close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరిత్యాగి

- కటుకోజ్వల మనోహరాచారి

రామ్మోహన్‌కు కొడుకుపైన సదభిప్రాయం లేదు.
ఆ మాటకొస్తే పనిచేయని ఎవరి కొడుకులపైనా ఆయనకు సద్భావన కలగదు. చదువుకునే దశలో చదువుకోవాలి.
చదువు చాలనిపిస్తే ఏదో ఒక ఉద్యోగంలోనో సొంత పనిలోనో స్థిరపడిపోవాలి. అంతేకానీ పనీపాటా లేకుండా బలాదూర్‌గా తిరిగిరావడం ఆయనకు నచ్చదు. ఈ విషయంలో కొడుకైనా మరొకరైనా ఆయన అభిప్రాయం అదే.
నాలుగైదు ఉద్యోగాలు మానేశాడు రాజీవ్‌. వాళ్ళ వీళ్ళ చెప్పుచేతలకింద పనిచేయడం ఇష్టంలేనట్లు ప్రవర్తిస్తుంటే కొడుకు కోసం సొంతంగా పుస్తకాల షాపు పెట్టించాడు రామ్మోహన్‌. ఆర్నెల్లు తిరిగేసరికి అప్పులు తప్ప కుప్పలు మిగలని స్థితికి తెచ్చాడు రాజీవ్‌. చివర్లో ఉన్నదంతా అమ్మేస్తే... పెట్టిన పెట్టుబడిలో పదిశాతం కూడా మిగల్లేదు.
రామ్మోహన్‌ కోపం నషాళానికంటింది. అయినా తమాయించుకున్నాడు. ‘‘మనలాంటి మధ్యతరగతి మనుషులు ఉన్నదాన్ని ఎట్లా వృద్ధిలోకి తేవాలో నేర్చుకోవాలిగానీ దివాలా తీసేలా నడపకూడదు. అజాగ్రత్తగా పనిచేస్తే అప్పుల పాలవడంతప్ప మిగిలేదేముండదు’’ పుస్తకాల షాపు అమ్మేసుకొని లెక్కపత్రం పూర్తిచేసి, చేతులు దులుపుకొచ్చిన కొడుకును చూసి ఆవేశం అణచుకుంటూ అన్న మాటలివి.
రాజీవ్‌ తండ్రి వంక ఓ చూపుచూసి మౌనంగా ఉండిపోయాడు.
‘‘వాణ్ణి మాత్రం ఏం చేయమంటారు. తనేమైనా కావాలని లాస్‌ చేశాడా? బిజినెస్‌ అన్నాక లాభాలుంటాయి, నష్టాలుంటాయి. అన్నిటికీ సిద్ధపడే దిగాలి. చెబితే విన్నారా...’’ అంది తల్లి కౌసల్య.
‘‘నువ్విట్లా అన్నిటికీ వెనకేసుకొస్తుంటేనే వాడిట్లా తయారయ్యాడు. పరీక్షలెగ్గొట్టి పేకాట ఆడొస్తే ఏదో చిన్నపిల్లాడన్నావ్‌.
డిగ్రీ చదువు మధ్యలో వదిలేస్తే స్నేహితులు చెడగొడ్తున్నారన్నావ్‌. బలవంతంగా డిగ్రీ పూర్తి చేయించి పీజీకి పంపిస్తే... ఫెయిలయిన కొడుకుని చూసి చాల్లే చదువు అన్నావ్‌. ఏదో ఒకటని ప్రైవేటు ఉద్యోగాల్లో పెడితే వాటన్నిటినీ చేతగాక వదిలేసుకుంటుంటే- వాడసలే సుకుమారుడన్నావ్‌. ఇప్పుడేమో సొంత దుకాణం దివాలా తీస్తే... కావాలని చేశాడా అంటున్నావు. నీలాంటి తల్లుల మాటలు- పిల్లలకి లాభం చేస్తాయో, నష్టం చేస్తాయోగానీ మనవాడు మాత్రం బాగుపడే దాఖలాలు కనిపించడం లేదు’’ అన్నాడు రామ్మోహన్‌. ఎన్నో ఏళ్ళుగా అణచుకుంటున్న మధ్యతరగతి తండ్రి ఆక్రోశం అది.
ఇట్లాంటి సమయంలో వాదించకపోవడమే ఉత్తమమని గ్రహించిన కౌసల్య లోపలికెళ్ళిపోయింది.
రాజీవ్‌ తలెత్తాడు. ‘‘అవేమైనా ప్రభుత్వ ఉద్యోగాలా... పట్టుకొని వేలాడడానికి? ప్రింటింగ్‌ ప్రెస్‌లో కాగితాలు సర్దే ఉద్యోగం, బట్టల షాపులో సేల్స్‌మేన్‌ ఉద్యోగం, ఫైనాన్స్‌ కంపెనీలో అకౌంటెంట్‌ ఉద్యోగం... ఇవన్నీ మన ఒంటికి సరిపడే ఉద్యోగాలు కావు’’ అన్నాడు కొంచెం నిర్లక్ష్యంగా.
‘‘అంటే... నువ్వు చదివిన డిగ్రీ చదువుకు సర్కారు నౌకరీ వస్తుందా ఏంటీ?’’ అన్నాడు రామ్మోహన్‌.
‘‘మీకొచ్చింది గదా!’’
‘‘మా కాలం వేర్రా..! ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగం దొరకాలంటే పెట్టి పుట్టాలి. పెద్దపెద్ద చదువులుండాలి. పోటీ పరీక్షలను ఎదుర్కొనే సత్తా ఉండాలి. అన్నిటికీ మించి అదృష్టం కూడా ఉండాలి.’’ ఇందులో ఏ లక్షణం నీకుంది అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి రామ్మోహన్‌ మాటలు.
‘‘అదృష్టం ఉంటే అదే వస్తుందిలే’’
అంటూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు రాజీవ్‌.
ఏం చేయాలో అర్థంకాక తల పట్టుక్కూర్చున్నాడు రామ్మోహన్‌.
ఎందరి కొడుకుల్నో చూశాడు తను.
తన స్నేహితులతో సమానంగా తనూ తన కొడుకును చదివిద్దామనుకున్నాడు. పాఠశాల దశనుండే నిర్లక్ష్యం. తన స్నేహితుల పిల్లలూ సహోద్యోగుల కొడుకులూ ఉన్నత చదువులు చదువుతుంటే పనికిరాని స్నేహాలతో తన కొడుకు అర్ధాంతరపు చదువులు చదివాడు.
డిగ్రీ పూర్తి చేయడానికి నానాపాట్లు పడ్డాడు. ఇంజినీరింగూ వైద్యవిద్యలూ అటుంచి కనీసం పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయలేకపోయాడు. ప్రయత్నిస్తే అదంత పెద్ద కష్టం కాదుకానీ... మనవాడసలు ప్రయత్నించడే! పెద్ద చదువులమీద ధ్యాసేలేదసలు. ఎంతసేపూ స్నేహితులతో తిరగడం, ఇంటికొస్తే టీవీ చూడ్డంతో సరిపోతుంది.
తనేమో పెద్ద డబ్బున్నవాడు కాడు.
తన ఉద్యోగం కూడా జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి మించదు. ఏదో ప్రభుత్వ ఉద్యోగం ఉందన్న భరోసా తప్ప... పెద్దగా వెనకేసుకుందిగానీ కొడుకుని ప్రయోజకుణ్ణి చేసిందిగానీ లేదు. తర్వాత పుట్టిన కూతురు లక్ష్మీ కోసమన్నా కొంత కూడబెడదామంటే ఉన్న ఒక్క కొడుకుని స్థిరపరచడానికే చేతిలోది కాస్తా ఖర్చయిపోతోంది. ముందు తన కొడుకు ఏదో ఒక ఉద్యోగంలోనో పనిలోనో స్థిరపడిపోతే తర్వాత కొంతకొంత వెనకేయొచ్చనీ, రిటైర్‌ అయ్యేలోపు ఉన్న ఒక్క కూతురుకు తన స్థాయికి తగిన పిల్లాడిని వెతికి పెళ్ళి చేయొచ్చనీ...
చాలా చిన్న కోరికలు.
అవి తీరాలన్నా ముందుగా తన కొడుకు స్థిరపడిపోవాలి. ఎందులో పనికి కుదిర్చినా స్థిరంగా ఉండడంలేదని, ఎంతో కష్టపడి సొంతంగా పుస్తకాల షాపు పెట్టించాడు తను. బిజినెస్‌లో రాణించే నైపుణ్యం కూడా ప్రదర్శించలేకపోయాడు. స్నేహితులనీ
ఉద్దెర ఖాతాలనీ అదీ ముంచేశాడు.
ఎట్లా...? ఎట్లా నెగ్గుకొచ్చేది?
రామ్మోహన్‌ ఆలోచనలు పరిపరివిధాలా పోతున్నాయి.
రాజీవ్‌కు ప్రభుత్వ ఉద్యోగం రావడం మాత్రం అసంభవం. ప్రైవేటు సంస్థల్లో కొలువుకు ఉంచితే స్థిరంగా ఉండటం
లేదు. పగలంతా అక్కడిక్కడ తిరిగి ఇంటికొస్తున్నాడు. ఇంట్లో ఉన్నంతసేపూ సెల్‌ఫోన్‌కో టీవీకో అంకితం అవుతున్నాడు.
ఏం చేసి అతన్ని బాగుపర్చడం..??
నలుగురూ నాలుగు మాటలు చెప్పారు. అందరి మాటల సారాంశం ఒకటే. పెళ్ళి చేస్తే పిల్లాడు బుద్దిమంతుడవుతాడు.
అంతే!
నాలుగునెలలు తిరక్కుండానే రాజీవ్‌ పెళ్ళికొడుకయ్యాడు. రామ్మోహన్‌ గారింట్లోకి మరో సభ్యురాలు అడుగుపెట్టింది కోడలు రూపంలో. సరోజ చాలా చక్కని పిల్ల. భర్తకూ అత్తమామలకూ ఎదురుచెప్పని వినయశీలత ఉంది. కానీ భర్తను ఎట్లా బాగుపర్చుకోవాలో అర్థంకాని స్థితిలో ఆమె కూడా నలుగుతోంది. పెళ్ళయ్యాక కూడా తాను ఏదో ఒక పనిలో కుదురుకోవాలనే ధ్యాస లేకుండా పోయింది రాజీవ్‌కు. తండ్రి నానా తంటాలుపడి ఓ ప్రైవేటు బ్యాంకులో రికార్డ్‌ అసిస్టెంట్‌గా పని ఇప్పించినా... నెల తిరక్కుండానే మానేసి వచ్చాడు. కొడుకూ కోడల్నీ చూసుకోవడంతోపాటు, డిగ్రీ చదువుతున్న కూతురు పెళ్ళికోసం ఎలా సన్నద్ధం కావాలా అన్న ఆలోచన రామ్మోహన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
కొడుకు ప్రయోజకుడు కాకుండానే ఎదిగిన కూతురు కళ్ళముందు తిరుగుతుంటే... తను చేసే చిరుద్యోగంతో ఎట్లా నెట్టుకురావడమో అర్థంకాని స్థితిలో ఉన్నాడు రామ్మోహన్‌.

* * *

కాలం పరుగులు తీస్తున్నా రామ్మోహన్‌ కుటుంబ పరిస్థితుల్లో మెరుగుదల లేదు.
రాజీవ్‌ తండ్రయ్యాడు. మనవడు పుట్టిన ఆనందం ఒకవైపు... కొడుక్కి స్థిరమైన ఉద్యోగం లేదన్న ఆవేదన మరోవైపు. డిగ్రీ పూర్తిచేసి పైచదువులు చదవాలని ప్రయత్నిస్తున్న కూతుర్ని చూస్తుంటే ఒకవైపు సంతోషం... మరోవైపు బెంగ. ఈలోపు తనకు రిటైర్మెంట్‌ వయసు కూడా ముంచుకొస్తున్న విషయం రామ్మోహన్‌ను మరింత మనోవేదనకు గురిచేస్తోంది.
ఆరోజు సాయంత్రం ఆఫీసు నుండి రావడంతోనే ఆయాసంగా అనిపించడంతో బెడ్‌ పైన వాలిపోయాడు. రాత్రి జ్వరం కూడా తగిలింది. తెల్లవారేసరికి జ్వరం, ఆయాసం ఎక్కువవడంతో దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రిలో వీలైనన్ని పరీక్షలు చేశారుకానీ వ్యాధి నిర్ధారణ చేయలేకపోయారు. చివరగా పని ఒత్తిడివల్ల కలిగే సాధారణ సమస్యే అని తేల్చి ప్రాథమిక చికిత్స చేసి పంపించివేశారు.
రామ్మోహన్‌ తేలిగ్గా తీసుకున్నా... ఎక్కడో ఏదో అనుమానం. ఇంతకుముందులా తన శరీరం తనకు సహకరించడంలేదన్న విషయం అర్థం అవుతూనే ఉంది. ఉండబట్టలేక మరుసటిరోజు కరీంనగర్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నాడు... కొడుకును ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకున్నాడేమో తోడల్లుడు రాజేశాన్ని వెంట తీసుకెళ్ళాడు.
హాస్పిటల్‌ వాళ్ళు రకరకాల పరీక్షలుచేసి రామ్మోహన్‌కు వచ్చిన జబ్బేమిటో తేల్చేశారు. అది విని రామ్మోహన్‌తోపాటు వెంటవచ్చిన రాజేశంకూడా హతాశుడయ్యాడు. ప్రారంభ దశలో గుర్తించారు కనుక ఆపరేషన్‌ చేస్తే ప్రయోజనం ఉంటుందనీ లేకుంటే సంవత్సరం కూడా బతకటం కష్టమనీ అన్నారు. పదినుండి పన్నెండు లక్షలదాకా ఖర్చవుతాయన్నారు వైద్యులు.
అశనిపాతం లాంటి వార్త.
రామ్మోహన్‌ కళ్ళముందు... పెళ్ళికెదిగిన కూతురు లక్ష్మీ, ఉద్యోగంలేక తనమీదే ఆధారపడ్డ కొడుకూ కోడలూ, సంవత్సరం కూడా నిండని మనవడూ, ఎప్పుడూ తన యోగక్షేమాల కోసం పూజలూ వ్రతాలూ చేసే భార్యా కనిపించారు.
పన్నెండు లక్షలు ఎక్కణ్ణుంచి తేవాలి? తనేమీ ఆస్తిపాస్తులు కూడబెట్టలేదు, ఎట్లా..?
మరో సంవత్సరంలో రిటైర్‌ కాబోతున్నాడు. రిటైర్మెంటుకు రాబోయే డబ్బుతో కూతురికి పెళ్ళి చేయాలనుకున్నాడు. ఆ డబ్బుల్ని తన జబ్బుకు ఎట్లా మళ్ళిస్తాడు..? అయినా అప్పటి వరకూ ఈ వ్యాధితో తను బతుకుతాడా! మరి తనే పోతే..?!

...అతని ఒళ్ళు క్షణకాలం జలదరించింది. మానసికంగా ఒక్కసారిగా కుంగిపోయాడు.
వెంటొచ్చిన తోడల్లుడు కల్పించుకున్నాడు. ‘‘అన్నయ్యా, ఈ ఆసుపత్రి పెద్దగా నమ్మకమైంది కాదు. మా బంధువులూ స్నేహితులూ చాలామంది మోసపోయారిక్కడ. లేనిపోనివి చెప్పి పేషంట్లను పీల్చి పిప్పిచేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ కార్పొరేట్‌ ఆసుపత్రులే అంత. మనం మరోచోట చూపించుకుందాం’’ అన్నాడు.
రామ్మోహన్‌కు దూరమవుతున్న ఆశలు మళ్ళీ చిగురించాయి. ‘‘పద’’ అన్నాడు.
అప్పటికే తడిసి మోపెడైన బిల్లు చెల్లించి బయటపడ్డారు.
రామ్మోహన్‌ బాగా ఆలోచించాడు. ఆయనకు ఈ ప్రైవేటు వైద్యులను నమ్మాలనిపించడం లేదు.
ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటే?! ఈమధ్య గవర్నమెంటు ఆసుపత్రులు బాగా మెరుగుపడ్డాయట... ఆమాటే చెప్పాడు రాజేశంతో.
అతనూ ఔనన్నాడు.
సాయంత్రానికి జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో జాయిన్‌ అయిపోయాడు రామ్మోహన్‌.
మళ్ళీ టెస్టులన్నీ చేశారు. ఇక్కడి డాక్టర్‌ యువకుడు. రామ్మోహన్‌తో కూలంకషంగా అన్నీ మాట్లాడాడు. రెండుమూడు గంటల తర్వాత డిశ్చార్జి చేశారు. మందులు తీసుకుని హుషారుగా బయటకొస్తున్న రామ్మోహన్‌ను తోడల్లుడు రాజేశం ఆసక్తిగా చూశాడు.
‘‘ఏం చెప్పారు డాక్టర్‌గారు?’’
‘‘నువ్వు చెప్పిందే నిజం. పెద్ద ఆసుపత్రి అని వెళ్తే పెద్దగా మోసం చేద్దాం అని చూశారు. ఏకంగా పదిపన్నెండు లక్షలకు గాలం వేశారు. ఇక్కడ డాక్టర్లు మాత్రం ఇది కేవలం పని ఒత్తిడితో వచ్చిన ఆయాసమే అన్నారు’’ ప్రశాంతత నిండిన మనసుతో చెప్పుకొస్తున్నాడు రామ్మోహన్‌.
తేలికపడిన మనసుతో నవ్వాడు
రాజేశం. ‘‘ఇంకా ఏం చెప్పారు’’ అన్నాడు బండివైపు నడుస్తూ.
‘‘ఏమీలేదు. విశ్రాంతి ఎక్కువగా తీసుకోమన్నారు. కొంతకాలం నెలనెలా వచ్చి మందులు తీసుకొని వాడమన్నారు.’’
‘‘ఏదైతేనేం... అన్నీ మన మంచికే జరిగాయి’’ అంటూ బండి కదిలించాడు రాజేశం.

* * *

రామ్మోహన్‌ జీవనశైలిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఎక్కువగా ఇంటిపట్టునే ఉంటున్నాడు. నెలనెలా ఆసుపత్రికి వెళ్ళడం, డాక్టరుతో మాట్లాడడం, మందులు తెచ్చుకోవడం చేస్తున్నాడు. భార్యాపిల్లలు పలుమార్లు ప్రశ్నిస్తే పనిభారం తగ్గించుకోవాలన్న వైద్యుని మాటే చెప్పాడు. హాస్పిటల్‌కు వెళ్తున్నప్పుడు మాత్రం అప్పుడప్పుడు లక్ష్మిని వెంట తీసుకెళ్తున్నాడు.
ఉద్యోగవిరమణకు ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది. ఈ దశలో ఉరుకులు పరుగులతో ఉద్యోగం చేయడం ఎందుకనుకున్నాడు. సాధ్యమైనన్ని సెలవులు వాడుకుంటున్నాడు. ఆయన ఒకప్పటిలా లేడన్నది ఇంటిల్లిపాదీ గ్రహించారు. గతంలో రామ్మోహన్‌ పనిదినాల్లో సెలవుపెట్టి ఇంట్లో విశ్రాంతి తీసుకున్న దాఖలాలు లేవు. తండ్రి ఇట్లా ఖాళీగా ఇంట్లో పడుకుని ఉంటే ఏదోలా ఉంది రాజీవ్‌కు. ఏనాడూ విశ్రాంతి అంటే ఎరుగని మనిషి. ఎప్పుడూ పనిని నమ్ముకున్నవాడు. తమ అభ్యున్నతి కోసం నిరంతరం తపించిన వ్యక్తి... ఇప్పుడిలా నిస్సత్తువగా... పొరపాటున తండ్రికేదైనా అయితే!
ఇంతకాలం తనకు బాధ్యత తెలియలేదు. చదువుమీదా ఉద్యోగంమీదా చేసే పనిమీదా శ్రద్ధ కనబర్చలేకపోయాడు. తండ్రి సంపాదించి తెస్తుంటే తేరగా తిని తిరగడానికి అలవాటుపడ్డ తనకు తండ్రి మంచానపడితే ఏమిటి పరిస్థితి? ఇప్పటికీ సరైన ఉపాధి లేదు తనకు. అమ్మా చెల్లెలూ కూడా భయపడుతున్నట్లే ఉన్నారు... ఇప్పుడెలా?
అసలు నాన్నకేమైంది... తనేం చేయాలి..? అతనిలో ఆలోచనల సుడిగుండాలు.
ఆ రాత్రి... తండ్రి - తననూ చెల్లెల్నీ పక్కన కూర్చోబెట్టుకుని ‘‘నీ ఉద్యోగం, చెల్లెలి పెళ్ళీ ఇంకా మిగిలిపోయే ఉన్నాయి’’ అన్నాడు. తనేమీ మాట్లాడలేకపోయాడు.
తెల్లవారేసరికి నిద్రలోనే కన్నుమూశాడు రామ్మోహన్‌.

* * *

‘లక్ష్మి వెడ్స్‌ డా।। వినయ్‌’ అనే అక్షరాలు మంటపం గోడకు మెరుస్తున్నాయి. వాటికి ముందు పందిట్లో లక్ష్మి... వరుని తలపై తలంబ్రాలు పోస్తోంది. పక్కనే పెళ్ళి బాధ్యతలు మోస్తూ రాజీవ్‌, సరోజ దంపతులు. ఆ పక్కనే తల్లి కౌసల్య. భర్తపోయి సంవత్సరం గడిచిన బాధను కూతురుకు పెళ్ళవుతున్న సంతృప్తి కప్పివేస్తోంది.
పెళ్ళిమంటపం బంధుమిత్రులతో సందడిగా ఉంది. తలంబ్రాల కార్యక్రమం కొనసాగుతోంది. రాజీవ్‌ కళ్ళలో సంతృప్తితో కూడిన ఆనందం. మనిషిలో నిండుదనం కనిపిస్తోంది.

అప్పటికి రామ్మోహన్‌ చనిపోయి సంవత్సరం గడిచిపోయింది. ఆయన పోయేనాటికి ఉద్యోగ విరమణకు ఇంకా రెండు నెలల సమయముంది. అప్పటికి కొడుక్కి ఉద్యోగం లేదు, చదువాగిపోయిన కూతురు పెళ్ళీడు వయసులో ఉంది. ఆస్తుల్లేవు, ఆదుకునేవాళ్ళు లేరు. కుటుంబాన్ని చుక్కాని లేని నావలా మార్చి తండ్రి తమను వదిలిపెట్టి పోవడం రాజీవ్‌ జీర్ణించుకోలేక పోయాడు. అయితే, తండ్రి పోయిన బాధనుండి విముక్తుడు కాకమునుపే తండ్రి ఉద్యోగం కొడుక్కి లభించడం పెద్ద ఉపశమనం. నట్టనడి సంద్రంలో కొట్టుకుంటున్న వాడికి ఒడ్డుకు చేర్చే నావ దొరికినట్టయింది రాజీవ్‌కు.
అయితే... చెల్లెలి పెళ్ళి బాధ్యత తనపైన మిగిలిపోయింది.
ఈ దశలో డాక్టర్‌ వినయ్‌ రూపంలో కోరి ఇంటికి నడచి వచ్చింది సంబంధం.
ఈ రోజుల్లో ఒక వైద్యుడు తన ఇంటికి కుటుంబంతో వచ్చి, కట్నకానుకలు కోరకుండా తన చెల్లెల్ని అడగడం రాజీవ్‌ను విస్మయానికి గురిచేసింది. తల్లితో పాటు లక్ష్మి మారుమాట లేకుండా అంగీకరించారు. రాజీవ్‌ గర్వంగా ఫీలయ్యాడు. తండ్రి
ఉన్నా ఇట్లాంటి సంబంధం తెచ్చేవాడో లేడో అనుకున్నాడు.
ఇంతలో కొత్త దంపతులిరువురూ పీటల మీద నుంచి లేచారు. పురోహితుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోమంటున్నాడు. వాళ్ళు నేరుగా రామ్మోహన్‌ ఇంట్లోకి నడిచారు. వెనుకే రాజీవ్‌ దంపతులు, తల్లి, నలుగురు పెద్దలూ వచ్చారు.
కొత్త దంపతులు ముందుగా హాల్లో ఉన్న రామ్మోహన్‌ చిత్రపటం ముందు మోకరిల్లారు.
రాజీవ్‌ పక్కనే ఉన్న దేవుని చిత్రపటానికి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించాడు.
‘‘మా నాన్న ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోవడంతో నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం రావడంవల్లనే చెల్లెలి పెళ్ళి చేయగలిగాను. అంతా దేవుడి దయ’’ అన్నాడు.
‘‘కాదు’’ అన్నాడు రామ్మోహన్‌ చిత్రపటానికి మొక్కి ఇటు తిరిగిన పెళ్ళికొడుకు.
విస్మయంగా చూశారంతా. ‘‘ఆయన చనిపోవడం వల్ల ఉద్యోగం రావడం కాదు, నీకు ఉద్యోగం రావడం కోసం ఆయన చనిపోయారు.’’
విచలితుడై చూశాడు రాజీవ్‌ అతనివంక. ‘‘అంటే..?’’
‘‘తనకు వచ్చిన వ్యాధికి చికిత్స చేయించుకుంటే లక్షలు ఖర్చవుతాయని చికిత్స నిరాకరించారు మీనాన్న. రిటైర్మెంట్‌ తర్వాత చనిపోతే కొడుగ్గా నీకు ఉద్యోగం రాదని కేవలం నీకోసం... తను చికిత్స చేయించుకోలేదు. ఉద్యోగ విరమణకు ముందే మరణాన్ని చేజేతులా ఆహ్వానించారు. చికిత్స చేయించుకున్నా ఎక్కువకాలం బతకనన్న విషయం తెలుసుకుని, అప్పటికి తన కొడుక్కి ఉద్యోగం లేక, కూతురు పెళ్ళికి డబ్బూ ఉండక, తనవారి గతేమవుతుందోనని ఆలోచించి తన కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఉత్తముడు ఆయన.’’
రాజీవ్‌ హృదయం భారంగా మారింది.
‘‘ఇదంతా మీకెలా తెలుసు?’’
‘‘ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ని నేనే! అంతటి త్యాగమూర్తి బిడ్డకు చేయూతనివ్వాలనీ ఆయన ఆత్మ కొంతైనా సంతృప్తి చెందాలనీ లక్ష్మిని ఏరికోరి పెళ్ళి చేసుకున్నాను. దేవుడు ఇంకెక్కడో లేడు, పరిత్యాగి అయిన మీ తండ్రి రూపంలో ఉన్నాడు.’’
అక్కడ అందరి కళ్ళూ నీళ్ళతో నిండిపోయాయి.
రాజీవ్‌ చలించిపోయాడు.
‘‘అవును బావా, ఇంతకాలం మా దేవుణ్ణి మేమే గుర్తించలేకపోయాం’’ అంటూ కళ్ళనీళ్ళతో తండ్రి చిత్రపటం ముందు వాలిపోయాడు. అతని వెనుకే ఇంటిల్లిపాదీ మోకరిల్లారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.