close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాట తప్పినందుకు గౌను తొడిగించారు!

ఈ వసతులు కల్పిస్తాం... ఆ పనులు చేయిస్తాం... అంటూ హామీలిచ్చి చివరికి వాటిని పూర్తిచేయకుండానే కాలాన్ని గడిపేసే రాజకీయ నాయకుల్ని సాధారణ జనం తిట్టుకుని వదిలేస్తారు,  కాస్త ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవాళ్లయితే ఇదేంటి అని నిలదీస్తారు. కానీ మెక్సికోలోని హుయిక్స్‌టాన్‌ పట్టణ ప్రజలు తమ మేయర్‌, ట్రస్టీలను అలా వదిలేయలేదు. పట్టణ నీటి వ్యవస్థను బాగుచేస్తానంటూ హామీ ఇచ్చి అది నెరవేర్చకుండా తిరుగుతున్న వాళ్లతో బలవంతంగా గౌనూ, లంగా జాకెట్టూ వేయించి రోడ్ల వెంట తిప్పారు. నిధులు చాల్లేదంటూ బుకాయిస్తుండటంతో రోడ్ల వెంట వెళ్లే వాహనాలను ఆపి వాళ్లతోనే నిధుల కోసం భిక్షాటన చేయించారు. నాలుగు రోజుల పాటు ఈ తంతు సాగింది. మా నాయకులకూ ఇలాంటి శిక్షే సరైందంటూ ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతుండటంతో ఈ పోస్టు ఇప్పుడు వైరల్‌ అయింది. 


బంగారంలాంటి ప్యూపా...

గొంగళిపురుగు సీతాకోక చిలుకయ్యే క్రమంలో ప్యూపాగా మారుతుందని మనకు తెలుసు. అంగుళం పొడవుతో ఆకుపచ్చ రంగులో చెట్లఆకుల అడుగున మనకు ఈ ప్యూపాలు కనిపిస్తుంటాయి. అయితే, ఆరెంజ్‌ స్పాటెడ్‌ టైగర్‌ క్లియర్‌ వింగ్‌ బటర్‌ఫ్లైగా పిలిచే సీతాకోక చిలుకల ప్యూపాలు మాత్రం అచ్చం బంగారంతో లేదా మెరిసే లోహంతో చేసిన వాటిలా ఉంటాయి. ఇవి శత్రువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికే ఇలాంటి ప్యూపాలను ఏర్పరచుకుంటాయట. ఈ ప్యూపా ఉపరితలం మెరవడం వల్ల దానిమీద పరిసరాల ప్రతిబింబం కనిపిస్తూ ఉండి, అవి పరిసరాల్లో కలిసిపోతాయి. బల్లులూ, పక్షులూ, పెద్ద సాలీళ్లలాంటివి వీటిని తినడానికి వచ్చినప్పుడు వాటి ప్రతిబింబం వాటికే కనబడటంతో అవి భయపడి పారిపోతుంటాయట. ఇంతకీ ఈ ప్యూపాలు మెరవడానికి కారణం కైటిన్‌ అనే పత్యేక పదార్థమే. 


వింత స్తంభాలాట!

ఆటంటే ఎగరడం, దూకడం, పరిగెత్తడంలాంటివే మనకు తెలుసు. కానీ ఓ స్తంభం చివర కూర్చునేది కూడా ఉంటుందని ఎప్పుడైనా విన్నారా... అయితే దీని గురించి తెలుసుకోవలసిందే! పోల్‌ సిటింగ్‌గా పిలిచే ఈ క్రీడ నెదర్లాండ్స్‌ దేశంలో ప్రాచుర్యం పొందింది. ఇందులో క్రీడాకారులు నీళ్లలో ఉండే ఓ స్తంభం మీద కూర్చుని ఉండాలి. దానికి కాళ్లు పెట్టుకునేందుకూ, కూర్చునేందుకూ వీలుగా ఏర్పాట్లు చేసి ఉంటాయి. అలా ఎవరు ఎక్కువ గంటలు కూర్చుంటే వాళ్లే విజేత. అయితే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కొన్ని గంటలకోసారి కిందకి దిగొచ్చట. అంటే, నిద్ర కూడా ఆ స్తంభం మీదేనన్నమాట. ఆ దేశంలో ఆదరణ పొందిన ఈ ఆటకు సంబంధించి అప్పుడప్పుడూ పోటీలు జరుగుతుంటాయి, ముఖ్యంగా అక్కడ ఇదో పర్యటక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇదేం పిచ్చి ఆట, ఎవరైనా ఆడతారా అనుకుంటున్నారా... ఈ ఆటలో ఓ వ్యక్తి ఏకంగా 51 రోజుల 20 గంటల పాటు పోల్‌ మీద కూర్చుని రికార్డు సృష్టించాడంటే ఓ ఆటగా ఇది అక్కడ ఎంత ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు.


చేతులు లేని పైలట్‌..!

విమానాన్ని నడిపేందుకు ఎంతో శారీరక దార్ఢ్యం, అంతకు మించిన మానసిక స్థైర్యం అవసరం. కానీ చేతులు లేకుండానే విమానాన్ని నడిపేస్తూ... మనో బలం ముందు ఏ అవకరమూ అడ్డంకి కాదని నిరూపిస్తోంది అమెరికాకు చెందిన జెసికా కాక్స్‌. రెండు చేతులూ లేకుండా పుట్టిన ఈమె ప్రపంచంలోనే ఇలా చేతులు లేకుండా విమానాన్ని నడుపుతున్న మొట్ట మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించింది. తన రెండు కాళ్లతోనే విమానాన్ని నడుపుతూ ప్రపంచాన్ని అబ్బుర పరుస్తున్న జెసికా టెడెక్స్‌లాంటి ప్రఖ్యాత వేదికల మీద మాట్లాడుతూ స్ఫూర్తి కలిగించే వక్తగానూ ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. ఈమె పియానో వాద్యకారిణీ, తైక్వాండోలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించిన ధైర్యశాలీ, స్కూబా డైవర్‌ కూడా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.