close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాజులీ... పచ్చని లోగిలి..!

మాజులీ... గులాబీరంగు సూర్యాస్తమయానికీ పచ్చని పంటపొలాలకీ నిండైన కొలనులకీ ఊగాడే వెదురు వంతెనలకీ రంగురంగుల పక్షులకీ పెట్టింది పేరు. బ్రహ్మపుత్రానదిలో వెలసిన ఈ అతిపెద్ద దీవి... చూడచక్కని పచ్చని లోగిలి..!

సోం రాష్ట్రంలో భాగమైన మాజులీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. దేశంలో జిల్లాగా మారిన ద్వీపం ఇదొక్కటే. ప్రకృతి సౌందర్యానికీ హస్తకళాకృతులకీ నెలవైన మాజులీ, అసోం దుఃఖదాయనిగా పేరొందిన బ్రహ్మపుత్రలోనే క్రమంగా కలిసిపోనుంది. మరో ఇరవయ్యేళ్లలో కనుమరుగై పోవచ్చనేది నిపుణుల అంచనా.
బ్రహ్మపుత్రకీ దాని ఉపనదులకీ వచ్చిన భారీ వరదల్లోంచే మాజులీ పుట్టుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ వరదల వల్లే కోతకి గురై కుంచించుపోవడం దురదృష్టకరం. వందేళ్ల క్రితం వరకూ 1,250 చదరపు కిలోమీటర్లలో 250 పైచిలుకు గ్రామాలతో ఉన్న మాజులీ, ప్రస్తుతం 515 చదరపు కిలోమీటర్లే మిగిలి ఉంది. గత ముప్ఫై ఏళ్లలో 35 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అతిపెద్ద నదీ దీవిగా గిన్నిస్‌ బుక్‌ రికార్డు ఇప్పటికీ మాజులీకే సొంతం.

ఆ దీవిలో ఏముంది?
జోర్‌హాట్‌ నగరం నుంచి రిక్షాలూ ట్యాక్సీల్లో నదీతీరంలోని నిమాతీఘాట్‌కు చేరుకుని అక్కడి నుంచి ఫెర్రీ లేదా పడవల్లో గంటా రెండు గంటల్లో మాజులీని చేరుకోవచ్చు. దీవిలో ఎక్కడా ఎత్తైన భవనాలూ టీవీ డిష్‌లూ కనిపించవు. ప్రకృతి ఒడిలో నివసిస్తోన్న స్వచ్ఛమైన అస్సామీలు మాత్రమే కనిపిస్తారు. వాళ్లు తినే ఆహారమూ వాడుకునే వస్తువులూ నివసించే ఇళ్లూ ధరించే దుస్తులూ సకలం స్వయంగా వండినవీ, చేత్తో చేసినవే.
దీవిలో ఎటుచూసినా వెదురుపొదలే. నిశ్శబ్దంగా ఉన్న ఆ రోడ్లమీద ప్రయాణిస్తుంటే పొదల్లోంచి వచ్చే గాలి వేణునాదంలా వినిపిస్తుంటుంది. సంగీత పరికరాలూ ఫెర్రీలూ ఇళ్లూ ఫర్నిచరూ అన్నీ వెదురుతోనే చేస్తారు. గుంజల్ని పాతి, వాటికి పై భాగంలో వెదురుతో స్టిల్ట్‌ తరహా ఇళ్లు కట్టుకుంటారు. ఇప్పుడిప్పుడు వర్షాకాలంలో వచ్చే వరదల్ని తట్టుకునేందుకు కాంక్రీటు స్తంభాలు కట్టినా వాటిమీద వెదురు పొదరిళ్లనే కడతారు.
ప్రస్తుతం ఈ దీవిలో 243 గ్రామాలు ఉన్నాయి. జనాభా లక్షన్నర పైనే. పండగలూ వేడుకలూ అందరూ కలిసే చేసుకుంటారు. ఇంటింటా మగ్గం తప్పక ఉంటుంది. కాటన్‌, సిల్కు దారాలతో దుస్తులు నేయడం మాజులీ వాసులకి వెన్నతో పెట్టిన విద్య.
అసోంలో 16వ శతాబ్దంలో ఉద్యమంలా పుట్టుకొచ్చిన నవీన వైష్ణవ మతానికి రాజధాని మాజులీనే. ఈ మతానికి మూల గురువైన శ్రీమాన్‌ శంకరదేవ మతసారాన్ని బోధించేందుకు ‘సత్రా’ల పేరుతో 22 వైష్ణవారామాలను ఏర్పాటుచేశాడు. మాజులీ వాసులకి ఇవే దేవాలయాలు. తరాలనాటి అసోంవాసుల ఆభరణాల్నీ పాత్రల్నీ ఆయుధాల్నీ మాస్క్‌ల్నీ సత్రాల్లో ప్రదర్శిస్తుంటారు.

వరి... వంద రకాల్లో!
వీళ్ల ప్రధాన వృత్తి వ్యవసాయం. దాదాపు వంద రకాల వరిని పండిస్తారు. కోమల్‌ సాల్‌ అనే బియ్యాన్ని గోరువెచ్చని నీటిలో 15 నిమిషాలపాటు నానబెట్టి అల్పాహారంగా తింటుంటారు. వరదని తట్టుకుని పెరిగే బావోధాన్‌ అనే మరో రకాన్ని సంప్రదాయ వంటల్లో ఎక్కువగా వాడతారు. మట్టి కుండల్లో అదీ హరప్పా నాగరికత కాలంనాటి పద్ధతుల్లో వండటం ఇక్కడ కనిపిస్తుంది. సందర్శకులంటే వీళ్లకి ఎంతో అభిమానం. ఆప్యాయంగా ఇంటికి ఆహ్వానించి మరీ టీ ఇస్తారు. సైబీరియా కొంగలూ పెలికాన్‌లూ స్టార్క్‌లూ... ఇలా రకరకాల పక్షులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడి సరస్సులకి తరలి వస్తుంటాయి. కథల్లో వినే రాజహంస పేరు గల ఒక రకం బాతులు హాయిగా విహరిస్తుంటాయక్కడ. అందుకే మాజులిలో కొన్నిరోజులైనా గడపాలనుకోని ప్రకృతిప్రేమికులు ఉండరేమో!

15 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.