close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీచర్లూ మీకు జేజేలు!

‘మనకోసం మనం బతకడంలో గొప్పేముంది? ఇతరుల కోసం బతికితే ఆనందంతోపాటు బోలెడంత ఆత్మసంతృప్తి మిగులుతుంది. మేమూ అదే చేస్తున్నాం’ అంటున్న ఈ టీచర్లు సంపాదన కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసమే కష్టపడుతున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం(సెప్టెంబరు 5) సందర్భంగా వారి గురించి...

గుర్రంమీద స్కూలుకు...

విశాఖ ఏజెన్సీలోని కొన్ని గ్రామాలకు కాలినడకనే వెళ్లాలి. మార్గం మధ్యలో అడవిజంతువులు దాడిచేసే ప్రమాదమూ ఉంటుంది. 
ఆ ఏజెన్సీలోని పెదబయలు మండలంలోని జమదంగిలో ప్రాథమిక పాఠశాల ఉంది. మండలకేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ స్కూలును చేరుకోవాలంటే 20 కిలోమీటర్ల మేర కొండలూ, గుట్టలూ, వాగులూ దాటాలి! మూడేళ్ల క్రితం దాసుబాబుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఆ బడిలోనే పోస్టింగ్‌ వచ్చింది. తీరా స్కూలుకెళితే కనీసం పైకప్పు కూడా లేదు. పైగా దాసు అక్కడకు వెళ్లాలంటే సాహసయాత్ర చేయకతప్పదు. కొన్నిసార్లు ఆ ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం కూడా ఇబ్బంది పెడుతుంది. వానలూ, పొగమంచూ ముందుకెళ్లనీయవు. అయినాసరే పిల్లలకు చదువు చెప్పాలని నిర్ణయించుకుని ఎలాంటి వసతీ లేని ఆ గ్రామంలో దాసు కొన్నాళ్లు ఉండి గిరిజన భాషను నేర్చుకోవడంతోపాటు పిల్లలందరికీ తెలుగు నేర్పించాడు. 
పిల్లలంతా సక్రమంగా బడికి హాజరవుతున్నారని తెలిశాక ఇంటి నుంచి వెళ్లడం మొదలుపెట్టాడు. ఇబ్బందైనా గుర్రపు స్వారీ చేస్తూ కొండలూ, గుట్టలూ, వాగులూ దాటుకుని వెళ్లి పాఠాలు చెబుతున్నాడు. కొందరు టీచర్లు సౌకర్యాలున్నా స్కూళ్లకి సరిగా వెళ్లరూ, విద్యార్థుల్ని పట్టించుకోరు. అలాంటిది ఒకవైపు అడవి జంతువుల భయం మరోవైపు సౌకర్యాల కొరత ఉన్నా దాసు సెలవు పెట్టకుండా రెట్టించిన ఉత్సాహంతో స్కూలుకి హాజరవుతూ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నాడు. కష్టమైనా స్వారీ నేర్చుకుని గుర్రంపైనే రోజూ నలభై కిలోమీటర్లు ప్రయాణించి బడికెళుతున్న దాసు ఎంతోమంది ఉపాధ్యాయులకు స్ఫూర్తి అని చెప్పొచ్చు.

పడవెక్కి బడికెళ్లి...

కేరళలోని నెయ్యార్‌ అటవీప్రాంతంలో అగస్త్యర్కూడం గ్రామం ఎత్తైన కొండపైన ఉంది. గిరిజన బాలల కోసమే ఇరవై ఏళ్ల క్రితం అక్కడో పాఠశాల ఏర్పాటైంది. స్కూల్‌లో తక్కువ మంది చిన్నారులున్నా... టీచర్లకు మాత్రం అక్కడ పనిచేయాలంటే హడల్‌. 
ఎందుకంటే పడవ ప్రయాణం చేసి... ఏనుగులూ, చిరుతలూ సంచరించే అడవిలో నడుచుకుంటూ.. కొండలూ గుట్టలూ ఎక్కితేనే ఆ స్కూల్‌ని చేరుకోగలం. గత పదహారేళ్లుగా ఉషాకుమారి అలానే బడికెళుతోంది. ఉదయం ఏడున్నరకి ఇంట్లో బయల్దేరి నది వరకూ స్కూటీపై వచ్చే ఉష అక్కడి నుంచి పడవ ఎక్కి అడవి వద్దకు చేరుకుంటుంది. కర్రసాయంతో అడవి కమ్మేసిన కొండని ఎక్కుతూ మార్గమధ్యంలోని తండాల్లో ఉండే పిల్లల్ని కూడా బడికి తీసుకెళుతుంది. మధ్యాహ్న భోజనం పథకం కింద నిధులు సక్రమంగా రాకపోయినా ఆమె జీతం వెచ్చించి మరీ చిన్నారులకు కడుపునింపుతుంది. ఉష ఒక్కరే ఆ స్కూల్లో టీచర్‌. గిరిజనుల జీవితంలో మార్పు తేవాలన్న ధ్యేయంతోనే ఎంత కష్టమైనా ఆ బడిలో పనిచేస్తున్న ఉష సెలవులు కూడా పెట్టడానికి ఇష్టపడదంటే నమ్ముతారా!

మోదీ మెచ్చిన మాస్టారు!

ఇడములకుడి... కేరళలోని పర్యటక ప్రాంతమైన మున్నార్‌ పరిధిలో ఉంటుంది. కొండలూ, గుట్టలూ ఎక్కిదిగితేనే ఆ గ్రామాన్ని చేరుకోగలం. అక్కడున్న ప్రాథమిక పాఠశాలకు చుట్టుపక్కల 28 తండాల నుంచి కూడా పిల్లలు వస్తుంటారు. 
కనీసవసతులకు ఎంతో దూరంగా ఉన్న ఆ బడిలో మురళీధరన్‌కు టీచర్‌ ఉద్యోగం వచ్చింది. సంతోషంగా ఉద్యోగంలో చేరి ఆ గ్రామానికే మకాం మార్చాడు. నెలకోసారి ఇంటికెళ్లి భార్యాపిల్లల్ని చూసి వస్తూ... కరెంటు కూడా లేని ఇడములకుడిలో అరకొర వసతులతో బతకడం మొదలుపెట్టాడు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా తానే స్టేషనరీ, బెంచీలూ, బల్లలూ, బోర్డులూ, ఛార్టులూ, పుస్తకాలు సమకూర్చుకున్నాడు. మధ్యాహ్నభోజనం పథకం అమలుకాని రోజుల్లో విద్యార్థులకు తనకు ఉన్నదే కాస్త పెట్టి ఆకలి తీర్చేవాడు. పాట రూపంలో పాఠాల్ని బోధిస్తూ, ప్రకృతిలోకి తీసుకెళ్లి అన్నీ విడమరుస్తూ చిన్నారులకు చదువు పట్ల ఆసక్తిని పెంచి వారు బడి మానకుండా చూస్తున్నాడు. ఐదోతరగతి పూర్తయిన వారు ఉన్నత విద్య చదువుకొనే దిశగా ప్రోత్సహిస్తూ తల్లిదండ్రుల్లోనూ చైతన్యం తీసుకొస్తున్నాడు. మురళీధరన్‌ దగ్గర చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు నేడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అంతేనా ఆ గ్రామస్థులకు ఓటరు, రేషన్‌, ఆధార్‌కార్డులూ, విద్యుత్‌ సౌకర్యం అందించి ప్రభుత్వ పథకాలు దక్కేలా చూస్తున్నాడు. ఈ మధ్య ప్రసారమైన మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ కూడా మురళీధరన్‌ గురించి ప్రస్తావించి ప్రశంసించారు.

1 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.