close

వ్యాయామానికి సై ‘ఫిట్‌ ఇండియా’కు జై

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయనేది పాత మాట. కూర్చుని తింటూ కొండల్లా పెరిగిపోతున్నామన్నది ఇప్పటి మాట. రోజురోజుకూ మారుతున్న జీవనశైలీ ఆహారపుటలవాట్ల వల్ల స్థూలకాయం ఓ పక్కా, పౌష్టికాహారలోపం మరోపక్కా ప్రజానీకాన్ని నిస్తేజం చేస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పదడుగులు వేస్తే ఆయాసం, నాలుగు మెట్లెక్కితే నీరసం. ఇలా ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడుతుందని సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రే రంగంలోకి దిగారు. ‘ఫిట్‌ ఇండియా’ దిశగా ‘పదండి ముందుకు...’ అంటున్నారు. మరి మీరు సిద్ధమా?

బతకడానికి తిండి అనుకున్నన్నాళ్లూ ఆ తిండి సంపాదించుకోడానికి కాయకష్టం చేసేవాళ్లం. కానీ, శరీరాన్ని కష్టపెట్టనక్కరలేకుండా సంపాదించడం నేర్చుకున్నాక ఆ తిండితోనే చేజేతులా ప్రాణాలకు ఎసరు తెచ్చుకుంటున్నాం. సూటిగా చెప్పాలంటే- శరీరానికి పనిలేకపోవటమూ, అవసరంలేని తిండి తినడమూ... ఈ రెండూ కలిసి ఇప్పుడు మనిషి ఉసురు తీస్తున్నాయి. ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచమంతా ఇదే పరిస్థితి. శరీరానికి చాలినంత పని లేకపోవడమే మరణాలకు ప్రధాన కారణమంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రతి నలుగురిలోనూ ఒకరు పూర్తిగా మందకొడిగా ఉంటున్నారనీ, నూటికి ఎనభై మంది పిల్లలకు శారీరక వ్యాయామం అంటే ఏమిటో తెలియడం లేదనీ హెచ్చరిస్తోంది ఆ సంస్థ. మనదేశంలో నూటికి 54 మంది ఏ విషయంలోనూ కొంచెం కూడా ఒళ్లు వంచడం లేదంటోంది భారత వైద్య పరిశోధక మండలి. కేవలం పదిశాతం మాత్రమే చెమటోడ్చే వ్యాయామం ఏదో ఒకటి చేస్తున్నారట. అంటే- ఎంతో అభివృద్ధి సాధించామనుకుంటున్న మనం చివరికి బద్దకంతో మన సమాధుల్ని మనమే తవ్వుకుంటున్నామన్న మాట. ఎక్కడ వచ్చింది ఈ మార్పు? ఎందుకిలా మారిపోయాం మనం?

స్టైల్‌ మారుతోంది...
ఓ నలభై యాభై ఏళ్ల క్రితం... సగటు మధ్య తరగతి జీవితంలో రోజుకు కనీసం ఏడెనిమిది కిలోమీటర్ల నడక ఉండేది. పిల్లలు బడికీ,  రైతులు పొలాలకీ, పెద్దలు పనులకీ నడిచే వెళ్లేవారు. పై అంతస్తుల్లో ఉండేవారు మెట్లెక్కేవారు. సైకిల్‌ నిత్యజీవితంలో ఒక భాగంగా ఉండేది. బడుల్లోనూ బయటా మైదానాలు పిల్లల ఆటలతో కేరింతలతో దద్దరిల్లేవి. ఇక, ఇంటిపని అంతా శరీరకష్టమే. బావిలో నీళ్లు తోడడం దగ్గర్నుంచీ ఇంటి దగ్గరే పాడిపశువుల పోషణ వరకూ ఎన్నో పనుల్ని ఇంట్లోని చిన్నా పెద్దా ఆడా మగా అంతా కలిసి స్వయంగా చేసుకునేవారు.

అలాంటిది... సాంకేతికత అందుబాటులోకి రావడం పెరిగే కొద్దీ మనిషికి సుఖం పెరిగింది. మొదట స్కూటరొచ్చింది. ఇంటి వాకిట్లో ఎక్కి కూర్చుంటే మళ్లీ ఆఫీసు ముంగిట్లోనే దిగడం. దాని దెబ్బకి సైకిల్‌ పోయింది.

బస్సులూ, ఆటోలూ వచ్చాయి. నడక పోయింది.

గ్యాస్‌ స్టవ్‌, మిక్సీ, వాషింగ్‌ మెషీన్‌ వచ్చాయి. ఇల్లాలికి పని తగ్గింది.

పిల్లలకు చదువులు పెరిగిపోయాయి. పాఠశాలలు ఇరుకైపోయాయి. ఆటలు మాయమైపోయాయి.

ఫలితం... అందరికీ సమయం కలిసొచ్చింది. తీరిగ్గా కూర్చుని గంటల తరబడి టీవీ చూడడం, చిరుతిళ్లు లాగించడం అలవాటైపోయింది. సినిమాలూ హోటళ్లూ ఎక్కువైపోయాయి. అలా అలా సంపాదన పెరిగేకొద్దీ సౌఖ్యాలు పెరుగుతూ పోయాయి. ఉద్యోగాల తీరూ మారిపోయింది. మొత్తంగా మనిషి జీవితం ఇప్పుడు చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ చుట్టూ తిరుగుతోంది. ఒక బ్యాంకుకెళ్లే పని లేదు, ఒక బిల్లు కట్టే పని లేదు. కాలికీ చేతికీ పని పోయింది. ఏడెనిమిది కిలోమీటర్లు నడిచేవాళ్లం కాస్తా ఇప్పుడు ఏడెనిమిది గంటలు కదలకుండా కూర్చునే పరిస్థితికి వచ్చామన్నమాట.

వాడని వస్తువు ఏదైనా పనిచేయడం మానేస్తుంది. పనులేమీ లేకపోవటంతో మన శరీరంలోని కండరాలూ పనిచేయడం మానేస్తున్నాయి. మరో పక్క అవసరం ఉన్నా లేకపోయినా తినడమూ, తినకూడనివి తినడమూ, తినకూడని సమయంలో తినడమూ... అన్నీ కలిసి ఆరోగ్యంతో ఆడుకోవటం మొదలెట్టాయి. ఫలితమే జీవనశైలి రుగ్మతలుగా మనం చెప్పుకుంటున్న జబ్బులు. మనదేశంలో...
* 13.5 కోట్ల మందికి స్థూలకాయం,.
* 7.2 కోట్ల మందికి మధుమేహం,
* 4.2 కోట్ల మందికి థైరాయిడ్‌ సమస్యలూ.
* 8 కోట్ల మందికి రక్తపోటూ,
* 5.5కోట్ల మందికి గుండెజబ్బులూ ఉన్నాయి

నిజానికి అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యసౌకర్యాల వల్ల ఇవేవీ సమస్యలే కాకూడదు. అయినా అయ్యాయంటే- చేజేతులా చేసుకున్నాం కాబట్టే. అందుకే ఇప్పుడు మేల్కొనక తప్పని పరిస్థితి. మనిషి ‘ఫిట్‌’గా ఉండడం అంటే సన్నగా ఉండడం మాత్రమే కాదు, చురుగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి..! అలా ఉండాలంటే ముఖ్యంగా మూడు విషయాలపై శ్రద్ధ పెట్టాలి. అవి... తిండీ, వ్యాయామమూ, ఒత్తిడీ.

ఆహారం ఇలా...
తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. కానీ మనమేమో అంత లోతుగా ఆలోచించకుండా తినడం అవసరం కాబట్టి ఏదో ఒకటి తినేసి కడుపు నింపుతున్నాం. దాని ఫలితమే ఆరోగ్యంమీద పడుతోంది.

ఆ మధ్య జరిగిన ఒక సర్వేలో మనదేశంలో నూటికి 38 మంది వారంలో మూడుకన్నా ఎక్కువ సార్లు హోటళ్లలో తింటున్నట్లు తేలింది. అక్కడ తీసుకునే పిజ్జా, బర్గర్లూ, కూల్‌డ్రింకులూ లాంటివాటిల్లో కెలొరీలు ఎక్కువగా ఉంటాయి
కానీ పోషకవిలువలు శూన్యం. అందుకే నిపుణులు వాటిని జీరో కెలొరీ డైట్‌ అంటారు. అరుదుగా తప్ప వీటికి ఆహారంలో స్థానం ఇవ్వకూడదు.

పిజ్జాలూ బర్గర్లే కాదు, హోటల్లో ఓ మసాలా దోశ లాగించినా అంతే. చక్కగా బంగారు రంగులో నెయ్యి వేసి కాల్చి, లోపల ఆలూ కూర దట్టించి, అల్లం చట్నీ, సాంబారులతో ఘుమఘుమలాడే మసాలా దోశలో ఏకంగా 1,023 కెలొరీలు లభిస్తాయట. అంటే మనిషికి రోజుకు కావలసిన కెలొరీల్లో సగానికి పైనే. కప్పు సాంబారులోనే 130 కెలొరీలు ఉంటాయట. దోశ ఒక్కటే కాదు, మామూలుగా మన హోటళ్లలో వడ్డిస్తున్న ఏ రకం భోజనమైనా ఒక ప్లేటులో 600లకు పైగా కెలొరీలు ఉంటున్నాయట. ఈ గందరగోళం లేకుండా 60-70 శాతం పిండిపదార్థాలూ, 10-12 శాతం మాంసకృత్తులూ, 20-25 శాతం కొవ్వు పదార్థాలూ ఉండేలా ఆహార పదార్థాల్ని ఎంచుకోవాలి. రోజు మొత్తమ్మీద శరీరానికి అందాల్సిన కెలొరీలను సమంగా అందేలా భోజనం వేళల్ని పాటించాలి.

లెక్క ఉంది!
నిజానికి ఫలానా పదార్థంలో ఇన్ని కెలొరీలే ఉంటాయని కచ్చితంగా చెప్పలేం. ఆయా పదార్థాల తయారీకి కావలసిన పదార్థాలను ఒక్కొక్కరూ ఒక్కో దామాషాలో వాడటమూ, ఉపయోగించే నూనె పరిమాణమూ... ఇలాంటి వాటి మీద ఆధారపడి కెలొరీల సంఖ్య ఉంటుంది. అందుకని ఎవరు చెప్పినా ఉజ్జాయింపుగా మాత్రమే చెబుతారు. అలాగే కెలొరీలు ఖర్చయ్యే విధానమూ మారుతుంది. ఒకే పని ఒకరు చేస్తే 100 కెలొరీలు ఖర్చయితే మరొకరు చేస్తే 150 కెలొరీలు ఖర్చు కావచ్చు. వారి వయసూ పనిచేసే విధానమూ శరీరతత్వమూ అందుకు కారణమవుతాయి. అలాగే తీసుకునే ఆహారంలో ఎన్ని కెలొరీలు ఉన్నాయనే కాదు, అవి దేని ద్వారా వస్తున్నాయన్నది కూడా చూడాలి. ఒక ఇడ్లీ తిన్నా ఒక పూరీ తిన్నా దాదాపు ఒకే స్థాయిలో కెలొరీలు లభిస్తాయి. అయితే ఇడ్లీ తినడం వల్ల వచ్చే కెలొరీలు పిండిపదార్థాల వల్ల వస్తాయి కాబట్టి త్వరగా ఖర్చవుతాయి. అదే పూరీతో వచ్చే కెలొరీలు కొవ్వు(నూనె) వల్ల వస్తాయి కాబట్టి వాటిని వెంటనే ఖర్చు చేయకపోతే అవి కొవ్వు నిల్వల్లోకి చేరిపోతాయి. గ్రాము పిండిపదార్థాన్ని కరిగించడానికి 4 కెలొరీలు సరిపోతాయి. అదే పరిమాణంలో కొవ్వుని కరిగించడానికి మాత్రం 9 కెలొరీలు కావాలి. ఈ లెక్క గుర్తుంచుకుంటే మనం తీసుకుంటున్న ఆహారాన్ని బట్టి ఎంత శరీర కష్టం చేయాలో తేల్చుకోవచ్చు.

ఇక మనిషికి రోజుకు ఎన్ని కెలొరీలు కావాలీ అంటే- స్త్రీలకైతే 2200, పురుషులకైతే 2400 అన్నది అంతర్జాతీయ ప్రమాణం. కానీ మారుతున్న జీవనశైలిని బట్టి చూస్తే అన్ని కెలొరీలు అనవసరం అంటున్నారు మన పోషకాహార నిపుణులు. సాధారణ ఒడ్డూపొడుగుతో ఆరోగ్యంగా ఉన్న మనిషికి తన బరువులో కిలోకి 30 కెలొరీలు చొప్పున ఆహారం తీసుకుంటే చాలంటున్నారు వాళ్లు. చాలా సన్నగా, లేదా బాగా లావుగా ఉండేవాళ్లకు ఈ లెక్క పనికిరాదు. అలాంటివారు నిపుణుల సలహాని అనుసరించి ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

కష్టపడి కరిగించాలి!
ఆర్థిక విషయాల్లో లాగా ఆహారం విషయంలో నిల్వలకు స్థానం లేదు. అందుకే ఆహారం ద్వారా తీసుకున్న కెలొరీలనుంచీ లభించే శక్తిని ఎప్పటికప్పుడు ఖర్చు
చేసెయ్యాలి. అలా ఖర్చుచేయకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. శరీర కష్టం అనేది మన జీవనశైలిలోనుంచి మాయమైపోయింది. ఏడెనిమిది గంటలు కడుపులో చల్ల కదలకుండా కూర్చోవడం వల్ల...
* స్థూలకాయమూ దాని కారణంగా మరెన్నో ఆరోగ్య సమస్యలూ వస్తున్నాయి.
* కొందరి శరీరతత్త్వం వల్ల తిండి ఎంత తిన్నా, అసలేమాత్రం పనిచేయకపోయినా... లావవరు. దాంతో ఆరోగ్యంగానే ఉన్నామనుకోవడంతో ప్రమాదం ముంచుకొచ్చేదాకా తెలియడం లేదు.
* శరీరానికి కనీస వ్యాయామం లేకపోతే నిద్ర సరిగా పట్టదు. చాలినంత నిద్ర లేకపోతే మెదడు ఆలోచించే శక్తిని కోల్పోతుంది.

శరీర కష్టం చేసే వృత్తుల్లో ఉన్నవారు తప్ప మామూలుగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నవాళ్లలో నూటికి యాభై మంది కూడా స్ట్రెచింగ్‌ లాంటి కనీస వ్యాయామాలు సైతం చేయడం లేదట. మనిషి లావూ సన్నంతో సంబంధం లేకుండా చురుగ్గాఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. అందుకు శరీరానికి వ్యాయామం కావాలి. శరీరంలోని కండరాలూ, ఊపిరితిత్తులూ అన్నిటికీ పని ఉండేలా చెమటోడ్చాలి. ఒకప్పుడు పిల్లలు ఎన్ని ఆటలు ఆడుకున్నా ఇళ్లలోనూ పెద్దలకు సాయం చేసేవారు. ఇప్పుడు అయితే చదువుకుంటూ లేకపోతే టీవీ చూస్తూ గంటల తరబడి కదలకుండా కూర్చోవడంలో వాళ్లూ పెద్దలతో పోటీపడుతున్నారు. ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న వయసుతో సంబంధంలేని అనారోగ్యాలు. చూడడానికి ఒడ్డూ పొడుగూ నిండుగా ఉంటారు. కానీ ఒంట్లో సత్తువ ఉండదు. కండరాల్లో పటుత్వం ఉండదు.

పదివేల అడుగులు
ప్రతి వ్యక్తీ రోజుకు కనీసం పదివేల అడుగులు నడవాలన్న ప్రచారాన్ని యాభై ఏళ్ల క్రితమే ప్రారంభించాయి జపాన్‌ లోని వాకింగ్‌ క్లబ్బులు. ఆ తర్వాతే దేశవిదేశాల పరిశోధకులు దాన్ని అందిపుచ్చుకున్నారు. ఉద్యోగాలన్నీ కూర్చుని చేసేవే కావడమూ ఇళ్లలో టీవీలు ఎక్కువ సమయాన్ని కదలకుండా కూర్చోబెట్టడమూ చూసిన వీరు కనీసం పదివేల అడుగులు నడిస్తే రోజుకు కావలసిన శారీరక వ్యాయామం అందుతుందని లెక్కలేసి దాన్ని ఓ ప్రమాణంగా మార్చారు. అయితే అది కనీస అవసరం మాత్రమే. ఆరోగ్యంగా ఉన్నవారు అంతకన్నా ఎక్కువ నడవడానికీ ప్రయత్నించాలి. ఇక, ఆ పదివేల అడుగులూ రోజు మొత్తమ్మీద అప్పుడో వందా ఇప్పుడో వందాలాగా కాదు, మరి?
* నిమిషానికి వంద అడుగుల చొప్పున కనీసం మూడు వేల అడుగులు నడిస్తే- అది ఒక మాదిరి వ్యాయామం చేసినట్లు.
* నిమిషానికి 129 అడుగుల చొప్పున మూడు వేల అడుగులు నడిస్తే కఠిన వ్యాయామం చేసినట్లు.

పై రెండిట్లో ఏదో ఒకటి చేశాక మిగిలిన అడుగుల లెక్కని రోజు మొత్తం మీద విభజించుకుని నడవొచ్చు. అయితే ఇది పెద్దల లెక్క. పిల్లలకైతే పెద్దల కన్నా రెట్టింపు నడక కావాలట.

కనపడదు కానీ...
కనపడకుండా ఆరోగ్యం మీద ప్రభావం చూపే మరో శత్రువు- ఒత్తిడి. ఇంట్లో బాధ్యతలూ ఆఫీసులో టార్గెట్లూ వ్యాపారాల్లో ఒడుదొడుకులూ... కారణమేదైనా కావచ్చు. వాటి ప్రభావం ఒత్తిడి రూపంలో మనసు మీదా శరీరం మీదా పడుతుంది. మనిషి ఫిట్‌నెస్‌ని దెబ్బతీస్తుంది. అదెలాగంటే...
* ఒత్తిడి వల్ల అతిగా తినడమూ, తినకూడని జంక్‌ ఫుడ్‌ తినడమూ చాలామందిలో కన్పిస్తుంది.
* కొంతమంది శారీరక శ్రమ అతిగా చేస్తారు. దానివల్ల త్వరగా నిస్త్రాణకు గురవుతారు.
* ఒత్తిడి నిద్రలేమికి దారితీస్తే నిద్రలేమి స్థూలకాయానికి దారితీస్తుంది.
* దీర్ఘకాలం ఒత్తిడి కొనసాగితే అల్సర్లు, మధుమేహం, గుండెజబ్బులు, హైపర్‌థైరాయిడిజం లాంటి సమస్యల్లోకి దారితీస్తుంది.

ఒత్తిడి ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా చూసుకోవాలంటే దినచర్యను అందుకు తగినట్లుగా మార్చుకోవాలి. కొన్ని చిన్న చిన్న మార్పులే దినచర్యను ఎంతో ఉత్సాహభరితంగా మారుస్తాయి. నిద్రలేవగానే రెండు నిమిషాలు మంచం మీద పడుకునే కాళ్లూ చేతుల్ని బాగా సాగదీస్తే కండరాలన్నీ ఉత్తేజితమవుతాయి. ఆ వెంటనే హడావుడిగా పనుల్లో పడిపోకుండా ఓ పావుగంట మెడిటేషన్‌ చేసుకోవాలి. మరో అరగంట నడక, యోగా లేదా మరేదైనా వ్యాయామానికి కేటాయించాలి. పొద్దున్నే కాసేపు వ్యాయామం చేయడం వల్ల రోజుమొత్తం మీద తీసుకునే ఆహారంపై నియంత్రణ ఉంటుందనీ, జంక్‌ఫుడ్‌, స్వీట్ల మీద ఇష్టం తగ్గుతుందనీ, ఒత్తిడి కూడా అదుపులో ఉంటుందనీ అంటున్నారు నిపుణులు.

* * * * *

సమస్య మనదే, పరిష్కరించుకుంటే లాభపడేదీ మనమే... ఈ విషయాన్ని ప్రధాన మంత్రి చెప్పాలా మనకు!
ఆయన చెప్పాడని కాకపోయినా, ఒంటిని రవంత శ్రమపెడితే పోయేదేం ఉంది... మోయలేని బరువు తప్ప!
అందుకే... కాస్త కదులుదాం. ఆరోగ్య భారతానికి బాటవేద్దాం!

పార్టీకెళ్లారా..!

పార్టీలూ ఫంక్షన్లూ లేకపోతే జీవితం బోరుకొడుతుంది. అందుకే పార్టీలంటే ఎగిరిగంతేస్తాం. తృప్తిగా తిని వస్తాం. మరి, ఆ అదనపు కెలొరీలని ఏం చేద్దాం? పార్టీల్లో మనం తినే ప్రత్యేక పదార్థాల్లో ఎన్ని కెలొరీలు ఉంటాయో వాటిని ఖర్చుచేయాలంటే ఎంత చెమటోడ్చాలో మచ్చుకి కొన్ని...
* చిన్న ఫ్రూట్‌కేక్‌ ముక్క(50గ్రా.) తింటే వచ్చే 160 కెలొరీలను కరిగించాలంటే కనీసం రెండు కిలోమీటర్లు నడవాలి.
* వేయించిన చేపముక్క(40గ్రా.) తినేస్తే ఫర్వాలేదు, వచ్చాక కనీసం ఒకటిన్నర కిలోమీటర్లు నడిచి 110 కెలొరీలను కరిగించేయాలి.
* చల్లచల్లగా కూల్‌ డ్రింక్‌ తాగేటప్పుడు బాగుంటుంది కానీ అది కొవ్వు కాకుండా ఉండాలంటే ఓ అరగంట నడవాల్సిందే. ఎందుకంటే 200మి.లీ. కూల్‌డ్రింక్‌లో 90 కెలొరీలుంటాయి.
* వేడి వేడి జిలేబీ అప్పటికప్పుడు వేసిస్తుంటే ఆరారగా లాగించేశారా... నోట్లో కరకరలాడుతూ కరిగిపోయిన జిలేబీ శరీరంలోనూ నిలవుండకుండా కరగాలంటే వందగ్రాముల జిలేబీకి కనీసం రెండున్నర గంటలు ఆపకుండా నడవాల్సిందే.
* ఒక్కటంటే ఒక్క రసగుల్లానే తిన్నానంటారా... అది ఇచ్చే కెలొరీలు ఖర్చవ్వాలంటే ఓ అరగంట నడవక తప్పదు మరి.

కెలొరీల రాక... పోక..!

మనం సాధారణంగా తీసుకునే కొన్ని ఆహార పదార్థాల్లో ఎన్ని కెలొరీలు ఉంటాయో, అలాగే మనం సాధారణంగా చేసే పనులతో ఎన్ని కెలొరీలు ఖర్చవుతాయో చూద్దాం.
కప్పు వరి అన్నం - 206
ఒక ఇడ్లీ - 75
ప్లేటు ఉప్మా - 260
ఒక పూరీ - 80
ఒక పుల్కా - 85
ఒక వడ - 70
ఒక సమోసా - 210
ఒక బ్రెడ్‌ స్లైసు - 70
కప్పు టీ/ కాఫీ - 40
కప్పు పాలు - 103
కప్పు పెరుగు - 90
పావులీటరు మజ్జిగ - 5
గుడ్డు - 85
చికెన్‌ కర్రీ (125గ్రా.) - 260
రొయ్యల కూర (145గ్రా.) - 220
మటన్‌కర్రీ (150గ్రా.) - 290
నెయ్యి టీస్పూన్‌ - 42
అరటి పండు - 80
ద్రాక్ష  (100గ్రా.) - 67
మామిడి (100గ్రా.) - 70
ఆపిల్‌ (100గ్రా.) - 52
జాంపండు (100గ్రా.) - 68
పుచ్చకాయ (100గ్రా.) - 30

మనం సాధారణంగా చేసే పనులు ఒక గంట సేపు చేస్తే ఎన్ని కెలొరీలు ఖర్చవుతాయో చూద్దాం. వ్యక్తి బరువుని బట్టి ఇవి కాస్త ఎక్కువా తక్కువా ఉండవచ్చు.
నడక - 250
నిలబడితే - 132
షాపింగ్‌ - 204
ఇంటిపని - 210
తోట పని - 300
నృత్యం - 372
బ్యాడ్మింటన్‌ - 348
టేబుల్‌ టెన్నిస్‌ - 245
టెన్నిస్‌ - 392
మెట్లు ఎక్కడం - 425
ఈత (25మీ./నిమిషానికి) - 292
సైక్లింగ్‌ (2.5కిమీ./గంటకు)- 360
పరుగు (8కి.మీ./గంటకు) - 522

15 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.