close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అల్లాహ్‌కీ గణపతికీ ఒకటే పందిరి!

వినాయక చవితికి గజాననుడు వీధివీధినా అందంగా వెలుస్తాడు. మండపాల్లో ముచ్చటగా కొలువుదీరతాడు. అదే సమయంలో మొహర్రం నెలా వస్తుంది. హిందూ - ముస్లిం సోదర భావాన్ని తెలుపుతూ మన దేశంలో కొన్ని చోట్ల రెండింటినీ ఒకే వేదిక మీద నిర్వహిస్తున్నారు. వినాయకుడూ పీర్లూ పక్కపక్కనే ఉండే ఈ మండపాలు మతసామరస్యానికి ఆలవాలంగా నిలుస్తున్నాయి.
వినాయక చవితి వచ్చిందంటే దేశమంతా సందడి నెలకొంటుంది. ప్రాంతీయ భేదం లేకుండా భారతదేశంలోని హిందువులంతా కలిసి గణనాథుడిని కొలుస్తారు. వాడవాడనా విగ్రహాలు ఏర్పాటు చేసి మేళతాళాలతో వేడుకలు నిర్వహిస్తారు. ఇక, ముస్లింల పవిత్ర మాసం మొహర్రం. ఇందులో భాగంగా చావిడిలా ఏర్పాటుచేసిన చోట ఒక వేదిక మీద స్థానిక ముస్లింల సంప్రదాయాన్ని అనుసరించి పీర్లను ఉంచి కుటుంబ సమేతంగా వచ్చి దట్టీలు సమర్పిస్తారు. రకరకాల పూలూ, రంగురంగుల దట్టీలతో ఆ పీరీలను అలంకరిస్తారు. అక్కడికి వెళ్లి ఊదుని కణతలకు రాసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా దట్టీలు సమర్పించే వాళ్లలో హిందువులుంటే, గణపతి నవరాత్రుల్లో పాల్గొనే వాళ్లలో ముస్లింలూ ఉంటారు. కొన్నిసార్లు గణపతి నవరాత్రులూ, మొహర్రం నెలా ఒకేసమయంలో వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో హిందూ ముస్లిం సోదరభావాన్ని తెలుపుతూ ఈ రెంటినీ ఒకే వేదిక మీద నిర్వహిస్తున్నాయి గణపతి పండళ్లూ, ముస్లిం సంస్థలూ. కర్ణాటక హుబ్బళ్లిలోని బమ్మాపూర్‌ విఘ్నేశ్వర ఉత్సవ సమితి- ముస్లిం జమాత్‌ కమిటీ, పుణె దగ్గరి మాధ్లా బజార్‌ మిత్ర మండల్‌ - పైల్వాన్‌ తాజియా ఖడ్కీ, గుజరాత్‌ వడోదరలోని కళామందిర్‌ యువక్‌ మండల్‌ - నవ్‌జవాన్‌ హుస్సేనీ కమిటీల్లాంటివి ఈ తరహా సంప్రదాయానికి తెరలేపిన వాటికి కొన్ని ఉదాహరణలు. ఇందులో భాగంగా ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేసి ఒక పక్క వినాయకుణ్నీ, మరో పక్క పీర్లనూ ఉంచుతారు. ఎవరి సంప్రదాయాలను అనుసరించి వాళ్లు పూజల్ని నిర్వహించుకుంటారు. ఒకరి ఆచారాలకు ఒకరు భంగం కలగకుండా చూసుకుంటారు. వచ్చే భక్తులూ తమ తమ ఇష్టాన్ని బట్టి రెండు చోట్లా ఆశీర్వాదం తీసుకుంటారు. కొన్ని చోట్ల గణపతికి ముస్లింలు హారతులు సమర్పిస్తే, హిందువులు ముస్లిం ప్రార్థనల్ని నిర్వహిస్తారు. ఇలాంటి మండళ్ల దగ్గర హిందూ ముస్లిం సోదరభావాన్ని తెలుపుతూ రాసే కొటేషన్లూ ఆకట్టుకుంటాయి. ‘విశ్వాన్ని సృష్టించింది ఒక్కడే... ఆయన్ని కొందరు అల్లాహ్‌ అనీ కొందరు భగవాన్‌ అనీ పిలుస్తారు... భేదం ఉన్నది పిలుపులో మాత్రమే’; ‘రక్తం ఎక్కించుకునేప్పుడు హిందూ రక్తమా, ముస్లిం రక్తమా అని అడగం... అందరిలో ప్రవహించేది ఒకటే రక్తం అయినప్పుడు మనకెందుకు తేడాలు’... అన్నీ ఈ తరహా సందేశాలే కనిపిస్తాయక్కడ. ఒక్కసారి కాదు ఈ కమిటీలు ఎన్నో ఏళ్లుగా ఈ తంతును విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. రెండు మతాల ప్రజల మనసుల్ని తెలిపే ఈ మండపాలు నిజమైన మత సామరస్యానికి వేదికలని చెప్పొచ్చు కదూ!

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.