close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎడమచేతివాటం మంచిదే!

సాధారణంగా అందరూ కుడిచేత్తోనే అన్ని పనులూ చేస్తుంటారు. అరుదుగా కొద్దిమంది ఎడమచేత్తో చేస్తుంటారు. దీనికి కారణం జన్యువులన్నది తెలిసిందే. అయితే అందుకు కారణమైన జన్యువునీ దాని పనితీరునీ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు తొలిసారిగా గుర్తించారు. అంతేకాదు, ఈ జన్యువు మెదడులోని భాషకు సంబంధించిన భాగంతో అనుసంధానమై ఉందనీ, పైగా ఆ భాగంలోని కణాల అమరికలోనూ వ్యత్యాసం ఉండటంవల్లే వాళ్లు ఆ చేతిని ఎక్కువగా వాడతారనీ గుర్తించారు. పైగా ఎడమచేతిని వాడేవాళ్లలో మెదడుకి ఇరువైపులా ఉండే భాషా భాగాలు ఒకదానితో ఒకటి మిగిలినవాళ్లలో కన్నా ఎక్కువ సమన్వయంతో పనిచేస్తున్నాయనీ, వాళ్లలో భాషా పరిజ్ఞానం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం కావచ్చనీ భావిస్తున్నారు. గర్భస్థ శిశువులో- అంటే, మెదడు ఏర్పడుతున్న దశలోనే ఈ కణాల అమరికా రూపుదిద్దుకుంటుంది. ఎడమచేతి వాడకం మంచిది కాదనీ అపశకునమనీ భావించి కొందరు పిల్లలతో బలవంతంగా కుడిచేతితో పనులు చేయించడం అలవాటు చేస్తుంటారు. కానీ మెదడు నిర్మాణంలోనే రూపుదిద్దుకున్న ఈ అమరికను బలవంతంగా మార్చే ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమం అన్నది నిపుణుల సూచన.


వయసుతో బరువు పెరిగేనా?!

ఇరవైల్లో చాలామంది సన్నగానే ఉంటారు. వయసు పెరిగేకొద్దీ కొంచెంకొంచెంగా బరువు పెరుగుతూ వస్తారు. యాభై దగ్గర పడేకొద్దీ కొందరిలో ఈ పెరుగుదల మరీ ఎక్కువై ఊబకాయానికి దారితీస్తుంది. అది చూసుకుని ‘ఇలా పెరుగుతున్నానేంటీ, నేను ఎప్పటిలానే తింటున్నా కదా’ అనిపిస్తుంటుంది. దాంతోపాటే ఆందోళనా మొదలవుతుంది. అయితే దీనికి కారణం తినడమో లేదా వ్యాయామం తక్కువ చేయడమో కాదట. వయసు పెరిగేకొద్దీ కొవ్వుకణాల పనితీరు తగ్గిపోవడమే బరువు పెరగడానికి కారణం అని స్వీడన్‌లోని కరోలిస్కా ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. దీనికోసం వీళ్లు 54 మంది స్త్రీ, పురుషుల్ని ఎంపికచేసి వాళ్లలోని కొవ్వు కణాల పనితీరుని 13 సంవత్సరాలపాటు పరీక్షించగా- వాళ్లలో బరువు పెరగడానికి కారణం కొవ్వులు కరగకుండా పేరుకుపోవడమేనని గుర్తించారు. కాబట్టి దీనిగురించి ఆందోళన చెందకుండా వయసు పెరిగేకొద్దీ మితంగా తింటూ వీలైనంత ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.


నిద్రపుచ్చే కళ్లద్దాలు!

ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆ సమస్యను తీర్చేందుకే ఫ్లిండర్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన నిద్ర నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు కలిసి నీలిఆకుపచ్చని అద్దాలతో కూడిన రి-టైమర్‌ గ్లాసెస్‌ని రూపొందించారు.
వ్యాపారపనులు, షిఫ్ట్‌ వర్కు, జెట్‌లాగ్‌, చదువు, ఆటలు... తదితర కారణాలవల్ల నిద్రలేమితో బాధపడేవాళ్లలో జీవగడియారాన్ని సరిచేయడం ద్వారా నిద్రపట్టేలా చేస్తాయివి. రాత్రి 11 గంటలకు పడుకుంటే ఉదయం ఏడుగంటలకు నిద్రలేవడం సర్వసాధారణం. కానీ విభిన్న కారణాలవల్ల కొన్ని రోజులపాటు ఆ సమయానికి నిద్రపోకుండా ఉంటే తరవాతి రోజుల్లోనూ నిద్రపట్టక సతమతమవుతుంటారు. అలాంటివాళ్లు ఈ అద్దాలను వారంపాటు ఉదయాన్నే- అంటే, లేవగానే ధరించడంవల్ల వాళ్ల శరీరంలోని జీవగడియారం యథాస్థితికి వస్తుంది. తద్వారా సరైన సమయానికి నిద్ర పడుతుంది. అద్దాల్లోని ఫ్రేమ్‌ కిందిభాగంలో అమర్చిన డయోడ్‌ల నుంచి వెదజల్లే కాంతి జీవగడియారానికి కారణమైన మెలనిన్‌ ఉత్పత్తిని పెంచి నిద్రలేమి, డిప్రెష జెట్‌లాగ్‌... వంటి వాటిని తగ్గిస్తుందట.


జీడిగింజ తొక్కలతో సన్‌స్క్రీన్స్‌!

జీడిగింజల్లోని పప్పుల్ని తీశాక వాటిని చెత్తలో వేసేస్తాం. అయితే విట్‌వాటర్స్‌ర్యాండ్‌ విశ్వవిద్యాలయంతోబాటు జర్మనీ, మాలావి, టాంజానియా యూనివర్సిటీ బృందాలు కలిసి వృథాగా పారేసే వృక్ష సంబంధిత ఉత్పత్తుల నుంచి వుడ్‌(క్సైలో) కెమిస్ట్రీ అనే కొత్త రసాయన విధానం ద్వారా మానవాళికి ఉపయోగపడే పదార్థాలను వేరుచేయగలిగారు. ముఖ్యంగా- వృథాగా పారేసే జీడితొక్కల నుంచి సేకరించిన సువాసనభరితమైన రసాయనాలకు హానికర అతినీలలోహిత కిరణాలను గ్రహించి చర్మాన్ని రక్షించే గుణం ఉందనీ కాబట్టి వీటిని సన్‌స్క్రీన్‌గా వాడుకోవచ్చనీ చెబుతున్నారు. అంతేకాదు, యూవీ కిరణాల కారణంగా దుస్తులూ ప్లాస్టిక్‌ వస్తువుల రంగులు కూడా పోతుంటాయి. అలా పోకుండా ఉండేందుకు ప్రస్తుతం ఆయా వస్తువుల్లోనూ సన్‌స్క్రీన్లలోనూ ఆక్సీబెంజీన్‌ వంటి పెట్రోలియం ఉత్పత్తిని వాడుతున్నారు. అంటే వీటికోసం శిలాజ ఇంధనాలను రసాయన ప్రక్రియకు గురిచేయాల్సి వస్తుందనీ, దానికన్నా జీడి గింజల తొక్కల నుంచే ఈ పదార్థాన్ని సులభంగా తయారుచేయవచ్చంటున్నారు. పైగా దీనికయ్యే ఖర్చూ తక్కువేనట.


22 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.