close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నరముఖ గణపతి నమో నమో!

గణపతిని తలచుకోగానే మనకు గజముఖుడే గుర్తుకు వస్తాడు. కానీ అందుకు భిన్నంగా వినాయకుడు మొదట ఆవిర్భవించిన రూపంతోనే అంటే మనిషి ముఖంతోనే పూజలందుకుంటున్న క్షేత్రం తమిళనాడులోని ఆదివినాయక ఆలయం. బొజ్జలేని గణపతిగా పార్వతి పసుపు నలిచి చేసిన అదే సుందర రూపంతో ఉన్న విఘ్నేశ్వరుడిగా స్వామి దర్శనమిచ్చే ఈ ఆలయం విశేషాలు ఏంటంటే...

గజానన పద్మార్కం గజాననమహర్నిశం।
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే।।
...అంటూ వినాయకుడిని స్తుతిస్తాం.

గణనాథుని తలచుకోగానే పెద్దపెద్ద చెవులూ, తొండం, ఏక దంతంతో గజముఖమే మనకు గుర్తుకు వస్తుంది. నిజానికి మొదట వినాయకుడు మనిషి రూపంలోనే ఉద్భవించాడు. తండ్రి కోపానికి గురైన కారణంగా గజముఖుడిగా పూజలందుకుంటున్నాడు. మనిషి రూపంలో ఉద్భవించిన వినాయకుడు గజముఖుడిగా మారే వృత్తాంతం వినాయక వ్రతకల్పంలో కనిపిస్తుంది. సర్వమంగళ అయిన పార్వతీదేవి తాను రాసుకున్న పసుపుముద్దను నలిచి బొమ్మను తయారుచేస్తుంది. ఆ బొమ్మకు ప్రాణంపోసి వినాయకుడిగా నామకరణం చేసి, తన మందిరానికి ద్వారపాలకుడిగా పెడుతుంది. ఇదేదీ తెలియని పరమశివుడు యథావిధిగా పార్వతీదేవి మందిరంలోకి ప్రవేశించబోతాడు. అక్కడే ఉన్న వినాయకుడు శివుడిని అడ్డుకుంటాడు. అమ్మ అనుమతి లేనిదే లోనికి వెళ్లనివ్వనంటాడు. దీంతో ఆగ్రహించిన శివుడు వినాయకుడి తల నరికేస్తాడు. ఆ తర్వాత విషయం తెలుసుకుని గజాసుర సంహారం చేసి, గజముఖాన్ని తెచ్చి వినాయకుడికి అమరుస్తాడు. అప్పటి నుంచి గణపయ్య గజముఖంతోనే పూజలందుకుంటున్నాడు. కానీ, అందుకు భిన్నంగా వినాయకుడు నరముఖుడిగానే దర్శనమిస్తున్న ఈ క్షేత్రం తమిళనాడు తిరువారూరు జిల్లాలోని తిలాతర్పణపురిలో ఉంటుంది. ఇక్కడ వెలసిన స్వామి తొండం లేకుండా మానవ రూపంలోనే భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో స్వామిని నరముఖ గణపతి, ఆది వినాయకర్‌ వంటి పేర్లతో పిలుస్తారు. ప్రతి నెలా సంకటహర చతుర్దశినాడు స్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. నైవేద్య ప్రియుడైన విఘ్ననాయకుడికి కుడుములూ ఉండ్రాళ్లతోపాటూ జిల్లేడుకాయలనీ సమర్పిస్తారు. తిలాతర్పణపురిలోని ముక్తీశ్వరర్‌ క్షేత్రంలో భాగంగా కొలువుదీరి ఉంటుందీ ఆలయం. అందువల్ల మహాశివరాత్రి, మాసశివరాత్రి లాంటి పర్వదినాల్లో ఇక్కడ ప్రతేక అభిషేకాలూ, శివకల్యాణాలూ జరిపిస్తారు.

తర్పణాల స్వామి
సాధారణంగా పితృకర్మలను కాశీ, గయాలాంటి క్షేత్రాల్లోనో లేదంటే ఏ నది ఒడ్డునో నిర్వహిస్తారు. వీటితోపాటు ఈ క్షేత్రంలోనూ తర్పణాలు ఇచ్చి, పితృకర్మలు ఆచరిస్తే చాలా మంచిదని నమ్ముతారు భక్తులు. అందుకే మహాలయ పక్షం వంటి సమయాల్లో దేశం నలుమూలల నుంచీ ఇక్కడకు ప్రత్యేకంగా వచ్చి మరీ పితృకర్మలు చేపడుతుంటారు. దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో... వనవాసం చేస్తున్న రామచంద్రమూర్తి తన తండ్రి అయిన దశరథ మహారాజు మరణవార్త తెలుసుకున్న తర్వాత తాను వెళ్లిన ప్రతి చోటా ఆయనకి తర్పణాలు వదిలేవాడట. ఇలా ఎన్నో ప్రదేశాల్లో తర్పణాలు వదిలినప్పటికీ తన తండ్రికి ముక్తి లభించక పోవడంతో శివుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు పరమ శివుడు ప్రత్యక్షమై ఈ క్షేత్రంలోని కొలనులో స్నానం చేసి పితృకర్మలు నిర్వహించమని చెప్పాడట. దీంతో దశరథుడికి ముక్తి లభించిందని పురాణగాథ. రాముడు తర్పణాలు ఇచ్చిన ప్రదేశం కాబట్టే దీనికి తిలాతర్పణపురి అనే పేరు వచ్చిందని స్థానికుల నమ్మకం.

ఇలా చేరుకోవచ్చు
తిరువారూరు జిల్లాలోని కూతనూరు సరస్వతీ దేవి ఆలయానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంటుందీ తిలాతర్పణపురి. తిరునల్లారులోని శనీశ్వర ఆలయానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుందిది. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. రోడ్డు మార్గంలోనైతే దేశంలో ఎక్కడి నుంచైనా సరే కుంభకోణం, తంజావూరు, మైలాడుతురై, మాయావరం పట్టణాలకి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ప్రభుత్వం నడిపే ప్రత్యేక బస్సుల్లో చేరుకోవచ్చు. రైలు మార్గంలో తిరువారూరు-మైలాడుతురైల మధ్య ఉన్న పూందోట్టం స్టేషన్‌కి వస్తే అక్కడి నుంచిఆటోల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. నరముఖ గణపయ్యని సందర్శించుకోవచ్చు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు