close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాత సామాన్లే పూలకుండీలు!

‘కావాలని పారేస్తే తప్ప సృష్టిలో పారేయదగ్గ వస్తువు అంటూ ఏదీ ఉండదు. ఒక పనికోసం తయారుచేసిన వస్తువుని మరో రూపంలోకి మార్చి వాడుకోవడంలోనే ఉంది అసలైన మ్యాజిక్‌. అదే రీసైక్లింగ్‌’ అంటుంటారు పర్యావరణప్రియులు. అందులో భాగంగా మొలకెత్తిన వినూత్న ఆలోచనలకు ప్రతిరూపాలే ఈ పూల కుండీలు.

ఉప్పూకారాలన్నీ సమంగా పడితే గడ్డితో పచ్చడి చేసినా అద్భుతంగా ఉంటుందంటారు పెద్దలు. అలాగే, కాస్త సృజన ఉండాలే కానీ మొక్కల్ని పెంచడానికి పనికిరానిది ఏదీ లేదు అంటున్నారు ఈనాటి ఉద్యానవన ప్రియులు. అనడమే కాదు, ఆ విషయాన్ని ఆచరణలోనూ చూపిస్తున్నారు. పిల్లలు ఆడుకునే లెగో బ్రిక్స్‌ నుంచి కారు టైర్ల వరకూ అన్నీ మొక్కల పెంపకానికి అనుకూలమే అంటూ వాటిని తమదైన శైలిలో అందంగా అలంకరించి మరీ పెంచుతున్నారు.

సీసా, డబ్బా అన్నీ కుండీలే!
ఇంటికి అందాన్నీ మనసుకి ఆహ్లాదాన్నీ పంచి ఇచ్చే పచ్చని మొక్కల్ని పెంచుకోవాలని కోరుకోని వాళ్లు ఉండరు. అందుకే రకరకాల ఆకారాల్లో అందంగా తయారుచేసిన కుండీలు అనేకం ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటంతట అవే నీటిని తీసుకునేవీ సంగీతాన్ని వినిపించేవీ లైట్లు వెలిగేవీ నీళ్లు అయిపోతే రకరకాల సంకేతాల్ని చూపించేవీ... ఇలా వీటిల్లో రకరకాల ఫీచర్లని జోడించినవీ ఉంటున్నాయి. వీటి సంగతి ఎలా ఉన్నా, పర్యావరణం పట్ల ప్రేమ కావచ్చు, వృథా ఎందుకు అన్నది కావచ్చు... మొత్తమ్మీద పనికిరాని వస్తువుల్ని సైతం అందమైన కుండీలుగా తయారుచేసుకుని పెంచుకునేవాళ్ల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతోంది.
ఇంట్లో రోజువారీ ఎన్నో రకాల వస్తువుల్ని వాడి పారేస్తుంటాం. అలాంటి వాటిల్లో ఎక్కువగా జమ అయ్యేవి ప్లాస్టిక్కు బాటిళ్లే. అందుకే ఆయా బాటిళ్లని రకరకాల ఆకారాల్లో కోసి వాటికి రంగులు వేసి చిన్న బొత్తాముల్లాంటివి అమర్చి జంతు రూపాలు వచ్చేలా చేసి మరీ మొక్కల్ని పెంచేస్తున్నారు కొందరు సృజనశీలురు. అయితే వీటిల్లో మరీ చిన్న సైజు కన్నా రెండులీటర్ల బాటిళ్లని తీసుకుంటే కాస్త ఎక్కువ మట్టి పడుతుంది. వాటిల్లో ఏ మొక్క పెట్టినా ఆరోగ్యంగానూ పెరుగుతుంది. ఇలాగే నూనె డబ్బాలూ గాజు బాటిళ్లూ డబ్బాలూ జాడీలూ పాత్రలూ వంటలకు వాడే పెద్ద పెద్ద గంగాళాలూ... ఇలా వాడకుండా పక్కన పడేసిన అన్ని రకాల వంటింటి సామాన్లలోనూ మొక్కల్ని ఎంచక్కా పెంచేస్తున్నారు. అల్యూమినియంతో చేసిన డబ్బాల్లాంటి వాటికయితే నచ్చిన రంగులేయడమో వెల్వెట్‌ క్లాత్‌ లాంటిది చుట్టడమూ చేస్తే ఇంట్లో కొత్త కుండీలు ఉన్నట్లే. వాడని టీ కప్పుల్లోనూ పుదీనా, కొత్తిమీర గింజలు చల్లి వంటింటి కిటికీలోనో బాల్కనీలోనో కాస్త ఎండ తగిలేచోట ఉంచితే తాజా ఔషధ రుచుల్నీ సొంతం చేసుకోవచ్చు.

సృజన ఉంటే చాలు!
ఎంత ఖరీదు పెట్టి కొన్నా లెదర్‌ సోఫాల్లాంటివి కొన్నాళ్లకి పాడయిపోతుంటాయి. వాటిని ఒకటిరెండుసార్లకన్నా ఎక్కువగా బాగుచేయలేం. అమ్ముదామంటే కొనేవాళ్లూ ఉండరు. అలాంటి సోఫాలూ కుర్చీల్లో మట్టిని నింపి, ఇంటి ముందో వెనకో వేసి రంగురంగుల పూల మొక్కల్ని పెంచితే పెరడు లుక్కే మారిపోతుంది. ఒకప్పుడు కొబ్బరి తీయగా మిగిలిన చిప్పల్నీ, తాగిన బోండాల్నీ ఎండబెట్టి వంటచెరకుగా వాడుకునేవారు. ఇప్పుడు వాటిల్లో సైతం చిన్నపాటి క్రోటన్‌ మొక్కల్నీ ఔషధ మొక్కల్నీ పెంచేస్తున్నారు. చిప్పల్ని ఓ కర్రకి వేలాడదీస్తే అందమైన కుండీల స్టాండ్‌ కూడా అమరిపోతుంది.
ఇంట్లో టీనేజ్‌ అమ్మాయిలో అబ్బాయిలో ఉంటే జీన్స్‌ ప్యాంటులూ యాక్సెసరీలూ అరలు అరలుగా పేరుకుపోతూనే ఉంటాయి. కాబట్టి వాడని ప్యాంట్లనీ బ్యాగుల్నీ చెప్పుల్నీ కుండీల్లా మలచుకోవచ్చు. పైగా ఇవి ఎండకి ఎండి, వానకి తడిసి పాడయినా నేలలో కలిసిపోతాయి కాబట్టి పర్యావరణానికి వచ్చిన నష్టమూ లేదు. అలాగే కూరగాయలూ పండ్లూ వేసుకునే ప్లాస్టిక్‌ బుట్టలూ వెదురూ జనపనారతో చేసిన పాత బుట్టలనూ అందమైన కుండీలుగా మలచుకోవడం చాలా సులభం. ఇవే కాదు, పాతకాలంనాటి టేప్‌రికార్డర్లూ ఫోనుల్లాంటి వాటిల్లో బుల్లి నాచు మొక్కల్ని పెంచితే ఇంటికి యాంటిక్‌ లుక్కూ వస్తుంది. వాటిల్లోని పచ్చదనం మనసుకి ఆహ్లాదాన్నీ పంచి ఇస్తుంది. ఇక, కార్లూ మోటారు సైకిళ్ల టైర్లు చాలానే వృథా అవుతుంటాయి. వీటిని పెరట్లో ఒకదానిమీద ఒకటి అమర్చి వాటిల్లో మట్టిని నింపి తలంబ్రాలు, నీలగోరింట, బంతి, చామంతి, టెంకీస్‌... వంటి అందమైన పూలమొక్కల్ని పెంచుతున్నారు. ఇంటిముందు విశాలమైన పెరడు ఉన్నా లేదా పబ్లిక్‌ పార్కుల్లోగానీ వీటిని పెట్టి, రంగులు కూడా వేస్తే అందరి దృష్టినీ ముందుగా ఆకర్షించేవి అవే అనడంలో సందేహం అక్కర్లేదు. కొందరయితే టైర్లను కోసి కుండీల్లా చేసి మరీ మొక్కల్ని పెంచుతున్నారు. ఇవే కాదు, పిల్లల ఆటవస్తువులూ పనికిరాని పుస్తకాలూ... ఇలా వేటిలోనైనా పూలమొక్కల్ని పెంచుకోవచ్చు.
కావాల్సిందల్లా కాస్త ఓపికా మరికాస్త సృజనా మాత్రమే.

1 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.