close
ఆకలి తీర్చుతున్న ఆత్మీయులు

ఒక రూపాయికి ఏమొస్తుంది... ఓ చాక్లెట్‌ వస్తుంది. మహా అయితే ఆ డబ్బుతో కాలక్షేపం కోసం బఠాణీలు కొనుక్కొని తినొచ్చు. కానీ...  ఈ మానవతామూర్తులు మాత్రం ఒక్క రూపాయికే ఆకలి తీర్చుతున్నారు. కన్న తల్లిదండ్రులకే అన్నం పెట్టని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో వారు మాత్రం... ముక్కూమొహం తెలియని పేదలకు తక్కువ ధరకే అల్పాహారం, భోజనం అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

రూ. 10కే నాలుగు దోశలు!

క్క దోశ ఖరీదు ఎంత అంటే...  ‘కనీసం పాతిక’ అని వెంటనే సమాధానం వస్తుంది. మహారాష్ట్రలోని నాగపుర్‌లో మాత్రం రూ. 10కే నాలుగు దోశలను ఎంచక్కా ఆరగించొచ్చు. నాగపుర్‌కు చెందిన శారద చారగోడే అనే మహిళ పది రూపాయలకే నాలుగు దోశలను అల్పాహారంగా అందజేస్తూ ఔదార్యం చూపుతోంది. అవి...  కేవలం పిల్లలూ, విద్యార్థులకే సుమా! కారణం...  ఆమె ఎదుర్కొన్న ఆర్థిక, కుటుంబపరమైన ఇబ్బందులే. వివాహమైన కొన్ని సంవత్సరాలకే భర్త వేధింపులు తాళలేక శారద నరకయాతన అనుభవించింది. తరవాత కొన్నాళ్లకు అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చిన ఆమె...  పిల్లలను పోషిస్తూ చదివించడానికి ఏదో ఒక ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. చివరికి 2004లో నాగపుర్‌లోని శ్రీదీదీనగర్‌ పాఠశాల దగ్గర చిన్న టిఫిన్‌ సెంటరును ఏర్పాటు చేసుకొంది. ఆ సెంటరు ద్వారా మొదట్లో రూపాయికే దోశలూ, ఇడ్లీలూ అమ్ముతుండేది. ఇప్పుడు రూ. 10కే నాలుగు దోశలు అమ్ముతోంది. ఈ టిఫిన్‌ సెంటరు మీదుగా వెళ్లే ప్రతి చిన్నారీ, విద్యార్థీ... శారద వేసిన దోశ రుచి చూడాల్సిందే... ఆమె ఆప్యాయతకు సలాం కొట్టాల్సిందే!

రూపాయికే ఇడ్లీ

మిళనాడు రాష్ట్రం పేరూరు సమీపంలోని వాదివేళంపాలాయానికి చెందిన కె.కమలాత్తాళ్‌ 80 ఏళ్ల వృద్ధురాలు. ఆమె కేవలం రూపాయికే నాలుగు ఇడ్లీలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతోంది. మామూలుగా అయితే ప్లేటు ఇడ్లీ ధర సుమారు రూ.20. ఈమె మాత్రం రూపాయికే వాటిని అందిస్తూ పేదలకు అండగా నిలుస్తోంది. కమలది సాధారణ వ్యవసాయ కుటుంబం. కుటుంబసభ్యులంతా పొలం పనులకు వెళ్తుంటే ఆమె ఖాళీగా ఉండేది. తానూ ఏదో ఒకపని చేయాలని యోచిస్తుండగా... నిరుపేదలకు తక్కువ ధరకే ఇడ్లీలను అమ్మి తనవంతు సాయంచేయాలన్న ఆలోచన వచ్చింది. అలా... పదేళ్లక్రితం యాభై పైసలకే నాలుగు ఇడ్లీలు ఇచ్చేది. ఇప్పుడు రూపాయికే వాటిని అమ్ముతోంది. ఒక రోజు ముందే సరుకులన్నీ సిద్ధం చేసుకొనే ఈ బామ్మ... ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే ఇడ్లీలూ, సాంబారూ, చట్నీ తయారుచేస్తుంది. రోజూ వెయ్యి ఇడ్లీలు అమ్ముతాననీ, ఖర్చులుపోనూ ఎంత మిగులుతుందనే దానికన్నా... తక్కువ ధరకే పేదలు కడుపునింపుకోవడాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉంటుందంటుంది కమలాత్తాళ్‌.

భోజనం ఖరీదు రూపాయే...

మిళనాడుకు చెందిన వి.వెంకట్రామన్‌...  పేద రోగులకూ, వారి బంధువులకూ రూపాయికే భోజనం, అల్పాహారం అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కారణం...  ఆయన్ను కదిలించిన ఓ సంఘటనే. ఈరోడ్‌లో జనరల్‌ ఆస్పత్రి వద్ద వెంకట్రామన్‌ చిన్న హోటల్‌ నిర్వహిస్తున్నాడు. ఓ రోజు హోటల్‌కు వచ్చిన ఒక మహిళ పది రూపాయలు ఆయన చేతిలో ఉంచి ఆరు దోశలు ఇవ్వాలని కోరింది. ఈ డబ్బుతో కేవలం ఆరు ఇడ్లీలు మాత్రమే వస్తాయనీ, ఆరు దోశలు ఇవ్వడం కుదరదన్నాడు. తనతోపాటు తన కుటుంబసభ్యులూ ఆస్పత్రిలో ఉన్నారనీ, వారి ఆకలి తీరాలంటే ఆరు దోశలు ఇవ్వాలనీ ప్రాధేయపడింది. ఆమె మాటలకు చలించిన వెంకట్రామన్‌ ఆ మహిళతోపాటు ఆస్పత్రి వద్దకు వెళ్లి వారి దయనీయస్థితిని కళ్లారా చూశాడు. దాంతో పేద రోగులకూ, వారి బంధువులకూ తక్కువ ధరకే భోజనం, అల్పాహారం అందజేయాలని అదే రోజు నిశ్చయించుకున్నాడు. అప్పటి నుంచీ ఆస్పత్రికి వచ్చే పేదలకు ఒక్క రూపాయికే ఉదయం 15 అల్పాహార కూపన్లూ, 40 మధ్యాహ్న భోజనాలూ, మళ్ళీ రాత్రికి 15 అల్పాహార కూపన్లూ అందజేస్తున్నాడు. ఇలా... గత మూడేళ్ళుగా పేద రోగుల ఆకలి తీర్చుతూ అందరి మన్ననలూ అందుకుంటున్న వెంకట్రామన్‌ను ప్రశంసించకుండా ఉండగలమా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.