close
ఆకుపచ్చని కాఫీ..!

కాఫీ... అన్న మాట వింటే చాలు... మధురమైన రుచీ ఘుమఘుమలాడే పరిమళాలతోబాటు ముదురు గోధుమ రంగులోని ఆ రంగూ గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు గ్రీన్‌ టీ మాదిరిగానే కాఫీ కూడా ఆకుపచ్చని రంగులోనూ వస్తోంది. అవును మరి, ఒకప్పుడు మెదడుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేందుకు తాగే కాఫీని ఇప్పుడు ఆరోగ్యం కోసమూ తాగేస్తున్నారు.

కాఫీ అనగానే ముదురు గోధుమ రంగులో ఉండే కాఫీ కలర్‌ మాత్రమే స్ఫురించడం సహజం. అంటే కాఫీ అనేది ఓ రంగు పేరుగానూ స్థిరపడిపోయిందన్నమాట. అసలు కాఫీ గింజలు ఆకుపచ్చని రంగులో ఉంటాయని కూడా ఊహించలేం. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చే కాఫీ గింజలన్నీ కూడా వేయించినవే. వాటితో మాత్రమే పొడి చేస్తుంటారు. కానీ ఇప్పుడు కాఫీ గింజల్ని ముదరకుండానే కాస్త లేతగా ఉండగానే- అంటే, ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే కోసి వేయించకుండా పొడి చేసి తాగేస్తున్నారు.

ఎందుకలా? 
ఆకుపచ్చని కాఫీ బరువుని తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలడంతో మొదట్లో దాన్ని సప్లిమెంట్స్‌లా తీసుకోవడం మొదలైంది. అది కాస్తా బ్లాక్‌, మిల్క్‌, లాటె కాఫీ, టీల మాదిరిగానే గ్రీన్‌ కాఫీని కూడా రకరకాల రుచుల్లో చప్పరించేస్తున్నారు. రోస్ట్‌ చేయని కాఫీ గింజల్లోని క్లోరోజెనిక్‌ ఆమ్లాలు ఆరోగ్యానికి మంచివనీ, ఇవి రక్తంలో గ్లూకోజ్‌ నిల్వల్ని తగ్గించడంతోబాటు జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికీ దోహదపడతాయనీ చెబుతున్నారు. పైగా ఆకుపచ్చని కాఫీ గింజలవల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టమూ లేకపోవడంతో వీటిని కాఫీ రూపంలో తాగడం సరికొత్త ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా ఇందులోని క్లోరోజెనిక్‌ ఆమ్లాలు మధుమేహానికీ హృద్రోగాలకీ కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడానికి తోడ్పడతాయి. పైగా ఇది రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది.

సాధారణంగా కాఫీ మొక్కలకి ఎరుపూ లేదా వంకాయ వర్ణంలోని కాయలు కాస్తాయి. వాటిని కోసి ఎండిన తరవాత కావాల్సిన రుచికోసం గింజల్ని రకరకాల ఉష్ణోగ్రతల దగ్గర  వేయించి పొడి చేస్తుంటారు. కాఫీగింజల్లో సహజంగానే వెయ్యి రకాల పదార్థాలు ఉంటాయి. అన్నింటిలోకీ పాలీఫినాల్స్‌ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీర కణాలపై ప్రభావం చూపుతాయి. అయితే కాఫీ గింజల్ని వేయించినప్పుడు వాటిల్లో సహజంగా ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కానీ గ్రీన్‌ కాఫీ గింజల్లో అవన్నీ పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

గ్రీన్‌ కాఫీ ఆకలిని తగ్గించడంతోబాటు క్రేవింగ్‌నీ తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌నీ అదనంగా పెరిగిన కొవ్వునీ తగ్గించడంతోబాటు రక్తప్రసరణని పెంచడం ద్వారా ఆకస్మికంగా సంభవించే పక్షవాతం, గుండె ఆగిపోవడం, కిడ్నీలు పనిచేయకపోవడం... వంటివి రాకుండా చేస్తుంది. ఎందుకంటే గ్రీన్‌ కాఫీ గింజల్లో ఆస్ప్రిన్‌ను పోలిన శక్తిమంతమైన పదార్థం ఉంటుంది. అది రక్తనాళాలు పూడుకుపోకుండా చేస్తుందట. దాంతో రక్తప్రసరణ సాఫీగా ఉంటుంది.

అంతేకాదు, ఆకుపచ్చని కాఫీ హానికరమైన టాక్సిన్లు బయట వెళ్లేలా చేస్తుంది.

ఇందులోని క్లోరోజెనిక్‌ ఆమ్లం గ్రీన్‌ టీతో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా హానికర ఫ్రీ రాడికల్స్‌ శాతాన్ని తగ్గిస్తుంది. ఫెరూలిక్‌ ఆమ్లం చర్మం తాజాగా ఉండేలా చేస్తే; అర్హాడిక్‌, లినోలిక్‌, ఓలియాక్‌ వంటి ఫ్యాటీ ఆమ్లాలూ తేమను కాపాడటం ద్వారా చర్మాన్ని మృదువుగా చేస్తాయి. అందుకే రంగూరుచీవాసనకే కాదు... అందానికీ ఆరోగ్యానికీ ఆకుపచ్చని కాఫీ... అంటూ సరికొత్త రాగం తీస్తోంది ఈతరం! 
  
 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.