close
ఒక్క టీ జీవితాన్ని మార్చేసింది!

‘పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ నేను అవకాశాలు సృష్టించుకుంటా...’అనే బ్రూస్‌లీ మాటలు రఘువీర్‌ సింగ్‌ చౌధురికి ఆదర్శం. పస్తుల నేపథ్యం నుంచి నెలకి లక్షల్లో సంపాదించే స్థాయికి చేరుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

రఘువీర్‌ది జైపుర్‌ శివారులోని ఓ పల్లెటూరు. కుటుంబాన్ని అతికష్టంమీద నెట్టుకొచ్చే వ్యవసాయ కూలీలు అతని తల్లిదండ్రులు. రఘువీర్‌కేమో చదువంటే ఇష్టం. బాగా చదివి ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ అవ్వాలని కలలు కనేవాడు. కానీ ఆర్థిక స్థోమత లేక పదో తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. లోలోపల బాధ ఉన్నా పేదరికాన్ని తిట్టుకుంటూ కూర్చోలేదు. అమ్మానాన్నలకి అండగా ఉండాలని కూలి పనులకు వెళ్లేవాడు. అప్పటికే రఘువీర్‌ తండ్రి ఆరోగ్యం పాడైంది. చెల్లీ, తమ్ముడూ చిన్నపిల్లలు. దాంతో కొన్నాళ్లు ఆ పనీ ఈ పనీ చేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు.

అదే మలుపు...
కొన్నాళ్ల తరవాత కూలిపనులతో సంపాదన సరిగా రావట్లేదని ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందామనుకున్నాడు. ఆ విషయాన్ని జైపుర్‌లో ఉంటున్న స్నేహితుడికి చెబితే తన గదిలో ఉండి ఉద్యోగం చూసుకోమని రఘువీర్‌కి సలహా ఇచ్చాడు. అలా జైపుర్‌కి మకాం మార్చేసిన రఘు అమెజాన్‌ ప్రకటన చూసి డెలివరీ బాయ్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. వారం తిరిగేలోపు ఉద్యోగం వచ్చింది. జీతం తొమ్మిది వేలు. బైకు లేకపోవడంతో ఎంత దూరమైనా సైకిల్‌పైనే వెళ్లి డెలివరీ ఇచ్చేవాడు. అలా వెళ్లినప్పుడు భోజన సమయం దాటిపోయేది. గదికెళ్లి తినడానికి కుదిరేది కాదు హోటళ్లలో తింటే ఖర్చని టీతోనే సరిపెట్టుకునేవాడు. అయితే రఘువీర్‌ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన కొన్ని చోట్ల టీ స్టాళ్లు కూడా ఉండకపోయేవి. ఒకవేళ ఉన్నా టీ వేడిగా రుచిగా లేకపోవడంతో తాగేవాడు కాదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొంత జీతం ఇంటికి పంపుతూ, మరికొంత దాచేవాడు. ఇదిలా ఉంటే రఘువీర్‌ డెలివరీ ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఎంతో కొంత డబ్బు తీసుకుని టీ, స్నాక్స్‌ తెచ్చిపెట్టమని కొందరు అడిగేవారు. కానీ ఎక్కువ ఆర్డర్లు ఉండటంతో కుదిరేదికాదు. కొన్నాళ్లకి ఉద్యోగం మానేసి ఆ పనే చేస్తే బాగుంటుంది కదా అనిపించింది రఘువీర్‌కి.

టీ తయారీ నేర్చుకుని...
రాజస్థాన్‌ వాసులు టీని ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా టీతోపాటు ఆలూ సమోసా, కచోరీ, పరోటా వంటివి తింటుంటారు. అవన్నీ ఇంటికే తక్కువ ఛార్జీతో అందిస్తానంటే చాలామంది ఆనందంగా సరే అన్నారు. రఘువీర్‌ ఆ విషయాన్ని స్నేహితులతో చెప్పాడు. మొదట ఇదేం వర్కవుట్‌ కాదని చాలామంది నిరుత్సాహ పరిచినా పట్టించుకోకుండా జైపుర్‌ నగరమంతా తిరిగి రుచిగా, శుచిగా టీ చేసే దుకాణాల్ని వెతికి పట్టుకున్నాడు. ఓ పదిరోజుల పాటు పలు ప్రాంతాల్లోని తనకు తెలిసిన వినియోగదారులకు ఉచితంగా టీ, స్నాక్స్‌ అందించాడు. చాలామంది రఘువీర్‌ టీని ఇష్టపడ్డారు. తరచూ తీసుకోవడానికి ఆసక్తి చూపారు. దాంతో తనమీద తనకి నమ్మకం కలగడంతో ఉద్యోగం మానేసి టీ అందించే అంకుర పరిశ్రమకు శ్రీకారం చుట్టాడు. తినీతినక దాచుకున్న ఇరవై వేల రూపాయల్నే పెట్టుబడిగా పెట్టాడు. టీ హోం డెలివరీ గురించి ఇళ్లూ, ఆసుపత్రులూ, ఆఫీసులూ, చిన్న చిన్న దుకాణాలూ, మిల్క్‌ బూత్‌లూ, బస్సులూ, ఆటోల్లో పోస్టర్లు అంటించాడు. ఒకటి రెండు ఆర్డర్లతో మొదలుపెట్టి రోజుకు వంద ఆర్డర్లు అందుకునే స్థాయికి చేరుకున్నాడు. అప్పటి వరకూ స్టాళ్లలో టీ తీసుకునేవాడు కాస్తా తానే టీ కాయడం నేర్చుకుని సొంతంగా దుకాణం పెట్టాడు. చాలాకాలం ఒక్కడే టీ కాయడం, ఆర్డర్లు తీసుకోవడం, డెలివరీ ఇవ్వడం చేసేవాడు. ఉదయం ఆరు నుంచి రాత్రి పదివరకూ టీలు అందించేవాడు. ఈ క్రమంలో డైలీ కస్టమర్ల జాబితా మూడొందలకు చేరింది. ఆదాయం పెరగడంతో
రఘువీర్‌ కూడా రద్దీగా ఉండే మరో మూడు ప్రాంతాల్లో టీ స్టాళ్లను ఏర్పాటు చేశాడు. జైపుర్‌ నగరమంతా సేవలు విస్తరించి రోజుకి ఎనిమిదొందల ఆర్డర్లు అందించే స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆరుగురు డెలివరీ బాయ్స్‌, మరో పదిమంది సహాయకులకు ఉపాధినిస్తున్నాడు. నెలకి లక్షన్నరపైనే సంపాదిస్తున్న రఘువీర్‌ తల్లిదండ్రుల చేత కూలిపనులు మాన్పించాడు. వారికో ఇల్లు కట్టించి చెల్లినీ, తమ్ముణ్నీ బాగా చదివిస్తున్నాడు. ఒక్క ఆలోచనతో జీవితాన్ని మార్చుకున్న రఘువీర్‌ ఇప్పుడు ఆరు బైకులకి యాజమాని అయ్యాడు. సమస్యలు వచ్చినప్పుడు కూర్చుని కుమిలిపోయేవారు కొందరైతే వాటిని దూరం చేసుకుని జీవితాన్ని సంతోషమయం చేసుకుంటారు మరికొందరు... రఘువీర్‌ రెండోకోవకే చెందుతాడనడంలో సందేహమేముంది!

22 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.