిపోతుందట. పప్పులో వేసినా పులుసులూ, పచ్చళ్లూ, పులిహోర వంటివి చేసినా పండు మిర్చి రంగులో ఎర్రగా ఉంటాయట. ఈ చింతగుజ్జుతో చాక్లెట్లూ, జెల్లీలూ, జామ్‌లూ, లాలీపాప్‌లూ ఫుడ్‌కలర్లూ కూడా తయారు చేయొచ్చని తేలింది.

పలు రాష్ట్రాల్లో సాగు...
మరికొన్ని పరిశోధనలు చేస్తూనే గతేడాది ‘రుధిర చింత’ అని నామకరణం చేసి ఈ రకాన్ని బయటకు తీసుకొచ్చి రైతులకు పరిచయం చేశారు శాస్త్రవేత్తలు. ఇతర జాతీయస్థాయి ఉద్యానవన పరిశోధనకేంద్రాలు సైతం ఈ చింతను గుర్తించి ఆహార తయారీ పరిశ్రమలకు సిఫారసు చేశాయి. వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునే వాణిజ్య పంట కావడం, నాటాక తక్కువ కాలంలో ఎక్కువ ఫలసాయం రావడం, అదీ ఏటా పంట చేతికి అందడంతో ఇతర రాష్ట్రాల రైతులు కూడా సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే మొక్కకు యాభై రూపాయల చొప్పున తీసుకుని వీటిని రైతులకు అందిస్తున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రైతులు ఇప్పటికే రుధిర చింత సాగును పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. ఆహార తయారీ పరిశ్రమలు కూడా రైతులను సంప్రదించి సాగు చేసి ఇవ్వమని కోరుతుండటంతో ఈ పంటకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు రుధిర చింత కోసం సంప్రదించడంతో వాటిని అధిక మొత్తంలో ఉత్పత్తి చేసే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. కరవు నేలల్లో సిరులు కురిపించే ఈ రుధిర చింతను మనమూ ఆస్వాదిద్దామా...!

 


- పాలబండ్ల రామచంద్ర, న్యూస్‌టుడే, అనంతపురం వ్యవసాయం

22 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.