close
నేల మనది... బాధ్యతా మనదే! ...

కొన్ని శతాబ్దాలుగా భూమికి జరగని నష్టం ఈ శతాబ్దంలో జరిగింది. నేల కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం... అని విడిగా చెబుతున్నా, ఇవన్నీ మన బతుకునే కలుషితం చేస్తున్నాయన్నది కాదనలేని నిజం. దాన్నుంచి బయటపడ్డానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ ఆదర్శం!

కరవులోనూ మొక్కలు పెంచారు!

వానలు కురవని చోట పచ్చదనం పెంచడమంటే యజ్ఞం చేసినట్లే. అలాంటిచోట నాటిన మొక్కలు పెరిగి పెద్దవి కావాలంటే రెండు మూడు వేసవులైనా వాటిని జాగ్రత్తగా కాపాడాలి. ఆ పనే చేస్తున్నారు కర్ణాటకకు చెందిన అటవీ అధికారి సంతోష్‌ అజూర్‌. రాష్ట్రంలోని విజయపుర జిల్లాలోని ఇంది, ముద్దబెహాళ తాలూకాల్లో ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా పరిధిలో 1787 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. పేరుకే అటవీ ప్రాంతం కానీ చాలాచోట్ల ముళ్లకంపలు తప్పించి చెట్లు లేవు. వాటినీ అలాగే వదిలేస్తే ఉన్న కొద్ది చెట్లనీ నరికేస్తున్నారని చాలామంది అధికారులు ఖాళీ ప్రాంతంలో మొక్కలు నాటించారు. కానీ నీటి చుక్కలేని చోట మొక్కలు పెôచడమంటే మాటలా. ప్రతి వేసవికీ మొక్కలు మోడైపోయేవి. ఇదే ప్రాంతానికి చెందిన సంతోష్‌ అజూర్‌ అధికారిగా వచ్చాక ఎలాగైనా పచ్చదనం పెంచాలనుకున్నారు. అక్కడికి కాస్త దూరంలో కృష్ణా నుంచి నీరు వెళ్లే కాలువ పోతుంది. అక్కణ్నుంచి నీటిని ట్యాంకర్లలో నింపి తెచ్చి మొక్కలకు పోయడం మొదలుపెట్టారు. మొక్కలు నాటిన సంవత్సరం వారంలో ఆరు రోజులూ, రెండో ఏడాది వారంలో రెండు రోజులూ నీరు పెట్టేవారు. మూడో సంవత్సరం నుంచి దాదాపు నీటి అవసరం లేకుండా అవే పెరిగేవి. మొండి పరిస్థితుల్లోనూ పెరిగే కానుగ, రావి, వేప, మర్రి రకాల్ని ఎంపికచేసుకుని అటవీ ప్రాంతంతోపాటు రోడ్డు పక్కనా, పాఠశాలలూ, కళాశాలల ప్రాంగణాల్లో, ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో నాటించారు సంతోష్‌. పెరిగిన మొక్కల్ని నర్సరీల్లోనే తొమ్మిది అడుగులు పెరగనిచ్చి నాటుతుండటంవల్ల మంచి ఫలితాలు వచ్చాయి. గ్రామస్తులూ, విద్యార్థులూ, అధికారులూ తోడురాగా ఆరేళ్లలో లక్షన్నర మొక్కల్ని పెంచారు.

స్వచ్ఛ సేవకులు...

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్‌టెల్‌ మారథాన్‌లో దాదాపు 20 వేల మంది పాల్గొన్నారు. ఒక్కొక్కరూ నాలుగు వాటర్‌ బాటిళ్లు తాగినా మొత్తం 80వేల బాటిళ్లు అవుతాయి. వాటిని దారి పొడుగునా విసిరేస్తుంటే ఎంత చెత్త తయారవుతుంది. అలా పడేసిన ప్రాంతాన్ని శుభ్రం చేయడం ఎంత కష్టం, అవన్నీ చెరువుల్లో కలిస్తే ఇంకెంత నష్టం. ఇదంతా ఆలోచించే ‘అర్త్‌లింగ్స్‌’ సంస్థ మారథాన్‌ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా మార్చడానికి ‘గ్రీన్‌ పార్ట్‌నర్‌’గా పనిచేసింది. ఐటీ ఉద్యోగి శ్రీరామ్‌ ఆరుమిల్లి దీన్ని 2016లో ప్రారంభించాడు. అర్త్‌లింగ్స్‌ ఇప్పటివరకూ 15 మారథాన్‌లలో ఈ విధమైన సేవలు అందించింది. మారథాన్‌ ప్రారంభమయ్యే, ముగిసేచోట, మారథాన్‌ సాగే దారిలో సంస్థకు చెందిన వాలంటీర్లు వేస్ట్‌ బ్యాగులు పట్టుకుని నిల్చుంటారు. వాటర్‌ బాటిళ్లనీ, ఇంకా ఇతర వ్యర్థాలను అందులో వేయమని చెబుతారు. దీనివల్ల పరిశుభ్రత పెరుగుతుంది, కార్మికుల శ్రమ తగ్గుతుంది. ఇంకా నీళ్ల సీసాలకు బదులుగా క్యాన్లలో నీళ్లు నింపి గ్లాసులతో అందిస్తారు. ఒక్కో మారథాన్‌కు కనీసం వెయ్యి కిలోల చెత్తను వీరు ఈ పద్ధతిలో సేకరిస్తారు. మారథాన్‌లు లేని సమయాల్లోనూ నగరంలోని వివిధ ప్రభుత్వ భవనాలూ, ప్రధాన కూడళ్లూ, ఫ్లైఓవర్ల దగ్గర గోడల్ని శుభ్రంచేసి రంగులువేస్తారు. 
సీడ్‌ బాంబుల్నీ, మొక్కల్నీ పంచుతారు. ఇదంతా శ్రీరామ్‌ అతడి బృందంలోని మరో వంద మంది వాలంటీర్లు కలిసి చేస్తుంటారు.

ఆ వీధి చాలా క్లీన్‌... 

తిరువీధి అమ్మన్‌ కోయిల్‌ స్ట్రీట్‌ ఆర్‌.కె.నగర్‌... చెన్నైలోని ఈ వీధిలో నడుస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రహరీ గోడలకు మంచి రంగులు వేసి వాటిమీద ఆకర్షణీయమైన బొమ్మలు గీసి ఉంటాయి. పచ్చదనాన్ని పెంచేలా గోడలకు ఆనుకొని పూల మొక్కలూ, వాటిమీద పాకుతూ తీగ మొక్కలూ కనిపిస్తాయి. అంతేకాదు, దారిలో ఎక్కడా ఓ చిత్తు కాగితంగానీ మరే రకమైన చెత్తగానీ కనిపించదు. అలాగనీ అదేమీ ముఖ్యమంత్రి, గవర్నర్‌ ఉండే ప్రాంతం కాదు. అక్కడుండేదంతా సామాన్యులే. కానీ వారి అసామాన్యమైన ఆలోచనా, ఆచరణా ఆ వీధికి ఓ ప్రత్యేకతను తీసుకువచ్చాయి. వీధిలో ఉండే 80 ఇళ్ల యజమానులు ఆరేళ్లకిందట సంఘంగా ఏర్పడి తమ వీధిని శుభ్రంగా ఉంచాలని ప్రతినబూనారు. వీధిలో చెత్త డబ్బా ఉండదు. తడి చెత్తని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గుంతల్లో వేస్తారు. దాన్ని సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి వాళ్లే వాడుకుంటారు. ఈ-వేస్ట్‌ని సేకరించడానికి ప్రత్యేక కేంద్రం ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలైనా అక్కడ ఇచ్చేయాల్సిందే. పొడిచెత్తని సేకరించి కార్పొరేషన్‌కు అప్పగిస్తారు. అందుకే అక్కడ అంత శుభ్రత. వీరి ప్రయత్నాన్ని మెచ్చి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అవార్డు కూడా ఇచ్చింది! 

15 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.