close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చంబా అందాలు చూడాల్సిందే!

‘హిమగిరి సొగసులూ మురిపించును మనసులూ’ అని ఓ సినీకవి అన్నట్లు ప్రకృతి అందానికీ ఆధ్యాత్మికతకీ ఆలవాలమైన హిమాలయాల్ని ఎంత చూసినా తనివి తీరదు. మంచుకొండల గాంభీర్యంతోనూ పచ్చని మొక్కల సౌందర్యంతోనూ అలరారే చంబాలోయలో విహారం మనసుని మరో లోకాలకు తీసుకువెళ్తుంది’ అంటున్నారు దిల్లీకి చెందిన పప్పు శాంతాదేవి.
దిల్లీలోని సరాయి రోహిల్లా స్టేషన్‌ నుంచి ధౌలాధార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పంజాబులోని పఠాన్‌కోట్‌కి వెళ్లాం. ఉదయం 8.15 నిమిషాలకు రైలు పఠాన్‌కోట్‌లో ఆగింది. అక్కడి నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న చంబాకు కార్లో బయల్దేరాం. అడవుల్లో కొండల్లో లోయల్లో సాగిన ఆ ప్రయాణంలో రెప్పవాల్చితే ఏ అద్భుత దృశ్యాన్ని మిస్సవుతామో అనిపించింది. మామిడితోటల మధ్య కట్టిన ఓ చిన్న హోటల్లో అల్పాహారం తీసుకుని మళ్లీ బయల్దేరాం. రకరకాల చెట్లూ, మధ్యమధ్య కొండవాగులూ అన్నీ చూసుకుంటూ ముందుకు కదిలాం. చంబా సమీపిస్తోందనగా వయ్యారాలు పోతూ ప్రవహిస్తున్న రావి నది కనిపించింది. ఒకచోట కారు ఆపి రావి నదిని చూశాం. ఆ నది ప్రవాహ సడి మంద్రమైన సంగీతంలా వినిపించసాగింది. అంత ప్రశాంతంగా కనిపించే ఆ నది ఎప్పుడు పొంగి చుట్టుపక్కల ఊళ్లని ముంచేస్తుందో ఊహించలేం’ అంటారు స్థానికులు.

చంబాలోని స్నేహితుల ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. వాళ్లు ఆప్యాయంగా ఆహ్వానించారు. చంబా  లోయలో ఉన్నా ఊరంతా ఎత్తుపల్లాలే. ఎక్కడికి వెళ్లాలన్నా కొండలో మెట్లో ఎక్కాల్సిందే. చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో చంబా ఊరు ఉంటుంది. ఇది జిల్లా ముఖ్యపట్టణం కావడంవల్ల ఆసుపత్రులూ అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. చిన్న సందులూ పెద్ద కట్టడాలూ ఏటవాలు పైకప్పులూ చెక్క కట్టడాలూ ఆ ఊరి ప్రత్యేకతలు. కొండల్లో వర్షాలూ హిమపాతాలూ ఎక్కువ కాబట్టి కురిసిన మంచుకానీ వాన నీరు కానీ పైకప్పుమీద నిలువ ఉండకుండా ఉండేందుకే ఇళ్ల పైకప్పుని ఏటవాలుగా నిర్మిస్తారు. దేవాలయాల నిర్మాణం కూడా ఇదే విధానం. ఆ ఊరి మొత్తంలో ఎత్తైన కట్టడం రాజావారి బంగ్లా. ఇప్పుడు దాన్ని మెడికల్‌ కాలేజ్‌గా మార్చారు. రాచరికాలు పోయినా చంబా ప్రజలు తమ ఊరి గురించీ రాజు గురించీ ఎంతో అభిమానంగా చెబుతారు.

అన్నీ దేవాలయాలే!
చంబాలో ఎక్కడ చూసినా ఆలయాలే. ఇక్కడ పురాతన నరసింహస్వామి ఆలయంతోబాటు చాముండీదేవి ఆలయం కూడా ఉంది. రోడ్డు మార్గంలో వెళితే ఆలయం వెనకవైపునకు వెళ్లి 30 మెట్లు ఎక్కితే సరిపోతుంది. అదే ముఖద్వారం వైపునకు వెళితే సుమారు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కొండ అంచున ఉన్న ఆ అమ్మవారి ఆలయాన్ని స్వయంభువుగా చెప్పడమే కాదు, హెరిటేజ్‌ ప్రదేశంగానూ గుర్తించారు.  అమ్మవారి ఎదురుగా 27 కిలోల బరువున్న గంట ఉంది. దాన్ని 1600 సంవత్సరంలో ఆనాటి రాజావారు 27 రూపాయల ఖర్చుతో చేయించారట. ఆ గంట కొడితే చంబా లోయంతా వినబడుతుందట. ఇక్కడినుంచి చంబాలోయ మొత్తంగా కనిపిస్తుంది. అన్ని వేల సంవత్సరాల క్రితం కొండ చివర్లో ఆ నిర్మాణాన్ని ఎలా చేపట్టారనేది ఆశ్చర్యకరమైన విషయం.

ఆ గుడి చూసి కిందకి వచ్చే దారిలో మరో కొండమీద ఉన్న ఓ పెద్ద రాతిమీద ఆంజనేయస్వామి, పంచ పాండవుల బొమ్మలూ చెక్కి ఉన్నాయి. అక్కడే ఓ కొండమీద చంబా రాణి ఆత్మత్యాగం చేసిన ప్రదేశం ఉందనీ చెప్పారు. ఒకప్పుడు చంబాలో నీటి ఎద్దడి సంభవించిందట. జనం తాగునీటికోసం అల్లాడిపోయారట. అప్పుడు చంబారాణికి తను ప్రాణ త్యాగం చేస్తే నీళ్లు వస్తాయని కల వచ్చిందట. అలా ఆవిడ కొండెక్కి, అక్కడ నుంచి కిందకి దూకి మరణించిదట. ఆ తరవాత నుంచి ఆ ప్రాంతానికి మరెప్పుడూ కరవు రాలేదట. అందుకేనేమో చంబా ప్రజలకి రాజవంశమంటే అపారమైన ప్రేమ. ఇప్పటికీ ఆ కొండ ప్రాంతాల్లో నీటి ప్రాముఖ్యత గురించి బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి. తరవాత . చేతిలో బిందెతో నిలువెత్తు రూపంలో ఉన్న శీతలామాతనీ దర్శించుకున్నాం.

గొప్ప సంప్రదాయం!
చంబా పట్టణం నుంచి మిగిలినవాళ్లంతా తెలుసుకుని ఆచరించగలిగే మరో గొప్ప సంప్రదాయం ‘చంబెలి ధాం’  చంబాలోని ఏ ఇంటిలోనైనా శుభకార్యం ఉంటే ముందుగా ఈ ధాం అనే విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ విందుని లక్ష్మీనారాయణ ఆలయంలోనే ఇస్తారు. అక్కడ ఖాళీ లేకపోతే రెడ్‌ క్రాస్‌ వాళ్ల హాల్లో ఈ విందును నిర్వహిస్తారు. ఇంతకీ అక్కడి విందు విశేషమేమంటే- అక్కడ ఎవరైనాగానీ పేదా గొప్పా తేడా లేకుండా- చివరకు రాజవంశీకులు ఇచ్చే విందులో సైతం- ఒకే రకమైన వంటకాలు ఉంటాయి. ముడి పెసలు, పప్పు, రాజ్మా కూర, మజ్జిగ పులుసు, అన్నం, తీపి అన్నం, ఖామీ అనే మరో వంటకం మాత్రమే ఉంటాయి. ఆ ఆలయంలో ఒక పక్కకి మూడు విశాలమైన చావిడులు ఉన్నాయి. ఒక్కోదాంట్లో సుమారు ఐదు వందలమంది పడతారు. పిలిచిన వాళ్లు అందరూ- అంటే కుటుంబంలోని ముసలివాళ్ల నుంచి చిన్న పిల్లలవరకూ అందరూ తప్పనిసరిగా విందుకు వస్తారు. వచ్చినవాళ్లంతా బీదాగొప్పా తేడా లేకుండా కులమతాల పట్టింపులూ లేకుండా నేలమీద పరిచిన చాపలమీద కూర్చునే తింటారు. మేం వెళ్లినవారి ఇంటిలో ఆ రోజు సుమారు రెండువేలమంది భోజనం చేశారు. నేలమీద కూర్చోలేనివారికోసం ఒక హాల్లో అరుగులు కట్టారు. ఆ ఊరిలో ఆ కట్టుబాటు అద్భుతంగా అనిపించింది. మేం ఈ ధాం కార్యక్రమం చూశాక, రాజా భూరి సింగ్‌ మ్యూజియానికి వెళ్లాం. అందులో చంబా సంస్కృతీ సంప్రదాయాల్ని తెలిపే కళారూపాలూ రాజకుటుంబీకుల దుస్తులూ ఆభరణాలూ ఉన్నాయి. తరవాత 18వ శతాబ్దంలో రాజా ఉమేద్‌ సింగ్‌ నిర్మించిన అఖండ్‌ చండీ ప్యాలెస్‌, రంగ్‌మహల్‌లతోబాటు లక్మీనారాయణ ఆలయం, సుయ్‌మాతా ఆలయాల్ని చూశాం. ఇక్కడే రావి నది నుంచి ఏర్పడిన ఛమేరా సరస్సులో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించడం మంచి అనుభూతిని అందించింది. తరవాత ఖజ్జియార్‌కి బయలుదేరాం.

అందాలకు నెలవు!
ఖజ్జియార్‌ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. అక్కడ కాలాటాప్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ ఉంది. అందులో రకరకాల రంగుల పక్షులు కనిపించాయి. ఖజ్జియార్‌ అంతా దేవదారు వనాలే. ఆకాశాన్ని అంటుతూ నిలువుగా పెరిగిన ఆ దేవదారు వృక్షాల మధ్య సన్నని దారుల్లో ప్రయాణిస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. చుట్టూ కొండలూ... మధ్యలో ఓ సువిశాలమైన మైదానం. దాని మధ్యలో ఓ జలాశయం, దానిచుట్టూ పైన్‌ వృక్షాల అరణ్యం ఉంటుంది. దట్టంగా ఎత్తుగా పెరిగిన పైన్‌ వృక్షాలు జాగ్రత్తగా పెంచిన వనంలా గోడ కట్టినట్లుగా ఉన్నాయి. అదంతా చూస్తుంటే భగవంతుడు శ్రద్ధగా వేసిన చిత్రంలా కనిపిస్తుంది. అక్కడ పర్యటకులకోసం చక్కని రంగులు వేసి, ఏటవాలు పైకప్పులతో ఉన్న అతిథి గృహాలు ఉన్నాయి. అవన్నీ బొమ్మల్లా కనిపిస్తాయి. మేం వెళ్లినప్పుడు ఖజ్జియార్‌ జలాశయంలో నీళ్లు లేవు. కానీ వంతెనలు నిర్మించి ఉన్నాయి. ఆ జలాశయం భూగర్భంలోంచి వచ్చిన ఊటతో వచ్చిందనీ అందులో శేషనాగు ఉండేదనీ అక్కడ ఉన్న బోర్డుమీద రాసి ఉంది. అందులో నీళ్లు ఉన్నప్పుడు కైలాసపర్వతం అందులో ప్రతిబింబిస్తుందట.

అక్కడే ఒకవైపున నాగదేవాలయం ఉంది. అది 1200 సంవత్సరంలో నిర్మించారనీ తరవాత పునరుద్ధరించారనీ అక్కడ రాసి ఉంది. అయితే అక్కడ పాము విగ్రహానికి బదులు బలరాముడి విగ్రహం ఉంది. ఆయన్ని శేషనాగు అవతారంగా చెబుతారు. విగ్రహం పై భాగంలో అనేక ముఖాలు కలిగిన నాగూ విప్పిన పడగల కింద ఓ చేతిలో గదా మరో చేతిలో రోకలి పుచ్చుకున్న విగ్రహమూ ఉంది. అక్కడే కొండమీద ఏటవాలు కప్పుతో నిర్మించిన మరో ఆలయం కూడా ఉంది. ఆ ఆలయానికి ఎదురుగా హిడింబి ఆలయం ఉంది.  తరవాత అక్కడి నుంచి మంగల్‌, గేట్‌, జోత్‌, నూర్పూర్‌ అనే ఊళ్ల మీదుగా ఆ కొండదారి పైకి ఎక్కి, కిందికి దిగుతూ ఉంటే అద్భుతంగా అనిపించింది. అక్కడి నుంచి చూస్తే మంచుతో కప్పబడిన కైలాస పర్వతం, దాని చుట్టూ ఉన్న చిన్న పర్వతాలూ సాక్షాత్కరించాయి. మూర్తీభవించిన ఆ ప్రకృతి సుందర గాంభీర్యంతో మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. అలా సుమారు 7,500 అడుగుల ఎత్తు వరకూ వెళ్లి కిందకి దిగాం. ఆ ప్రయాణంలో మేం గమనించిన మరో విషయమేంటంటే- అక్కడ ప్రతి ఐదు వందల అడుగుల ఎత్తుకీ చెట్లు మారిపోతున్నాయి. 7,500 అడుగుల ఎత్తులో పైన్‌ చెట్లు మాత్రమే ఉన్నాయి. అక్కడి నుంచి కిందికి వస్తే వేరే జాతులకు చెందిన పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఇంకా కిందికి వస్తే అనేక వృక్షజాతులతోబాటు రోడోడెండ్రాన్‌లూ కనిపించాయి. మందారాల్లా విరబూసిన ఆ పూలతో అక్కడివాళ్లు పచ్చడి చేసుకుంటారట. అదో ఔషధమొక్క అని చెప్పారు. ఆ మొక్కలన్నింటినీ పలకరిస్తూ పాములా మెలికలు తిరిగిన దారిలో తిరిగి పఠాన్‌కోట్‌కు చేరుకున్నాం.

 

29 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.