close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆరడుగుల మరుగుజ్జు

- వరుణ్‌ పారుపల్లి

సాయంత్రం ఐదుగంటలు...
బెజవాడలో నేనెక్కిన ‘ఫలక్‌నుమా’ బయలుదేరింది. విజయనగరంలో రంగారావు మామయ్యకు అవసరమైతే డబ్బు ఇవ్వడానికి ఆఫీసుకు సెలవుపెట్టి బయలుదేరాను. దాదాపు ఏడుగంటల ప్రయాణం. చాలా రోజుల తర్వాత విజయనగరం వెళ్తున్నా. ఇటీవల బొత్తిగా మనుషుల్లో కలవని నేను ‘చంటి’ పెళ్ళికి కూడా వెళ్ళలేదు. అమ్మ ఆ పెళ్లి విశేషాలు చెప్పబోతే కూడా వినిపించుకోలేదు. బహుశా స్నేహని కలవడానికి వెళ్ళడమే ఆఖరనుకుంటా. ‘స్నేహ’ ఆలోచన రాగానే మనసు రెక్కలు విప్పుకుని గతంలోకి ఎగిరిపోయింది.
అవి నేను పీజీలో చేరడానికి ఎదురు చూస్తున్న రోజులు. చుట్టంచూపుగా వచ్చిన మా మామయ్య రమ్మనడంతో తనతోపాటు విజయనగరం వెళ్ళా. మామయ్య కొడుకు చంటి నాకంటే రెండేళ్లు చిన్న. వాడితో కలిసి తిరుగుళ్ళూ, క్రికెట్‌ ఆటలతో సమయం గడిచిపోయేది.
ఇంకో రెండు రోజుల్లో వెళ్లిపోదామనుకుంటుండగా... ఆరోజు మామయ్య దుకాణానికీ, చంటి క్లాసుకీ వెళ్లిపోయారు. అత్తయ్య వంటగదిలో ఉంది. కాఫీ తాగుతూ, తీరుబడిగా ఇంటి వసారాలో కూర్చుని పేపర్‌ చదువుతున్నా.
‘‘రవ్వ జల్లెడ ఇవ్వమంది మా అమ్మమ్మ’’ అన్న మాట విని తలెత్తి చూశా.
పదిహేడేళ్ళు ఉంటాయేమో... పసిమి మేనిఛాయతో, ఆరోగ్యవంతమైన ఆకారంతో ఆకుపచ్చ రంగు చుడిదార్లో మెరిసిపోతూ ఒకమ్మాయి నిలుచుని ఉంది. నేను విజయవాడలో చాలామంది అందమైన అమ్మాయిలనే చూశాను కానీ, ఈ అమ్మాయిది సహజమైన సౌందర్యం. సమాధానం చెప్పాలన్న ధ్యాస కూడా లేకుండా గుడ్లప్పగించి ఆమెనే చూస్తూ ఉండిపోయా. నా చూపులకు ఇబ్బంది పడిందేమో, ‘‘తొందరగా ఇస్తారా? అవతల పొయ్యిమీద ఎసరు ఉంది’’ అంది.
ఆ మాటలకి ఈ లోకంలోకి వచ్చి ‘‘ఏం కావాలీ?’’ అన్నా.
‘‘చెప్పాను కదా, రవ్వ జల్లెడ కావాలని... తొందరగా ఇవ్వండి. లేట్‌ అయితే మా అమ్మమ్మ ఊరుకోదు’’ అని కొంచెం కోపంగా చెప్పింది.
ఇంతలో మా అత్తయ్య లోపలినుండి వచ్చి ‘‘అదేంటే, వాణ్ణి అడుగుతావు? నీకీ ఇంట్లో ఏదెక్కడ ఉంటుందో తెలియదా? వెళ్లి తీసుకో’’ అంది.
అత్తయ్య ఆ మాట అనడమే ఆలస్యం, తూనీగలా తుర్రున లోపలికెళ్ళి జల్లెడతో బయటికొచ్చింది. వచ్చి అత్తయ్యతో ‘‘పందిరిగుంజలాగా ఇక్కడ ఆరడుగుల మనిషి ఉన్నాడు కదా అని అడిగా. నాకేం తెలుసు ఇతనికి ఏమీ తెలియదని?’’ మా అత్తయ్యతో అని వెళ్ళిపోయింది.
తను అలా వెళ్ళగానే అడిగా ‘‘ఎవరత్తయ్యా? నోటికెంత వస్తే అంతమాట అని పోయింది?’’ అని.
‘‘స్నేహ అని, పక్కింటి వాళ్ళ మనవరాలు. వాళ్ళది రాజాం. సెలవలు కదా, అమ్మమ్మ ఇంటికి వచ్చింది. పిల్ల బంగారం. ఎవడు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు’’ అంది.
‘ఆ... బంగారమే... నోటిదురద బంగారం. అందంగా ఉందని పొగరు!’ గొణుక్కున్నా. ఎంత తిట్టుకున్నా, ఆ అమ్మాయి అందానికి ఆకర్షితుణ్ణి కాకుండా ఉండలేకపోయా.
కొన్ని రోజుల తర్వాత నా ప్రవేశపరీక్ష ఫలితాలు వచ్చాయి. చాలా మంచి ర్యాంకు వచ్చింది. అమ్మానాన్నలు ఫోన్‌ చేసి అభినందించారు. మా అత్తయ్య ఈ సంగతి స్నేహ వాళ్ళ అమ్మమ్మకి చెప్పింది. ఆమె రావడం, ‘తన’ ముందు నన్ను మెచ్చుకోవడం, ‘తన’ దృష్టిలో నేనో విజేతగా నిలబడటం చకచకా జరిగిపోయాయి. ఆ సాయంత్రం మామయ్య ఇంటికొస్తూనే ‘‘నాన్న ఫోన్‌ చేశాడురా, నిన్ను రేపే రమ్మంటున్నాడు’’ అన్నాడు.
‘‘వాడొచ్చి పదిరోజులైనా కాలేదు అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? నేను మాట్లాడతా ఉండు అన్నయ్యతో’’ అంటూనే నాన్నకు ఫోన్‌ చేసింది అత్తయ్య. ఏ కళనున్నారో నాన్న కూడా ‘‘సరే నీకిష్టమైనప్పుడే పంపించు’’ అన్నారు. మెల్లమెల్లగా స్నేహతో చనువు ఏర్పడింది. ‘‘మీరు’’ల్లోంచి ‘‘నువ్వు’’ల్లోకి దిగాం.
ఒకరోజు మామయ్యా అత్తయ్యా చంటీ సాలూరులో ఫంక్షన్‌ ఉందని బయల్దేరారు. నాకు వెళ్ళబుద్ధి కాలేదు. అత్తయ్య వెళ్తూ స్నేహకి చెప్పింది...  ‘నేను మధ్యాహ్నం వాళ్ళింటికి భోజనానికి వస్తాను’ అని. ఒంటిగంట కొట్టింది. కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. నా అంతట నేను వెళ్ళి ‘అన్నం పెట్టండి’ అని ఎలా అడిగేది? ఒకటీ పదికి, తను రెండు డబ్బాలతో వచ్చింది.
‘‘నువ్వు మొహమాటపడుతున్నావేమో అని నేనే తెచ్చా... ఇదిగో భోంచెయ్‌’’ అంది.
‘తను’ నా గురించి ఆలోచిస్తోందా అని ఆశ్చర్యం వేసింది. తనని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలో అర్థంకాలేదు. నా బాధని దేవుడు గమనించాడేమో... ఆ సందర్భం కూడా అప్పుడే కల్పించాడు. నాకొక అలవాటు ఉంది- కాస్త ఖాళీ దొరికితే పేపర్‌ మీద ఏవో బొమ్మలు వేస్తూ ఉంటా. ఆరోజు ఉదయం కూడా బొమ్మలు గీశా. అవి పెళ్ళి బొమ్మలు. డైనింగ్‌ టేబుల్‌ మీదనే న్యూస్‌పేపరుతో మూసి ఉన్నాయి. స్నేహ వాటిని చూడబోతే వారించాను. ‘‘ఏంటి, చూడకూడదా?!’’ అనడిగింది.
నేను నవ్వి ‘‘ఏవో పిచ్చి బొమ్మల్లే’’ అని దాటెయ్యబోయా.
‘‘ఫర్వాలేదు, చూపించు’’ అంటూ లాక్కుని చూసింది. ఆ బొమ్మలు చూసి ఆశ్చర్యంగా, ‘‘అరె, భలే వేశావే! నీలో ఇంత కళ ఉందని తెలియదు. ఈ పెళ్ళికొడుకు ఎవరు... నువ్వేనా?’’ అంది.
సిగ్గుపడుతూ తలూపాను.
‘‘మరి, ఈ పెళ్ళికూతురు... మీ మామకూతురా?’’
‘‘కాదు, నువ్వే’’ నా సమాధానానికి నేనే విస్తుపోయాను. ‘ఇంత ధైర్యం నాకేనా?’ అని.
ఒక్కసారిగా తన ముఖం గంభీరంగా మారిపోయింది. మౌనంగా ఆ కాగితం అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత రెండు రోజులు మా ఇంటి ఛాయలకు కూడా రాలేదు. నాకు ఆ రెండు రోజులూ ముళ్ళమీద కూర్చున్నట్టుగా ఉంది.
సాయంత్రం ఊరికి వెళ్ళిపోదామని బట్టలు సర్దుకుంటుంటే స్నేహ వచ్చింది. అయిదు నిముషాలు ఏమీ మాట్లాడలేదు. నాకు ఎలా మొదలుపెట్టాలో తెలియలేదు. చివరకు తనే ‘‘ఏంటి వెళ్ళిపోతున్నావా?’’ అంది.
‘‘అవును. అందనిదానికోసం ఆరాటపడుతూ ఇంకెన్నాళ్ళు ఉండను?’’ అన్నా.
‘‘అందుతుందో లేదో ప్రయత్నం చేస్తే కదా తెలిసేది. ప్రయత్నం కూడా చెయ్యకుండా, అందదు అని చెప్పి రాళ్ళు రువ్వుతావా? అయినా మా అమ్మాయిలకి మీలాగా మొహమ్మీద చెప్పడం రాదు. మీరే అర్థం చేసుకోవాలి’’ అంది.
ముభావంగా బట్టలు సర్దుతున్న నేను ఒక్కసారిగా ఆగిపోయా- ‘నేను విన్నది నిజమేనా’ అని. ‘‘ఏమన్నావూ?’’ అన్నా.
‘‘నీకు ఏదీ ఒక్కసారి చెప్తే అర్థంకాదే!’’ అని నా డిప్పమీద ఒక్కటిచ్చి తుర్రుమంది. జరుగుతున్నది కలో నిజమో తెలియలేదు. తేరుకుని బయటికి పరుగెత్తి చూశా.
తను వాళ్ల ప్రహరీ పక్కన నిలబడి నాకేసి చూస్తూ నవ్వుతోంది. నాకు పట్టరాని సంతోషం కలిగింది. కోహ్లీ వికెట్‌ తీసిన కొత్త బౌలర్‌లాగా తెగ సంబరపడిపోయా... అది నా తొలిప్రేమ మరి! అది మొదలు పెద్దవాళ్ళకి అనుమానం రాకుండా సైగలతోనే మాట్లాడుకునేవాళ్ళం.
ఒకరోజు క్యారమ్‌ బోర్డు ఆడుతుండగా అంది ‘‘మన పెళ్ళికి మన పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? నాకెందుకో భయంగా ఉంది’’ అని.
‘‘నేను చూసుకుంటా కదా... నేను పీజీ పూర్తి చేసి, మంచి ఉద్యోగం సంపాదించి, నిన్ను ఇమ్మంటే మీ వాళ్ళు ఒప్పుకోరా? నాకంటే మంచి అల్లుడిని తీసుకొస్తారా వాళ్ళు? ఇక, మా ఇంట్లో నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు. నువ్వేం దిగులు పడకు’’ అని ధైర్యం చెప్పాను.
అప్పటిదాకా భారంగా గడచిన కాలం తన సాంగత్యంలో పంచకల్యాణిలా పరుగులు పెట్టింది. చూస్తుండగానే కాలేజీలు తెరిచారు. పీజీ కోసం విజయవాడ పటమటలో హాస్టల్లో ఉండేవాణ్ణి. ఇద్దరం చిరునామాలు ఇచ్చి పుచ్చుకున్నాం. నేను హాస్టల్‌ చిరునామా ఇస్తే, తను స్నేహితురాలిది ఇచ్చింది.
ఉత్తరాలూ, అప్పుడప్పుడు ఫోనుల్లోనే సాగేది మా ప్రేమాయణం. ఇప్పటిలా ఆరోజుల్లో సెల్‌ఫోన్లు అంతగా లేవు.
అవకాశం చిక్కినప్పుడల్లా రాజాం వెళ్లొస్తూ ఉండేవాణ్ణి. అంత దూరం ప్రయాణం చేసి తనతో గడిపేది కొన్ని గంటలే అయినా అదే నాకు పెద్ద వరంలా అనిపించేది.
ఏమాటకామాట చెప్పుకోవాలి... ఏకాంతంలో ఉన్నా ఎప్పుడూ మేం హద్దు మీరింది లేదు.

కాలం గిర్రున మూడేళ్ళు తిరిగింది. ఈ మూడేళ్ళలో తన డిగ్రీ కూడా పూర్తయ్యింది. నాకు పీజీ ఫైనల్‌ పరీక్షలు దగ్గరికొచ్చాయి. ఒకపక్క చదవాల్సిన సబ్జెక్టులు, మరో పక్క ప్రాజెక్ట్‌. ఊపిరి సలిపేది కాదు. ఆ ఒత్తిడితో నెమ్మది నెమ్మదిగా స్నేహతో మాటలు తగ్గిపోయాయి. పరీక్షలు పూర్తికాగానే ఉద్యోగ ప్రయత్నాల్లో స్నేహితులతోపాటు హైదరాబాద్‌ చేరా. అప్పుడే కొత్తగా సెల్‌ కొనుక్కున్నాను. స్నేహకి నంబర్‌ ఇచ్చా. దాని పుణ్యమా అని రోజూ కనీసం గంటసేపు మాట్లాడుకునేవాళ్ళం. ‘నువ్వు తొందరగా ఉద్యోగంలో స్థిరపడాలి. పెద్దవాళ్ళను ఒప్పించి మనం పెళ్లి చేసుకోవాలి. మనకో చిన్న ఇల్లూ ఇద్దరు పిల్లలూ... మీ అమ్మా వాళ్లనీ మా అమ్మా వాళ్లనీ బాగా చూసుకోవాలి...’ ఇలా ఏవేవో మాట్లాడేది.
హైదరాబాదులో రెండు నెలలు కష్టపడ్డాక ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం దొరికింది. నెలకి పదిహేనువేల జీతం. ఖర్చులు పోగా ఓ అయిదువేలు ఇంటికి పంపేవాణ్ణి- నా తృప్తికోసం. ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగాను. టీమ్‌ లీడర్‌ స్థాయికి చేరుకున్నా. నేను పనిచేసే సంస్థలోనే నాకు ‘నిత్య’ పరిచయమైంది. చాలా తెలివైన చలాకీ అమ్మాయి. స్నేహలా ఎమోషనల్‌ కాదు, పక్కా ప్రాక్టికల్‌. జీవితంపట్ల స్పష్టమైన అభిప్రాయాలు కలది. నిత్యా నేనూ ఒకే ప్రాజెక్ట్‌లో పనిచేసేవాళ్ళం. రాత్రిళ్ళు బాగా పొద్దుపోయే వరకూ, అప్పుడప్పుడూ శని, ఆదివారాలు కూడా పనిచేయాల్సి వచ్చేది.
ఈ క్రమంలో నాకు తెలియకుండానే స్నేహకి దూరమవుతూ నిత్యకి దగ్గరయ్యాను.
అమాయకమైన పల్లెటూరి అమ్మాయి స్నేహ కంటే ఆధునిక భావాలూ స్థిరమైన దృక్పథం ఉన్న నిత్య మెరుగనిపించింది. నెమ్మదిగా స్నేహతో మాటలు తగ్గించేశాను. ‘స్నేహ మనకి సూట్‌ కాదు, తనకి తగ్గవాడు దొరుకుతాడులే’ అని సరిపెట్టుకుని ఫోన్‌ నంబర్‌ కూడా మార్చేశాను.
ఓ ఆదివారం నిత్యకి ప్రపోజ్‌ చేశాను. తను ఈ విషయం ముందే ఊహించిన దానిలా చాలా నింపాదిగా ‘‘కిరణ్‌, నువ్వంటే నాకూ ఇష్టమే. కానీ, ఈ ఇష్టం ప్రేమా కాదా అనేది మనం తేల్చుకోవాలి. నీకు ఓకే అయితే కొన్నాళ్ళు కలిసి బతుకుదాం. నచ్చితే దాన్ని నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకువెళ్దాం, లేదంటే స్నేహితుల్లా విడిపోదాం’’ అంది. ‘సరే’నన్నా.
అమ్మా వాళ్లకు చెప్తే ‘నువ్వు చిన్నపిల్లాడివి కాదు, నీకేది సరైనది అనిపిస్తే అది చెయ్యి. కానీ, నీ నిర్ణయానికి నువ్వే బాధ్యుడివి. గుర్తుంచుకో’ అని మాత్రం హెచ్చరించారు. అదే రోజు సాయంత్రం హాస్టల్‌ నుంచి నా ఫ్లాట్‌లోకి మారింది నిత్య.
ఆరునెలలు గడిచాయి...
అప్పటివరకూ మా ఇద్దరిమధ్యా ఎటువంటి అభిప్రాయభేదాలూ రాలేదు. కానీ ఆరోజు, ‘అమ్మకి మోకాలు నొప్పి ఎక్కువైంది, సర్జరీ చెయ్యాలన్నార’ని నాన్న ఫోన్‌ చేశారు.
‘‘విజయవాడకన్నా హైదరాబాదులో మంచి వైద్యం దొరుకుతుంది. ఆపరేషన్‌ నేను చేయిస్తాను, నా దగ్గరికి రండి’’ అని చెప్పాను.
ఆ విషయం నాకూ నిత్యకూ మధ్య పెద్ద గొడవనే సృష్టించింది. ‘‘కిరణ్‌, మనమధ్య ఎవరూ ఉండకూడదు అని అనుకున్నాం కదా... ఇప్పుడు నువ్వు మీ అమ్మని తీసుకొస్తే ఎలా? అవసరాలు అందరికీ ఉంటాయి. మా అక్కకి డెలివరీ చేయించడానికి హైదరాబాద్‌ తీసుకొస్తామన్నారు మా అమ్మావాళ్లు. నేను తీసుకొచ్చానా? అయినా, నువ్వు మీ అమ్మానాన్నలకి చెప్పేముందు నన్ను అడగాలి కదా?’’ అంటూ విరుచుకుపడింది. చేసేదేమీ లేక మా అమ్మని హోమ్‌కేర్‌లో ఉంచి ఆపరేషన్‌ చేయించాను.
అమ్మకి నయం అయ్యాక, తిరుగు ప్రయాణం ముందు నాన్న మాట్లాడారు- ‘‘చెబితే తప్ప తెలుసుకోలేని అమాయకుడివి కాదు. ఆధునికత పేరుతో ఎటుపోతున్నావో ఆలోచించు. మీకిదంతా ఫ్యాషన్‌ అనిపించొచ్చు, కానీ కన్నవారు కూడా ఎక్కసమైతే, దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. నువ్వైనా తెలుసుకునే ప్రయత్నం చెయ్యి’’ అన్న మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయి. ప్రత్యేకంగా జీవించడానికీ గిరిగీసుకొని బతకడానికీ తేడా తెలియని నిత్య వల్ల నేను స్నేహితులకీ కన్నవాళ్ళకీ ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ‘ఇక కలిసి ఉండటం కష్టమ’ని చెప్పేద్దామనుకునేలోపు తనే, ‘కిరణ్‌, మనకి సెట్టవ్వదు’ అని ఫ్లాట్‌ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మూడేళ్లయింది... ఆ పీడకల ముగిసి. ఈ మూడేళ్ళలో నేను మరో అమ్మాయి జోలికి వెళ్ళలేదు. ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. కళ్ళు తెరిచేసరికి రైలు కోరుకొండ స్టేషన్‌ దాటుతోంది. లేచి, డబ్బున్న బ్యాగుని సరిచేసుకొని విజయనగరం స్టేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా.
పదినిముషాల తర్వాత విజయనగరం స్టేషన్‌లో దిగేసరికి సన్నగా వర్షం మొదలైంది. అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న మామయ్యని చూసి పలకరింపుగా నవ్వాను. ‘‘ఏరా బాగున్నావా?’’ అంటూ నా బ్యాగుని అందుకున్నారు.
ఇంటికి వెళ్ళగానే అత్తయ్య ‘‘అలసిపోయుంటావు, స్నానంచేసి రా. వేడిగా టిఫిన్‌ చేద్దువుగాని’’ అంది.
తీరుబడిగా టిఫిన్‌ చేస్తూ చంటి గురించి అడిగాను. ‘‘పొద్దునే ఫోన్‌ చేశాడురా, ఇంకో గంటలో రావాలి. నువ్వు తెచ్చిన డబ్బు వాడి కోసమే. ఇక్కడే విజయనగరంలో ఇంకో ఇల్లు కొన్నాడు. ఆఖరి నిమిషంలో ఓ పది లక్షలు వేరేదానికి ఖర్చయ్యాయి. నాన్నని అడిగితే ఇస్తానన్నాడు. ఈ టాక్సుల గొడవ లేకపోతే నిన్ను ఇబ్బందిపెట్టేవాళ్ళం కాదు. వాడొచ్చాక బావామరుదులు మిగిలినవి మాట్లాడుకోండి’’ అని నవ్వింది.
ఇంతలో ఓ కారు రివ్వున వచ్చి ఆగింది. దానిలోంచి చంటీ, వాడి భార్యా దిగారు. వాళ్ళని చూసి ఉలిక్కిపడ్డాను. నేను చూసింది నిజమా కలా అనిపించింది. వాడి భార్య మరెవరో కాదు... స్నేహ!! స్నేహని జీవితంలో మళ్ళీ చూస్తాననుకోలేదు. నా దృష్టిలో తనతో ప్రేమ ముగిసిన అధ్యాయం. అలాంటిది ఇప్పుడు ఆమె నా ఎదురుగా ఉంది. ‘మామధ్య జరిగింది వీళ్లెవరికన్నా తెలుసా, తెలియదా? అసలేం జరుగుతోంది..?’ ఆలోచనలతో తల వేడెక్కిపోతోంది.
‘‘బాగున్నావా బావా... ఏంటి మరీ చిక్కిపోయావు, డైటింగా?’’ అన్న చంటి మాటతో ఈలోకంలోకి వచ్చాను.
‘‘నాదేముందిలేరా... నువ్వు మాత్రం అలాగే ఉన్నావు. ఇల్లు కొన్నావట కదా, పార్టీ లేదా?’’ నా మనసులోని అలజడిని పైకి కనపడనీయకుండా బలవంతంగా నవ్వుతూ అడిగాను.
‘‘స్నేహా, టైమ్‌కి వచ్చావే. పొయ్యి మీద పప్పుచారు పెట్టాను, కొంచెం చూసుకో తల్లీ’’ అని అత్తయ్య స్నేహని వంటగదిలోకి పంపించింది. ‘స్నానం చేసొస్తా’నని చంటి లోపలికి వెళ్ళిపోయాడు.
‘‘అత్తయ్యా, స్నేహని మన చంటి చేసుకోవడం ఏంటి?’’ అడిగాను. అత్తయ్య మాటలకు నా కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది.
‘‘ఓ... నీకు స్నేహ గుర్తుందా..? మూడేళ్ళ క్రితం- కూతురు ఎవరినో ప్రేమిస్తోందని, దానికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసేశాడు వాళ్ళ నాన్న. తన ప్రేమని కాపాడుకోవడానికి ప్రేమించిన వాడిని తండ్రితో మాట్లాడించాలని ఫోన్‌ చేస్తే, నంబర్‌ మార్చేశాడంట ఆ ప్రబుద్ధుడు. తర్వాత ఎప్పటికో తెలిసింది... ఆ ప్రబుద్ధుడివి నువ్వేవనని. అదేనేరా ప్రేమంటే? ప్రేమించినవాడు పట్టించుకోకపోయినా కట్టుకున్నవాడు దాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూశాడు. కానీ దాని అదృష్టాన్ని చూసి ఆ దేవుడికి కూడా కన్నుకుట్టిందేమో, ఆ అబ్బాయిని తీసుకుపోయాడు. ఏడాదిక్రితం స్నేహ వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, దానికి మళ్ళీ పెళ్లి చెయ్యాలనుకుంటున్నారని. పెళ్లి చేసుకోమంటే ఆ బంగారు తల్లి ఏమందో తెలుసా... ‘పెళ్లి చేసుకుని నా దారిన నేను వెళ్లిపోతే, వయసు మళ్ళిన మా అత్తామామల్ని ఎవరు చూసుకుంటారు? అందుకే, నాతోపాటు వాళ్ళని కూడా చూసుకునే వాడైతేనే చేసుకుంటా’ అంది. అంత మంచి మనసురా దానిది...’’ ఆయాసంతో ఆగింది అత్తయ్య.

ఇంతలో ఎప్పుడు వచ్చాడో చంటి అందుకుని, ‘‘బావా, స్నేహ అంటే నాకు మొదటి నుంచీ ఇష్టమే. ఆమె జాలిగుణం, బోళాతనం, ఆమె నడవడికపట్ల గౌరవముండేది. కానీ, ఎప్పుడూ ఆ ఇష్టాన్ని ఎవరికీ చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఆ ధైర్యమే ఉంటే ఎప్పుడో తనని పెళ్ళి చేసుకునేవాణ్ణి. నా ఇంజినీరింగ్‌ అయిపోయి వైజాగులో కంపెనీ పెట్టాక - స్నేహకి మళ్ళీ సంబంధాలు చూస్తున్నారనీ ఆమె ఈ కండిషన్‌ పెట్టిందనీ తెలిసింది. పెళ్లయ్యాక కన్నవాళ్ళనే గాలికి వదిలేస్తున్న ఈ రోజుల్లో... చనిపోయిన వెంకట్‌ అమ్మానాన్నలని తన తల్లిదండ్రులుగా చూసుకుంటున్న స్నేహ మీద ఇష్టం, గౌరవం మరింత పెరిగాయి. అందుకే, నా మనసులో మాట అమ్మానాన్నలకి చెప్పేశాను.
నా నిర్ణయం విన్న స్నేహ మీమధ్య జరిగిందంతా చెప్పింది. తెలిసీతెలియని వయసులో కలిగిన ఆ ఆకర్షణ గురించి నేను పట్టించుకోను. నాకు నువ్వన్నా నీ భావాలన్నా ఇష్టం. చనిపోయిన భర్త తరఫువాళ్ళనే ఇంత బాగా చూసుకుంటున్నావంటే, నిన్ను చేసుకున్నాక మా అమ్మానాన్నల్ని ఇంకెంత బాగా చూసుకుంటావో అర్థం చేసుకోగలను. నీకు అభ్యంతరం లేదంటే నీతోపాటు నీ వాళ్లందరినీ నా వాళ్లుగా స్వీకరిస్తా’’ అని చెప్పాను. ఇప్పుడు కొన్న ఇల్లు వెంకట్‌ అమ్మానాన్నల కోసమే. నువ్వు ఏ పరిసితుల్లో స్నేహకి దూరమయ్యావో అడిగి, నిన్ను జడ్జ్‌ చెయ్యను. అవన్నీ మర్చిపోయి తను ఆనందంగా ఉంది. నాకది చాలు’’ అని అంటూండగానే - వంటింట్లో నుంచి వస్తూ, ‘‘ఏంటీ, అమ్మాకొడుకులు కబుర్లతోనే అన్నయ్యకి కడుపు నింపేస్తారా? వంట అయిపోయింది, భోజనాలకి లేవండి’’ అంది స్నేహ.
నాలో అంతర్మథనం మొదలైంది. కంటికి కనిపించని అడ్డుగోడలు తనచుట్టూ కట్టుకుని అందరినీ కాదనుకున్న నిత్య ఎక్కడ... భర్త చనిపోయినా అతని బాధ్యతలను తను తీసుకుని, అత్తమామల్ని అమ్మానాన్నల్లా చూసుకుంటున్న స్నేహ ఎక్కడ? ప్రేమని వస్తువుగా చేసి లాభనష్టాల త్రాసులో కొలిచిన నేనెక్కడ, ప్రేమించిన మనిషి ఆనందం కోసం ఏమైనా చెయ్యడానికి వెనుకాడని చంటి ఎక్కడ!? ఉన్నతమైన వాళ్ళ వ్యక్తిత్వాల ముందు... ఆరడుగుల మరుగుజ్జునై నిలబడ్డాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.