close
పెట్టుబడి ఉంది... ఐడియా ఉందా?

ఓ మంచి వ్యాపార ఆలోచన తట్టగానే ‘యురేకా’ అని అరవాలనిపిస్తుంది. కానీ ఆ వెంటనే ఎన్నో సందేహాలూ, మరెన్నో ప్రశ్నలూ. ఆ సందేహాల్ని నివృత్తి చేసుకోవాలన్నా, ప్రశ్నలకు జవాబులు దొరకాలన్నా
చేయాల్సిందల్లా ఒక్కటే... ఐఐటీ బొంబాయి ‘ఆంత్రప్రెన్యూర్‌ సెల్‌’ నిర్వహించే యురేకా వ్యాపార ఆలోచనల పోటీలో పాల్గొనడమే. అక్కడ గెలిస్తే అది కచ్చితంగా యురేకా అనదగ్గ ఆలోచనే!

దేశంలో ఔత్సాహిక వ్యాపారుల్ని ప్రోత్సహించడానికి ఇటీవల చాలా సంస్థలు పోటీలుపెట్టి బహుమతులు అందిస్తున్నాయి. అలాంటి పోటీల్లో ఐఐటీ బొంబాయి ‘ఇ సెల్‌’ చేపట్టే ‘యురేకా’నే నంబర్‌వన్‌. పోటీకి వచ్చే దరఖాస్తులు(గతేడాది 10వేలు) చూస్తే ఇది ఆసియాలోనే అతిపెద్ద వ్యాపార ఆలోచనల పోటీ. గత 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీల నిర్వహణను ఐఐటీ విద్యార్థులే చూసుకుంటారు. తమ దగ్గర వినూత్నమైన వ్యాపార ఆలోచన ఉందని భావించే వారెవరైనా పోటీలకు అర్హులే. కాకపోతే ఒకవేళ ఇప్పటికే అంకుర సంస్థగా రిజస్టరు అయితే నమోదు తేదీ ఆగస్టు 24కి 2019 నాటికి రెండేళ్లు మించకూడదు. మొత్తంగా మూడు విభాగాల్లో ఈ పోటీల్ని నిర్వహిస్తున్నారు. అవి... వ్యాపార ఆలోచన, సామాజిక దృక్పథం ఉన్న ఆలోచన, ఐఐటీ బొంబాయి విద్యార్థుల ఆలోచన. ఈ మూడు విభాగాల్లో రూ.50 లక్షల నగదు బహుమతులు అందిస్తారు. వ్యాపార ఆలోచనలో ప్రథమంగా నిలిచే బృందం రూ.5 లక్షలు, ద్వితీయ జట్టు రూ.3 లక్షలు అందుకుంటుంది. సామాజిక వ్యాపార ఆలోచన విభాగంలో తొలిరెండు స్థానాల్లో నిల్చిన జట్లు రూ.2 లక్షలు, రూ.1 లక్ష అందుకుంటాయి. ఐఐటీ బొంబాయి విద్యార్థుల విభాగంలో రూ.1 లక్ష అందుతుంది. నగదు బహుమతికంటే కూడా పోటీలో రెండో దశ నుంచీ దొరికే నిపుణుల మార్గనిర్దేశం అమూల్యమైనదని చెప్పాలి. ఐఐటీ ప్రొఫెసర్లూ, వివిధ రంగాల్లోని నిష్ణాతులూ, పెట్టుబడిదారులూ వీరికి మార్గనిర్దేశకులుగా ఉంటారు.

దరఖాస్తుల సమయం...
2019 పోటీలకు గానూ దరఖాస్తుల్ని ఆన్‌లైన్ (ecell.in/eureka) లో తీసుకుంటున్నారు. సెప్టెంబరు 24 ఆఖరుతేదీ.
దరఖాస్తులో వ్యాపార నమూనా(బిజినెస్‌ మోడల్‌)ను వివరించడంతోపాటు నిర్వహకులు అడిగే వివిధ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఆలోచనలో వినూత్నత, దాన్ని ఆచరణలోకి తేవడం, మార్కెట్‌ పరిధి... మొదలైన కోణాల్లో న్యాయనిర్ణేతలు ఆలోచనని సమీక్షిస్తారు. మొత్తం దరఖాస్తుల్లోంచి కేవలం 80-90 ఆలోచనల్ని రెండో దశకు ఎంపికచేస్తారు. ఈ దశలో నిపుణుల నుంచి ఆన్‌లైన్లో మార్గనిర్దేశం అందుతుంది. నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ మార్గనిర్దేశం అందేలా చూస్తారు. ఒక్కో బృందంలో ఒక్కరి నుంచి ఏడుగురు వరకూ ఉండొచ్చు. బృంద సభ్యుల వివరాల్నీ దరఖాస్తుతోపాటు తెలపాలి. పోటీలో పాల్గొనేవాళ్లు విద్యార్థులే కానవసరంలేదు. ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ, సాధారణ వ్యక్తులూ, ఇతర వృత్తుల్లో ఉన్నవారెవరైనా కావచ్చు. రెండో దశకు చేరిన బృందాల నుంచి 10-15 బృందాల్ని ఎంపికచేస్తారు. వారికి ఐఐటీ-బీ క్యాంపస్‌లో మూడు రోజులపాటు నిపుణుల సమక్షంలో శిక్షణ ఉంటుంది. ఈ దశలో నమూనా ఉత్పత్తి తెస్తారు. అదే సమయంలో న్యాయ నిర్ణేతలకు తమ ఆలోచనను వివరించేలా, పెట్టుబడిదారుల్ని మెప్పించేలా మాట్లాడటంలో శిక్షణ ఇస్తారు. వీరంతా ఐఐటీ ఇ-సెల్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘ఇ-సమిట్‌’ వేదిక మీద తమ ఉత్పత్తి గురించి న్యాయనిర్ణేతలకూ, పెట్టుబడిదారులకూ చెప్పాల్సి ఉంటుంది. ఈ సమావేశం 2020 ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరుగుతుంది. ఆ వేదికమీదనే విజేతల్నీ ప్రకటిస్తారు. ఈ దశకు చేరేసరికి ఆలోచన కాస్తా ఆవిష్కరణగా మారిపోతుంది. ఇ-సమిట్‌లో ప్రపంచస్థాయి అంకుర సంస్థల వ్యవస్థాపకుల్ని చూడొచ్చు, కలిసి మాట్లాడొచ్చు. కొన్ని సంస్థలకు ఇక్కడ పెట్టుబడి వచ్చే అవకాశమూ ఉంటుంది. పోటీల తర్వాత కూడా విజేతలకు ఇ-సెల్‌నుంచి వివిధ రకాలుగా ప్రోత్సాహమూ, మార్గనిర్దేశమూ కొనసాగుతుంది.
గతేడాది విజేతల్లో ‘ఎకో ఫ్రెండ్లీ పాలిమర్‌’ సంస్థ బిజినెస్‌ విభాగంలో విజేతగా నిలిచింది. ఈ సంస్థ తయారుచేసిన సేంద్రియ పాలిమర్‌ను మొక్కల పాదులో మట్టితో కలిపి వేసినపుడు నీటిని ఆవిరికాకుండా ఆపి, ఎక్కువకాలం మొక్కకు అవసరమైన తేమను అందిస్తుంది. ఈ కేటగిరీలో ద్వితీయ బహుమతి ‘ఫుడ్‌ కో వర్క్స్‌’ సంస్థ అందుకుంది. ఈ సంస్థ ‘కో వర్కింగ్‌ కిచెన్‌’లను అభివృద్ధి చేస్తోంది. బయో డీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ తయారుచేస్తున్న గ్రీన్‌ర్యాప్‌, తక్కువ ధరకే నీటిశుద్ధి యంత్రాలు తయారుచేస్తున్న ప్యూర్‌ పానీ సంస్థలు సామాజిక వ్యాపార ఆలోచనల విభాగంలో అవార్డుల్ని అందుకున్నాయి.
ఈసారి మీవంతు వస్తుందేమో ప్రయత్నించండి!


జూనియర్లకీ పోటీ...

పాఠశాల విద్యార్థులూ ఇటీవల అద్భుతమైన ఆవిష్కరణలు చేపడుతున్నారు. మరింతమందిని ఈ దిశగా ప్రోత్సహించడానికి యురేకా జూనియర్స్‌ స్థాయి పోటీల్ని నిర్వహిస్తున్నారు. 6-10 తరగతుల విద్యార్థులకు ఈ పోటీలు ఉంటాయి. విజేతకు రూ.లక్ష నగదు బహుమతి అందుతుంది. వీరు తమ వివరాల్ని ఇ సెల్‌/యురేకాజూనియర్‌ విభాగంలో నమోదు చేసుకోవాలి. అక్టోబరు 30 ఆఖరుతేదీ. వీరి ఎంపిక ప్రక్రియ కూడా సీనియర్లని పోలి ఉంటుంది.

15 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.