close
మీకోసం ఓ యూట్యూబ్‌ ఛానెల్‌!

ఎవరికి ఎక్కువ విషయాలు తెలిస్తే వాళ్లే బాస్‌. అలాంటి స్నేహితులు ఉన్నాకూడా మనం సేఫ్‌జోన్లో ఉన్నట్టే. కానీ స్నేహితులకి కూడా తీరిక లేక ఫోన్లోనే హాయ్‌, బాయ్‌ చెప్పుకుంటున్న రోజులివి. అందుకే ఆన్‌లైన్‌ నేస్తాలే మనకు దిక్కు. అలాంటివే ఈ యూట్యూబ్‌ ఛానళ్లు.

కెరీర్‌ గైడెన్స్‌ కోసం...

హైదరాబాద్‌కు చెందిన దంపతులు తస్కీన్‌ ఫాతిమా బాషా... సుగంధ్‌ రాఖా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. తస్కీన్‌ దాదాపు ఎనిమిదేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశాక ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా మారింది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌మీద అవగాహన తెచ్చేందుకు భర్తతో కలిసి ‘ది అర్బన్‌ ఫైట్‌’ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించింది. అనతికాలంలో మంచి స్పందన వచ్చిందీ ఛానల్‌కు. ఆ క్రమంలోనే నగరవాసులకు కెరీర్‌, ఆర్థిక అంశాల్లోనూ అవగాహన తెస్తే ప్రయోజనం ఉంటుందని ఆ వీడియోల్నీ చేయడం మొదలుపెట్టారు. ఆ రంగాల్లో తమ అనుభవానికి నిపుణుల ఆలోచనల్నీ జోడించి సులభమైన ఇంగ్లిష్‌లో వివరిస్తూ వీడియోల్ని పెడుతున్నారు. రెజ్యుమె ఎలా సిద్ధం చేయాలీ, గ్రూప్‌ డిస్కషన్స్‌, ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధమవ్వాలీ, స్పోకెన్‌ ఇంగ్లిష్‌- పబ్లిక్‌ స్పీకింగ్‌లో ఎలా మెరుగుపడాలీ... అన్న అంశాలపైన వీరు తీసిన వీడియోలకు మంచి స్పందన ఉంది. ఇంటర్వ్యూల్లో ‘మిమ్మల్నే ఎందుకు ఎంపిక చేసుకోవాలీ, మీ గురించి చెప్పండి’ అని అడిగే ప్రశ్నలకూ ఎలా సిద్ధమవ్వాలో చెబుతూ విడివిడిగా వీడియోలు చేశారు. వీటికి లక్షల్లోనే వీక్షణలు ఉన్నాయి. కేవలం ‘మీ గురించి చెప్పండి’ ప్రశ్నపైన తీసిన వీడియోకి 40 లక్షల వీక్షణలు వచ్చాయి. డీమ్యాట్‌ అకౌంట్‌ తెరవడం, స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేయడం, సొంతిల్లు కొనడం... లాంటి ఆర్థిక పాఠాలకూ లక్షల్లోనే వీక్షణలు ఉన్నాయి. యూట్యూబ్‌లో వినోదానికి సంబంధించిన ఛానళ్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది విద్యావిభాగంలోని ఈ ఛానల్‌కు మంచి స్పందన రావడానికి కారణం వీడియోల్లో నాణ్యత. వివిధ అంకుర సంస్థలు వీరికి స్పాన్సర్లు గానూ ఉంటున్నాయి. కేవలం మూడేళ్లలో ఈ ఛానల్‌ తొమ్మిది లక్షల మంది చందాదారుల్ని సంపాదించింది.

ఫోన్‌ ఎంపికలో తోడు... 

మార్కెట్లో రోజుకో ఫోన్‌ వస్తుంది. ఏది కొనాలో ఏమీ అర్థం కాదు. అలాగని ఏదో ఒకటి కొనేసి చేతులు కాల్చుకోలేం. ఈ సమస్య మీదీ నాదీ మాత్రమే కాదు, అందరిదీనూ. అలాంటివాళ్లు ఓసారి ‘ప్రసాద్‌ టెక్‌ ఇన్‌ తెలుగు’ చూస్తే కొంతవరకూ అవగాహన వస్తుంది. ఈ ఛానల్‌కి ఉన్న పాపులారిటీవల్ల వివిధ మొబైల్‌ కంపెనీలు తమ ఉత్పత్తుల్ని మార్కెట్‌లోకి విడుదలచేయకముందే రివ్యూ కోసం ప్రసాద్‌ దగ్గరకు పంపుతాయి. అలా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్త సరుకు గురించి మనం ఈ ఛానల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కొత్త గ్యాడ్జెట్ల పరిచయం, స్మార్ట్‌ఫోన్లూ, ఎలక్ట్రానిక్‌ పరికరాల రివ్యూ, టెక్నాలజీపై అవగాహన కల్పించే వీడియోలూ, టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలూ-జవాబులూ మొదలైన అంశాల్లో ప్రసాద్‌ వీడియోలు పెడతారు. కామెంట్లలో మన అవసరాలూ, బడ్జెట్‌ చెబితే అందుకు సరిపోయే ఫోన్‌ విషయంలో సలహా ఇస్తారు. కొత్తగా వచ్చిన పరికరాల్ని పరిచయం చేయడమే కాదు, వాటిని వారం, నెల రోజులు వాడిన తర్వాత కూడా తన అనుభవాన్ని చెబుతారు. చాలా క్లిష్టమైన విషయాల్ని కూడా చాలా స్పష్టమైన తెలుగులో అర్థమయ్యేలా చెప్పడం ఈ టెక్‌ గురూ ప్రత్యేకత. దాదాపు తొమ్మిది లక్షల మంది చందాదారులున్నారీ ఛానల్‌కు.

ఆన్‌లైన్లో ‘తెలుగు బడి’

పేరులో ఉన్నట్టే ఇదో తెలుగు మీడియం ఆన్‌లైన్‌ బడి. ఈ బడిలో వీడియో పాఠాలు చూస్తూ ఎవరైనా తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. దీన్లో భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వైద్యం ఇలా వివిధ రంగాలకు సంబంధించిన అంశాలను వీడియోల ద్వారా తెలుగులోనే వివరిస్తుంటారు. వాటికితోడు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల జీవిత చరిత్రలూ, జీవితంలో తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలూ వీటిపైనా వీడియోల్ని తీసి అప్‌లోడ్‌ చేస్తారు. అంతేకాదు, మీకు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలని ఉంటే వీరికి మెయిల్‌ద్వారా తెలియజేస్తే దానిపైన ప్రత్యేకంగా వీడియో చేస్తారు. అలా చాలామంది జీవనశైలి, స్టాక్‌ మార్కెట్‌, సైన్స్‌కు సంబంధించిన సందేహాల్ని వీరి వీడియోల సాయంతో తెలుసుకుంటున్నారు. మనం తిన్న ఆహారం ఎలా జీర్ణమవుతుంది, తల్లి గర్భంలో బిడ్డ ఎలా పెరుగుతుంది, పిడుగుల నుంచి ఎలా రక్షించుకోవచ్చు, మెదడు ఎలా పనిచేస్తుంది, ఐపీఓ అంటే ఏమిటి.... లాంటి సందేహాల్ని కొద్ది నిమిషాల వీడియోలతో నివృత్తి చేసుకోవచ్చు. అబ్దుల్‌ కలాం, బ్రూస్లీ, రతన్‌ టాటా మొదలైనవారి జీవితగాథలపైన తీసిన వీడియోలకు పది లక్షలకుపైనే వీక్షణలు వచ్చాయి. అందుకే మరి ఈ వెబ్‌ ఛానల్‌ పది లక్షల చందాదారులకు చేరువైంది.

1 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.