close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆవిష్కర్తలు @ ఐఐటి!

ఐఐటీలకీ ఐడియాలకీ ఏదో సంబంధం ఉంది. ఆ క్యాంపస్‌లో ఒక ఆలోచన పురుడుపోసుకుందంటే అది కచ్చితంగా కలలూ కాగితాలూ దాటి కళ్లముందు కనిపించే ఆవిష్కరణ అయి తీరుతుంది. రేపో మాపో ఓ స్టార్టప్‌గానూ అవతారమెత్తుతుంది. అవును... నేటి ఐడియానే రేపటి స్టార్టప్‌. ఈనాటి స్టూడెంటే రేపటి సీఈవో. నమ్మకం కలగడం లేదా... అయితే వీరి గురించి చదవాల్సిందే!

అంబర్‌ శ్రీవాస్తవ దిల్లీ ఐఐటీలో చదువుతున్నాడు. ఏడింటికల్లా కాలేజీకి బయల్దేరే అతనికోసం పొద్దున్నే లేచి వంట చేసి పెట్టేది తల్లి. ఉన్నట్టుండి ఓ రోజు ఆమె కళ్లుతిరిగి పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తే తీవ్ర రక్తహీనత అన్నారు డాక్టరు. హిమోగ్లోబిన్‌ బాగా పడిపోయిందనీ అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకమయ్యేదనీ డాక్టరు చెప్పడం శ్రీవాస్తవని ఆలోచింపజేసింది. అలాంటి పరిస్థితి రాకుండా ఇంట్లోనే రక్తపరీక్ష చేసుకునే అవకాశం ఉంటే ఎప్పటికప్పుడు చూసుకుని జాగ్రత్త పడవచ్చు కదా అన్న ఆలోచన అతడిని నిలువనీయలేదు. ఏడాదిన్నర కష్టపడి హిమోగ్లోబిన్‌ ఎంతుందో తెలుసుకునే ట్రూహెచ్‌బీ హీమోమీటర్ని తయారుచేశాడు. దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుల ప్రశంసలు అందుకున్న ఆ పరికరాన్ని చదువయ్యాక తానే సొంత కంపెనీ పెట్టి తయారుచేస్తున్నాడు శ్రీవాస్తవ.

నిర్భయ ఘటన జరిగినప్పుడు ఐఐటీ విద్యార్థులుగా ఉన్న ఆయుష్‌, పరాస్‌, మాణిక్‌, అవినాష్‌, చిరాగ్‌లు చాలా బాధపడ్డారు. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు కుటుంబసభ్యుల్నీ పోలీసుల్నీ హెచ్చరించేలా ఒక వేరబుల్‌ గ్యాడ్జెట్‌ ఉంటే బాగుంటుందన్న ఆలోచన రావడం తడవు వాళ్లు రంగంలోకి దిగారు. అది ప్రత్యేకంగా కన్పించకుండా అమ్మాయిలు ధరించే నగల్లో ఒకటిగా ఇమిడిపోవాలని పెండెంట్‌లాగా తయారుచేసి ఆప్‌కి అనుసంధానించారు. ఆపదలో ఉన్న మహిళ ఆ లాకెట్‌కి ఉన్న బటన్‌ని చేత్తో రెండుసార్లు నొక్కితే చాలు ఆప్‌ ద్వారా ముఖ్యమైన వాళ్లకు సమాచారం వెళ్లిపోతుంది. ఈ ‘సేఫర్‌ పెండెంట్‌’ పలువురి ప్రశంసలందుకోవడంతో ఆ మిత్రులు క్రౌడ్‌ ఫండింగ్‌ సాయంతో నిధులు సేకరించి సొంతంగా స్టార్టప్‌ను పెట్టారు. ‘లీఫ్‌’ అనే బ్రాండ్‌ పేరుతో ఇలాంటి పరికరాల్ని తయారుచేసి అమ్ముతున్నారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 13 మంది విద్యార్థులది ఒక బృందం. ఎప్పుడూ కలిసి తిరిగేవారు. ఓసారి పార్కింగ్‌ పక్కన మెట్లమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా ఓ దివ్యాంగ విద్యార్థి తన సైకిల్‌ని పార్కింగ్‌ నుంచి తీయడానికి పడుతున్న ఇబ్బంది చూశారు. అప్పటికి అతనికి సాయం చేసి పంపించినా ఆ సంఘటన వారి మనసులోంచి చెరగలేదు. అలాంటివారికి ఎలాంటి సైకిల్‌ అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందీ అని ఆలోచించారు. ఊహల్లోని ఆ సైకిల్‌కి మిత్రబృందంలోని వారంతా తలా ఒక ప్రత్యేక ఫీచర్నీ జోడించారు. ఏడాది తిరిగేసరికి ‘ఈ-బైక్‌’ని తయారుచేసి ప్రొఫెసర్ల ముందు పెట్టి ప్రశంసలందుకున్నారు.

అందుబాటు ధరలోనే అన్ని సౌకర్యాలతో ఉన్న ఆ సైకిల్‌ ఇప్పుడు పేద దివ్యాంగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐఐటీల్లో చదివితే పెద్ద పెద్ద జీతాలతో మంచి ఉద్యోగాలొస్తాయి. నిజమే కానీ, చుట్టూ ఉన్న సమాజానికి పనికొచ్చినప్పుడే చదివిన చదువుకు సార్థకత అని నమ్ముతోంది నేటి యువతరం. అందుకే సమాజ అవసరాలను తెలుసుకుని తమ నైపుణ్యాలతో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఇంజినీరింగ్‌ చదివినంత మాత్రాన ఏ పరికరమైనా తయారుచేయవచ్చనుకుంటే పొరపాటే. అవసరాన్ని గుర్తించగల పరిశీలనా, కష్టపడే స్వభావమూ, ఒకటికి పదిసార్లు ప్రయత్నించి చూసే ఓర్పూ లాంటివన్నీ ఉండాలి. మిగిలిన విభాగాల మీద అవగాహనా ఉండాలి. అన్నిటినీ మించి కొత్తదారులు వేసే సాహసం, వేయగల సత్తా ఉండాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టే వీరంతా సమాజంమీద తమదైన ముద్ర వేస్తున్నారు.

సైన్యం కోసం... 
అంకిత్‌ మెహతా, ఆశిష్‌ భట్‌, రాహుల్‌ సింగ్‌, విపుల్‌ జోషి, అమర్‌దీప్‌ సింగ్‌- ఐఐటీ బోంబేలో కలిసి చదువుకున్నారు. దేశభక్తి మెండుగా ఉన్న వీరంతా సైన్యానికి పనికొచ్చే పని ఏదైనా చేయాలనుకున్నారు. పర్వత ప్రాంతాల్లో, సియాచిన్‌ లాంటి మంచు ప్రాంతాల్లో సైనికుల గస్తీకి ఉపయోగపడేలా ఒక డ్రోన్‌ని తయారుచేశారు. దానికి నాణ్యమైన లెన్స్‌ బిగించారు. దాంతో పగలూ రాత్రీ తేడా లేకుండా అది ఎక్కడైనా స్పష్టమైన వీడియోలూ ఫొటోలూ తీస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే నలభై నిమిషాల పాటు తిరిగి, నాలుగు కిలోమీటర్ల పరిధిలో దృశ్యాల్ని చక్కగా చిత్రిస్తుంది. అలా పెద్ద సాలీడు ఆకారంలో వారు తయారుచేసిన ‘నేత్ర’ డ్రోన్‌ అన్ని పరీక్షలనూ తట్టుకుని నిలిచి సైన్యం చేతికి వెళ్లింది. ఉత్తరాఖండ్‌ వరదల సమయంలో సైన్యం మొట్టమొదటగా దాన్ని ఉపయోగించి ఎందరో తప్పిపోయినవారి ఆచూకీ కనిపెట్టి కాపాడగలిగింది. పట్టా పుచ్చుకునే లోపే తాము తయారుచేసిన వస్తువు సైన్యానికి ఎంతగానో ఉపయోగపడడం చూసిన ఆ మిత్రబృందం ఆనందానికి హద్దుల్లేవు.

పేద విద్యార్థులకు వరం 
చుట్టూ ఉన్న సమాజాన్ని అందరమూ చూస్తాం. కొందరు మాత్రమే నిశితంగా పరిశీలిస్తారు. సమస్యల్ని కనిపెట్టి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఒక్కరి ఆలోచనా ఆచరణా ఫలిస్తే లక్షలాది మంది ప్రయోజనం పొందవచ్చు. ఈషన్‌ సదాశివం ఆలోచన అలాంటిదే. ఐఐటీ కాన్పూర్‌లో చదివేటప్పుడు స్వచ్ఛంద సేవాకార్యక్రమం కింద పేద పిల్లలకు చదువు చెప్పడానికి వెళ్లేవాడు సదాశివం.

పాఠశాలల్లో పిల్లలకు కూర్చోవడానికి బల్లలు లేకపోవడం, స్కూలుబ్యాగులు కొనుక్కోలేని పిల్లలు పుస్తకాలను ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల్లో తెచ్చుకోవడం చూసి అతడికి బాధనిపించేది. ఇళ్లలోనూ వారు నేలమీద బోర్లా పడుకున్నట్లుగా వంగిపోయి రాయడం చూసిన అతనికి ఆ లేత వెన్నెముకలు ఎంత దెబ్బతింటాయో కదా అనిపించేది. ఆ విషయమే వైద్యులతో మాట్లాడితే పుస్తకాలను అంత దగ్గరగా చూస్తూ రాయడం వల్ల వాళ్ల చూపూ దెబ్బతింటోందని చెప్పారు వారు. పిల్లలకు రాసుకునే బల్లా పుస్తకాల బ్యాగూ రెండూ తక్షణావసరాలని భావించిన సదాశివం ఆ రెండూ ఒకే వస్తువుగా ఉంటే చౌకగా ఎక్కువ మందికి అందించవచ్చనుకున్నాడు. అలాంటి మోడల్‌ తయారుచేయడానికి చాలానే శ్రమపడ్డాడు. ఎన్నో డిజైన్లు ప్రయత్నించి చూశాక చివరికి విజయం సాధించాడు. తక్కువ బరువుతో తేలిగ్గా మడతపెట్టడానికి వీలయ్యేలా తయారుచేసిన ఆ బ్యాగ్‌ని పిల్లలు మామూలు పుస్తకాల సంచీలా వీపు మీద తగిలించుకోవచ్చు.

బడికెళ్లాక బల్లలా చేసి దాని మీద పుస్తకం పెట్టుకుని రాసుకోవచ్చు. దానికి ‘డెస్కిట్‌’ అని పేరు పెట్టాడు సదాశివం. చదువైపోగానే వచ్చిన ఉద్యోగావకాశాలన్నిటినీ వదులుకుని బ్యాగుల తయారీనే వృత్తిగా ఎంచుకున్న సదాశివం వాటిని కార్పొరేట్‌ సంస్థల ద్వారా పేద విద్యార్థులకు అందజేసేలా కృషిచేస్తున్నాడు.

స్టార్టప్‌లూ ప్రశంసలూ... 
విద్యార్థులుగా తాము తయారుచేసిన పరికరాలను అక్కడే వదిలేయడం లేదు ఈ ఆలోచనాపరులు. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ధైర్యం ఉన్నవారు స్వయంగా స్టార్టప్‌లు పెట్టి వ్యాపారవేత్తల అవతారమూ ఎత్తుతున్నారు. 
ఐ-దియా: చేతిలో పట్టే ఓ చిన్న పరికరంతో సౌరశక్తిని గ్రహించి విద్యుత్‌ శక్తిగా మార్చుకోగలిగితే- ఈ ఆలోచన సచిన్‌ కుమార్‌ది. ఐఐటీ బోంబేలో చదివిన సచిన్‌ మూడేళ్లపాటు పరిశోధన చేసి తయారుచేసిన ‘ఐ-దియా’ మన అరచేయంత ఉంటుంది. సౌరశక్తిని గ్రహించి రాత్రి పూట లైటులా వెలుతురునిస్తుంది. ఇంకా దీంతో సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ చేసుకోవచ్చు, యూఎస్‌బీ పోర్ట్‌లానూ ఉపయోగించవచ్చు. ఇప్పుడు సచిన్‌ ఇల్యూమైండ్‌-సోలార్‌ట్రెక్‌ పేరుతో కంపెనీ పెట్టి ఈ బుల్లి సౌరదీపాలను తయారుచేస్తున్నాడు. 
ఈ-స్కూటర్‌: ఐఐటీ మద్రాస్‌లో  చదివేటప్పుడే సెల్‌ఫోన్‌కన్నా త్వరగా ఛార్జింగ్‌ అయ్యేలా ఈ-స్కూటర్‌ని తయారుచేశాడు తరుణ్‌మెహతా. చదువైపోగానే సొంతంగా ‘అథర్‌ ఎనర్జీ’ పేరుతో బెంగళూరులో స్టార్టప్‌ పెట్టిన తరుణ్‌ ఇప్పుడు ‘ఈ-స్కూటర్‌’లను తయారుచేసి విక్రయిస్తున్నాడు. 
బ్రీతలైజర్‌: మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ఓ హెల్మెట్‌ని తయారుచేశారు ఐఐటీ వారణాశి విద్యార్థులు- రిషబ్‌, నమన్‌ సింఘాల్‌, శుభం జైశ్వాల్‌. వీళ్లు తయారుచేసిన హెల్మెట్‌ని బండికి అనుసంధానిస్తారు. దాంతో అది పెట్టుకుంటే తప్ప బండి స్టార్టవదు. పెట్టుకోగానే వ్యక్తి శ్వాసనీ విశ్లేషిస్తుంది ఆ హెల్మెట్‌. ఒకవేళ అతడు మద్యం సేవించి ఉంటే బండి స్టార్ట్‌ కాకుండా చేస్తుంది. అంతేకాదు, బ్లూటూత్‌తో అనుసంధానించి ఉండడంతో ఒక వేళ బైక్‌ని ఎవరైనా దొంగిలిస్తే వెంటనే యజమానికి సమాచారం ఇస్తుంది. హెల్మెట్‌ పెట్టుకుని బండి మీద వెళ్తున్న వ్యక్తి ప్రమాదానికి లోనైతే అంబులెన్స్‌కీ కుటుంబసభ్యులకీ ప్రమాద స్థలాన్ని కూడా తెలుపుతూ సమాచారం వెళ్లేలా ఈ హెల్మెట్‌ని తయారుచేసిన రిషబ్‌, శుభంలకు ప్రతిష్ఠాత్మక ఎరిక్సన్‌ ఇన్నొవేషన్‌ అవార్డు లభించింది. 
మత్స్య: బోంబే ఐఐటీకే చెందిన 20 మంది విద్యార్థులు సముద్రంలో పరిశోధనలకూ, రక్షణ చర్యలకూ, దారి తెలుసుకోవడానికీ ఉపయోగపడే ఓ పరికరాన్ని తయారుచేశారు. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ సహకారంతో తయారుచేసిన ఆ పరికరానికి ‘మత్స్య’ అని పేరు పెట్టారు. నౌకాదళానికి ఎంతో ప్రయోజనకరమైన ఈ పరికరానికి ‘రోబోసబ్‌’ అనే అంతర్జాతీయ పోటీలో బహుమతి లభించింది.

చిన్నవే... పెద్ద పని చేస్తాయి! 
ఆవిష్కరణలు అంటే అన్నీ పెద్ద పెద్ద యంత్రాలో మరొకటో కానక్కర్లేదు. రోజువారీ ఉపయోగపడే చిన్న పరికరాలు కూడా మనకు అవసరమే. అలాంటివాటినీ తయారుచేసి ప్రశంసలందుకున్నారు కొందరు ఐఐటీయన్లు. 
* నీళ్లలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉంటే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తున్న విషయం గమనించిన ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులు దాన్ని నివారించడానికి ఓ సులభమైన పరిష్కారం కనిపెట్టారు. నేరేడు పండ్ల గింజల్ని ఎండబెట్టి పొడి చేసి దాన్ని నీటిలో కలిపితే ఫ్లోరైడ్‌ స్థాయి తగ్గిపోయి నీళ్లు తాగడానికి వీలుగా మారతాయని వీరు నిరూపించారు. 
* గుండెపోటు వచ్చిన పేషెంట్లకు ‘సీపీఆర్‌’ చేయడానికి తోడ్పడే పరికరాన్ని అతి తక్కువ ధరలో తయారుచేశారు ఐఐటీ గాంధీనగర్‌ విద్యార్థులు. ఇది గుండెని గట్టిగా తట్టినట్టు చేస్తుంది. ఊపిరితిత్తులు సరిగా పనిచేసేలా చూస్తుంది. 
* వాడిన నూనెని మళ్లీ వాడితే ఆరోగ్యానికి చేటు. పారేస్తే పర్యావరణానికి చేటు. అందుకని ఆ నూనెను బయో డీజిల్‌గా మార్చే పరికరాన్ని తయారుచేశారు దిల్లీ ఐఐటీ విద్యార్థులు అభిషేక్‌ శర్మ, హర్షిత్‌ అగర్వాల్‌, మోహిత్‌ సోని. 
* డీజిల్‌ జనరేటర్ల వల్ల జరుగుతున్న వాయుకాలుష్యానికి అడ్డుకట్ట వేయడానికి దిల్లీ ఐఐటీ విద్యార్థి కుశాగ్ర శ్రీవాస్తవ తయారుచేసిన ‘చక్ర షీల్డ్‌’ మంచి ఫలితాన్నిస్తోంది. ఈ పరికరాన్ని జనరేటర్‌కి బిగిస్తే కాలుష్యాన్నంతా ఫిల్టర్‌ చేసేస్తుంది. 
* ఐఐటీ గాంధీనగర్‌ విద్యార్థులు దీప్‌ కార్కె, నిహార్‌ కొటక్‌, సుమిత్‌ దేశ్‌ముఖ్‌లు కార్మికులు విశ్రాంతి తీసుకోవడానికి పనికొచ్చేలా తక్కువ ఖర్చుతో టెంట్‌ తయారుచేశారు. దీన్ని మడత పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తాత్కాలిక ఆశ్రయం కల్పించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

తాజా విజేతలు..! 
ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థుల్లో సృజనకు పదునుపెట్టడానికి గాంధీనగర్‌ ఐఐటీ ఎండాకాలం సెలవుల్లో ‘ఇన్వెంట్‌’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. మొన్న వేసవిలో జరిగిన ఈ కార్యక్రమంలో 9 ఐఐటీల నుంచి 28 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆరు వారాలపాటు అక్కడ ఉండి తమ ఆలోచనలకు ఆవిష్కరణ రూపమిచ్చారు. ఆవిష్కరణ ఏదైనా అది రూ.50వేల లోపు ఖర్చుతో తయారవ్వాలి, నేటి జీవన విధానంలో ఉపయోగపడాలన్నదే నియమం. ఆ పోటీలో గెలుపొందిన పరికరాలివి. 
* సౌరశక్తితో విద్యుత్తు తయారీకి ఏర్పాటుచేసే సౌర ఫలకాలు తూర్పు నుంచి పడమరకు ప్రయాణించే సూర్యుడి కిరణాలను పూర్తి స్థాయిలో గ్రహించలేవు. సూర్యుడితో పాటు ఆ ఫలకాలు కూడా దిశ మార్చుకునేలా ‘మెకానికల్‌ సోలార్‌ ట్రాకర్‌’ని తయారుచేసి ప్రథమ బహుమతి పొందారు ఐఐటీ పాలక్కాడ్‌ విద్యార్థులు పరుల్‌ సాంగ్వాన్‌, ప్రబల్‌ వశిష్టలు. ఈ పరికరం వల్ల మరో 25 శాతం సౌరశక్తి అదనంగా లభిస్తుంది. 
* ఐఐటీ బోంబే, ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థులు నంబి లక్ష్మి, ప్రథమేష్‌ దేశ్‌ముఖ్‌లు ఒకసారి వాడి పారేసే క్యారీబ్యాగ్‌లకు ప్రత్యామ్నాయం తయారుచేశారు. హోటళ్లనుంచి ఆహారపదార్థాలు ప్యాక్‌ చేయించి తీసుకెళ్లడానికి ప్లాస్టిక్‌ కవర్లను ఎక్కువగా వాడుతున్నందున వాటి బదులుగా ఉపయోగించడానికి అల్యూమినియం లైనింగ్‌తో కాగితం ప్యాకెట్లను వీరు తయారుచేశారు. ఇవి క్యారీబ్యాగుల్లా ఉపయోగపడడమే కాక రీసైక్లింగ్‌కీ వీలుగా ఉంటాయి. ఈ పర్యావరణ హిత ప్యాకెట్లను వ్యాపార స్థాయిలో వాడితే ఫుడ్‌ ప్యాకేజింగ్‌ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని భావించిన నిపుణులు వీరికి రెండో బహుమతి ఇచ్చారు. 
* పాలూ పెరుగూ నూనే నెయ్యీ అన్నీ ఇప్పుడు ప్యాకెట్లలోనే లభిస్తున్నాయి. వాటిని పాత్రల్లోకి వంపుకునేటప్పుడు పారబోసుకునేవాళ్లు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా వాటిని పాత్రల్లోకి వంపుకునేలా, మిగిలినదాన్ని ప్యాకెట్లోనే ఉంచి మూత పెట్టి భద్రపరుచుకునేలా ఏర్పాటు ఉంటే ఎంత బాగుంటుందీ అని ఆలోచించారు ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థులు సమృద్ధీ పటాస్కర్‌, కలశ్‌ నిబియాలు.

వీరు తయారుచేసిన ‘స్పౌట్‌ ఇట్‌’ను నాజిల్‌లాగా ఏ ప్యాకెట్‌కైనా నేరుగా బిగించవచ్చు. అందులోని పదార్థం కారిపోకుండా అవసరమైనంత వంపుకుని మిగిలిన దానికి నాజిల్‌ మూత బిగించి ప్యాకెట్‌ని పక్కన పెట్టుకోవచ్చు. దీనికి మూడో బహుమతి లభించింది.

నాటి నుంచి నేటి వరకూ... 
గూగుల్‌ సంస్థ న్యూస్‌ వెబ్‌సైట్లన్నిటినుంచీ ముఖ్యమైన వార్తల్ని క్రోడీకరించి ‘గూగుల్‌న్యూస్‌’ పేరుతో అందించడం మొదలెట్టి పదహారేళ్లయింది. దానికి కారణం కృష్ణ భరత్‌ అనే ఐఐటీ విద్యార్థే. మద్రాస్‌లో చదువుకునేటప్పటినుంచీ కృష్ణకి ఏ పని అయినా ప్రణాళికాబద్ధంగా చేయడం అలవాటు. అమెరికా వెళ్లి గూగుల్‌లో ఉద్యోగంలో చేరినా ఆ అలవాటు పోలేదు. వార్తలు చదివే అలవాటున్న అతడు తాను చూసే ముఖ్యమైన వెబ్‌సైట్‌ వార్తలన్నీ ఒక్కచోట వచ్చేలా ఒక ప్రోగ్రామ్‌ రాసుకున్నాడు. అది కాస్తా అధికారుల దృష్టిలో పడి గూగుల్‌ న్యూస్‌ అయింది. అలా అప్పటి గూగుల్‌ న్యూస్‌ నుంచీ ఇప్పటి శాంసంగ్‌ గెలాక్సీ గేర్‌ వరకూ ఐఐటీ విద్యార్థులు ఎన్నో కొత్త ఆలోచనలు చేశారు, నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు, తోటివారికి స్ఫూర్తినిస్తున్నారు.

*  *  *

ఐఐటీలో పట్టా పుచ్చుకుంటే ఆరంకెల జీతంతో ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. తెల్లచొక్కా నలగకుండా ఏసీ గదిలో కూర్చోవచ్చు. ఖరీదైన కారులో దర్జాగా తిరగొచ్చు. ఆ సుఖమూ విలాసమూ తీరే వేరు. కానీ సమాజానికి పనికొచ్చే ఓ ఆవిష్కరణ వల్ల కలిగే ఆనందం ముందు ఆ సుఖం ఏపాటిదనే ఐఐటీయన్లు తాము అనుకున్నది సాధించడానికి ఎన్ని అడ్డంకులకైనా ఎదురునిలుస్తున్నారు, ఏకదీక్షతో శ్రమిస్తున్నారు. మొన్నటి ఇన్ఫోసిస్‌, నిన్నటి ఫ్లిప్‌కార్ట్‌ నుంచి నేటి ఓలా దాకా... అన్నీ వీరి ఆలోచనలేనంటే ఐఐటీయన్ల సత్తా ఏమిటో అర్థంకావడం లేదూ..!


సీరియల్‌ ఆవిష్కర్త ప్రణవ్‌!

ఎవరైనా ఒకటో రెండో వస్తువులు తయారుచేస్తే గొప్ప. కానీ సీరియల్‌ ఆవిష్కర్తలు కొందరుంటారు... వారికి ప్రతిక్షణం ఓ కొత్త ఆలోచనే, ఏదో సాధించాలన్న ఆరాటమే. ఆ కోవలోకే వస్తాడు ప్రణవ్‌ మిస్త్రీ. ఐఐటీ ముంబయి నుంచి మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ పట్టా పుచ్చుకున్న ప్రణవ్‌ అక్కడ విద్యార్థిగా ఉండగానే ‘మౌస్‌లెస్‌’ పేరుతో కన్పించకుండా పనిచేసే మౌస్‌నీ మరికొన్ని పరికరాల్నీ తయారుచేశాడు. అప్పుడు మొదలైన ఆవిష్కరణల పర్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఐఐటీ నుంచి ఎంఐటీకి వెళ్లి మీడియా ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో మరో మాస్టర్స్‌ డిగ్రీచేసిన ప్రణవ్‌ ఆ తర్వాత పదేళ్లలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, నాసా, యునెస్కో లాంటి పది సంస్థలు మారి ప్రస్తుతం శాంసంగ్‌లో థింక్‌ట్యాంక్‌ టీమ్‌ హెడ్‌గా ఉన్నాడు. శాంసంగ్‌ గెలాక్సీ గేర్‌ సృష్టికర్త అతడే. ప్రణవ్‌ ఇప్పటివరకూ కనిపెట్టిన వస్తువులు- సిక్త్స్‌సెన్స్‌, మౌస్‌లెస్‌, స్పర్శ్‌, టెలి టచ్‌, ప్రికర్సర్‌, బ్లింక్‌బాట్‌, థర్డ్‌ఐ, క్వికీస్‌ లాంటివి ఇరవైకి పైనే ఉన్నాయి. తనని తాను ‘డిజైనీర్‌’ డిజైనర్‌ (ఇంజినీర్‌ ప్లస్‌) అని చెప్పుకునే ఈ యువ మేధావికి తెలియని సాంకేతిక రంగం లేదు. పరిచయం లేని కళ లేదు. అన్ని రంగాలూ తెలిసి ఉండటమే తన ఆవిష్కరణలకు పెట్టుబడి అంటాడు ప్రణవ్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.