close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ప్రియ’మైన బంగారం!

‘బంగారు తల్లివి కదూ... ఏడవకమ్మా...’ నాన్న బుజ్జగింపు. ‘మా బాబు బంగారు కొండ, గబగబా తినేస్తాడు...’ అమ్మ లాలింపు. ‘మా ఆయన బంగారం...’ భార్య నమ్మకం. ‘బంగారం లాంటి అవకాశం... వదులుకోకూడదు’ స్నేహితుడి సలహా. ‘కాస్త కష్టపడితే చాలు... భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది’ పెద్దల సూచన. ప్లాటినం బంగారంకన్నా ఖరీదైనదే కావచ్చు, మనకు మాత్రం బంగారంలా ఉండటమే ఇష్టం. ఆ రంగూ ఆ మెరుపూ ఆ మన్నికా... మరే లోహానికీ లేవు మరి. కాసింత బంగారం ఒంటి మీద ఉంటే ఆ కళే వేరు... ఆ ధీమానే వేరు!

బంగారం... ఇప్పుడు హాట్‌ టాపిక్‌. పెరిగిన బంగారం ధర ప్రస్తావన రాకుండా ఏ ఇద్దరి సంభాషణా ముగియడం లేదు.
‘ఒక్క నెక్లెస్‌ కొనిపెట్టమంటే ఇదుగో అదుగో అంటూ గడిపేశారు. ఇప్పుడిక కొన్నట్లే... ’ అన్న సాధింపులూ, ‘వీలైనప్పుడల్లా కాస్త కాస్త కొనిపెట్టుకుందాం అంటే వినలేదు, ఇప్పుడు చూడండి పిల్ల పెళ్లికి
కావలసిన బంగారం కొనాలంటే ఎంతవుతుందో’ అన్న సణుగుళ్లూ విన్పిస్తున్నాయి.
‘శ్రావణమాసంలో నాలుగు గాజులు చేయించుకుందామనుకుంటే బంగారం ధర చెట్టెక్కి కూర్చుంది. ఉండుండీ ఇప్పుడే పెరగాలా. ముప్పై తొమ్మిది వేలంట. ఇలా అయితే ఇక బంగారం కొన్నట్టే...’ అన్న నిట్టూర్పులూ వినబడుతున్నాయి.
కానీ, మనం- అంటే దక్షిణ భారతీయులం... బంగారం కొనకుండా ఉండగలమా?
అలా ఉన్న సాక్ష్యాలు చరిత్రలో లేవు. వర్తమానంలో కన్పించడం లేదు. భవిష్యత్తులోనూ ఉండే అవకాశం లేదు.
కావాలంటే ప్రపంచ స్వర్ణమండలి చెబుతున్న ఈ లెక్కలు చూడండి.

ఎంత బంగారమో!
మనదేశంలో ఉన్న బంగారం మొత్తం పాతిక వేల టన్నుల వరకూ ఉండవచ్చంటోంది వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌. ఆ పాతికవేల టన్నుల్లోనూ 21 వేల టన్నులు ఇళ్లల్లో మహిళల దగ్గరే ఉందట. మరే దేశంలోనూ ఇంత బంగారం లేదు. గత ఐదేళ్లలోనూ సగటున ఏడాదికి 849 టన్నుల బంగారాన్ని మన దేశంలో వివిధ అవసరాలకు వినియోగించామట. బంగారానికి సంబంధించి మనదేశంలో ఎక్కువ డిమాండ్‌ నగల మార్కెట్‌దే అయినా ధర పెరిగిన నేపథ్యంలో పెట్టుబడి కోసం ఈ సంవత్సరం గోల్డ్‌ బాండ్లూ ఈటీఎఫ్‌లూ కడ్డీలూ నాణేల కొనుగోళ్లు కూడా పెరిగే అవకాశముంది. దేశంలో ఉన్న బంగారంలో మన రిజర్వుబ్యాంక్‌ వద్ద నిల్వల రూపంలో ఉన్నది 613 టన్నులు మాత్రమే. మిగిలిన బంగారమంతా ప్రైవేటు సంస్థలూ వ్యక్తుల వద్ద ఉంది. ఎక్కువ బంగారు నిల్వలతో మొదటి స్థానంలో ఉన్న అమెరికా ఫెడరల్‌ బ్యాంకులో 8133.5 టన్నులు ఉండగా జర్మనీ(3369), ఇటలీ(2451), ఫ్రాన్స్‌(2436), రష్యా(2150) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మన దేశం పదోస్థానంలో ఉంది. అయితే ఇలా బ్యాంకు నిల్వల్లో మొదటి ఐదు దేశాల్లో ఉన్న మొత్తంకన్నా మన మహిళల దగ్గర నగల రూపంలో ఉన్న బంగారమే ఎక్కువ!

ఎందుకింత బంగారం మనకి?
బంగారం అంటే మనకెందుకింత ఇష్టమో అర్థం కాక విదేశాలవారు జుట్టు పీక్కుంటారు కానీ మనకది చాలా సింపుల్‌ ఫార్ములా. బంగారం నగ రూపంలో శరీరానికి అందాన్నివ్వడమే కాదు, ఎప్పటికీ తగ్గని దాని విలువే- భవిష్యత్తుకు గొప్ప భరోసా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బతకొచ్చన్న ధీమా. చేతిలో కాస్త డబ్బున్నప్పుడు శక్తి మేరకు కాసో తులమో కొని దాచుకునేవారు ఎందరో. వాళ్లు అలా దాచుకోబట్టే అంత బంగారం మనవాళ్ల దగ్గర జమయింది మరి. శ్రావణమాసం, ధన త్రయోదశి, అక్షయ తృతీయ లాంటి సందర్భాల్లో బంగారం కొనుక్కుంటే మంచిదని చెప్పి పెద్దలు దాన్నో సంప్రదాయంగా అలవాటు చేయడానికి కారణమదే. పెళ్లి అనగానే- ఎంత బంగారం పెడతారన్నది తప్పనిసరిగా మాట్లాడుకునే ఓ లెక్కగా మారడానికీ కారణం అదే. వానలు రాకో, వరదలు వచ్చో పంట చేతికి దక్కకపోతే మరో పంటకు పెట్టుబడి సంపాదించి పెట్టేది బంగారమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని కుదువబెట్టి ఎన్ని విపత్కర పరిస్థితులు గట్టెక్కమూ? ధర పెరగడమే కానీ తరగడం ఉండదు కాబట్టి దాన్ని అమ్ముకుని అయినా అవసరం తీర్చుకోవచ్చు. బంగారం ఎన్నేళ్లైనా పాడవదు. మెరుపు తగ్గదు. వాతావరణంలోని మార్పులకు లోనవదు. ఈ లక్షణాలు మరే లోహానికీ లేవు. అందుకే తరాల అంతరాన్ని అధిగమించి నాన్నమ్మ నెక్లెస్‌ అయినా, అమ్మమ్మ హారం అయినా... మనవరాలి మెళ్లో అందంగా ఒదిగిపోతుంది. దేశం మారితే డబ్బుకి రూపమూ మారిపోతుంది. బంగారానికి ఆ బాధ లేదు. అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా బంగారం విలువ చెక్కు చెదరదు. అందుకే దానికి అంత డిమాండు మరి.
బంగారాన్ని నగలుగానో పెట్టుబడిగానో ఎక్కువగా వాడుతున్నా దాన్ని ఇంకా చాలా రూపాల్లో వినియోగిస్తాం. అవును...
బంగారాన్ని మందులూ ఆహారపదార్థాల రూపంలో తింటున్నాం, తాగుతున్నాం, సౌందర్య సాధనంగా ముఖానికి పూసుకుంటున్నాం. మంచి విద్యుత్‌ వాహకం కావడంతో మొబైల్‌ ఫోన్లు వేగంగా పనిచేయడానికి బంగారాన్ని వాడతారు. పలు ఎలక్ట్రానిక్‌ పరికరాల్లోనూ దీన్ని వినియోగిస్తారు.

ఓ లెక్కుందట!
బంగారం భూమి మీదా, సముద్రంలోనూ కూడా ఉంటుంది. కాకపోతే ఎక్కువ మొత్తంలో ఉన్న గనుల నుంచి, ఖర్చుపరంగా గిట్టుబాటవుతుందనుకున్నప్పుడే తవ్వి తీస్తారు. ప్రపంచం మొత్తమ్మీద ఏటా గనుల నుంచి తీస్తున్న బంగారం 2500-3000 టన్నుల మధ్య ఉంటుంది. అందులో 750 టన్నుల దాకా మన దేశంలోనే వాడుతున్నాం. ఇంత బంగారం ఉంది కాబట్టి మన దగ్గర డబ్బున్నప్పుడు ఎంతంటే అంత బంగారం కొని ఇంట్లోనో బ్యాంకు లాకర్లోనో దాచిపెట్టుకుంటామంటే కుదరదు. మన దేశ బంగారం
చట్టం ప్రకారం...
* వివాహిత మహిళ వద్ద 500గ్రా.లు.
* అవివాహిత అయితే 250గ్రా.ఉండవచ్చు.
* పురుషుల వద్ద గరిష్ఠంగా ఉండాల్సిన బంగారం 100 గ్రాములే. అంతకన్నా ఎక్కువ ఉంటే దానికి పక్కాగా లెక్కలు చెప్పాల్సిందే. పన్నులు కట్టాల్సిందే.
ఆడవారి నగల మోజుపై జోకులు వేసుకుని నవ్వుకుంటారు కానీ ఈ మధ్య పురుషుల్లోనూ బంగారం మీద మోజు పెరుగుతోందంటున్నారు దుకాణదారులు. వాళ్లు ఎక్కువగా బ్రేస్‌లెట్లూ గొలుసులూ ఉంగరాలూ
కొంటున్నారట. ఈ మధ్య కొందరు బంగారు బాబులు ఏకంగా పుత్తడితో చొక్కాలు తయారుచేయించుకుని మరీ వేసుకుంటున్నారు. అసలు బంగారానికీ మనకీ ఈ బంధం ఎలా మొదలైందంటే...

క్రీస్తు పూర్వమే...
బంగారంపై మన మోజు ఇవాళ్టి కథ కాదు... అప్పుడెప్పుడో క్రీ.శ. ఒకటో శతాబ్దంలోనే ప్లినీ ద ఎల్డర్‌ అనే రోమన్‌ చరిత్రకారుడు మన దేశాన్ని ‘ద సింక్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ గోల్డ్‌’ అన్నాడు. భారతీయ మసాలాల కోసమూ అందమైన దుస్తులూ నగల కోసమూ తమ భార్యలు బంగారమంతా భారతదేశానికి దోచిపెడుతున్నారని అక్కడి ప్రజా ప్రతినిధులంతా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారట. ఒక్క రోమ్‌లోనే కాదు, పోర్చుగల్‌, ఇంగ్లండ్‌... ఇలా చాలా దేశాలు భారతదేశాన్ని తమ బంగారు నిల్వల్ని దోచుకుంటున్న దేశంగా చూసేవని చరిత్ర చెబుతోంది. అందుకు కారణమేంటంటే- సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న మనదేశానికి అన్ని దేశాలనుంచీ సముద్రమార్గంలో వర్తకులు వచ్చిపోతుండేవారు. ఇక్కడ ఎక్కువగా దొరికే సుగంధ ద్రవ్యాలూ నగిషీలు చెక్కిన హస్తకళాకృతులూ అందమైన నగలూ దుస్తులూ వారిని బాగా ఆకట్టుకునేవి. వాటికి బదులుగా వారి నుంచి కొనుక్కోడానికి పాశ్చాత్య వస్తువులేవీ మనవాళ్లకు నచ్చకపోవటంతో బంగారం తీసుకునేవారు. అలా అన్ని దేశాలకూ మన వస్తువులు వెళ్తే మనకేమో తిరుగు టపాలో బంగారమూ వెండీ వచ్చేవి. 17వ శతాబ్దంలో బ్రిటిష్‌ పార్లమెంటులోనూ భారతదేశానికి తరలిపోతున్న బంగారం గురించి ఒకప్పటి రోమ్‌లో జరిగినట్లే చర్చ జరిగితే అక్కడి ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీకి గట్టిగా చెప్పిందట భారతీయులకు పాశ్చాత్య వస్తువుల్ని అలవాటు చేయమని. దాంతో యంత్రాలతో తయారైన వస్తువులు మనదేశానికి వెల్లువెత్తాయి. బంగారం రాక తగ్గిపోయింది. ఇప్పుడేమో ధర పెరిగిపోయింది.

ఇవీ కారణాలు
బంగారం ధర ఇంతలా పెరగడానికి నిపుణులు చెబుతున్న కారణాలేంటంటే...
* ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం మొదటిది. దీని వల్ల డాలర్‌ విలువ పడిపోయింది. డాలర్‌ నీరసపడినప్పుడు పుత్తడి ధర పెరగడం
సాధారణం. జూన్‌ చివరివారంలో పది గ్రాములూ రూ.35,800కి చేరిన బంగారం ఆగస్టు 15 కల్లా 38,950కి చేరింది.
* మన దేశంలో ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్‌ని జులైలో ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10శాతం నుంచి పన్నెండున్నర శాతానికి పెంచారు. మన బంగారం అంతా దిగుమతి చేసుకునేదే కాబట్టి దిగుమతి సుంకం పెరిగితే బంగారం రేటూ పెరుగుతుంది.
* అమెరికా జులైలో వడ్డీ రేట్లు తగ్గించడమూ బంగారంపై ప్రభావం చూపింది.
* తాజాగా వివిధ దేశాల ఆర్థిక పరిస్థితులపై ఐఎంఎఫ్‌ హెచ్చరికలూ ఒక కారణం. 2012 తర్వాత మొదటిసారి బ్రిటిష్‌ ఆర్థికవ్యవస్థ ఊహించని రీతిలో నష్టాల్లో కూరుకుంది. జర్మనీ పారిశ్రామిక ఉత్పత్తి తొమ్మిదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇలాగే పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ప్రగతి కుంటుపడటంతో ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే పెట్టుబడిగా అందరి దృష్టీ బంగారం వైపు మళ్లింది. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో బంగారం నిల్వల్ని కొన్నాయి.
పెరిగిన ధర నేపథ్యంలో ఈ ఏడాది దేశంలో బంగారానికి డిమాండు మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోతుందని ఓ అంచనా. అయినా దిగుమతుల్లో మార్పేమీ ఉండదట. బంగారం వాడకంలో ప్రపంచంలోనే
రెండో స్థానంలో ఉన్నాం మనం. గత మూడేళ్లుగా అంతంతమాత్రంగా ఉన్న ఆభరణాల మార్కెట్‌లో డిమాండ్‌ ఈ ఏటి అక్షయతృతీయ నాటికి కాస్త మెరుగుపడింది. పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండడంతో షాపులన్నీ కళకళలాడాయి. అలాంటిది ఇప్పుడు అకస్మాత్తుగా ధర పెరగడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది వేచిచూడాల్సిన విషయమేనంటున్నాయి మార్కెట్‌ వర్గాలు.

రేపటి బంగారం
బంగారం ధర గతంలోనూ కొన్నిసార్లు అనూహ్యంగా పెరిగింది. అయినా దాని డిమాండు తగ్గలేదు. ఇప్పుడే కాదు, మరో పదేళ్లూ ఇరవయ్యేళ్లూ ముప్పయ్యేళ్లూ అయినా బంగారం మీద మన మోజేం మారదట. ప్రపంచ స్వర్ణ మండలి గత ఏడాది విడుదల చేసిన ‘గోల్డ్‌ 2048’ నివేదిక ఆ విషయమే చెబుతోంది. ఇండియా, చైనాల్లో మధ్య తరగతి జనాభా పెరగడమూ, ఆర్థికంగా బలపడడమూ బంగారానికి డిమాండును పెంచుతాయట. విద్యుత్తు, వైద్యం, సాంకేతికత తదితర రంగాల్లో బంగారం వాడకం ఇంకా పెరుగుతుందట. బంగారం మీద పెట్టుబడులు పెట్టే విషయంలో సలహాలూ సూచనలూ ఇవ్వడానికీ, అమ్మడమూ కొనడమూ చేసి పెట్టడానికీ, బంగారాన్ని కానుకలరూపంలో పంపించడానికీ- భారత్‌, చైనాల్లో ప్రత్యేక ఆప్‌లు రాబోతున్నాయట.

* * * * * 

అదండీ సంగతి. ధర ఎంత పెరిగితే దాని గురించి అంతగా మాట్లాడుకుంటాం. అంతేకానీ కొనడం మాత్రం మానుకోం.
కావాలంటే మిగతా ఖర్చుల్ని తగ్గించుకునైనా ఓ కాసు బంగారమే కొనుక్కుంటాం.
ఎందుకంటే- ఎంతైనా... అది బంగారం మరి!

సగం వాటా నగలదే!

పసుపు పచ్చగా మెరిసేదే పుత్తడి అనుకుంటే పొరపాటే. రంగు రంగుల బంగారాన్నీ తయారుచేస్తున్నారు...
* స్వచ్ఛమైన బంగారం మృదువుగా సాగిపోతుంది కాబట్టి దాంతో నగలు చేయడానికి కొద్ది మొత్తం ఇతర లోహాలను కలుపుతారు. అలా రాగి కలిపినప్పుడు బంగారం ఎర్రటి ఛాయ సంతరించుకుంటుంది. అదే ఇంకాస్త ఎక్కువ కలిపితే గులాబీ రంగులోకి మారిపోతుంది. వెండి కలిపితే పచ్చదనం తగ్గిపోతుంది. అల్యూమినియం లోహాన్ని వేర్వేరు పాళ్లలో కలపడం ద్వారా ఆకుపచ్చ, ఊదారంగు బంగారాలను తయారుచేస్తున్నారు. గాలియం, ఇండియం లాంటి లోహాలను కలిపితే నీలివర్ణంలో కాంతులీనుతుంది. నికెల్‌, పల్లాడియం లాంటివి కలిపితే తెల్ల బంగారమవుతుంది.
* బంగారం స్వచ్ఛతని క్యారట్లలో కొలుస్తారు. స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారెట్లది. సాధారణంగా ఆభరణాలకు 22 క్యారట్ల బంగారాన్ని వాడతారు. మూడొంతులు బంగారమూ ఒక వంతు మరో లోహమూ కలిస్తే 18 క్యారట్లు అంటారు.
* ఉత్పత్తిపరంగా బంగారు గనుల్లో  మొదటి స్థానం  ఇండోనేషియాలోని గ్రాస్‌బెర్గ్‌ గనిది. టాప్‌ టెన్‌ గనుల్లో దక్షిణాఫ్రికాలోని రెండు గనులుంటాయి.
* బంగారం వాడడం మొదలెట్టినప్పటినుంచి ఇప్పటివరకు 1,87,200 టన్నుల బంగారాన్ని గనుల నుంచి వెలికి తీసి ఉంటారని అంచనా.
* ఇప్పుడు వెలికితీస్తున్న బంగారంలో 49 శాతం వాటా ఆభరణాలదే.
* పద్మనాభస్వామి నేలమాళిగలను పక్కనపెడితే బంగారు నగలు ధరించి మెరిసిపోయినా, ఆ నగల్ని బ్యాంకుల్లో దాచుకున్నా తిరుమల శ్రీనివాసుడితో పోటీపడగల దేవుడు మరొకరు లేరు. దాదాపు తొమ్మిది వేల కిలోల బంగారం ఆయన సొంతం. రోజూ రెండు కిలోల చొప్పున ఏటా దాదాపు 700 కిలోల పుత్తడి కానుకల్ని భక్తులు ఆయనకు సమర్పించుకుంటున్నారు. అది కాక బ్యాంకుల్లో దాచిపెట్టిన బంగారానికి వడ్డీగా కూడా తితిదే బంగారాన్నే తీసుకోవడంతో పదేళ్లకోసారి 1800 కిలోల బంగారం చొప్పున జమవుతోంది.

ఆ ఊరే బంగారం!

మీ ఊళ్లో ఎన్ని బంగారు దుకాణాలున్నాయో మీకు తెలుసా? హైదరాబాదూ విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో అయితే వందల్లో ఉంటాయి. అదే జిల్లాల్లోని టౌనుల్లోకెళితే బహుశా పదుల్లో ఉండొచ్చు. కానీ కేరళలోని కొడువల్లి అనే ఊరికి వెళ్తే మాత్రం బంగారు ధగధగలకు కళ్లు చెదిరిపోతాయి. యాభైవేల జనాభా కూడా లేని ఆ ఊళ్లో ఒకేచోట రోడ్డుకిరువైపులా ఏకంగా వందకు పైగా బంగారు దుకాణాలున్నాయి. దాంతో మొదటిసారి అటు వెళ్లినవారంతా తాము దారి తప్పలేదుకదా అని ఒక్క క్షణం కంగారు పడతారు. బంగారం కొనే విషయంలో దేశంలో కేరళ మొదటి స్థానంలో ఉంటే, కేరళలో కొడువల్లిది ప్రథమస్థానం. ఒకప్పుడు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చి అక్కడే కొనుక్కునేవారట. ఇప్పుడు ఎక్కడికక్కడే షాపులు వచ్చినా కొడువల్లిలోని ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో గల్ఫ్‌ వెళ్లినవాళ్లు ఉంటారు. దాంతో డబ్బుకి కొదవ లేకపోవటంతో శుభకార్యాలతో సంబంధం లేకుండా మామూలు పండగలకి కూడా అక్కడి వారు కొత్త బట్టలు కొనుక్కున్నట్టే బంగారు నగలు కొనుక్కుంటారట. ఆ ఊరు దాటి ఇంకాస్త అవతలికి వెళ్తే కోళికోడ్‌లో ఏకంగా వీధులమ్మట తిరుగుతూ కూరగాయలమ్మినట్లు బంగారు నగలు అమ్మే బస్సే(మొబైల్‌ జ్యువెలరీ షోరూమ్‌) ఉంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.