
క్రికెట్ కథాంశంగా వచ్చిన ‘కౌసల్య కృష్ణమూర్తి’లో కౌసల్యగా నటించిన ఐశ్వర్యా రాజేశ్ తెలుగు అమ్మాయే. కలువల్లాంటి కళ్లూ చక్కటి అభినయంతో ఆకట్టుకున్న ఐశ్వర్య తన ఆటతోనూ ప్రేక్షకుల మనసు దోచుకుంది. సినీరంగంలోకి వచ్చిన తొలినాళ్లలో సమస్యల్నీ, అవమానాల్నీ ఎన్నింటినో తట్టుకుని నిలబడింది. హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య తన ప్రయాణం గురించి చెబుతోందిలా...
మాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. మా తాతయ్య అమర్‌నాథ్‌గారు, నాన్న రాజేశ్ కూడా నటులే. ‘మల్లెమొగ్గలు’, ‘రెండు జళ్ల సీత’, ‘ఆనందభైరవి’ తదితర సినిమాల్లో నాన్న హీరోగా నటించారు. మా మేనత్త, ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి మీ అందరికీ సుపరిచితురాలే. మా తాతయ్య హైదరాబాద్ నుంచి వెళ్లి చెన్నైలో స్థిరపడ్డారు. దాంతో ఇప్పటికీ మేం అక్కడే ఉండిపోయాం.
ఇక, నాకు ఊహ తెలిసేప్పటికి మా కుటుంబ పరిస్థితి బాగోలేదు. ఎందుకంటే నాన్న చేతిలో సినిమాలూ, డబ్బూ ఉన్నంత కాలం ఎవరెవరో ఆయన చుట్టూ చేరిపోయారు. సమస్యలున్నాయంటూ అందినమేరకు డబ్బులు పట్టుకెళ్లేవారు. అమ్మానాన్నలది అతి మంచితనం కావడంతో సాయం కోరినవారికి ‘లేదూ కాదూ...’ అనకుండా ఇచ్చేవారు. కొందరికి ష్యూరిటీ కూడా ఉండి డబ్బు ఇప్పించిన రోజులున్నాయి. దాంతో మా ఆస్తులన్నీ కరిగిపోయాయి. తాగడం వల్ల నాన్న ఆరోగ్యం పాడైంది. దాంతో నన్నూ, ముగ్గురన్నయ్యల్నీ పోషించడానికి అమ్మ ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేసేది. భారమైనా సరే నాన్నకి ఖరీదైన వైద్యం చేయించింది. కానీ లివర్ ఫెయిల్‌కావడంతో నా ఎనిమిదో ఏట నాన్న చనిపోయారు. అప్పటికి మాకున్నది టి.నగర్లో మేముంటున్న ఫ్లాట్ మాత్రమే. అమ్మానాన్నలు ష్యూరిటీ ఉండి డబ్బు ఇప్పించిన వాళ్లంతా మొహం చాటేయడంతో అప్పు ఇచ్చినవాళ్లు మా ఇంటిమీదకొచ్చి గొడవ చేసేవారు. దాంతో మా అమ్మ ఫ్లాట్ అమ్మేసి అప్పులు తీర్చింది. ఆ తరవాత ఓ అద్దె ఇంటికి మారిపోయాం. అమ్మ తిన్నా తినకపోయినా మాకు మాత్రం ఏ లోటూ లేకుండా చూసుకుంది. చిన్నప్పుడు మా నలుగుర్నీ తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో చదివించింది. అమ్మని వదిలి ఉండలేక కొన్నాళ్లకి మేం కూడా చెన్నై వెళ్లిపోయి అక్కడే చదువుకున్నాం. దాంతో అమ్మ కష్టాల్ని దగ్గరగా చూశాం. పెద్దన్నని ఎంబీఏ చదివించింది. అన్న ఫస్ట్‌క్లాస్‌లో పాసై ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇక మా కష్టాలు తీరినట్టే అనుకున్నాం. ఇంతలో ఓ ప్రమాదం పెద్దన్ననీ, రెండో అన్ననీ తీసుకెళ్లిపోయి మా జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. అన్నయ్యలు చనిపోయాక అమ్మ కోలుకోలేకపోయింది. దాంతో తనకి రెస్ట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది అనిపించింది. అప్పుడే ఓ ఛానల్లో డాన్స్ రియాలిటీ షో నిర్వహిస్తున్నారని తెలిసి నేనూ ఆడిషన్‌కి వెళ్లా. నా డాన్స్ చూసి షోలో అవకాశమిచ్చారు. నిజానికి నాకు డాన్స్ అంటే పిచ్చి. కాలేజీలో ఉన్నప్పుడు ఆసక్తి ఉన్నవాళ్లకి నేర్పించేదాన్ని కూడా. అలా చదువుకుంటూనే డాన్స్ షోలో పాల్గొని విజేతగా నిలిచి టైటిల్ అందుకున్నా. అదయ్యాక టీవీ సీరియళ్లలో అవకాశాలు వచ్చాయి. కానీ నేరుగా సీరియళ్లలో చేస్తే అర్ధరాత్రి వరకూ పనిచేసినా రోజుకు ఐదొందల నుంచీ వెయ్యి రూపాయలే ఇస్తారు, అదే సినిమాలు చేసేవారు సీరియళ్లలో నటిస్తే వారికి బాగానే డబ్బులిస్తారు. దాంతో నేను కూడా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా.
కసి పెరిగింది...
నాది చామనఛాయ. దాంతో సినిమాల్లో ప్రయత్నించినప్పుడు ‘తెల్లగా ఉన్నవాళ్లకే అవకాశాలు దొరకట్లేదు. నీ రంగుకి సినిమాలు కూడానా?’ అని చాలామంది అవమానించారు. ఆ మాటలు ఎంతో బాధపెట్టినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూసుకున్నా. నేనేంటో నిరూపించుకోవాలి అన్న కసి పెంచుకున్నా. ఆ సమయంలో సినీ రంగంలో ఎవరి సపోర్టు లేకపోయినా నన్ను నేను నమ్ముకున్నా. పట్టు వదలకుండా ప్రయత్నాలు చేయగా చేయగా చిన్న సినిమాల్లో సెకండ్ హీరోయిన్, ఫ్రెండ్ పాత్రలు వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకునేదాన్ని. దాదాపు ఐదేళ్లపాటు అదే పరిస్థితి. అయినా నిరుత్సాహపడకుండా నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని. తొలిసారి 2015లో వచ్చిన ‘కాకా ముట్టై’ నాకు పెద్ద బ్రేక్‌నిచ్చింది. ఆ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించా. నిజానికి ఆ పాత్రలో నటించేందుకు చాలా సందేహించా. ఎందుకంటే అప్పటికి నాకు ఇరవై ఒక్కేళ్లు. ఆ వయసుకే తల్లి పాత్ర చేస్తే ఇక మీదట అన్నీ అలాంటి అవకాశాలే వస్తాయి అనిపించింది. చేయాలో వద్దో చెప్పే వాళ్లు కూడా లేరు. ఆ సమయంలో విజయ్ సేతుపతితో కలిసి పనిచేస్తున్నా. ఏదో మాటల సందర్భంలో ‘ఇద్దరు పిల్లల తల్లిగా అవకాశం వచ్చింది. చేయాలో వద్దో తెలియట్లేదు’ అన్నా. వెంటనే ‘మీరు ఆలోచించకుండా చేయండి. అతను మంచి డైరెక్టర్. మీ కెరీర్‌కు ప్లస్ అవుతుంది’ అని విజయ్ సలహా ఇవ్వడంతో వెంటనే ఒప్పేసుకున్నా. ఆ సినిమాలో స్లమ్‌లో ఉండే అమ్మాయిగా డీగ్లామరస్‌గా కనిపించినా నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు, నటనకు రంగుతో సంబంధం లేదని కూడా రుజువైంది. ఆ తరవాత మణిరత్నం, గౌతమ్‌మీనన్, బాలీవుడ్ నటుడు అర్జున్‌రామ్‌పాల్ వెతుక్కుంటూ వచ్చి అవకాశాలిచ్చారు.
మూడోసారి పిలిచారు...
‘చెలియా’లో అదితీరావ్ హైదరీ పాత్ర డబ్బింగ్ ఆడిషన్‌కి ఒకసారి నన్నుకూడా పిలిచారు మణి సర్. కానీ నా వాయిస్ సెట్ కాలేదు. ఆ తరవాత ఇంకేదో సినిమాకి పిలిచారు. అప్పుడూ వర్కవుట్ కాలేదు. ‘కాకా ముట్టై’ విడుదలయ్యాక మూడోసారి పిలిచి ‘నవాబ్‌లో ఓ పాత్ర ఉంది. అది నువ్వే చేయ్యాలీ...’ అన్నారు. అక్కడికక్కడే ఎగిరిగంతేశా. అందులో సిలోన్ అమ్మాయిగా కనిపించా. అలానే దర్శకుడు గౌతమ్‌మీనన్ ‘ధృవనచ్చత్రం’లో అవకాశమిచ్చారు. ఇది త్వరలో విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ‘డాడీ’లో హీరోయిన్ పాత్ర ఇచ్చారు. అప్పటికి హిందీ ఒక్క ముక్కరాదు. పదిహేనురోజుల్లో నేర్చుకుని ఆ సినిమాలో నటించా. మలయాళంలో కూడా అవకాశాలు రావడంతో ఆ భాషా నేర్చుకున్నా. అలా చేయడం వల్ల నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. సినీ రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చా. ‘నవాబ్’, ‘సామీ2’, ‘అందమైన మనసులో’... ఇవన్నీ డబ్బింగ్ సినిమాలే... నేరుగా తెలుగులో తీసినవి కాదు. గుంటూరు, హైదరాబాద్‌లో ఉన్న మా బంధువులు మాత్రం తెలుగులో ఎప్పుడు నటిస్తావ్ అని అడిగేవారు. నాకూ నటించాలని ఉండేది. అందుకు తగ్గ పాత్ర రావాలిగా అనుకునేదాన్ని. అలాంటి సమయంలోనే ‘కౌసల్య కృష్ణమూర్తి’లో చేయమని అడిగారు. అది గతేడాది తమిళంలో హిట్ అయిన ‘కనా’కి రీమేక్. ‘కనా’లోనూ నేనే హీరోయిన్ని. అలాంటి సినిమాలు ఒక్కసారి చేయడమే చాలా కష్టం. అలాంటిది రెండు భాషల్లోనూ చేయడం నాకు పెద్ద సవాలుగా అనిపించింది. క్రికెట్ రాని నాకు ‘కనా’లో అవకాశం వచ్చింది అనే కంటే నేనే తీసుకున్నా అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే ఆ సినిమాకి ముందు ‘నీకు క్రికెట్ వచ్చా’ అని నటుడు శివకార్తికేయన్ అడిగితే రాదని చెప్పా. క్రికెట్ కథాంశంగా సినిమా తీస్తున్నారనే విషయం ఆ తరవాత తెలిసింది. ‘క్రికెట్ వచ్చిన నటీనటులు కావాలని’ ఆ చిత్ర బృందం సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కనిపించడంతో దర్శకుడు అరుణ్రాజాకి ఫోన్ చేసి కథ చెప్పమన్నా. ‘మీకు క్రికెట్ రానప్పుడు నేను కథ చెప్పడం సమయం వృథా. అవసరం లేదు’ అన్నాడు అరుణ్. అయినా సరే చెప్పాల్సిందేనని బలవంతం చేస్తే చివరికి కథ చెప్పాడు. అది విన్నాక ఆ సినిమాలో చేసి తీరాల్సిందే అనిపించింది. అరుణ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ‘వారం రోజులు ట్రైనింగ్ ఇవ్వండి. నేను సరిగా ఆడలేను అనుకుంటే మీరు చెప్పకుండా నేనే తప్పుకుంటా. ఒక్క అవకాశం ఇవ్వండి’ అని రిక్వెస్ట్ చేసి ఓ మహిళా కోచ్‌ని పెట్టుకుని క్రికెట్ నేర్చుకున్నా. వారంలో ఆటగురించి తెలిసింది గానీ ఆడటం మాత్రం రాలేదు. అయినా వారం తరవాత అరుణ్ ముందు ఆడిచూపించా. సరిగా ఆడలేదు అనే విషయం అర్థమై... ఈ సినిమా నేను చేయను అని చెప్పేశా. ‘లేదు ఐషూ... నువ్వే ఈ సినిమా చేయాలి. చేయగలవు. నీ ఆరాటం నాకు నచ్చింది. నేను రాసుకున్న పాత్రకి నువ్వే కరెక్ట్’ అని హీరోయిన్ పాత్రకి పచ్చజెండా ఊపాడు. దాంతో ఆర్నెల్లపాటు క్రికెట్ నేర్చుకుని... పక్కాగా ఆడగలను అని నమ్మకం వచ్చాకే షూటింగ్లో పాల్గొన్నా. ఒకసారి బంతి మూతికి తగలడంతో కిందపెదవి చీలిపోయి నాలుగు కుట్లు పడ్డాయి. ఇక ‘కౌసల్య కృష్ణమూర్తి’ విషయానికొస్తే రాజమండ్రిలో మండుటెండల్లో తీశారు. తెలుగులో తొలి సినిమా అనే ఉత్సాహంతో ఎండా, వేడీ పట్టించుకోలేదు. ఒక్క క్లైమాక్స్ సీన్ తప్ప షూటింగ్ అంతా బాగా జరిగింది. క్లైమాక్స్‌లో ఆస్ట్రేలియన్ ప్లేయర్లతో తలపడాలి. ఆ సమయంలో కాలికి గాయమైంది. పైగా మూడు రోజుల్లో ఆ షూటింగ్ అయిపోవాలి. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన క్రీడాకారులకి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశారు. నా వల్ల వాళ్ల ప్రయాణం క్యాన్సిల్ అయితే నిర్మాతకు నష్టం. దాంతో మొదటిరోజు ఆడదామని ప్రయత్నించా కానీ కాలు నొప్పి ఎక్కువగా ఉంది. రెండోరోజుకి ఇంకా పెరిగింది. మూడో రోజుకీ తగ్గకపోవడంతో కాలికి గట్టిగా బ్యాండ్ కట్టేసి షూ వేసుకుని ఆడి షూటింగ్ పూర్తి చేశా. ఆ తరవాత కాలు వాచిపోయి నొప్పి భరించలేకపోయా. సినిమా విడుదలయ్యాక మంచి స్పందన రావడంతో ఆ బాధంతా మర్చిపోయా. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నా. సవాళ్లతో కూడుకున్న ఎలాంటి పాత్ర చేయడానికైనా నేను సిద్ధమయ్యానిప్పుడు. అందుకే షూటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా పట్టించుకోకుండా ముందుకెళుతుంటా.
గ్లిజరిన్ అక్కర్లేదు! ఎమోషనల్ సీన్లలో గ్లిజరిన్ వాడక తప్పదు. అదేంటో నాకు గ్లిజరిన్ వాడకుండానే కన్నీళ్లొచ్చేస్తాయ్.* నేను సినిమాల్లోకి వచ్చాక అమ్మ ఉద్యోగం కూడా మాన్పించేశా. ఒకప్పుడు ఫ్లాట్ అమ్మేసిన టి.నగర్లోనే అమ్మకి ఓ ఇల్లు కొనిచ్చా. అన్నయ్య మణికంఠ వ్యాపారం చేస్తూనే తమిళ సీరియళ్లలో నటిస్తున్నాడు. తనకి ఒక బాబు. ఇప్పుడు మేమంతా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం. * నేను తెల్లగా లేననీ, అసలు నటినే కాలేననీ విమర్శించిన వాళ్లే ఇప్పుడు తమ సినిమాల్లో నటించమని అడుగుతున్నారు. వాళ్లు అలా అడుగుతుంటే గర్వంగా అనిపిస్తుంది. * రాజేంద్రప్రసాద్‌గారి ‘రాంబంటు’ సినిమాలో ఒక పాటలో నటించా. అప్పుడే తొలిసారి కెమెరా ముందుకు రావడం. మళ్లీ ఇప్పుడు ‘కౌసల్య కృష్ణమూర్తి’లో ఆయన కూతురిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యా. * సౌందర్యకు వీరాభిమానిని. ఆమె ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయేవారు. సమయం దొరికితే సౌందర్య సినిమాలు చూస్తుంటా. |
- పద్మ వడ్డె
సినిమా
ప్రముఖులు
సెంటర్ స్ప్రెడ్
ఆధ్యాత్మికం
స్ఫూర్తి
కథ
జనరల్
సేవ
కొత్తగా
పరిశోధన
కదంబం
ఫ్యాషన్
రుచి
వెరైటీ
అవీ.. ఇవీ
టిట్ బిట్స్