close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వారసుడు

- సుబ్బు శివకుమార్‌ చిల్లర

ఆరోజు టీచర్స్‌ డే. రవీంద్ర భారతి ఆడిటోరియం జనాలతో కిక్కిరిసిపోయి ఉంది. అత్యుత్తమ జూనియర్‌ కాలేజీ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం జరుగుతోంది. ‘‘నౌ ద స్టేట్‌ బెస్ట్‌ టీచర్‌ అవార్డు గోస్‌ టు శ్రీ సత్యప్రసాద్‌ గారు’’ అని వినిపించగానే ఆడియన్సులోంచి లేచి అందరికీ నమస్కరిస్తూ స్టేజీ వైపుకి నడిచాడు సత్యప్రసాద్‌. సత్య ఐఐటీ అకాడమీ ఛైర్మన్‌ అతను. ఆడిటోరియం చప్పట్లతో మారుమోగిపోయింది. ‘ప్రతిసారిలాగే ఈసారి కూడా ఆయనకే’ అంటూ హాల్లో గుసగుసలు మొదలయ్యాయి.

‘‘శ్రీ సత్యప్రసాద్‌... తన గురువు, గొప్ప విద్యావేత్త శ్రీ రాజయ్యగారి ఆశీస్సులతో మొట్టమొదట పదిమంది స్టూడెంట్స్‌తో, ఒక మామూలు ఐఐటీ కోచింగ్‌ సెంటర్‌ మొదలుపెట్టి, పదిమందిని ఐఐటీకి క్వాలిఫై అయ్యేట్లు చేశారు. ప్రతి సంవత్సరం ఎంతమంది స్టూడెంట్స్‌ని తీసుకుంటున్నారో అంతమందికీ ఐఐటీ సీటు వచ్చేట్లు చేశారు. ప్రస్తుతం ఐదువందల మందిని మాత్రమే తన కళాశాలలో చేర్చుకుని ఐదు వందల మందికీ ఐఐటిలో సీటు వచ్చేట్లు చేస్తున్న గొప్ప విద్యావేత్త శ్రీ సత్యప్రసాద్‌గారు. కచ్చితంగా వందశాతం రిజల్ట్‌ సాధిస్తున్న ఏకైక కళాశాల సత్య ఐఐటీ అకాడమీ. ఈసారి కూడా వందశాతం ఫలితాలు సాధించిన విద్యాసంస్థ ఛైర్మన్‌ శ్రీ సత్యప్రసాద్‌గారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా స్టేట్‌ బెస్ట్‌ టీచర్‌ అవార్డ్‌ అందుకుంటున్నారు’’ అని యాంకర్‌ మైక్‌లో అనౌన్స్‌ చేస్తోంది.
అవార్డు ఇచ్చి భుజం తట్టి, ‘‘కీప్‌ ఇట్‌ అప్‌ సత్యప్రసాద్‌ గారూ’’ చెప్పారు సీఎం.
కిందకి దిగాక టీవీవాళ్ళు చుట్టుముట్టారు. ‘‘హండ్రెడ్‌ పర్సెంట్‌ ఫలితాలను ఎలా సాధిస్తున్నారు, మీ రహస్యం ఏమిటి?’’ అడిగాడొక విలేఖరి.
‘‘రహస్యమేమీ లేదు, ఒక గట్టి పట్టుదలతో ఈ రంగంలోకి వచ్చినవాణ్ణి నేను. రాత పరీక్షలో ర్యాంక్‌ సాధించిన పిల్లలకు మళ్ళీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటాను. వాళ్ళమీద తల్లిదండ్రుల ఒత్తిడేమైనా ఉందా, లేక వాళ్ళ ఛాయిస్‌ ప్రకారమే ఇష్టపూర్వకంగా వస్తున్నారా, వాళ్ళ ఆటిట్యూడ్‌ ఎలా ఉంది... ఇవన్నీ అసెస్‌ చేసుకున్నాకే వాళ్ళను నా కాలేజీలో చేర్చుకుంటాను. నా మెథడ్స్‌ అన్నీ డిఫరెంట్‌గా స్ట్రెస్‌ ఫ్రీగా ఉంటాయి’’ చెప్పాడు సత్యప్రసాద్‌. ఇంకొంతమంది టీవీవాళ్ళు అతన్ని చుట్టుముట్టేలోగా అక్కణ్ణుంచి మెల్లగా జారుకుని కారెక్కాడు. అతనికి పబ్లిసిటీ ఇష్టముండదు. పేపర్‌ యాడ్స్‌ ఇవ్వడు, హోర్డింగ్లు ఉండవు, హోరెక్కించే టీవీ రేడియో ప్రకటనలు ఉండవు. ఒకరి ద్వారా మరొకరు తెలుసుకుని మాత్రమే అతని కాలేజీలో చేరడానికి వస్తారు. ఏటా అతని కాలేజీలో అడ్మిషన్‌ కోసం యాభైవేల మందికి పైగా ఎంట్రన్స్‌ రాస్తారు. కేవలం ఐదువందల మందికే అక్కడ ప్రవేశం ఉంటుంది.

* * * * *

మరుసటిరోజు తన ఛాంబర్‌లో కూర్చుని స్టూడెంట్స్‌ ట్రైనింగ్‌ మాడ్యూల్స్‌ చూస్తున్న సత్యప్రసాద్‌కి తన గది గుమ్మం దగ్గర ఎవరో ఘర్షణ పడుతున్నట్లు వినిపించింది.
‘‘నేను అర్జంట్‌గా సార్‌ని చూడాలి’’ ఏడుపు గొంతుతో అడుగుతున్నాడొక వ్యక్తి.
‘‘అపాయింట్‌మెంట్‌ లేకుండా సార్‌ ఎవరినీ చూడరు’’ చెప్తున్నాడు డోర్‌ దగ్గరున్న సెక్యూరిటీ అతను.
‘‘నేను ఈరోజు సార్‌ని చూడకుంటే, ఇక బతకను... చచ్చిపోతాను’’ బెదిరిస్తూ అర్థిస్తున్నాడు.
వెంటనే లేచి బయటకు వచ్చాడు సత్యప్రసాద్‌.
‘‘చూడండి సార్‌, మిమ్మల్ని కలవందే వెళ్ళనంటున్నాడు’’ కంప్లైంట్‌ చేశాడు సెక్యూరిటీ గార్డ్‌.
ఆ కుర్రాడికి పదహారు, పదిహేడేళ్ళు ఉంటాయి. సన్నగా తెల్లగా ఉన్నాడు. ముఖంలో ఏదో తెలియని వర్చస్సూ పట్టుదలా కళ్ళల్లో కసీ కనపడుతున్నాయి.
‘‘అతన్ని లోపలికి పంపించు’’ అని సెక్యూరిటీకి చెప్పి లోపలికి నడిచాడు.
‘‘థ్యాంక్యూ సార్‌’’ అంటూ అతన్ని ఫాలో అయ్యాడు ఆ కుర్రాడు.
కూర్చోమని సైగ చేశాడతనికి. ఆ కుర్రాడు కూర్చున్న తరవాత మంచినీళ్ళ బాటిల్‌ అందించాడు సత్యప్రసాద్‌.
కుర్రాడు నీళ్ళు తాగి, కర్చీఫ్‌తో ముఖం తుడుచుకుని తేరుకున్నాక, ‘‘చెప్పు నీ సమస్య ఏమిటి... నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు?’’ అని అడిగాడు.
‘‘సార్‌, నా పేరు అరుణ్‌. నేను టెన్త్‌క్లాస్‌ పాసయ్యాను.’’
‘‘అడ్మిషన్‌ కోసం వచ్చావా?’’ అడిగాడు సత్యప్రసాద్‌.
‘‘కాదు సార్‌, నేను జాబ్‌ కోసం వచ్చాను.’’
‘‘జాబా... నీకా..? నిండా పదహారేళ్ళు కూడా నిండినట్లు లేదు. ఏం జాబ్‌ చేస్తావు, ఆఫీస్‌బాయ్‌గా చేస్తావా?’’
‘‘లేదు సార్‌... పిల్లలకు మ్యాథ్స్‌ టీచ్‌ చేస్తాను.’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్‌... జస్ట్‌ టెన్త్‌క్లాసు పాస్‌ అయ్యానని చెప్తున్నావ్‌... ఇంటర్మీడియట్‌ వాళ్ళకి మ్యాథ్స్‌ ఎలా చెబుతావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు సత్యప్రసాద్‌.
‘‘కావాలంటే టెస్ట్‌ చేయండి సార్‌, నేను టెన్త్‌లో ఉన్నప్పుడే ఇంటర్‌ సబ్జెక్ట్స్‌ అన్నీ కంప్లీట్‌ చేసేశాను. టెక్స్ట్‌బుక్‌లో ఏ పేజీ తెరిచి అడిగినా, మీరు ఏ చాప్టర్‌లో ప్రశ్నలడిగినా సమాధానం చెప్తాను’’ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు అరుణ్‌.
కొంచెం విసుగూ కొంచెం కోపమూ కలిగాయి సత్యప్రసాద్‌కి. అయినా తమాయించుకుని - ట్రిగనోమెట్రీలో కొన్ని ఫార్ములాలు అడిగాడు. అరుణ్‌ తడుముకోకుండా సమాధానం చెప్పాడు.
క్యాల్కులస్‌, ఆల్జీబ్రా, మాట్రిసేస్‌, విక్టర్‌ ఆల్జీబ్రా, సెట్స్‌ అండ్‌ రిలేషన్స్‌, హైపెర్బోలిక్‌ ఫంక్షన్స్‌... ఏది అడిగినా చిటికెలో చెప్పేస్తున్నాడు. ‘వీడు మనిషా... రోబోనా’ అని అబ్బురపడ్డాడు సత్యప్రసాద్‌.
‘‘నువ్వు ఇంటర్‌ చదవకుండా... జాబ్‌ ఎందుకు చేద్దామనుకుంటున్నావు?’’
కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి అరుణ్‌కి. కళ్ళు తుడుచుకుని చెప్పాడు.
‘‘మా నాన్నగారు సడన్‌గా చనిపోయారు సార్‌. ఆయన వ్యాపారంలో నష్టపోయి ఆ ఒత్తిడికి బీపీ పెరిగి గుండెపోటుతో చనిపోయారు. మా ఇల్లూ ఆస్తులన్నీ అప్పులవాళ్ళు జప్తు చేసుకున్నారు. మా బంధువులెవ్వరూ ఆదుకోవటానికి సిద్ధంగా లేరు. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు. నేను మీ కాలేజీలో చదువుకుని ఐఐటీ సాధిద్దామనుకున్నాను. కానీ, కాలం కలిసిరాలేదు సార్‌. నాకిప్పుడు సంపాదన కావాలి. మా అమ్మను పోషించుకోవాలి’’ చెప్పాడు అరుణ్‌.
‘‘ఐయామ్‌ వెరీ సారీ అరుణ్‌.’’
‘‘సార్‌, అలా అనకండి సార్‌. నాకు జాబ్‌ చాలా అవసరం.’’
‘‘నీకు జాబ్‌ ఇవ్వను అరుణ్‌. కానీ, నా కాలేజీలో సీటు ఇస్తాను. ఫీజు కట్టనవసరం లేదు, ఫ్రీగా ఇంటర్మీడియట్‌ చదువుకోవచ్చు.’’
‘‘కానీ, మాకు జీవనం ఎలా
గడుస్తుంది సార్‌... మేం ఎక్కడ ఉండాలి, ఏం తినాలి?’’
‘‘ఊ... ఆ సంగతి కూడా నేనే చూసుకుంటాను. నువ్వు కాలేజీలో చదువుకుంటూనే అసిస్టెంట్‌ టీచర్‌లాగా ఉండి క్లాసులు అయిపోయాక, స్టూడెంట్స్‌కి ఏమైనా డౌట్స్‌ ఉంటే క్లియర్‌ చెయ్యాలి. మీ అమ్మగారికి కూడా కాలేజ్‌ క్యాంటీన్‌లో ఉద్యోగమిస్తాను. ఉండటానికి కాలేజీ ప్రెమిసెస్‌లోనే వసతి కల్పిస్తాను. నువ్వు ఐఐటీ సాధించి తీరాలి’’ చెప్పాడు సత్యప్రసాద్‌.
అమాంతంగా లేచి ఆయన కాళ్ళమీద పడ్డాడు అరుణ్‌. ‘‘సార్‌ మీ మేలు ఈ జన్మలో మరిచిపోను’’ కన్నీళ్ళతో ఆయన కాళ్ళు కడిగేస్తున్నాడు అరుణ్‌.
‘‘లే అరుణ్‌... లే’’ అంటూ అతన్ని లేవదీసి గుండెలకు హత్తుకున్నాడు. ‘‘నువ్వు ఈ కాలేజీలో చేరటం నా అదృష్టం అరుణ్‌. నువ్వు బాలమేధావివి’’ అంటూ ప్రశంసించాడు.
బెల్‌ కొట్టి ప్రిన్సిపాల్‌ని పిలిచాడు. అతనికి జరిగిందంతా చెప్పి అరుణ్‌కి అడ్మిషన్‌ ఇచ్చి, వాళ్ళకు తగిన వసతి ఏర్పాట్లు చెయ్యమని చెప్పాడు.
మరొకసారి సత్యప్రసాద్‌ కాళ్ళకి దణ్ణంపెట్టి కృతజ్ఞతాభావంతో బయటకు నడిచాడు అరుణ్‌.
ఏదో ఆలోచిస్తున్నట్లుగా కొద్దిసేపలా అచేతనంగా కూర్చుండిపోయాడు సత్యప్రసాద్‌.

తన గతం అతని కళ్ళముందు కదలాడింది.

* * * * *

సత్యప్రసాద్‌ పదోతరగతి ఫస్ల్‌ క్లాసులో పాసయ్యాడు. కాలేజీలో చేరాలనీ ఐఐటీ సాధించి పెద్ద ఇంజనీర్‌ అవ్వాలనీ కలలు కంటున్నాడు. ఆరోజు స్నేహితులతో ‘లవకుశ’ మ్యాట్నీ షో చూసి ఇంటికి వచ్చేసరికి తండ్రి శవం వరండాలో పడుకోబెట్టి ఉంది. తల్లి ఏడుస్తోంది, జనం గుమిగూడి ఉన్నారు.
సత్యప్రసాద్‌ వాళ్ళ పెద్దనాన్న రాజశేఖరం పెద్దగా అరుస్తున్నాడు.
‘‘ఈ అప్పులన్నీ ఎవర్నడిగి చేశాడు? డబ్బులన్నీ సినిమా తియ్యడానికి తగలేసి, దివాలా తీసి... ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా చనిపోతే... మిమ్మల్నెవరు పోషిస్తారు? ఈ ఇంట్లో వాడికేమీ వాటా లేదు. మీకిచ్చిన పొలాలూ ఇల్లూ అన్నీ అమ్మేసుకున్నారు కదా... ఇంకా మీకిక్కడ ఇవ్వాల్సింది ఏమీలేదు. ఈ అంత్యక్రియలు అయ్యాక, మీ దోవ మీరు చూసుకోవలసిందే.’’

‘‘అలా అనకండి బావగారూ, మాకు మాత్రం ఎవరున్నారు..? పిల్లవాడు టెన్త్‌ చదివాడు, వాడు డిగ్రీ చదివే వరకు ఓపిక పట్టారంటే వాడు చదువు పూర్తిచేసుకుని, ఏదో ఉద్యోగం చేసి మీ రుణం తీర్చుకుంటాడు. ఇంత పచ్చడి మెతుకులు తిని, ఇంట్లో మూలన పడి ఉంటాం’’.

‘‘అలా అనకండి బావగారూ, మాకు మాత్రం ఎవరున్నారు..? పిల్లవాడు టెన్త్‌ చదివాడు, వాడు డిగ్రీ చదివేదాకా కాస్త ఓపిక పట్టారంటే వాడు చదువు పూర్తిచేసుకుని, ఏదో ఉద్యోగం చేసి మీ రుణం తీర్చుకుంటాడు. ఇంత పచ్చడి మెతుకులు తిని, ఇంట్లో మూలన పడి ఉంటాం’’ దీనంగా బతిమిలాడుతోంది సత్యప్రసాద్‌ తల్లి అనసూయ.
‘‘కుదరదమ్మా, నావల్ల కాదు. మీ దారి మీరు చూసుకోవలసిందే’’ చెప్పాడు రాజశేఖరం.
‘‘రాజశేఖరంగారూ, మీరు అలా అంటే ఎలాగండీ, తనకు పుట్టింటివారెవరూ లేరు కదా? ఇలాంటప్పుడు ఆదుకోకపోతే ఇంకెప్పుడు సహాయపడతారు?’’ అన్నాడొక బంధువు.
‘‘అంత జాలిపడితే మీ ఇంటికే తీసుకెళ్ళి పెట్టుకోండి’’ గద్దించాడు రాజశేఖరం.
అంతే... మరెవ్వరూ మారుమాట్లాడలేదు. బంధువులంతా తలా ఒక దోవన వెళ్ళిపోయారు. ఇక బతిమిలాడటం మానేసింది అనసూయ. ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా మారుమాట్లాడలేదు.
అంత్యక్రియలు పూర్తయ్యాక, పెట్టె సర్దుకుంది. కొడుకును దగ్గరకు పిలుచుకుంది. అందరిముందూ సత్యప్రసాద్‌ చెయ్యి గట్టిగా పట్టుకుంది.
‘‘బాబూ సత్యా... ఇకనుండీ నీకు నేను, నాకు నువ్వు మాత్రమే ఉంటాం. నన్నేమో ఇంటిపట్టునే ఉంచి నిన్నటిదాకా అన్నీ తానై చూసుకున్నాడు మీ నాన్న. ఇప్పుడు ఆ బాధ్యత నీది. నువ్వు రిక్షా తొక్కుతావో ఆటో నడుపుతావో బూట్‌ పాలిష్‌ చేస్తావో పేపర్లు వేస్తావో... నాకు తెలీదు. నువ్వే ఇంటి బాధ్యత తీసుకోవాలి, చదువుకోవాలి, పెద్దగా ఎదగాలి, నా మర్యాదని నిలబెట్టాలి. అప్పుడే మనం మళ్ళీ బంధువుల్ని కలుద్దాం. అంతవరకూ సెలవు’’ అంటూ కొడుకు చెయ్యి పట్టుకుని విసవిసా నడిచి వెళ్ళిపోయింది.
బంధువులందరూ కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళవెంట పరుగెత్తుకుంటూ వచ్చింది- అప్పటిదాకా వాళ్ళింట్లో పనిచేసిన పనిమనిషి లక్ష్మి.
‘‘అమ్మా, ఎక్కడికెళతారమ్మా’’ అంది లక్ష్మి.
‘‘ఏమో తెలీదు లక్ష్మీ. ఈ విశాల ప్రపంచంలో మాకింత చోటుదొరకదా’’ అంది అనసూయ.
‘‘మీరు ఏమీ అనుకోకుంటే మా ఇంటిదగ్గర ఒక చిన్న గది ఖాళీగా ఉంది. కిరాయి ఐదువందలు. ఇప్పుడు నాదగ్గర ఐదువందలు ఉన్నాయమ్మా, అది ఓనరుకు ఇచ్చేద్దాం. వచ్చేనెల సంగతి తరవాత చూద్దాం, ఏమంటారు?’’ అడిగింది లక్ష్మి.
‘‘థ్యాంక్యూ లక్ష్మీ, అక్కడికే వెళ్దాం’’ అంటూ అప్పటిదాకా నోరు మెదపని సత్యప్రసాద్‌ తల్లి చెయ్యి పట్టుకుని ‘‘పదమ్మా... లక్ష్మితో వెళ్దాం’’ అంటూ ఆమెవెంట నడిచారు.
ఆ రాత్రి వాళ్ళకు భోజనం తెచ్చిపెట్టింది లక్ష్మి.
‘‘ఎంత గొప్పగా బతికినోల్లకు, ఇన్ని కష్టాలెందుకు పెట్టినావు దేవుడా?’’ అంటూ భోరుమంది లక్ష్మి.
‘‘ఇలాంటి పరీక్షలు దేవుడు ఎందుకు పెడతాడో తెలుసా లక్ష్మీ, ఇటువంటప్పుడే కదా నీలాంటి వాళ్ళ గొప్పతనం నాలాంటి వాళ్ళకు అర్థమయ్యేది’’ అంది అనసూయ.
‘‘చూశావా సత్యా, ఇక నుంచీ కాలేజీ చదువుకాదురా... జీవిత పాఠాల్ని నేర్చుకోవలసిన సమయం వచ్చింది నీకు. ‘ఎవరు తన, ఎవరు మన’ అని నీకు తెలియచెప్పేది ఈ పేదరికమే. నువ్వు ఎంత పెద్దవాడివైనా ఎంత ఎత్తుకెదిగినా ఒక్కటి మాత్రం మరిచిపోకు, కిందపడిన వాణ్ణి లేవనెత్తి నిలబెట్టు... వాణ్ణి జీవితంలో గెలిపించు, అదే మానవత్వం. అదే నువ్వు నీ తల్లికిచ్చే మాట’’ చెప్పింది అనసూయ.
‘‘అలాగేనమ్మా... నువ్వేమీ ఆందోళన పడకు. నువ్వనుకున్నది, నేను సాధిస్తాను’’ పట్టుదలగా చెప్పాడు సత్యప్రసాద్‌.
వాళ్ళనుచూసి లక్ష్మి కళ్ళు చెమర్చాయి.
ఆరోజు నుండి సత్యప్రసాద్‌ పని చెయ్యడం మొదలుపెట్టాడు.
మార్కెట్‌ స్ట్రీట్‌లో చెప్పులు కుట్టే అతని దగ్గర బూట్‌ పాలిష్‌ చేశాడు, పేపర్‌ బాయ్‌గా మారి పొద్దున్నే పేపరు వేశాడు, చాయ్‌ బండి అతని దగ్గర చేరి ఫ్లాస్క్‌ నింపుకుని ఆఫీసుల్లో చాయ్‌ సప్లై చేశాడు, బట్టల షాపుల్లో అకౌంట్స్‌ రాశాడు, డోర్‌ టు డోర్‌ సేల్స్‌మాన్‌గా మారి పుస్తకాలు అమ్మాడు. సాయంత్రంపూట చిన్న పిల్లలకు లెక్కలు చెప్పటం మొదలుపెట్టాడు. రాత్రిళ్ళు మాత్రం ఇంటర్మీడియట్‌ పుస్తకాలు అరువు తెచ్చుకుని చదివేవాడు. ప్రైవేటుగానే ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశాడు. మ్యాథ్స్‌ మీద అతనికి ఉన్న పట్టు కారణంగా అనేకమంది స్టూడెంట్స్‌ అతని దగ్గర ట్యూషన్‌కి రావడం మొదలుపెట్టారు. కాలం గడిచేకొద్దీ సత్యప్రసాద్‌ పేరు ‘బెస్ట్‌ మ్యాథ్స్‌ టీచర్‌’గా ఆ చుట్టుపక్కల మారుమోగిపోయింది.
రాజయ్య అనే ఒక విద్యావేత్త ఒకరోజు సత్యప్రసాద్‌ని పిలిచి, ‘‘బాబూ, నీ గురించి విన్నాను. ఇంత చిన్న వయస్సులోనే చాలా మంచిపేరు సంపాదించుకున్నావు. జీవితంలో నాకొక కోరిక ఉండిపోయింది, నువ్వే దాన్ని తీర్చగల సమర్థుడివని నమ్ముతున్నాను... తీరుస్తావా?’’ అన్నాడు.
‘‘చెప్పండి సార్‌... ఏమిటది?’’ అడిగాడు సత్యప్రసాద్‌.
‘‘ఐఐటీలలో మన తెలుగువాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. మన విద్యార్థులలో, వాళ్ళ తల్లిదండ్రులలో ఐఐటీ గురించి సరైన అవగాహన కల్పించాలి. దానికొక ప్రత్యేకమైన ఇన్‌స్టిట్యూట్‌ పెట్టాలన్నది నా కోరిక. మన ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన ప్రతి పిల్లవాడు ఐఐటీ సాధించాలి. నా కోరిక తీర్చగలవా?’’

‘‘చేస్తాను సార్‌. నా మనసులో ఎన్నాళ్ళనుండో గూడుకట్టుకుని ఉన్న ఆలోచనకి మీరిప్పుడు ప్రాణం పోశారు, తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను’’ అన్నాడు సత్యప్రసాద్‌.
‘‘దానికి అవసరమైన పెట్టుబడి నేను ఇస్తాను. నాకు వయసు పైబడింది, పిల్లలంతా అమెరికాలో సెటిల్‌ అయిపోయారు. వాళ్ళు నా దగ్గరినుండి ఆశించేది ఏదీలేదు. నా భార్య గతించినప్పటి నుండి నాకు కూడా జీవితంమీద ఆశ సన్నగిల్లింది. ఈ ఇల్లు నీ పేరున రాసేస్తాను. ఇక్కడ నుండే నీ ప్రస్థానం మొదలుపెట్టు’’ అంటూ ఆశీర్వదించాడాయన.
ఆయన కాళ్ళకు దణ్ణంపెట్టి ‘‘రాజయ్య ఐఐటీ అకాడమీ అనే పేరు పెట్టి ఇన్‌స్టిట్యూట్‌ స్టార్ట్‌ చేస్తాను సార్‌’’ చెప్పాడు సత్యప్రసాద్‌.

ఆ రాత్రి వాళ్ళకు భోజనం తెచ్చిపెట్టింది లక్ష్మి. ‘‘ఎంత గొప్పగా బతికినోల్లకు, ఇన్ని కష్టాలెందుకు పెట్టినావు దేవుడా?’’ అంటూ భోరుమంది లక్ష్మి. ‘‘ఇలాంటి పరీక్షలు దేవుడు ఎందుకు పెడతాడో తెలుసా లక్ష్మీ, ఇటువంటప్పుడే కదా నీలాంటి వాళ్ళ గొప్పతనం నాలాంటి వాళ్ళకు అర్థమయ్యేది’’ అంది అనసూయ.

‘‘లేదు లేదు... ‘సత్య ఐఐటీ అకాడమీ’ అని పేరు పెట్టు. సత్యం తప్పకుండా ప్రవర్తించు, సత్య మార్గంలో విద్యార్థులను నడిపించు. విద్యార్ధులకు చదువుమీద ఇష్టం పెరిగేలా విద్యాబోధన సాగాలి. బలవంతంగా ఏదీ వారిపైన రుద్దకు, ప్రత్యేకమైన పద్ధతులు రూపొందించు, నా ఆశీస్సులు ఎప్పటికీ నీకుంటాయి’’ చెప్పాడు రాజయ్య.
అక్కడి నుంచి సత్యప్రసాద్‌ ప్రస్థానం మొదలైంది. దేశం మొత్తం గర్వపడేట్లు ‘సత్య ఐఐటీ అకాడమీ’ని తీర్చిదిద్దాడు. నామమాత్రపు ఫీజులతో అత్యుత్తమమైన బోధనా పద్ధతులతో ఇష్టపూర్వకంగా పిల్లలు విద్యను అభ్యసించేలా మాడ్యూల్స్‌ రూపొందించాడు. వరుసగా పదిసార్లు ఉత్తమ ఉపాధ్యాయునిగా మన్ననలు అందుకున్నాడు.

* * * * *

ఆలోచనల నుంచి బయటకు వచ్చి తన చాంబర్‌లో ఎదురుగా గోడకు తగిలించి ఉన్న తల్లి ఫొటో వంక చూశాడు. తను కష్టపడి సాధించిన పేరుప్రఖ్యాతులు చూసి గర్వపడింది తల్లి. తమను వదిలేసిన బంధువులందరినీ ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసింది. తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకుంది. ఎవరు కష్టాల్లో ఉన్నా తన కొడుకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడని హామీ ఇచ్చింది. అది విని ఆరోజు వారికే సహాయమూ చెయ్యని బంధువులందరూ సిగ్గుపడ్డారు. కష్టకాలంలో తమకు సాయం చేసిన లక్ష్మి కొడుక్కి మంచి చదువు చెప్పించి, పెద్ద ఉద్యోగస్తుడయ్యేలా చేశాడు సత్యప్రసాద్‌. కొడుకు ఉన్నతిని చూసి ఆనందంగా కన్నుమూసింది అనసూయ.
‘‘నువ్వు చెప్పినట్లే... నాలాగే కింద పడబోయేవాణ్ణి పట్టుకుని నిలబెట్టానమ్మా. రాజయ్యగారు నాకు అప్పజెప్పిన ఈ మహాయజ్ఞాన్ని నా తర్వాత ముందుకు తీసుకుపోయే వారసుడు అరుణ్‌ రూపంలో దొరికాడమ్మా’’ అంటూ తల్లి ఫొటోకి నమస్కరించాడు చెమర్చుతున్న కళ్ళతో.
నవ్వుతూ చూస్తున్న ఆమె ఫొటో పైన పెట్టిన పూవు రాలింది...ఆశీర్వదిస్తున్నట్లుగా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.