close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వానా వానా వెల్లువాయె...

చినుకు పడితే సంబరం... వాన కురిస్తే సంతోషం...
ఆ వానచినుకుల్లో తడిసిముద్దయితే అంతే లేని ఆనందం...
అందుకే ఓ వానా పడితే ఆ కొండా కోనా హాయి...; వానా వానా... తేనెల వాన...; అంటూ చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా లోకమంతా వానతో కలిసి ఆడుతుంది, పాడుతుంది.
పండగలూ వేడుకలూ జరుపుకుంటుంది. మనిషిని అంతగా మురిపించి, మైమరిపించే ఆ చిటపట చినుకుల వెనకున్న విశేషాలెన్నో..!

చినుకు పడితే చాలు... ఎండల్లో మోడువారిన మొక్కలన్నీ పచ్చగా చిగురిస్తాయి. వరుణదేవుడే స్వయంగా వచ్చి పచ్చని తివాచీ పరిచినట్లుగా అప్పటివరకూ నేలలోపల విశ్రాంతి తీసుకుంటున్న గడ్డి పిలకలన్నీ ఒక్కసారిగా మొలకెత్తుతాయి. కొండలన్నీ పచ్చకోకని సింగారించుకుంటాయి. ఆ పచ్చదనంలోని మెరుపుకి కారణం వానచినుకులతోబాటు నేలకు చేరిన నత్రజనేనట.

వాన పరిమళం
తొలకరి జల్లులకు పులకరించిన పుడమి ఒకలాంటి మట్టి పరిమళాన్ని వెదజల్లుతుందన్నది తెలిసిందే. అయితే ఆ వాసన మట్టిదీ కాదు, వానదీ కాదు. మట్టిలో ఉండే యాక్టినో సైనోబ్యాక్టీరియాది. ఎండల్లో అవి పెట్టిన గుడ్లు, వాన చినుకులకి పగలడంతో వాటిల్లోని జియోస్మిన్‌ అనే పదార్థం కారణంగా వచ్చేదే ఆ పరిమళం. చెట్లు విడుదల చేసే ఒక రకమైన తైలాల్ని రాళ్లూ నేలా గ్రహిస్తాయి. వానచినుకులతో ఆ తైలాలు కలిసినప్పుడు ఆ సువాసన గాలిలో కలిసి మనల్ని చేరుతుందనీ చెబుతారు. ఆ విధంగా మట్టి వాసనకి చిరుజల్లులే కారణం.

వాన పండగ!
వర్షమొస్తే లోకమంతా హర్షమే. మరి వర్షం కురిస్తేనే కదా... ఏరువాక సాగేదీ, పంటలు పండేదీ, గాదెలు నిండేదీ... అందుకే వర్షాకాలం ఆరంభంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పండగ జరుపుకుంటారు. వానలు కురిసి, పంటలు పండి, లోకం పచ్చగా ఉండాలని బోనం పేరుతో తెలంగాణలో అమ్మవారికి నైవేద్యం పెడితే, ‘వర్షం కురిపించు ప్రభూ’ అంటూ ఆ వరుణదేవుడిని వేడుకుంటూ రాజస్థానీయులూ గుజరాతీయులూ తీజ్‌ పండుగ జరుపుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో హరేలీ పేరుతో వాన వేడుక చేసుకుంటే, హిమాచల్‌లోని చంబావాసులు రకరకాల వంటకాలతో మింజార్‌ పండగను వారంరోజులు చేస్తారు.

వాన రాకడ
వాతావరణశాఖ వర్షం రాకని ఎంతవరకూ పసిగడుతుందో తెలీదుగానీ కొన్ని జంతువులు మాత్రం ముందే తెలుసుకుంటాయి. వాన రావడానికి ఒకటి రెండు రోజుల ముందు తాబేళ్లు ఎగువ ప్రాంతానికి చేరుకుంటాయి. ఏనుగులు తొండం పైకెత్తి గుంపులుగుంపులుగా పరుగులు తీస్తుంటే వర్షం పొంచి ఉన్నట్లే. నల్లచీమలు తమ గుడ్లను పట్టుకుని వరసగా వెళ్లిపోతుంటే వాన జాడ ఉందన్నమాటే. పక్షులు నేలకు దగ్గరగా ఎగురుతుంటే వర్షం రాబోతుందనే అర్థం. సముద్ర పక్షులయితే తీరానికి చేరుకుని నిశ్శబ్దాన్ని పాటిస్తాయట. టిబెట్‌, డార్జిలింగ్‌ ప్రాంతాల్లోని సరస్‌ పక్షులయితే తమ గూళ్లని పర్వత గుహల్లోకి తరలిస్తాయట. గాలి పీడనంలోని వ్యత్యాసం వల్ల వాటి చెవులకు ఏదో అసౌకర్యంగా అనిపిస్తుందట. ఇవన్నీ ఎలా ఉన్నా నింబోస్ట్రాటస్‌, క్యుములోనింబస్‌ అనే రెండు రకాల మేఘాలు కిందికి వచ్చినప్పుడే వాన కురుస్తుంది. మొదటి రకం నల్లగా ఉంటే రెండో రకం మేఘం పర్వతం ఆకారంలో ఉండి ముదురు బూడిద వర్ణంలో ఉంటుంది.

వాన పాట..!
హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ అన్న తేడా లేకుండా ఓ వాన పాటో, సన్నివేశమో లేని సినిమా ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రేమనీ శృంగారాన్నీ చూపించాలన్నా, యాక్షన్‌ ఫైట్‌కి గాంభీర్యం తీసుకురావాలన్నా వాన సెట్‌ వేయాల్సిందే. ఇక, వానంటే సినీ కవులకి ఎంతిష్టమో... ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా’ అంటూ వర్షంమీద అలుగుతారు. ‘వానా వానా వెల్లువాయె...’ అంటూ వానజోరుతో కలిసి ఆడిపాడతారు, ‘అరెరె వాన జడివాన... ’ అంటూ వర్షంలో పరవశిస్తారు.
‘స్వాతీ ముత్యపు జల్లుల్లో...’ అంటూ చిరుజల్లుల్లో తడిసిముద్దవుతారు. అయితే ఆ వానని చిత్రీకరించడానికీ తెర వెనుక సినీబృందం పడే కష్టం ఎంతో.

వాన చినుకు!
వర్ష బిందువు రూపుదిద్దుకున్నప్పుడు గోళాకారాన్ని సంతరించుకున్నా నేలను తాకేటప్పుడు మాత్రం గాల్లోని నిరోధం కారణంగా అడుగుభాగంలో నొక్కుకున్నట్లుగా అయి ఆకారం లేని జెల్లీ బీన్‌, పారాచూట్స్‌ మాదిరిగా 0.1 నుంచి 10 మి.మీ. వ్యాసంతో ఉంటుంది. 1995లో బ్రెజిల్‌లోనూ 1999లో పసిఫిక్‌ మహాసముద్రంలోని మార్షల్‌ దీవుల్లోనూ పది మి.మీ. వ్యాసంతో పడినవే ఇప్పటివరకూ నమోదయిన అతిపెద్ద చినుకులు.

వాన వేగం
వాయువేగం మాదిరిగా వానకీ వేగం ఉంటుంది. సాధారణంగా గంటకి 10 నుంచి 30 కి.మీ. వేగంతో చినుకులు అవి నేలను హత్తుకుంటాయి. మేఘం ఎత్తుని బట్టీ ఆ వేగం ఆధారపడి ఉంటుంది. వానకి గాలి కూడా తోడయితే, అది 35 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అందుకే జోరువానలో ప్రయాణిస్తుంటే వానచినుకులు సూదుల్లా గుచ్చుకుంటుంటాయి. నిజానికి వాతావరణంలోని ఒకలాంటి రాపిడి కారణంగా ఆ చినుకులో వేగం కాస్త సన్నగిల్లుతుంది. లేకుంటే అవి మరింత వేగంగా పడి మనుషుల్ని గాయాలపాలు చేస్తాయి.

ఎక్కువ వాన!
ప్రపంచంలోకెల్లా అత్యధికంగా వాన కురిసేది మేఘాలయలోని మాసిన్రమ్‌లోనే. ఏటా 11,971 మి.మీ. వర్షపాతం నమోదవుతుందక్కడ. అదేసమయంలో అటకామాలోని ఎరికాలో సగటున 0.76 మి.మీ వర్షం మాత్రమే పడుతుంది. ఇక, హిందూ మహాసముద్రంలోని లా రీ యూనియన్‌లోని ఫాక్‌ - ఫాక్‌ ప్రాంతంలో 1966 జనవరి 7-8 తేదీల్లో అంటే- 24 గంటల్లో ఏకంగా 1.825 మీటర్ల వర్షం కురిసి రికార్డు సృష్టించింది. చిత్రంగా హవాయ్‌లోని మౌంట్‌ వాయలీలే వాసులు ఏడాదిలో 350 రోజులూ వర్షాన్ని ఆనందిస్తే, చిలీలోని కలామా వాసులకు గత 400 సంవత్సరాలుగా చినుకన్నదే తెలీదు.

రాళ్ల వాన!
వానంటే ఎంతిష్టమున్నా మేఘాలు గర్జిస్తుంటే మాత్రం అర్జునా... ఫల్గుణా... అంటూ చెవులు మూసుకుంటాం. కానీ ఉగాండావాసులకి మాత్రం అస్సలు భయం ఉండదు. ఎందుకంటే అక్కడ మేఘాలు ఏడాదికి 250 సార్లకు పైగా ఉరుముతుంటాయి. వానల్లో వడగళ్లు ఎంత మామూలయినా కొన్నిసార్లు అవి ప్రాణాల్నీ హరించేస్తాయి. ఉత్తరాఖండ్‌లోని 1942లో రూప్‌ఖండ్‌ దగ్గర కురిసిన వడగళ్ల వాన ఏకంగా 600 మంది మరణానికి కారణమైందట. 1986లో బంగ్లాదేశ్‌లోని గోపాల్‌గంజ్‌ ప్రాంతంలో ఏకంగా కిలోకి పైగా బరువున్న రాళ్ల వర్షం 92 మందిని బలితీసుకుంది. పోతే, కెన్యాలోని కెరిచో కొండల్లో అయితే ఏడాదిలో 135 రోజులపాటు వడగళ్ల వానలే.

రంగుల వాన!
వర్షానిదే రంగు అంటే ఎవరైనా చెప్పేది తెలుపే. కానీ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు... ఇలా రకరకాల రంగుల్లోనూ వాన పడుతుంది. వాతావరణంలోని దుమ్ము రేణువులు అందులో కలిసి ఉండటమే దానికి కారణం. అయితే కేరళలోని కొట్టాయంలో వాన మరీ ఎర్రగా కురుస్తుంది.

చేపల వాన!
వర్షంలో వడగళ్లు పడినట్లే కొన్నిచోట్ల కప్పలూ, చేపలూ కురుస్తుంటాయి. హోండూరస్‌లో చేపలవాన సాధారణం. అక్కడి యోరో నగరంలో మే, జూన్‌ నెలల్లో కురిసిన చేపల్ని ఏరుకుంటూ వేడుకా జరుపుకుంటారు.

అదృశ్య వాన!
కొన్నిసార్లు వాన నేలని లేదా శరీరాన్ని తాకేలోగానే ఆవిరైపోతుంటుంది. ఎడారుల్లో మాత్రమే అనుభవంలోకి వచ్చే ఈ వాననే ఫాంటమ్‌ రెయిన్‌ అంటారు.
అలాగే కిందకి జారేలోగా గడ్డకట్టే వానలూ ఉంటాయి. వీటినే ఫ్రీజింగ్‌ రెయిన్స్‌ అంటారు.

వాన ముచ్చట!
భూమ్మీదే కాదు, వేరే గ్రహాలమీదా వర్షం పడుతుంది. అయితే శుక్రగ్రహంమీద సల్ఫ్యూరిక్‌ ఆమ్లం పడితే, టైటాన్‌ ఉపగ్రహం మీద మీథేన్‌ వర్షిస్తుందట.
* థాయ్‌లాండ్‌లో రాత్రివేళ మాత్రమే వర్షం వస్తే, క్యూబాలో పగటివేళలో మాత్రమే వాన పడుతుంది.
* వానకోసమే గొడుగొచ్చింది అనుకుంటే పొరబాటే. మొదటగా ఈజిప్షియన్లు ఎండని తట్టుకోలేకే దాన్ని రూపొందించారట.
* ప్రతి పదికోట్లమందిలో ఒక్కరికి మాత్రమే వాన అంటే అస్సలు పడదు. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేస్తాయి. ఆ అలర్జీ ఉన్నవాళ్లు ఒకవేళ వానకి చిక్కితే... అంతేసంగతులు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.