close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంటర్నెట్‌తో మెదడు బేజారు!

కంప్యూటర్‌ యుగంలో ఇంటర్నెట్‌ను ఉపయోగించని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే దాని వాడకం పెరిగేకొద్దీ అది మెదడు పనితీరునే మార్చేస్తోంది అంటున్నారు వెస్ట్రన్‌ సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. అదేపనిగా ఆన్‌లైన్‌లో ఉంటే దాని ప్రభావంవల్ల ఆలోచనలూ జ్ఞాపకశక్తీ సామాజిక సంబంధాలూ తీవ్రస్థాయిలో క్షీణిస్తాయని అంటున్నారు. ఇందుకోసం వీళ్లు అనేక కోణాల్లో పరిశీలించి చూడగా- ఇంటర్నెట్‌ ఎక్కువగా వాడేవాళ్లలో ఏకాగ్రత లోపిస్తుందని గుర్తించారు. ఇంటర్నెట్‌ లో ఏ అంశానికి సంబంధించిన సమాచారమైనా క్షణాల్లో దొరుకుతుంది. దాంతో విషయాల్నీ అంకెల్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకపోవడంతో దానికి సంబంధించిన మెదడు భాగం పనితీరు తగ్గుతోంది. అంటే- ఎంత వేగంగా విషయాన్ని తెలుసుకుంటామో అంతే వేగంగా అది మెదడులోంచి వెళ్లిపోతుంది. అందుకే పిల్లలకు ఆన్‌లైన్‌ వల్ల ఒనగూరే ప్రయోజనాలతోబాటు దానికి బానిసలుగా మారితే వచ్చే ప్రమాదాల గురించీ తెలియజెప్పాలి. స్మార్ట్‌ఫోన్‌ బంధాల కన్నా సామాజిక అనుబంధాలే మేలని తెలిసేలా చేయడంతోబాటు ఆటలకీ వ్యాయామానికీ కొంత సమయం ఉండేలా చూడాలనీ అంటున్నారు పరిశోధకులు. ఇది పిల్లలకే కాదు, పెద్దలకీ వర్తిస్తుంది.


పొలాలే సౌర విద్యుత్‌ కేంద్రాలు!

పొలాల్లో ఒక్క శాతాన్ని సౌరశక్తికి కేటాయిస్తే ప్రపంచ ప్రజల విద్యుచ్ఛక్తి అవసరాలన్నీ తీరిపోతాయి అంటున్నారు ఆరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు. అదేసమయంలో ఆ నేలలో వ్యవసాయాన్నీ చేయవచ్చు కాబట్టి ఈ కొత్త విధానాన్ని అగ్రివోల్టాయిక్స్‌గా పిలుస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో సౌర విద్యుత్తు ఉత్పత్తికి ఎడారి నేలలే మేలని అంతా అనుకుంటారు. కానీ తీవ్రమైన వేడిగాలులు వీచే ఎడారి ప్రాంతాల్లో సౌరఫలకాలను ఏర్పాటుచేస్తే వాటి పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించారు. అదే పంటలు పండే వ్యవసాయ భూముల్లో వాటిని పెట్టినప్పుడు అవి అత్యధికస్థాయిలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడంతోబాటు పంటలూ బాగా పండాయట. అంటే- మనుషులకు మాదిరిగానే సౌరఫలకాలకు కూడా చల్లని గాలీ తగలాలి, వాతావరణం పొడిగానూ ఉండాలి. అప్పుడే అవి ప్రభావవంతంగా పనిచేస్తాయన్నమాట. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నా గాలి వేడెక్కినా వాటి పనితీరు తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఆచరణలోకి వస్తే విద్యుచ్ఛక్తి సమస్య తీరిపోయినట్లే.


శాకాహారం తిందాం!

మానవాళి ఆహారపుటలవాట్లను మార్చుకోకపోతే ఉష్ణమండల ప్రాంతాల్లోని పావు వంతు నేలభాగం ఈ శతాబ్దం చివరినాటికి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. రోజురోజుకీ మాంసాహారం, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉష్ణమండల ప్రాంతాల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. వ్యవసాయానికి బదులుగా మాంసాహారం కోసం జంతువుల పెంపకం పెరుగుతోంది. దాంతో వీటికోసమే ఎక్కువ భూమిని కేటాయిస్తున్నారు. పశుజనాభా పెరగడం వల్ల జల వనరులూ అడుగంటుతున్నాయి. ఫలితంగా వాతావరణకాలుష్యం కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఇదిలానే కొనసాగితే మరో ఎనభై ఏళ్లనాటికి వ్యవసాయ భూమి 11 శాతం తగ్గిపోతుంది. అంతేకాదు, పశు సంపద విపరీతంగా పెరగడం వల్ల అనేక వృక్షజాతులు సైతం అంతరించిపోతున్నాయి. దాంతో పర్యావరణానికీ తీరని నష్టం వాటిల్లుతుందని వాళ్ల అధ్యయనంలో తేలింది. కాబట్టి ఇప్పటికైనా ఆహారపుటలవాట్లను మార్చుకోవడం మంచిది అంటున్నారు.


ఈ-దుస్తులొస్తున్నాయ్‌!

సెన్సర్ల ద్వారా సంగీతాన్ని వినిపించేవీ, దీపాల్ని వెలిగించే దుస్తులు మార్కెట్లోకి వస్తున్నాయ్‌. పరడ్యూ విశ్వవిద్యాలయ నిపుణుల బృందం ఇంకాస్త ముందుకు వెళ్లి ఎలాంటి వస్త్రాన్ని అయినా సెన్సర్లతో పనిచేసే ఈ-దుస్తులుగా మార్చే ఆమ్నిఫోబిక్‌ ట్రైబో ఎలక్ట్రిక్‌ నానో జనరేటర్స్‌ అనే సరికొత్త టెక్నాలజీని రూపొందించింది. అంటే ఫ్లోరిన్‌ అణువులతో కూడిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఓ చిన్న ఎంబ్రాయిడరీలో చొప్పించడం ద్వారా వాటిని ఈ-టెక్స్‌టైల్స్‌గా మార్చేస్తున్నారు. ఈ దుస్తులకి రిమోట్‌నీ అనుసంధానిస్తారు. దాన్ని ఆన్‌ చేయగానే అవి ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లా పనిచేస్తాయి. వర్షంలోకి వెళ్లినా తడవవు, మరకల్నీ పడనివ్వవు. చుట్టుపక్కల వాతావరణంలోని వైరస్‌నీ బ్యాక్టీరియాతోబాటు చెడువాసనల్ని సైతం దరిచేరనివ్వవట. వీటినీ వాషింగ్‌మెషీన్‌లోనూ వేయొచ్చట.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.