close
ఆకలేస్తే... అమ్మకాదు, జొమాటో గుర్తురావాలి!

నిన్నమొన్నటివరకూ బయట భోజనం చేయాలంటే దగ్గర్లో ఏ హోటల్‌ ఉందా అని చూసేవాళ్లు. మరిప్పుడు, ఏ ఆప్‌లో ఆర్డర్‌ ఇవ్వాలీ అని ఆలోచిస్తున్నారు. ఇంతలోనే ఎంత మార్పు! మన దగ్గర ఈ మార్పు వెనక ప్రధాన సంస్థల్లో జొమాటో ఒకటి. ఓ ఇద్దరు స్నేహితులు పదేళ్ల కిందట ప్రారంభించిన  కంపెనీ ఆహార రంగంలో  ఓ విప్లవాన్నే తెచ్చింది. ఆ ప్రయాణాన్ని మనతో పంచుకుంటున్నారు సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌.

ఐఐటీ దిల్లీ నుంచి బీటెక్‌ పూర్తిచేసి కన్సల్టెన్సీ సంస్థ అయిన ‘బెయిన్‌ అండ్‌ కంపెనీ’ దిల్లీ కార్యాలయంలో పనిచేస్తుండేవాణ్ని. అక్కడ పంకజ్‌ చద్దా నా సహోద్యోగి. ఆఫీసు క్యాంటిన్‌కి వెళ్లినపుడు మెనూ కార్డులు చాలినన్ని ఉండేవి కాదు. ‘పక్కవాళ్లు ఎప్పుడు ఇస్తారా’ అని ఎదురుచూడాల్సి వచ్చేది. ఆ సమస్యకు పరిష్కారంగా పంకజ్‌, నేనూ వాటిని స్కాన్‌ చేసి సంస్థ ఇంట్రానెట్‌లో పెట్టాం. ఆ వివరాల్ని ఉద్యోగులంతా తరచూ చూస్తుండేవారు. సొంత వ్యాపారం చేయాలన్న ఆలోచన నాకు ఉండేది. ఇక్కడో వ్యాపార అవకాశం ఉందని పంకజ్‌కు చెప్పాను. తర్వాత ఇద్దరమూ దిల్లీ నగరమంతా తిరిగి వివిధ రెస్టరెంట్ల మెనూ కార్డుల్ని స్కాన్‌చేసి ఒక వెబ్‌సైట్‌ ప్రారంభించి దాంట్లో పెట్టాం. అక్కడ ఆయా హోటళ్ల ఫోన్‌ నంబర్లూ ఉంచేవాళ్లం. 2008లో ప్రారంభించిన ఆ సైట్‌కు ‘ఫూడీబే’ అని పేరుపెట్టాం. ఆ వెబ్‌సైట్‌ని వీక్షించేవాళ్లనుంచి రెస్టరెంట్లకు ఆర్డర్లు బాగా రావడం చూసి రెస్టరెంట్ల యజమానులే మా వెబ్‌సైట్లో ప్రకటనలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇదంతా ఉద్యోగం చేస్తూనే వారాంతాల్లో చేసేవాళ్లం. డిమాండ్‌ బావుండటంతో మరో రెండు నగరాలకు చెందిన రెస్టరెంట్ల సమాచారాన్నీ ఫూడీబేలో పెట్టాం. ఏడాది తిరిగేసరికి మా ఖర్చులకు సరిపోయేంత ఆదాయం సైట్‌ద్వారా రావడంతో ఉద్యోగాలు మానేసి పూర్తిగా దానిమీద దృష్టిపెట్టాం. ఆరు నెలలపాటు అలా పనిచేశాక సంజీవ్‌ బిఖ్‌చందానీకి చెందిన ‘ఇన్ఫోఎడ్జ్‌’ మా కంపెనీలో రూ.70 లక్షలు పెట్టుబడి పెట్టింది. దాంతో మా జీవితం పూర్తిగా మారిపోయింది.

జొమాటో అయ్యిందిలా... 
2010లో ఇన్ఫోఎడ్జ్‌ పెట్టుబడి వచ్చాక మరిన్ని కొత్త నగరాల్లోని హోటళ్ల వివరాల్ని సైట్లో చేర్చాం. దాంతో చాలా వేగంగా ఎదుగుదల కనిపించింది. ఆ దశలో ఇన్ఫోఎడ్జ్‌ సీఎఫ్‌ఓ అంబరీష్‌ రఘువంశీ... మాకో సూచన చేశాడు. ‘ఫూడీబే’ పేరు ‘ఈబే’ వెబ్‌సైట్‌ను పోలి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ట్రేడ్‌మార్క్‌ సమస్యలూ రావచ్చన్నాడు. కొత్త పేరు కోసం ఆలోచించినపుడు జొమాటో, ఫోర్క్‌వైజ్‌ మా దృష్టికి వచ్చాయి. జొమాటో పేరుతో డొమైన్‌ కొనడానికి ఏడు లక్షల రూపాయలూ ఫోర్క్‌వైజ్‌ అయితే ఏడు వేలూ అన్నారు. పేరుకు అంత ఖర్చు చేయడం ఎందుకని జొమాటోకి బదులుగా ఫోర్క్‌వైజ్‌కి వెళ్దాం అని చెబితే... ‘జొమాటో పేరు ఎంతో క్యాచీగా, కూల్‌గా ఉంది. ఎందుకు వదులుకుంటున్నారు’ అని చెప్పిమరీ కొనిపించాడు అంబరీశ్‌. అలా ఫూడీబే కాస్తా జొమాటో అయింది. తర్వాత మా వెబ్‌సైట్లో రెస్టరెంట్లకి రివ్యూ, రేటింగ్‌ ఇచ్చే అవకాశాన్నీ కల్పించాం. తర్వాత ఆప్‌నీ తెచ్చాం. ఆహార విభాగానికి సంబంధించి ఇండియాలో మొట్టమొదట ఆప్‌ని తెచ్చింది మేమే. ఎదుగుదల చాలా వేగంగా ఉండటంతో 2011లో రూ.2.1కోట్లు, 2012లో రూ.1.6కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వాటిలో అధిక మొత్తం ఇన్ఫోఎడ్జ్‌ పెట్టింది. 2012 చివరికి కంపెనీ లాభాల బాట పట్టింది.

విదేశాలకు వెళ్లాం... 
కంపెనీ ఎదుగుదలకు మాకు రెండు మార్గాలు కనిపించాయి. రెస్టరెంట్ల సమాచారం ఉన్నట్టే స్పాలూ, సెలూన్లూ, జిమ్‌ల సమాచారంతో వెబ్‌సైట్లు తేవడం, లేదంటే రెస్టరెంట్ల సమాచారాన్ని మనదేశంలో ఇస్తున్నట్లే ఇతర దేశాల్లో ఇవ్వడం. మేం రెండో దారిని ఎంచుకున్నాం. అలా ఇండియా వెలుపల యూఏఈలో మా సేవల్ని ప్రారంభించాం. యూఏఈ మార్కెట్‌ పరంగా చిన్నదే అయినా వ్యాపార లావాదేవీల పరంగా పెద్దది. ప్రారంభించిన నాలుగు నెలల్లోనే అక్కడ లాభాల్లోకి వెళ్లగలిగాం. ఆ విజయంతో టర్కీ, బ్రెజిల్‌, లెబనాన్‌, పోర్చుగల్‌... ఇలా వివిధ దేశాలకు సేవల్ని విస్తరించాం. మా ఎదుగుదలని జాగ్రత్తగా గమనిస్తోన్న పెట్టుబడిదారులు మా వెంటపడ్డారు. అవసరమైన ప్రతిసారీ పెట్టుబడుల వర్షం కురిసేది. ఇన్ఫోఎడ్జ్‌తోపాటు సికోయా క్యాపిటల్‌ కూడా పెట్టుబడి పెట్టింది. దాంతో నగదు నిల్వలు బాగా ఉండేవి. మేం మార్కెట్‌లోకి ముందుగా వెళ్లినచోట మాకు తిరుగుండేది కాదు. కానీ కొన్ని దేశాల్లో మాకంటే ముందే మాలాంటి సేవలు అందిస్తున్న కంపెనీలతో పోటీ పడటం కష్టమయ్యేది. వాళ్లని అధిగమించాలంటే మరిన్ని ప్రణాళికలూ, డబ్బుతోపాటు తగినంత సమయం కావాలి. అందుకు ప్రత్యామ్నాయంగా కొన్నిచోట్ల అలాంటి సంస్థల్ని చేజిక్కించుకోవడం మొదలుపెట్టాం. అలా 2014లో న్యూజిలాండ్‌(మెనూ మేనియా), చెక్‌ రిపబ్లిక్‌(లంచ్‌టైమ్‌), పోలెండ్‌(గ్యాస్ట్రోనాసీ) దేశాల్లో కంపెనీల కొనుగోలుద్వారా ఆ మార్కెట్లలోకి వెళ్లాం. 2015 జనవరిలో అమెరికా కేంద్రంగా పనిచేసే అర్బన్‌స్పూన్‌ని చేజిక్కించుకున్నాం. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకేల్లో దానికి మార్కెట్‌ ఉంది. ఆదాయం ప్రకారం జొమాటో కంటే పెద్ద సంస్థ అయిన అర్బన్‌స్పూన్‌ని రూ.350 కోట్లు పెట్టి కొన్నాం. అప్పుడు చాలామంది అడ్డుచెప్పారు. కానీ అమెరికాలో జొమాటో ప్రవేశించి ఆ స్థానానికి చేరాలంటే చాలా కష్టం. అర్బన్‌స్పూన్‌తో ఒక్కరోజులో నాలుగైదు దేశాల్లో అడుగుపెట్టగలిగాం.

ఫుడ్‌ డెలివరీలోకి... 
2015 నుంచి మన దగ్గర ‘ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ’ కంపెనీలు మొదలయ్యాయి. ఆ ఏడాది జూన్‌లో జొమాటో కూడా ఆ విభాగంలోకి అడుగుపెట్టింది. కానీ మేం విదేశాల్లోనూ ఉండటం, అన్నిచోట్లా పోటీ బాగా ఉండటంతో ఒక దశలో పెట్టుబడులు రావడానికి కష్టమైంది. దాంతో ఖర్చులు తగ్గించుకోవాలని మేం కొత్తగా అడుగుపెట్టిన కొన్ని విదేశీ మార్కెట్ల నుంచి వెనక్కి వచ్చేశాం. వ్యాపారం బాగా నడుస్తున్నచోట లాభాల్ని పెంచుకున్నాం. అమెరికా సహా చాలా దేశాల్లో ఉద్యోగుల్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. అయితే ఇదంతా మేం మరింత దృఢంగా తయారయ్యేలా చేసింది. డబ్బు తక్కువగా ఉన్నపుడే చాలా సృజనాత్మక, ఆచరణీయమైన ఆలోచనలు వస్తాయి. నిజానికి కొన్నిసార్లు డబ్బు మనల్ని పూర్తిగా ఆలోచించకుండా చేస్తుంది. రెస్టరెంట్ల మెనూల్ని ఉంచుతూనే, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలోకి అడుగుపెట్టాం. రెంటినీ ఒకే వేదికమీదకు తేవడంతో మార్కెట్‌లో నిలదొక్కుకోగలిగాం. తర్వాత మళ్లీ పెట్టుబడులు వచ్చాయి. 2016 నాటికి ‘జొమాటో’ బిలియన్‌ డాలర్‌ కంపెనీగా ఎదిగింది. మన మార్కెట్‌లో దూసుకెళ్తూనే ఖతార్‌, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, మలేషియా... ఇలా 23 దేశాలకు విస్తరించాం. ప్రస్తుతం 13 దేశాల్లో చురుగ్గా ఉన్నాం. మన దేశంలోనూ ప్రస్తుతం 350కి పైగా నగరాలూ, పట్టణాల్లో మా సేవలు అందిస్తున్నాం. వారానికి 20 కొత్త నగరాల చొప్పున విస్తరించాలని చూస్తున్నాం. మన దగ్గర విందు కూడా వినోదమే. కాబట్టి డిమాండ్‌కు లోటుండదు. ప్రణాళికాబద్ధంగా వెళ్లడమే ముఖ్యం. 16 నెలల కిందటే మేం లాభాల్లోకి వచ్చింది. మళ్లీ కొత్త పెట్టుబడులు పెట్టాం.

అన్నింటా జొమాటో... 
ఆహారానికి సంబంధం ఉన్న ప్రతిచోటా మాదైన మార్కూ, మార్పూ ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. ఆదాయంలో 20 శాతం నిధుల్ని ‘రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’కి కేటాయిస్తాం. అలా వచ్చినవే జొమాటో గోల్డ్‌, హైపర్‌ప్యూర్‌ ఆలోచనలు. ‘గోల్డ్‌’ చందాదారులు మాతో భాగస్వామ్యం ఉన్న రెస్టరెంట్లకు వెళ్లి భోంచేసినపుడు తగ్గింపు ధరల్లో ఆహారం, పానీయాలు పొందొచ్చు. దీన్ని డెలివరీ విభాగంలోకీ తేనున్నాం. మనం తినేది బతకడానికి, చావడానికి కాదు. అందుకే కలుషితంకాని ఆహారం అందించాలని హైపర్‌ప్యూర్‌ని ప్రారంభించాం. దీన్లో భాగంగా హోటళ్లూ, రెస్టరెంట్లకు సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన ధాన్యాలూ, కాయగూరలూ, పండ్లూ పంపిణీ చేస్తున్నాం. అలాగే హోటళ్ల దగ్గర వృథా అయిన ఆహార పదార్థాల్ని ఎరువులుగా మార్చి రైతులకు అందిస్తున్నాం.

మా భాగస్వాములతో మేం పోటీ పడకూడదని సొంత కిచెన్లు ప్రారంభించలేదు. మేం ప్రారంభించినా ఎన్నిచోట్లకని వెళ్లగలం.

జొమాటో బయటవాళ్లకి ఒక కంపెనీ కావొచ్చు. కానీ ఉద్యోగుల పరంగా అదో కుటుంబం. మా ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లడం అరుదు. ఎందుకంటే కంపెనీ లక్ష్యంలో ఉద్యోగుల్ని అంతలా భాగం చేస్తాం. ఐఐటీలో నా మిత్రులూ, బెయిన్‌లో నా సహోద్యోగులూ ఇప్పుడు జొమాటోలో కీలక స్థానాల్లో ఉన్నారు. మా ఉద్యోగుల్లో 80 శాతం మగవాళ్లే. వాళ్లలో చాలామంది 30 ఏళ్లలోపువారే. తండ్రి అయిన ప్రతి ఒక్కరూ ఆ మధుర క్షణాల్ని అనుభవించాలని దేశంలోనే మొదటిసారి మా కంపెనీలో ఆరు నెలల పితృత్వ సెలవుల్ని అమలుచేస్తున్నాం. కంపెనీ ప్రారంభించిన రోజుల్లో 14 గంటలపాటు పనిచేసేవాణ్ని. ఇప్పుడు పది గంటలపాటు పనిచేస్తున్నా. రోజూ పొద్దున్నే ఆరోజు చేయాల్సిన 30-40 పనుల జాబితా రాసుకుంటాను. వాటిని ప్రాధాన్య క్రమంలో పూర్తిచేస్తాను. ఆకలేస్తే... అమ్మకాదు, జొమాటో గుర్తుకురావాలి. అదే మా లక్ష్యం. 


అంకెల్లో... జొమాటో!

కంపెనీ విలువ రూ.25వేల కోట్లు. 
* జొమాటోలో దీపిందర్‌కు సుమారు పదిశాతం, చైనాకు చెందిన ఏంట్‌ ఫైనాన్షియల్‌, ఇన్ఫోఎడ్జ్‌లకు చెరో 27 శాతం వాటా ఉంది. 
* నెలకు కోటికిపైగా ఆర్డర్లు వస్తున్నాయి. 
* ఖాతాదారులు సగటున నెలకు నాలుగు ఆర్డర్లు ఇస్తున్నారు. 
* ఆఫర్ల కారణంగా ప్రస్తుతం సగటున ఒక ఆర్డర్‌మీద జొమాటోకు నష్టం రూ.25వరకూ ఉంటోంది. 


ఆరు తప్పాను... ఐఐటీ కొట్టాను!

పంజాబ్‌లోని బఠిండా దగ్గర్లోని ముక్త్‌సర్‌ మా సొంతూరు. అమ్మానాన్నలిద్దరూ టీచర్లే. ఆరో తరగతిలో ఫెయిలయ్యాను. ఎనిమిదిలో ఉన్నపుడు ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో టీచర్లు నాకు జవాబులన్నీ చెప్పేయడంతో క్లాస్‌ ఫస్ట్‌ వచ్చాను. ర్యాంకు తగ్గిపోతే సిగ్గుచేటని అప్పట్నుంచీ చదవడం మొదలుపెట్టాను. ఇంటర్‌కి చండీగఢ్‌ పంపారు. ఆ వాతావరణంలో కుదురుకోలేక ఫస్టియర్‌లో ఫెయిలయ్యాను. ఆ వైఫల్యమే నాలో కసిని పెంచింది. మొదటి ప్రయత్నంలోనే ఐఐటీ దిల్లీలో సీటు సంపాదించాను. 
*  ఐఐటీలో కాంచనను మొదటిసారి చూశాను. తను ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ చేయడానికి చేరింది. ఇద్దరిదీ ‘మ్యాథ్‌మెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌’ డిపార్ట్‌మెంట్‌. ఆరు నెలలపాటు క్యాంటిన్‌లో, లైబ్రరీలో ఎక్కడ ఛాన్స్‌ దొరికితే అక్కడ ఆమెకు ఎదురుపడేవాణ్ని. ఐఐటీ దిల్లీ నుంచి పీహెచ్‌డీ పూర్తిచేసి ప్రస్తుతం దిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. మాకు 2007లో పెళ్లి అయింది. మాకో పాప. ముఖ్యమైన సలహా  ఎప్పుడు అవసరమైనా కాంచనను సంప్రదిస్తా. 
* ఆదివారం పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తాను. ఇంట్లో ఫాస్ట్‌ఫుడ్‌ వెరైటీలు తయారుచేస్తాను. సినిమాలు చూస్తాను. ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ వందసార్లు చూసుంటాను. 
* పంకజ్‌ గతేడాది వ్యక్తిగత కారణాలతో కంపెనీ నుంచి వైదొలిగాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.