close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సర్కార్‌ ‘ఆప్‌’లు శభాష్‌!

ప్రభుత్వాలు తలచుకుంటే ప్రజల అవసరాలని ఎంత పక్కాగా తీర్చవచ్చో చెప్పే ఉదాహరణలివి. ప్రజాప్రయోజనాల కోసం సాంకేతికతని వాడుకోవడంలో ప్రభుత్వ సంస్థలు ప్రైవేటువాటికి ఏమాత్రం తీసిపోవనీ చెప్పే తార్కాణాలు కూడా. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ, కర్ణాటక రెవెన్యూశాఖ, తమిళనాడు అటవీ శాఖలు రూపొందించిన ఈ మొబైల్‌ ఆప్‌లు ఈ తరహావాటిల్లో దేశంలోనే మొదటివి. వేటికవే వైవిధ్యంతో అలరారుతున్న ఆ మూడింటి పరిచయం ఇది..

ట్రీపీడియా

ఈ మధ్య పచ్చదనంపైన ప్రతి ఒక్కరిలోనూ మక్కువ పెరిగింది. ఇంటి ముంగిటో, పెరట్లోనో ఏ కాస్త స్థలం ఉన్నా ఏదో ఒక మొక్క నాటేస్తున్నారు. లేదా సర్కారు ఖాళీ స్థలంలోనే స్వచ్ఛందంగా మొక్కలు పెంచుతున్నారు. కానీ, ‘అలా పెంచుతున్న మొక్కలు మన నేలకి తగినవేనా? అవి విజాతి మొక్కలై పర్యావరణానికి విఘాతం కలిగిస్తే ఎలా?’ అని ప్రశ్నిస్తుంది ట్రీపీడియా ఆప్‌. ఆ ప్రశ్నలతోనే ఊరుకోదు. మన వాతావరణానికి చెడు/మంచి చేసే మొక్కల వివరాలు చెప్పి... వాటినెలా పరిహరించాలో/పెంచాలో వివరిస్తుంది. తమిళనాడు ప్రభుత్వ అటవీశాఖ గత ఏడాది సృష్టించిన ఈ ఆప్‌ ఇప్పటికే యాభైవేలకు పైచిలుకు డౌన్‌లోడ్‌లని సాధించింది. ఆ మధ్య చెన్నైలో నీటి కరవొచ్చి, పచ్చదనం తగ్గడమే అలాంటి సమస్యలకి మూలమని ప్రచారం జోరుగా సాగినప్పుడు, ఎక్కువమంది ఈ ఆప్‌నే డౌన్‌లోడ్‌ చేసుకున్నారట! ప్రస్తుతం తమిళనాడుకు మాత్రమే పరిమితమైన ఈ ఆప్‌ సేవల్ని త్వరలోనే దేశం మొత్తానికి విస్తరించబోతున్నారు. తమిళనాడు అటవీశాఖలో పనిచేస్తున్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుధారామన్‌ ఈ యాప్‌ని సృష్టించారు. ఇందుకోసం ఆమె కేంద్రప్రభుత్వం నుంచి ‘డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌’ అవార్డూ అందుకున్నారు!

ఫీడ్‌ ది నీడ్‌

ఇంట్లో విందు కార్యక్రమం జరిగింది. అనుకున్నదానికంటే తక్కువమంది వచ్చారు. లేదా వచ్చినవాళ్లకి సరిపోదేమోనని మీరు మరీ ఎక్కువగా వండించేశారు. చాలా ఆహారం మిగిలిపోయిందనే విషయం తేలేసరికి... ఎంతో సమయం గడిచిపోయుంటుంది. భోజనం వేళ దాటిపోయుంటుంది! ఒక్క హైదరాబాద్‌లోనే రోజూ తయారయ్యే ఆహారంలో 22 శాతం ఇలా వృధాగా చెత్తబుట్టలపాలవుతోందట. ఈ సమస్య నివారణకి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆహారాన్ని పేదలకి చేరుస్తున్నా... వాటి గురించి అందరికీ తెలిసుండదు. అందుకే హైదరాబాద్‌ పురపాలక సంస్థ జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగి ‘ఫీడ్‌ ది నీడ్‌’ ఆప్‌ని తెచ్చింది. విందుభోజనమే కాదు... మన ఇంట్లో రోజువారి మిగిలే ఆహారాన్ని కూడా అన్నార్తులకి అందించే సౌలభ్యాన్ని ఇది కల్పిస్తోంది. ఆహారం చాలా ఎక్కువ మొత్తంలో మిగిలి ఈ ఆప్‌ ద్వారా సమాచారం ఇస్తే... ఇందుకోసం నియమితులైన వాలంటీర్లు తీసుకెళ్తారు. యాపిల్‌ స్వచ్ఛంద సంస్థతో కలిసి జీహెచ్‌ఎంసీ నగరం నలుమూలలా ఏర్పాటుచేసిన ‘ఫీడ్‌ ది నీడ్‌’ ఉచిత ఫ్రిజ్‌ల్లో దాన్ని పెడతారు. ఆహారం కావాల్సినవాళ్లు ఆ ఫ్రిజ్‌ల నుంచి నేరుగా దాన్ని తీసుకోవచ్చు. ఆహారం మరీ తక్కువ ఉంటే... ఈ ఆప్‌ మీకు దగ్గర్లోని ఉచిత ఫ్రిజ్‌ల వివరాలిస్తుంది. దాన్ని చూసి ఆహారాన్ని అందులో ఉంచి రావొచ్చు.

దిశాంక్‌

నేలని మించిన ఆస్తిలేదన్న నమ్మకం మనలో చాలామందిది. కాకపోతే, ‘కొనే స్థిరాస్తికి సంబంధించి ఏవైనా లిటిగేషన్‌లున్నాయా? అమ్మేవాళ్లు చూపే సర్వే నంబర్‌ పరిధిలోనే ఈ భూమి ఉందా? అదేమైనా అటవీ, చెరువూ, నదుల కింద ఉండే శిఖం భూమా?’ వంటి వివరాలు తెలుసుకోవడం అంత సులభం కాదు. ఇందుకోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాలి.

ఆ బాధలేకుండా కేవలం ఒక్క క్లిక్‌తో మీరు నిల్చున్న నేలకి సంబంధించిన సమస్త వివరాలనీ మొబైల్‌లో చూపిస్తుంది ‘దిశాంక్‌’ ఆప్‌. కర్ణాటక ప్రభుత్వ రెవెన్యూశాఖ తెచ్చిన ఈ ఆప్‌ మొదలుపెట్టిన ఏడాదిలోనే నాలుగున్నర లక్షల డౌన్‌లోడ్స్‌ని సొంతం చేసుకుంది. కన్నడ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ‘భూమి ప్రాజెక్టు’ పేరుతో భూ వివరాలన్నింటినీ డిజిటలైజ్‌ చేసింది. దీని ద్వారా సుమారు 80 లక్షల సర్వే నంబర్‌ల వివరాలని కంప్యూటరీకరించింది. అక్కడితో ఊరుకోకుండా ఆ వివరాలని జీపీఎస్‌లో అనుసంధానిస్తూ ఈ దిశాంక్‌ ఆప్‌ని రూపొందించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.