close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆకలి తీర్చే ఆంజనేయుడు...!

అభయమిచ్చే ఆంజనేయుడు అక్కడ అన్నార్తుల కడుపు నింపుతున్నాడు. అనాథల, వికలాంగుల ఆకలి తీరుస్తున్నాడు. పేదల పెళ్ళిళ్ళకి అవసరమైన వివాహభోజనాలని ఉచితంగా అందిస్తున్నాడు. విజయనగరంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో కొలువుదీరిన ఈ పవమానసుతుడు మతాలకతీతంగా పేదలందరికీ నిత్యాన్న ప్రదాతగా మారిన వైనం ఇది...

ఆంజనేయస్వామికి తమలపాకులతో చేసే పూజ అత్యంత ప్రియమంటారు.

అరటిపండ్లు, మిరియాలు-బెల్లం పానకం, సింధూరం సమర్పిస్తే హనుమంతుడి కటాక్షం ఖాయమంటారు. వడమాలలిస్తే వట్టిభయాలన్నీ పోగొడతాడని చెబుతారు. కానీ విజయనగరం సంతపేట శ్రీనివాస్‌నగర్‌లో ఉన్న పంచముఖ ఆంజనేయుడు మాత్రం వీటితోపాటూ ఆకలి అన్నవారికి అన్నంపెడితే మరింతగా ప్రసన్నుడవుతాడట. అందుకే ఆలయంలోనే కాకుండా స్వామి భక్తుల తరఫున రోజూ పట్టణంలోని వందలాదిమందికి ఆహారాన్ని అందిస్తున్నారు.

భక్తులే ముందుండి...
విజయనగరంలో 1980ల నుంచీ శ్రీ మారుతీ దీక్షా సేవా పీఠం ఉంది. దాని గురువు తొలగాపు సుందరశర్మ ఏటా శిష్యులకు హనుమంతుడి మాలధారణ చేయించి భద్రాచలం తీసుకెళ్లేవారు.
ఆ భక్తుల అభీష్టం మేరకు విజయనగరంలోనూ ఆంజనేయుడి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ముఖ్యంగా సకల భయాలూ తొలగించి సత్ప్రవర్తనకి దారిచ్చే పంచముఖుణ్ణి ప్రతిష్ఠించాలని భావించారు. ఇందుకోసం స్థలం కావాలని అనేక ప్రాంతాలు తిరిగారు. జమ్మునారాయణపురంలో ఓ స్థలాన్నీ కొనుగోలు చేశారు. కానీ, తీరా చూస్తే ఆలయ నిర్మాణానికి తగ్గ వాస్తు దానికి లేదని తేలింది. దాంతో ఇంకెక్కడైనా స్థలం దొరుకుతుందేమోనని అన్వేషణ మొదలుపెట్టారు. ఆ వెతుకులాట పూర్తికాకుండానే ఆయన మరణించారు.

కానీ అది దైవసంకల్పమేమో... ఆయన శిష్యులు అంతే పట్టుదలతో ఆ బాధ్యతని తలకెత్తుకున్నారు. శ్రీనివాసనగర్‌లో మంచుకొండ అప్పలరాజు అనే భక్తుడు విరాళంగా ఇచ్చిన స్థలంలో ఆలయం పనులు ప్రారంభించారు. కాకపోతే నిర్మాణానికి ఎవ్వర్నీ ఒక్క రూపాయి ఇమ్మని అభ్యర్థించకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చే భక్తుల నుంచే నిధులు సమీకరించారు. అలా నాలుగేళ్లపాటు సాగిన ఆలయ నిర్మాణం 2008లో పూర్తయింది. కాకపోతే, దాన్ని నిర్మించిన భక్తులు అక్కడితో తమ బాధ్యత తీరిపోయిందని భావించలేదు. అదే సమష్టితత్వంతో వారంలో ఒకసారి అన్నదానం చేయడం మొదలుపెట్టారు. ఆలయానికి వచ్చి అడిగేవాళ్లు కొందరే ఉంటున్నారనీ, నోరు తెరిచి అడగలేని ఎందరో ఆకలి బాధతో అలమటిస్తున్నారనీ వాళ్లకీ భోజనం పెట్టాలనే ఆలోచనతో 2013లో ‘శ్రీశ్రీశ్రీ పంచముఖాంజనేయ నిత్య అన్నప్రసాద వితరణ ట్రస్టు’ని ఏర్పాటుచేసి... ఈ ఆలయాన్ని అక్షయపాత్రగా మార్చారు.

పోరాడేవాళ్లకీ...
ముందుగా పట్టణంలోని ప్రేమ సమాజం చెవిటిమూగ పాఠశాల, అనాథపిల్లలని ఆదరించే సరస్వతీ విద్యామందిరం, పుష్పగిరి కంటి ఆసుపత్రి, కుష్టు రోగుల చికిత్సా కేంద్రాల్లో రోజూ అన్నదానం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వృద్ధాశ్రమాలకీ విస్తరించారు. ప్రస్తుతం ప్రతిరోజూ 450 మందికి అన్నం, సాంబారు, కూరలతో కూడిన మధ్యాహ్నభోజనం హాట్‌బాక్సుల్లో సరఫరా చేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌ కూడలికి మారుమూల ప్రాంతాల నుంచి అర్జీలు పెట్టుకోవడానికని వచ్చినవాళ్లకీ భోజనాలు అందిస్తారు.

ప్రజాసమస్యలపైన పోరాడేందుకు వచ్చే ఆందోళనకారులు ముందుగా చెబితే వారికీ భోజనం సరఫరాచేస్తారు. వీటికి అదనంగా కార్తీక మాసంలో అయ్యప్ప, ఆంజనేయ, భవానీ మాల వేసేవాళ్లందరికీ మండలం రోజులు నిత్యాన్నదానం చేస్తారు. ఇవన్నీ ఒకెత్తయితే నిరుపేదల పెళ్ళి వేడుకలకి ఉచితంగా భోజనాలు సరఫరా చేయడం మరొకెత్తు. ఎంత పేదవాళ్లయినా వివాహాల వేళ కనీసం భోజనమైనా ఘనంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే తమకున్నదాంట్లో ఎక్కువ భాగం దానికే ఖర్చుచేస్తారు. ఇందుకోసం అప్పుల్లో కూరుకుపోయేవాళ్లూ ఎక్కువ. అలాంటి బాధలు పడకూడదనే... ‘కల్యాణమస్తు’ పథకాన్ని మొదలుపెట్టింది ఆలయ ట్రస్టు. పేదవాళ్లు ఎవరైనా పెళ్ళికి వారం ముందు తమ ఆధార్‌కార్డుతో వచ్చి ఇక్కడ విన్నవించుకుంటే చాలు... సుమారు మూడొందల మంది అతిథులకి సరిపడా వివాహ భోజనాన్ని సరఫరా చేస్తారు. ఈ భోజనంలో పులిహోరా, బిరియానీ, కూర, సాంబారు, పెరుగు, అప్పడాలతోపాటూ స్వీటూహాటూ కూడా ఉంటాయి.

మాధవసేవకి ఇదే అర్థం...
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని ప్రక్షాళించడం నుంచి గోశాల పనుల దాకా అన్నీ భక్తులే చేస్తారు. నిత్యాన్నదానానికి అవసరమైన వంటలు కూడా వాళ్లే వంతులవారీగా చేస్తున్నారు. ఇందుకోసం బస, భోజనం తప్ప ఇంకే ప్రతిఫలమూ ఆశించకుండా మానవ సేవే మాధవ సేవ అన్నమాటకి అసలైన అర్థం చెబుతున్నారు!

- జీవీవీ సత్యనారాయణరెడ్డి, ఈనాడు, విజయనగరం

ఫొటోలు: సీహెచ్‌ సత్యనారాయణ

1 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.