close
సేవ కోసం... మేము సైతం...

చాలామంది ఏదైనా సమస్యని చూసినపుడు దాన్ని సమస్య కోణంలోనే చూస్తారు. కానీ ఇక్కడున్నారే ఇలాంటివాళ్లు పరిష్కార కోణంలోనూ ఆలోచిస్తారు. వాటిని పరిష్కరించేందుకు సంస్థల్నీ ప్రారంభిస్తారు!


పేదపిల్లలకు సరిగమలు!

గోవాకు చెందిన లూయిస్‌ డయాస్‌ వృత్తిరీత్యా వైద్యులు. పదేళ్లపాటు యూకేలో ప్రాక్టీసు చేశారు కూడా. సంగీతంపైన ఇష్టంతో వయొలిన్‌ నేర్చుకుని ఒక సంగీత బృందంలో సభ్యుడిగానూ ఉండేవారు. అక్కడ జరిగే ప్రపంచస్థాయి సంగీత ప్రదర్శనలకు కొన్ని దేశాలనుంచి పేద విద్యార్థి బృందాలు వచ్చి అద్భుత ప్రదర్శనల్ని ఇవ్వడం చూశారాయన. ఆ విద్యార్థులకు ఓ మంచి వేదిక, అవకాశం దొరకడంతోనే అది సాధ్యమైందని గుర్తించి భారత్‌లోని పేద పిల్లలకు అలాంటి అవకాశాన్ని తాను కల్పించాలని 2010లో స్వదేశానికి తిరిగొచ్చారు. వైద్యుడిగా ప్రాక్టీసు నిలిపేసి గోవాలో ‘చైల్డ్స్‌ ప్లే’ సంస్థను నెలకొల్పి ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు పాశ్చాత్య సంగీతంలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. గోవాలోని ‘హమారా స్కూల్‌’లో కేవలం 12 మంది విద్యార్థులతో శిక్షణ ప్రారంభించారు.

వయొలిన్‌, పియానో, ఫిడేల్‌, ఫ్లూట్‌, చెలో, క్లారెనెట్‌... ఇలా పలు రకాల పరికరాల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం మూడు స్కూళ్లలో 120 మంది వీరి దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. వీరి విద్యార్థులు సంగీత ప్రదర్శనలూ ఇస్తుంటారు. హమారా స్కూల్‌ విద్యార్థి ఇర్ఫాన్‌... సంస్థ ప్రారంభం నుంచీ వీరి దగ్గర వయొలిన్‌ నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు అతడే మ్యూజిక్‌ మాస్టారుగా మారి సంస్థ తరఫున పాఠాలూ చెబుతున్నాడు. సంగీతం పేద విద్యార్థులకు ఓ అద్భుతమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తుందనీ, వాళ్ల వ్యక్తిత్వంలోనూ ఎంతో మార్పుని తెస్తుందనీ చెబుతారు లూయిస్‌.


హలో కాస్త టైమ్‌ ఇస్తారా?

మికుల్‌ పటేల్‌, ఐఐటీ రూర్కీలో చదువుతున్నపుడు అతడి క్లాస్‌మేట్‌ ఆత్మహత్యా యత్నం చేశాడు. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు అతడు రాసిన సూసైడ్‌ లెటర్‌ చదివాకగానీ మికుల్‌కి అర్థం కాలేదు, ఒంటరితనం ఎంత భయంకరమైందో. ఆ తర్వాత 2017లో ఐఐఎమ్‌లో చేరినపుడు దానికి పరిష్కారం చూపించాలనుకున్నాడు. అలా వచ్చిన ఆలోచనే ‘మూడ్‌కెఫే’ ఆప్‌.

ఎవరైనా ఒంటరితనంతో బాధపడుతుంటే ఈ ఆప్‌లో వాయిస్‌ కాల్‌ చేసి తమ బాధల్ని ఇతరులతో పంచుకోవచ్చు. ఈ ఆండ్రాయిడ్‌ ఆప్‌ని ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు అంతకుమించి ఎలాంటి వ్యక్తిగత వివరాల్నీ అడగదు. సమస్యని విన్నవాళ్లు దాని తీవ్రతనిబట్టి వాళ్లకి ఏదైనా సలహా ఇవ్వడమో లేదంటే అలాంటి బాధితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చే సంస్థల ప్రతినిధులకు ఫోన్‌ కనెక్ట్‌ చేయడమో చేస్తారు. బాధితుల సమస్యల్ని వినే వలంటీర్లకూ ఈ ఆప్‌లో చోటు ఉంటుంది. ఆప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని అందుకు సంసిద్ధత తెలిపితే వలంటీర్లకి ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఏ సమయంలో అందుబాటులో ఉంటారో చెబితే, ఆ సమయంలో ఎవరైనా బాధితులు ఫోన్‌ చేస్తే ఆ ఫోన్‌ని వారికి కలుపుతారు. ఆ విధంగా డబ్బుని కాకుండా సమయాన్ని సమాజానికి కేటాయించండి అంటోంది మూడ్‌కెఫే.


‘మానవత’ పరిమళిస్తోంది!

ఆపదలో ఉన్నవారిని చూసినపుడు ‘కాస్త చేయూత ఇవ్వగలిగితే’ అనిపిస్తుంది. ఆ ఊతమిచ్చే చెయ్యి మనదే ఎందుకు కాకూడదు అనుకున్న రామచంద్రారెడ్డి ‘మానవత’కు ఊపిరి పోశారు. 
కడప జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. అప్పుడే పూర్వవిద్యార్థులూ, స్నేహితులతో కలిసి ‘మానవత’ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు తక్షణమే స్పందించడానికి ఒక ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటుచేశారు. క్రమంగా జిల్లాలోని ఇతర మండలాలకూ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాలకూ విస్తరించింది మానవత. మండలం ఒక యూనిట్‌గా ఈ సంస్థ సేవలు అందిస్తుంది. విరాళాలతోనే నడుస్తుంది. దీన్లో వార్షిక సభ్యత్వానికి రూ.600 చెల్లించాలి. సభ్యులతోపాటు వారి సహకారంతో ఎవరైనా ఈ సంస్థ సేవల్ని ఉచితంగా పొందొచ్చు. రాష్ట్రంలో 108 సేవలు విస్తృతమై ప్రైవేటు అంబులెన్స్‌ల అవసరం తగ్గిన తర్వాత ఫీడర్‌ బాక్సులూ, అంతిమ యాత్రకు అవసరమయ్యే శాంతి రథాలను స్థానికంగా అందిస్తోంది మానవత. ఇంకా వాటర్‌ ట్యాంకర్లనూ సమకూర్చుతుంది. అంతేకాదు, విద్యాదానం, రక్తదానంపైనా దృష్టి పెడుతూ ప్రతి మండలంలో రక్తదాతల జాబితానీ తయారుచేస్తుంది. ఎవరికైనా రక్తం అవసరమని తెలియగానే దాతల్ని పంపిస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ఇటీవల మొక్కల పెంపకాన్నీ, వాటి సంరక్షణనూ ప్రోత్సహిస్తోంది మానవత (ఫోన్‌:9440389633).

- గణేష్‌ పోతుల, న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.